April 19, 2024

రాజీపడిన బంధం.. 3

రచన: ఉమాభారతి

అత్తయ్య నాకోసం శ్రద్ధగా వండించే తినుబండారాలు, తెప్పించే మామిడికాయలు, ఉసిరికాయలు మినహాయించి, ఈ సమయంలో ఆహ్లాదాన్ని కలిగించే ఇష్టమైన వ్యాపకం ఏముంటుందాని ఆలోచించాను.
చిన్నప్పటినుండి నాకు కుక్కపిల్లులు, వాటి పెంపకం ఇష్టం. స్కూలుకి వెళ్ళే దారిలో తప్పిపోయిన కుక్కపిల్లల్ని చేరదీసేదాన్ని. ఆ నోరులేని జీవాలు నాలో తెలియని ప్రేమని, మార్దవాన్ని నింపేవి. అప్పట్లో ఆ కుక్కపిల్లల్ని పెంచే స్తోమత లేక, పెట్స్ అంటే ఇష్టమున్న ఫ్రెండ్సుకి వాటిని అప్పజెప్పేదాన్ని.
పూదోటలు, మొక్కల పెంపకం కూడా ఇష్టం. మా ఈ బంగాళాకి ….. ముందు, వెనకా కూడా పెద్ద ఆవరణ ఉంది. ఉన్న తోటని కొత్త మొక్కలతో మరింత అందంగా చేయవచ్చు. కాక, కుక్కపిల్లల్ని కూడా బేషుగ్గా పెంచుకోవచ్చు కదా! అనుకున్నాను.
శ్యాం భార్యగా ఢిల్లీలో నాకు లభించిన గౌరవపూర్వక హోదాల్లో, ‘ఢిల్లీ పశుసంక్షేమ సంస్థ’ వారి కమిటీ సభ్యత్వం ఒకటి…..అయితే, తోటని తీర్చి దిద్దాలని ఉందంటే అభ్యంతరాలేముండవు కాని, కుక్కపిల్లల్ని పెంచుకుంటానంటే అత్తయ్య అనుమతిస్తారో లేదో అడగాలనుకున్నాను.
**
మరునాడు మధ్యాహ్నం వంటింట్లో పని చేస్తున్న అత్తయ్య దగ్గర చేరాను. నా మనసులో మాట బయట పెట్టాను.
“పెంపుడుకుక్కలంటే నాకూ ఇష్టమేనమ్మా. వెళ్ళి నీకు కావాల్సిన మంచి జాతి కుక్కల్ని రెండు కాకపోతే మూడింటిని తెచ్చుకో, మామయ్యకి కూడా ఏమీ అభ్యంతరముండదు. సరేనా” అన్నారామె.
నా ఆనందానికి అవధుల్లేవు. ఆనిమల్ షెల్టర్ కి ఫోన్ చేసాను.
“ప్రస్తుతం మన వద్ద లేవు. ఏవైనా మంచివి, చిన్నవి షెల్టర్ కి వచ్చినప్పుడు తెలియ చేస్తాను”… అని చెబుతూ కొద్ది రోజులు ఆగమంది సూపర్వైజర్.
**
నెలలు నిండుతుంటే, అత్తయ్య దగ్గరే కూర్చుంటున్నాను. ఎక్కువ సమయం ఆవిడతోనే గడుపుతున్నాను. యిద్దరం కలిసి బేబీ గది ఏర్పాట్లల్లో, బేబీ ఫర్నిచర్ కోసం అప్పుడప్పుడు షాపింగ్ వెళ్ళడం చేస్తున్నాము.
పైఅంతస్తులోని మా గదికి ఎదురుగా ఉన్న గదిని బేబీకి నర్సరీగా కేటాయించాము. ఆరోనెల రాగానే మెట్లెక్కడం కష్టంగా ఉందని క్రింద అంతస్తులోని గెస్ట్ రూంలోకి మారాను.
**
ఓ రోజు పొద్దుటే వాకింగ్ కానిచ్చి ఇంటికి వచ్చేప్పటికి, పశుసంక్షేమం నుండి ఫోన్ వచ్చింది. కాస్త సమయం పట్టినా, షెల్టర్ లోకి చక్కని కుక్కపిల్లలు వచ్చి చేరాయని తెలియజేసింది సూపర్వైజర్.
వెంటనే వెళ్లి రెండు ‘డాషాండ్’ జాతి కుక్కపిల్లల్ని తెచ్చాను. క్యాండి, మిండి అని అత్తయ్యే పేర్లు పెట్టారు. క్యాండి మగ కుక్కపిల్ల, మిండి ఆడపిల్ల. సౌమ్యంగా నడుచుకునే జాతివట. మామయ్యకి కూడా నచ్చాయి.
ఇంటివెనక స్థలంలో, నీడగా చల్లగా ఉండేలా డాగ్-హౌజ్ నిర్మించి, వాటికి మెత్తని పరుపులు, ఆడుకునే బంతులు తెప్పించి అమర్చాను.
రోజూ వాటిని ఆడించడం సరదాగా ఉంది. శ్యాం కూడా ఒకోప్పుడు నాతో పాటు క్యాండి, మిండిలతో ఆడ్డం, నడిపించడం సంతోషాన్నిచ్చింది. వాటితో పార్క్ కి కూడా వెళ్ళాము.
“ఈ జాతి కుక్కలు పెద్దగా పరుగెత్తలేవు. బాతుల్లా నేలమీదే ఉంటాయి. పొట్టి కాళ్ళతో బండగా బరువుగా అవుతాయి.. మెతక రకమే” అన్నారు శ్యాం వాటి గురించి.
వాటితో ఆడుతూ…జతగా ఉండవలసిన కుక్కపిల్లల్ని ఆడించే నెపంతో పరస్పరం దాడికి ఉసిగొల్పుతూ, శ్యాం వాటిల్లో శత్రుత్వం పెంచుతున్నారని గమనించాను. అవి బాధతో అరిచేలా బంతాట ఆడడం కూడా చూసాక, నా సంతోషం పటాపంచలైంది.
అదేమని పశ్నిస్తే, “అలాగే శిక్షణనివ్వాలి. లేదంటే, అవి కాపలా కుక్కలయ్యేది ఎలా?” అంటూ ఎదురు ప్రశ్న వేసి మొండి వాదన చేసారు.
అతనితో అలా వాదించి లాభం లేదని గుర్తించాను. అత్తయ్యని సంప్రదించాను. క్యాండి, మిండిలని చూసుకొని తోటపని కూడా చేయడానికి ఇద్దరు పనివాళ్ళని పెట్టాను. రాము, జీవా. ఇద్దరూ మా వాచ్-మాన్ తమ్ముళ్ళు.
ఇక శ్యాంని కుక్కపిల్లలకి దూరంగానే ఉంచగలుగుతున్నాను.
**
ఏడోనెల వచ్చాక, వేవిళ్ళు పూర్తిగా తగ్గి బాగానే తినగలుగుతున్నాను…..

ఓ రోజు పొద్దున్నే టిఫిన్ అయ్యాక.. అత్తయ్య నన్ను పిలిచి పక్కనే కూచోబెట్టుకుని అమ్మకి ఫోన్ చేసారు. “మీరూ ఆత్రుతగా ఉన్నారుగా వదినా! మన నీలకి ఏడవనెల వచ్చి, తేలిగ్గానే తిరుగుతుంది. ఇప్పుడు శీమంతం జరిపిద్దాం. చక్కగా ఓ నాలుగు రోజులు ఉండేలా రండి. మీరొచ్చినప్పుడు నీల డెలివరీ గురించి మాట్లాడుదాము” అంటూ ఆ కార్యానికి ముహూర్తం పెట్టించారు అత్తయ్య.
**
సంప్రదాయంగా మేళతాళాలతో పెద్దవాళ్ళంతా దగ్గరుండి జరిపించారు నా శీమంతం వేడుకలు.
వచ్చిన ముత్తైదువులంతా వెళ్ళాక హాల్లో కూర్చుని అందరు కబుర్లు చెప్పుకుంటున్నారు. వింటూ నేనూ అక్కడే ఉన్నాను….
“వదినా, మీరు నాకో మాటివ్వాలి” అన్నారు అత్తయ్య, ఉన్నట్టుండి అమ్మతో….
”ఇరువైపులా మా కుటుంబాల్లో కొన్ని తరాలుగా ఆడసంతానమే కలగలేదు. ఆడపిల్లల ముద్దుముచ్చట్లు, ఆప్యాయతలకి నోచుకోలేదనుకోండి. మావాళ్ళకి కూడా నేను దత్తపుత్రికనని మీకు తెలుసుగా!
ఇక ఇన్నాళ్ళకి గుణవంతురాలైన నీలవేణి మా ఇంటి కోడలిగా వచ్చాక మాత్రం ఆ కొరత తీరింది. సొంతబిడ్డలా కలిసిపోయింది మా కోడలు. ఇరువైపులా చుట్టాలందరికీ నీలంటే చాలా ఇష్టం కూడా. మా కోడల్ని మా అదృష్టంగా భావిస్తాము” అంటూ క్షణమాగారామె.
“మీకు సౌకర్యం లేదని కాదు. అపార్ధం చేసుకోకండి. నీల ప్రసవం కూడా..ఇక్కడే కానిద్దాం వదినా… మన నీలని మొదటినుండీ చూస్తున్న డాక్టర్ చేతులమీదుగా జరగనిద్దాం. అసలు ఇకమీదట వీలైనంతమటుకు నీలవేణి పురుళ్ళు, వేడుకలు మీ ఆశీస్సులతో ఇక్కడే జరుపుకుందాము. మీరైనా, మేమైనా… తేడా ఏముంది చెప్పండి” అడిగారు ప్రాధేయపడుతూ అత్తయ్య……
అమ్మ నవ్వుతూ మౌనంగా ఉండిపోయింది.
“అదీ కాక మనింట్లో ఏ వేడుక జరిగినా మావాళ్ళు కనీసం వందమంది బంధువులు, సప్తసముద్రాలు దాటైనా వస్తారు. చూసారుగా పెళ్ళికి ఎంతమంది వచ్చారో! మన ముచ్చట కంటే బంధువుల మర్యాదలు ఎక్కువౌతాయి కూడా! అదే పెద్ద పనైపోతుంది” అంటూ నవ్వేశారు అత్తయ్య.
మరో నాలుగు రోజులుండి అమ్మావాళ్ళు, తమ్ముడు వెళ్ళిపోయారు. మా క్యాండి, మిండిలు వాళ్ళకి కూడా నచ్చాయి.
**
అత్తయ్య అండదండలు, ఆప్యాయతల నడుమ నాకు తొమ్మిదినెలలు నిండాయి. ఢిల్లీ అపోలో హాస్పిటల్లో సెప్టెంబర్ పదిహేనున, ఉదయం ఎనిమిదింటికి పండంటి బాబుకి తల్లినయ్యాను. శ్యాం లాగా అందమైన వాడు నా బాబు.. ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నాము.
ఐదో రోజున నేను, బాబు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసాము. బాబుని చూడ్డానికి ఢిల్లీ వచ్చారు అమ్మావాళ్ళు. పరీక్షల సమయం అవడంతో వినోద్ రాలేకపోయాడు. అమ్మకి సహాయం చేస్తూ, పసివాడి పని నేర్చుకుంటుందని శాంతమ్మని పనిలో పెట్టారు అత్తయ్య. ఆదివారాలు తప్పించి ఆమె పొద్దుటే వచ్చి సాయంత్రం ఆరింటి వరకు ఉంటుందిట.
బాబుని ఎత్తుకోడానికి శ్యాం తెగ ముచ్చటపడినా, చేతుల్లోకి తీసుకొని మాత్రం యిబ్బంది పడుతున్నారు. మామయ్య కూడా అదే తంతు. వారివురు ప్రస్తుతం ఆమడ దూరం నుండే బాబుని ముద్దులాడి వెళుతున్నారు.
**
నేనింటికొచ్చిన మూడోరోజు, బాబుని చూడ్డానికి వస్తున్న చిత్ర, రమణిలతో తమ్ముడు వినోద్ కూడా ఢిల్లీ వచ్చాడు. వారి రాక నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
“అక్కా, బాబుకి నా పోలికులు కూడా ఉన్నాయి కదూ” అంటూ బాబు చుట్టూతే ఉంటున్నాడు వినోద్.
**
…ఇంటివెనక గార్డెన్ లో తిరగాలని, ఆరుబయట గాలికి కూర్చోవాలని, కుక్కపిల్లలతో ఆడాలని ఉంది. కాని బాలింతవంటూ అమ్మ, అత్తయ్య మరో రెండురోజులు గది దాటి రావద్దన్నారు.
పిల్లల పెంపకం గురించి అమ్మ చెబుతుంటే, చాలా విషయాలు నాతో పాటు వింటున్నారు రమణి, చిత్ర. మా ముగ్గురి సాన్నిహిత్యం ముచ్చటగా ఉందని సంతోషపడ్డారు అత్తయ్య. కబుర్లాడుతూ మాతో సరదాగా మెలుగుతున్నారు.
రమణి వైవాహిక జీవితం సుఖంగా ఉందని విని సంతోషించాము. డిగ్రీ అయిన వెంటనే పెళ్ళి చేసుకొని, భర్తకి బిజినెస్ లో కూడా భాగస్వామి అయ్యింది రమణి. నా పెళ్ళికి కూడా దగ్గరుండి అన్నిటా సాయం చేసిందని గుర్తు చేసింది అమ్మ. “అదే వైఖరి, అదే అల్లరి..పెళ్ళైనా రమణి మారలేదు”…అంది నవ్వుతూ…
చిత్ర మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతుంది. సైకియాట్రిస్ట్ అవ్వాలన్న చిత్ర నిర్ణయంలో మార్పు లేదు. మెడిసిన్ ఫైనల్ ఇయర్ అయ్యాక, తన సీనియర్ ఆనంద్ ని పెళ్లి చేసుకోబోతుందిట. తరువాత పోస్ట్-గ్రాడ్యుయేషన్ కూడా చేస్తుందట.
బాబుని వొడిలోకి తీసుకొని ముద్దులాడుతూ, “నేను మాత్రం పెళ్ళి అయిన వెంటనే బిడ్డ కోసం ప్లాన్ చేస్తా” అన్న చిత్ర మాటలకి అందరం నవ్వుకున్నాము.
“మీ బాబు అచ్చం వాళ్ళ నాన్నలా ఉన్నాడే నీలా. అసలు నీ పోలికే లేదనుకో, ఒక్క తలకట్టు తప్పించి” అంటూ నేను ఉడుక్కుంటానేమో నని చూసింది రమణి.
“మా వారి అందాలు పోలికగా వస్తే మంచిదేగా” అంటూ నవ్వేసాను.
**
తరువాత మూడోరోజులకి అవస్థ లేకుండా తిరుగ్గలుగుతున్నాను….చిత్ర వాళ్లకి మా కుక్కపిల్లలు క్యాండి, మిండి లని పరిచయం చేద్దామని ఇంటివెనక కంపౌండ్ లోకి తీసుకు వెళ్ళాను. నేను కూడా వాటిని చూసి వారం దాటింది.
‘క్యాండి’ కదలకుండా ఓ మూలకి పడి ఉన్నాడు. కుడి కాలుకి బేండేజి వేసి ఉంది. వాడికేమయిందో అర్ధంకాక కంగారుగా రాముని పిలిచి అడిగాను.
“శ్యాం బాబుగారు కుక్కపిల్లల్ని దూరంగా ఉన్న పార్క్ కి తీసుకెళ్ళారు మేడమ్. ఆ రోజు మేమూ వెళ్ళాము. పార్క్ లో చాలాసేపు ఆడించాము కూడా. ఇంటికొచ్చే ముందే, కాస్త ఎత్తైన గుట్టల మీదనుండి కిందకి పరిగెత్తిచ్చేసరికి క్యాండి కాలు మెలికపడి కదలలేకుండా అయిపోయింది. బాబుగారు వెంటనే డాక్టరు చేత కట్టేయించారు. తమరు తిరిగొచ్చిన ముందు రోజే మేడమ్” అంటూ విషయం బయట పెట్టాడు.
అసలంతగా పరిగెత్తలేని కుక్కపిల్లని, గుట్టలెక్కించి మరీ కిందకి తరమడం ఏమిటని నమ్మలేకపోయాను. శ్యాంలో నిర్లక్ష్యం, నిర్దయ కూడా ఉన్నాయని నా మనస్సు తడబడింది.
**
క్యాండి విషయంగా అన్యమనస్కంగానే ఉన్నా, చిత్ర కాబోయే భర్త గురించిన కబుర్లు, రమణివాళ్ళ కొత్త ఇల్లు, సంసారం, బిజినెస్ సంగతులు మాట్లాడుతూ గడుపుతున్నాను.
“పురిటికి కూడా ఇక్కడే ఉండిపోయావు. నిన్ను వదిలి ఉండలేరా శ్యాం? హైదరాబాదులో జరిగే నా పెళ్ళికి మాత్రం ఇద్దరు కలిసే రండి తల్లీ” అంటూ నవ్వేసింది చిత్ర.
“నీ పెళ్ళికి తప్పకుండా వస్తాగా! ప్రామిస్” అన్నాను.
రొజూ పొద్దుటే టిఫిన్లయ్యాక, వినోద్ తో ఢిల్లీ తిరిగేసి కాస్త షాపింగ్ కూడా చేస్తున్నారు రమణి, చిత్ర.
వచ్చిన వారానికి ముగ్గురూ తిరుగు ప్రయాణమయ్యారు.
**
కుక్కపిల్ల క్యాండి కాలు విషయమై డాక్టర్ సలహా తీసుకొని, రాము సాయంతో నెమ్మదిగా నడిపించడం మొదలుపెట్టాను. శ్యాంలా కాకుండా నా బాబుకి మూగజీవులపై ప్రేమ, జాలి ఉండాలని నా ఆశ..
**
బాబుకి ‘సందీప్’ అనే పేరు అందరికీ నచ్చింది. పసిమి ఛాయ, కొనదేరిన చక్కని ముక్కు, చిన్ని నోరు, నవ్వితే బుగ్గన చొట్టలు. వొత్తైన ఉంగరాల క్రాఫు. ఇంటిల్లిపాదికి నిత్యం వాడి ముద్దు మురిపాల్లో గడిచిపోతుంది. పెద్దవాళ్ళంతా వంతులేసుకుని మరీ వాడిని ఎత్తుకుని ముద్దులాడుతున్నారు.
దిష్టి చుక్కలు నానమ్మ పెడితే, నలుగు స్నానాలు అమ్మమ్మ డ్యూటీ. నాకూ, ఆయాకి పని తక్కువే.
“బాబు అచ్చం చిన్నప్పటి నీలని చూసినట్టే ఉన్నాడు” అంటూ అమ్మ బాబుని ముద్దులాడుతుంది. “ఏమంటారు మీరు?” అంటూ మధ్యలో నాన్నని కూడా అడుగుతుంది..
“అదెలా సాధ్యం వదినా? బాబు అచ్చం మా శ్యాంలా కదా ఉన్నాడు” , “చూడండి వాడి చిన్నప్పటి ఫొటో ఆల్బం” అంటూ అత్తయ్య శ్యాం చిన్నప్పటి ఆల్బం అందిస్తారు. బాబుని చూడ్డానికి ఎవరైనా వస్తే, తరుచుగా ఇంట జరిగే సంఘటన అదే. వాళ్ళు పోటీ పడే తీరు చూసి నవ్వొస్తుంది.
**
రాత్రిళ్ళు బాబు నిద్రపోవడం తక్కువే. మేలుకుని ఆడుతుంటాడు. ఒక్కోసారి కడుపు నొప్పితో బాధపడుతుంటాడు. నాకు, బాబుకి కూడా రాత్రి జాగారాలే. తలుపులు వేసేసుకొని వాడిని సముదాయిస్తూ ఉండవలసి వస్తుంది.
ఆదివారాలు తానింట్లో ఉన్నప్పుడు, బాబుని తన దగ్గర ఉంచమంటారు శ్యాం. మొదట్లో బాబుని చేతిలోకి తీసుకోడానికే సంశయించే శ్యాం, మెల్లగా అలవాటు చేసుకొంటున్నారు. ఆయన బాబుని ముద్దులాడుతుంటే… చూడ్డానికి చాలా ముచ్చటేస్తుంది. నా ఎదురుగా వాడిని ఆడిస్తుంటే… ఓ కలలా తోస్తుంది. అప్పుడు అతినిలో నేననుకున్న మొరటుతనం కూడా కనిపించదు. శ్యాం ఆప్యాయంగా బాబుని వొడిలోకి తీసుకుంటుంటే.. ఇకముందు అతని మీద అనుమాన పడకూడదపిస్తుంది.
**
ఇంటికొచ్చిన మూడు వారాలకి బారసాల జరిపించి ‘సందీప్’ అని నామకరణం చేయించాక, అమ్మావాళ్ళు తిరుగు ప్రయాణమయ్యారు.
“మీరు మళ్ళీ బాబు అన్నప్రాసనకి రావాలి” అన్నారు అత్తయ్య అమ్మావాళ్ళని సాగనంపుతూ..
“మా మనవడిని తరచుగా చూసుకోడానికి, ఈ తాతగారి రైల్వే ఉద్యోగం బాగా పనికొస్తుంది. సుఖంగా, సౌకర్యంగా ప్రయాణాలు చేస్తున్నాము” నవ్వుతూ కారెక్కింది అమ్మ.
**
మరో రెండునెలలకి బాబు గది తయారయ్యాక, తిరిగి పై అంతస్తులోకి మారాను. తరుచుగా బాబుతో ఆడాలని, ఆడించాలని శ్యాం ఉబలాట పడుతూ… అస్తవ్యస్తంగా వాడిని ఎత్తుకోడం, పైకి ఎగురవేయడం, రెక్క పట్టుకుని అటుఇటు లాగడం భరించలేకపోతున్నాను.

‘పసివాడిని శ్యాం చక్కగా ఎత్తుకుని ఆడించగలరు అన్న ఊహతో ఆనందించినంత సేపు పట్టలేదు, అది నిజం కాదని తెలుసుకోవడానికి.
“బాబుతో ఆడాలని ఉంది. వీడేమో ఎప్పుడు చూసినా నిద్ర పోతున్నాడు” అంటూ వాడు నిద్ర పోయేప్పుడు కూడా వాడి చేతులు, పాదాలు లాగుతూ వాడిని నిద్ర లేపుతున్న శ్యాంని, కొన్నిసార్లు గట్టిగా వారించాను.
అతని వద్ద బాబు ఉన్నప్పుడు, కాపలా కాయడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. శాంతమ్మ ఉన్నా, సందీప్ పనులన్నీ స్వయంగా చేసుకుంటున్నాను. పైపని చేస్తూ బాబుని ఓ కంట కనిపెట్టుకొని ఉంటే చాలని ఆమెకి వివరించాను..
**
సశేషం ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *