March 29, 2024

అమ్మమ్మ అనుభవం

రచన: యశస్వీ రచన

“అమ్మా జానకీ !!! నువ్వు, అల్లుడుగారు పిల్లాడిని రాష్ట్రం దాటించి చదివించాలని అనుకుంటున్నారట, , మీ నాన్నగారు అన్నారు. , నిజమేనా!?” అని ఆయాసంగా తన కూతురుని అడిగింది రత్నమాల.
“అమ్మా!! ముందు నువ్వు ఆ కర్రల సంచి నా చేతికి ఇచ్చి, ఇలా సోఫాలో కూర్చో!! ” అంటూ జానకి ఆ సంచి తీసుకుని పక్కన పెట్టి, వంట గది నుండి చల్లటి కడవ నీళ్లు తీసుకువచ్చి తల్లి చేతిలో పెడుతూ. , “మంచి నీళ్లు తాగి, ఓ రెండు క్షణాలు ప్రశాంతంగా కూర్చో అమ్మా!! ప్రయాణ బడలిక తగ్గిన తరువాత మెల్లగా అన్ని విషయాలు మాట్లాడుకుందాము. . . . ” అంది.
“సరేలేవే !!, , , నేను వస్తున్న విషయం అల్లుడు గారికి ఎప్పుడు చెప్పావు!?. పాపం!! ఆయన ఇంత ఎండన పడి తన కార్యాలయం నుండి నా దగ్గరకు వచ్చి, జాగ్రతగా ఇంటి దగ్గర దింపి, మళ్లీ బైటినుండే వెళ్ళిపోయారు. , కనీసం గుక్కిడు నీళ్లు కూడా నోట్లో పోసుకోలేదు!! ” అని రత్నమాల బాధ పడింది.
“అమ్మా!! ఆయన ఏ పని అయినా తనకు నచ్చితేనే చేస్తారు. నువ్వేమీ ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు. నువ్వు వస్తున్నావు అని మీ అల్లుడు గారు అన్నీ ముందే సిద్ధం చేసుకుని ఉన్నారు. , ఇంకలేమ్మా!! భోజనం సిద్ధంగా ఉంది, తినేసి సాయంత్రం వరకు పడుకో, , మీ అల్లుడు గారు కార్యాలయం నుండి వచ్చాక ప్రశాంతంగా మాట్లాడుకుందాము!!” అని జానకి రత్నమాలకు భోజనం వడ్డించడానికి లోపలకు వెళ్ళింది. .
‘అమ్మకి అసలు విషయం ఎలా చెప్పాలి!, ఆయన పిల్లాడిని తప్పకుండా ఆ పాఠశాలలో చేర్చడానికి నూటికి నూరు శాతం సిద్ధం అయ్యారు’ తల్లికి భోజనం వడ్డించి వచ్చిన జానకి మనసులో అనుకుంటూ, ఆమె విశ్రాంతి తీసుకోవడానికి గది సిద్ధం చేసే పనిలో పడింది.
ప్రయాణం వల్ల అలసిపోయిన రత్నమాల కూతురు చెప్పినట్టు సేద తీరింది. జానకి సాయంత్రం వంటకు కావాల్సినవి సిద్ధం చేసుకుని తనకు ఇష్టమైన పుస్తకాన్ని చదువుతూ కూర్చుంది. . ఆమెకు అక్షరాల మధ్య కాలం నెమ్మదిగా గడిచినా, అలసిపోయిన శరీరానికి పట్టిన నిద్ర వల్ల రత్నమాలకి మాత్రం, ఏదో గారడీలాగా మరో గంటకే సాయంత్రం అయ్యినట్టుగా మెలకువ రాసాగింది. . ఈలోపు జానకి భర్త రామ్మూర్తి రావడం, స్నానం చేసి బట్టలు మార్చుకొని దూరదర్శని ముందు కూర్చున్నాడు.
‘అమ్మ అసలు ఎందుకు వచ్చింది అన్న విషయం ఇంకా భర్తకి తెలియదు, తెలిస్తే ఎలా స్పందిస్తాడో??’ అని జానకి మనసులో ఆలోచిస్తూ కంగారుగా, కాలు కాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఈలోపు బయట అలికిడికి రత్నమాల మేల్కొని గది నుండి కళ్ళు, మొహం తన పైట కొంగుతో తుడుచుకుంటూ బయటకు వచ్చింది. “అమ్మా జానకీ!! అల్లుడు గారు వచ్చారా??” అని మెల్లగా నడుస్తూ ముందు గదిలోకి వచ్చింది.
“ఆయన వచ్చారు అమ్మా! ఏదో మాట్లాడాలి అన్నావు కదా!!” అని తన ఆలోచనల మధ్య కంగారులో రత్నమాలని ఇరకాటంలో పడేసినట్టు చేసింది జానకి. .
పక్కనే కూర్చున్న రామ్మూర్తి “అవునా!! ఏమిటి అత్తయ్య గారూ !! విషయం చెప్పండీ. . . . ” అని తన గంభీరమైన గొంతుతో అన్నాడు.
“అదేనండీ!! పిల్లాడ్ని ఆంగ్ల మాధ్యమంలో చదివించటానికి మీరు పక్కరాష్ట్రం పంపిస్తున్నారని మీ మావయ్య గారు అన్నారు!! ” అని రత్నమాల ఏదో చెప్తూ ఉంటే, మధ్యలో అందుకున్న రామ్మూర్తి, “అవునండీ!! పంపుతున్నాను. ఒక ఉద్యోగం కోసం కొన్ని వందల మంది పోటీ పడుతున్న ఈ రోజుల్లో పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వటానికి ఆంగ్ల మాధ్యమంలో చదువు అనేది చాలా ముఖ్యమైనది. . దీని గురించి నేను నిర్ణయం తీసుకుని, ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నాను!!. . ” అని తన మనసులో ఉన్న మాట బయటకు చెప్పాడు.
“మీకు ఆంగ్ల మాధ్యమాల్లో చదువు కావాలంటే, ఇక్కడే ఏదైనా ఒక మంచి పాఠశాలలో చేర్పించండీ. . , అంతేగానీ, ఇలా పక్క రాష్ట్రానికి పంపించడం ఎందుకూ అనీ. . . . . ”
“మీ మనసులో ఉన్న అసలు ఉద్దేశ్యం ఏంటో చెప్పండి అత్తయ్య గారూ!!. . . ”
“ఇప్పుడు అభివృద్ధి అని చెప్పుకుంటున్న ఈ చదువుల్లో మార్కుల కోసం విద్యార్థులు పడే వేదన తప్ప మరేం లేదు. అలాంటి ఈరోజుల్లో పిల్లలకి మంచి సంస్కారం నేర్పాలీ అంటే, పిల్లల దగ్గర తల్లో, నాన్నమ్మో, అమ్మమ్మో లేదా చక్కని మన కుటుంబ వాతావరణమో ఉంటే బావుంటుంది కదా!!. . . . . ”
“అక్కడ కూడా ఇలానే ఉంటుందండీ!! మీరు కంగారు పడకండి. , మన పిల్లవాడి, మిగిలిన పిల్లల బాధ్యత నిమిత్తం నియమించిన మహిళా ఉద్యోగులు , పంతులు గార్లు ఇంకా తోటి పిల్లలు ఉంటారు. అలాగే ఆడుకోవడానికి కూడా చాలా పరికరాలు, ఆటసామాగ్రి ఉంటాయి. , మంచి ఆహారం కూడా. . , ఇంకేం కావాలండీ!!” అని అసహనంగా అన్నాడు రామ్మూర్తి.
“అందరూ ఉంటారు గానీ, వాడి అవసరాలు తీర్చి అన్నీ అర్థం అయ్యేలాగా చెప్పడానికి మన భాష తెలిసిన వాళ్ళు అక్కడ ఎవరూ లేకపోతే వాడి పరిస్థితి ఏంటి??. పైగా వాడు ఇంకా చిన్న పిల్లాడు, ఇలా అయితే వాడికి అర్థం కాని ఆ భాషలో ఏది మంచో ఏది చెడో ఎలా తెలుస్తుంది!!. . ” అని గట్టిగా అంది రత్నమాల.
జానకి ఏం మాట్లాడకుండా తల దించుకుని, మల్లెలు మాలగా కడుతూ తల్లి, భర్తల మధ్య సంభాషణలు వింటూ, ఇక తప్పదు అని అనుకుంటే అమ్మని గానీ, భర్తను గానీ శాంత పరచడానికి సిద్ధంగా ఉంది.
“ఏంటండీ అత్తయ్య గారూ!! మీరు ఇంకా భాషా ! తెలుగు! అర్థం కాదు! అని అంటారు. ఈ రోజు పిల్లలు పుట్టుకతోనే అన్నీ నేర్చుకుంటున్నారు. , మీకు పిల్లాడి మీద ప్రేమ ఉందీ పంపవద్దు అంటే అందం గానీ, ఇలా అంటారేంటీ!?, నాకు వాడి మీద ప్రేమ ఉంది కాబట్టే ఈ పని చేస్తున్నాను!! ” అని రామ్మూర్తి కూడా కొంచెం గట్టిగానే సమాధానం చెప్పాడు.
“అల్లుడుగారూ!! మీకు తెలియదని కాదు!! పుట్టిన బిడ్డలకి అమ్మ భాషలోనే ఆది నుండి అన్నీ నేర్పితేనే, ఈ ఆధునిక సమాజంలో చీకు చింతా లేకుండా బ్రతుకుతారు. సంపాదిస్తూ బ్రతకడం వేరు, సంతోషంగా బ్రతకడం వేరు. . ఇప్పుడు మీరేమో, పిల్లలు భవిష్యత్తులో బాగా సంపాదించాలీ అని, చదువుల కోసం దూరంగా పంపుతారు. . , వాళ్లు పెద్ద అయిన తరువాత సంపాదిస్తారు తప్ప సంతోషంగా ఉండరు. , , ఆ తర్వాత, వాళ్ళు కూడా మిమ్మల్ని దూరంగానే పెట్టి, అదే ప్రేమ అనే భ్రమలో తమ సంపాదనతో వెలకట్టి చూస్తారు, , అంతే నాయనా!!. . ” అని తన అవేదనను వెళ్లగక్కింది రత్నమాల.
“అంటే!! ఇంటి నుండి దూరంగా పెట్టి చదివిస్తే, వాళ్ళు మమ్మల్ని కూడా ఇంటి నుండి గెంటేస్తారు అంటారు అంతేనా!!”
“నేను అలా అనడం లేదు. ఇంటి నుండి దూరంగా పోతే అమ్మ నాన్నల విలువ తెలిసి కష్టపడి చదువుకుంటారు అనే రోజులు కాలంలో కలిసిపోయాయి. ఇప్పుడు ఎటు చూసినా చెడు తప్ప మరేం లేదు, అన్ని రకాల చెడు వ్యాపకాలు అరచేతి దూరంలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో పిల్లలకి మనం మంచి భవిష్యత్తు ఇవ్వటం అంటే మంచి వ్యక్తిత్వం ఇవ్వడమే కదా!! కాబట్టి, కనీసం వాడికి కొంచెం వితరణ జ్ఞానం వచ్చేంత వరకూ అయినా పిల్లల్ని ఇంటి దగ్గరే పెంచుదాము అంటున్నాను!!. . . . ”
“మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇళ్ళ దగ్గర పెరిగిన పిల్లలు అందరూ పద్దతిగా ఉన్నారా ఏంటి??”
“నేను చెప్పేది పూర్తిగా వినండి!!. . ” అని కూతురి మొహం చూస్తూ. . . సౌమ్యం నిండిన గొంతుతో రత్నమాల, “అవును ఒక కుటుంబంలో పిల్లలు పెరగటానికీ, అలాగే ఖరీదైన వసతిగృహాల్లో పెరగటానికి చాలా వ్యత్యాసం ఉంది. అలా పెరిగిన పిల్లలు నాలుగు గోడల మధ్య, మహా అయితే ఓ పది మంది అదే వయసు ఉన్న పిల్లల మధ్య పెరుగుతారు. . , వాళ్ళకి సమాజం గురించి ఏం తెలుస్తుందీ, , ఏమీ తెలియదు. ఎందుకంటే, నేను అలాంటి వాళ్ళను కళ్ళారా చూసాను. . , అప్పటి వరకు అణిచిపెట్టిన వాళ్ళ మనసులోని కోరికలకు ఒక్కసారిగా స్వేచ్ఛ వస్తే వాళ్ళు ఏం చేస్తారు?? అప్పటి వరకు నాలుగు గోడల మధ్య బందీగా ఉండి, ఒక్కసారిగా సమాజంలోకి వస్తే వాళ్ళు సమాజంలో పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు. . ?? ఈ విషయాలేవీ ఈకాలం తల్లిదండ్రులు ఆలోచించరు కేవలం చదువు పూర్తి చేసుకుని ఒక మంచి ఉద్యోగంతో బయటకు రావాలనే ఆలోచిస్తారు” అంది.
అప్పటి వరకు తల దించుకుని తల్లీ, భర్త మధ్య సంభాషణలు వింటున్న జానకి తల పైకి ఎత్తి, ‘అవును కదా!!’ అన్నట్టు మొహం పెట్టి భర్త వంక ఆశగా చూడసాగింది. . అది గమనించిన రామ్మూర్తి తన మాటల్లో ఉన్న ఆవేశం తగ్గించి, తను కూడా మెల్లగా, “చూడండి అత్తయ్య గారు!! ఇప్పుడు ఉన్న లోకం పోకడలను బట్టి మనం ముందుకు సాగాలి అంతే, వందలో తొంభై మంది పిల్లలు ఇప్పుడు ఇలానే చదివి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు!! ” అన్నాడు.
“ఉపాధి కోసం చదువు కాదండీ!!, ఏది మంచో ఏది చెడో తెలుసుకోవటమే చదువు యొక్క ముఖ్య ఉదేశ్యం కావాలి కానీ, తల్లిదండ్రులు ఆశ, ఇంకా కళాశాల యాజమాన్యాల దురాశ వల్ల చదువు అంటే కేవలం ఉపాధి మాత్రమే అనే ముద్ర వేశారు. అందుకే చెరసాలలో ఖైదీలుగా పిల్లల్ని చూస్తూ, వాళ్లలో ఉన్న ఎన్నో ప్రత్యేకతలను తొక్కిపెట్టి, చదువు!! చదువు!! అని బండకేసి రుద్దుతున్నారు. నా మనవడికి అలాంటి చదువు వద్దు!! అమ్మానాన్నల మధ్య ఆప్యాయంగా పెరగనిద్దాం అంటున్నాను!!. . . . . ”
అత్తగారి మాటలు రామ్మూర్తిని సంకోచంలో పడేసినా, తను తీసుకున్న నిర్ణయం కూడా ఏమీ తప్పు కాదన్న నమ్మకంతో, “పిల్లలు మన దగ్గర పెరిగితే అన్నీ అవసరానికి దొరికి, వాళ్ళకి కష్టం తెలీదు. ముద్దు చేస్తే మొండితనం పెరుగుతుంది!. మాట వినరు!, చీటికీ మాటకి గొడవలు పడుతూ, పెద్దవారి మీద ఆధారపడిపోతూ ఉంటారు! ఇలా ఎన్నెన్నో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానండీ నేను!!!. . . . ” అన్నాడు.
“అయ్యో అల్లుడు గారు!!, పిల్లల మీద తల్లిదండ్రులు చూపించే ప్రేమ ఇంకా ఆప్యాయత అనేవి ఒక పరిమితి తర్వాత, పిల్లలకి బాధ్యత తెలిపేలాగా మార్పు చెందాలి. , , అంటే పిల్లలు ఇంట్లో పెరిగితే, వాళ్ళ చిన్నవయసు నుండీ, నాన్న పడుతున్న కష్టం వెనుక బాధ్యతనీ, అమ్మ పడుతున్న కష్టం వెనుక ప్రేమనీ చూస్తూ పెరుగుతారు. . . , అప్పుడే వాళ్ళకి తల్లిదండ్రుల మనసు అర్థం అవుతుంది అంటున్నాను!!! ఇది వాస్తవం నాయనా!!!. . . ”
రత్నమాల మాటల్లో నిజం లేకపోలేదు అని రామ్మూర్తి కి మెల్లగా అర్థం అవుతున్నది కానీ, తను తీసుకున్న నిర్ణయం మార్చుకోవటానికి తన అహం అడ్డు వచ్చో లేక, ఆధునిక ప్రపంచ పోకడలకు భ్రమించో “ఈ రోజుల్లో పిల్లలు ఎక్కడ ఇలా చేస్తున్నారండీ??. . . బడి నుండి రాగానే దూరదర్శని ముందో, లేకపోతే, అమ్మా నాన్నల చరవాణిని లాక్కుని దాని చేతిలో పెట్టుకుని కాలం వృధా చేస్తున్నారు తప్ప ఇంకేం చెయ్యరు!!!. . . ” అని రత్నమాల మాటలకి అడ్డుకట్ట వెయ్యాలని చూశాడు.
” నాయనా!! నేను మీకు చెప్పేంత దానిని కాదేమో!! కానీ, నేను చూసిన మనుషులను ఆధారంగా చేసుకుని చెప్తున్నాను వినండి!!. . ” అని పక్కనే ఉన్న జానకిని కూడా అదిలించి, “నువ్వు కూడా విను అమ్మాయ్!!” అంటూ, “కొంతమంది తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు వేసుకునే బట్టలు, ప్రముఖ తయారీదారులవా? కాదా? అని చూస్తున్నారు తప్ప, వాళ్ళు సమాజంలో ఎలా మెలుగుతున్నారో అని కూర్చో బెట్టి మాట్లాడే వాళ్ళు తక్కువ. . , పెద్దవాళ్ళు ఏది చేస్తే పిల్లలు కూడా అదే చెయ్యాలి అనుకుంటారు అని ఆలోచించటం లేదు!!. . . . . ”
“అయితే పిల్లలు సరిగ్గా ఎదగాలి అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళతో కూర్చుని పుస్తకాలు పట్టుకోవాలి అంటారా ఏంటండీ??” అని మెల్లగా వెటకారం ధ్వనించగా అన్నాడు రామ్మూర్తి. .
“నేను అలా అనడం లేదు అండీ. . . జీవితంలో తాను ఎన్ని బాధ్యతలు మొయ్యలో అని ఒక అబ్బాయికి ఎప్పుడు తెలుస్తుంది. . ?? తన నాన్నను చూస్తేనే తెలుస్తోంది!. . . ఒక కుటుంబంలో నాన్న అనే స్థానం లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో వివరంగా చెప్పాలి. ఆ పరిస్థితి రాకుండా ఉండటం కోసం తాను సమాజంలో ఎలా మెలుగుతున్నాడో?? తన కొడుక్కి ఆ తండ్రి తప్పకుండా చెప్పాలి. . . అప్పుడే ఆ కొడుక్కి తన మీద వున్న బాధ్యత ఏంటో తెలుస్తోంది!!. తండ్రి తన కొడుక్కి అమ్మను నువ్వు ఎలా చూసి గౌరవిస్తున్నావో అలాగే సమాజంలో మిగిలిన స్త్రీలను కూడా అలాగే గౌరవించాలి అని తప్పకుండా కొంత సమయం వెచ్చించి అర్థం అయ్యేలాగా చెప్పాలి. ఒక తండ్రి పిల్లలు తప్పు చేసినప్పుడు, , గొడ్డును బాదినట్టు బాదకుండా, ఆ తప్పు వల్ల వచ్చే పర్యవసానాలు గురించి క్షుణ్ణంగా చెప్పి, ఆ తప్పును మళ్ళీ చెయ్యకూడదు అని చెప్పాలి. ఇలా పిల్లలకి చెప్పే ఓపిక అయితే అమ్మానాన్నలకి ఉంటుంది లేదా ఏ అమ్మమ్మకో, నాన్నమ్మకో ఉంటుంది తప్ప, ఈ ఆడ ఉద్యోగస్తులకూ, ఇంకా పిల్లల చుట్టూ పని చేసే వాళ్ళకో ఉండదు అంటున్నాను!!!. . . ” అని ఒక కొడుకు వృద్ధి వెనుక తండ్రి బాధ్యత ఎలా నిర్వర్తించాలో?? అని అల్లుడుకి సున్నితంగా చెప్పింది.
తల్లి మాటలు వాస్తవాలు తెలుపుతూ, తన భర్త మనసులో మార్పు తీసుకువస్తున్నాయని జానకికి అర్థం అయ్యింది. . తను కూడా అమ్మకి వత్తాసు పలకాలని “ఒక ఆడపిల్లకి మొదటి గురువు అమ్మే. అమ్మే అన్నీ చెప్పాలి. . . తాను ముందుగానే సమాజపు పోకడల మధ్య నలిగి వుంటుంది. ఆ దుస్థితి మరో ఆడపిల్ల పడకూడదు అంటే అమ్మే ఖచ్చితంగా తన అనుభవాలు ఉదాహరణలుగా చెపుతూ తన బిడ్డకి సమాజాన్ని మరో కోణం వైపు చూపించాలి, ఎదుర్కొనే ధైర్యాన్ని నింపాలి. ఆడపిల్ల మంచి గురించి చెప్పటానికి తల్లికి ఉన్నంత స్వేచ్ఛ తండ్రికి కూడా ఉండదు. సొంత తండ్రికి కూడా కూతురి దగ్గర కొన్ని పరిమితులు ఉంటాయి. . . . అలాంటిది!! చిన్న వయసులోనే పిల్లల్ని హాస్టల్లో పెంచాలి అనుకోవడం మంచి నిర్ణయం కాదేమో!! ” అని తన ముందు ఆడుకుంటున్న కూతుర్ని వడిలోకి తీసుకుంటూ చాలా దృఢంగా చెప్పింది.
అత్త గారికి భార్య తోడవడంతో రామ్మూర్తి ఆలోచనలో పడ్డాడు. ‘ఇప్పటి వరకూ ఎప్పుడూ, నా నిర్ణయానికి ఎదురు చెప్పని జానకీ కూడా నా నిర్ణయం మార్చుకుంటే బావుంటుందన్న చూపుతో నన్ను చూస్తూ మాట్లాడుతుందంటే!! బహుశా నేను తీసుకున్న నిర్ణయం మంచిది కాదేమో??’ అని మనసులో అనుకుని మౌనంగా కూర్చున్నాడు.
రామ్మూర్తి మనఃస్థితి గమనించిన రత్నమాల “చిన్న వయసులోనే పిల్లలకి ఏదయినా చెపితే బుర్రలోకి ఎక్కుతుంది, ఒక్కసారి యవ్వనంలో పడ్డారా!! మన మాటలు వాళ్ళ చెవి దగ్గరకు కూడా వెళ్లవు, ఇంకా చెప్పాలీ అంటే, ఆ మాటలు వెగటుగా, పాతరకపు మాటలులాగా ఉంటాయి. కాబట్టి పిల్లలకి ఆ వయసులోనే మంచి మంచి విషయాలు చెప్పాలి, అప్పుడే అవి బుర్రకి ఎక్కుతాయి. అమ్మ ప్రేమ, తండ్రి బాధ్యత తెలిసినప్పుడే తప్పు చెయ్యడానికి పిల్లలు ఆలోచిస్తారు. ఆ ఆలోచనే వాళ్లలో తప్పు చెయ్యాలి అనే భావం పోయేలా చేస్తుంది. పిల్లల మీద తల్లిదండ్రులు వత్తిడి ఉన్నంత వరకు వాళ్ళకి ఉతీర్ణత అవటమే కావాలి అని అనుకుంటారు తప్ప మరో ఆలోచన ఉండదు. అందుకే పిల్లలని దగ్గరకు తీసుకుని మనసారా చెప్పాలి” అని అంది.
రామ్మూర్తి రత్నమాల మాటలని సంగ్రహంగా ఆలోచిస్తూ మరో మాట మాట్లాడకుండా అలానే తన మౌనాన్ని కొనసాగించాడు. ఒక్కసారిగా అతను, “మరి పిల్లలు ఇంట్లో ఉంటే మొండితనం, పొగరు ఇంకా బద్దకం పెరగదు అంటారా!!” అని అనుమానంగా అడిగాడు.
“పెరగదు అని నేననండీ!!, , ఖచ్చితంగా పెరుగుతుంది. , కాబట్టి, తల్లిదండ్రులు పిల్లలతో ఇంట్లో అన్ని పనులు చేయించాలి. . , వాళ్ళ శక్తి మేరకు. వాళ్ళకి ప్రేమ పంచాలి తప్ప గారాబం చెయ్యకూడదు. ఇంట్లో, ‘ఛీ!! నేను చేయను’ అనే పని నుండి, మీరు ఉండండి! నేను చేస్తాను!!’ అని పిల్లలు అనే విధంగా పెంచాలి. అప్పుడే వాళ్ళలో మీరు అన్న ఆ లక్షణాలు దరి చేరకుండా ఉంటాయి. . . ఇప్పటి వరకూ నేను చెప్పినవన్నీ మీరు చెయ్యాలి అంటే పిల్లలు ఇంట్లోనే ఉండి చదువుకోవాలి. . . . అప్పుడే ఇవన్నీ నూటికి నూరు శాతం సాధ్యపడతాయి” అని చెప్పి, ఒక పెద్ద నిటూర్పు విడిచింది రత్నమాల.
ఇన్ని చెప్పినా భర్త నిర్ణయంలో మార్పు రాలేదు అనుకుని ఇంక చేసేదేం లేక “అమ్మా!! నేను తినడానికి అన్నీ సిద్ధం చెస్తాను. నువ్వు ఆయన వస్తే తినేసి పడుకుందాము. . ” అని నిరాశగా వంట గది వైపు అడుగులు వేసింది.
రత్నమాల పైకి లేస్తుంటే కరవాణి మోగింది, ఎవరిది అని చూస్తే అల్లుడిది. . దాంట్లో పేరు ‘మావయ్య’ అని ఉంది.
అప్పటికే తన మనసు మార్చుకున్న రామ్మూర్తి కరవాణి చేతిలోకి తీసుకుని, “హా మావయ్య గారు!! చెప్పండీ!!. . . . ” అన్నాడు.
జానకి తండ్రి పరంధామయ్య , “ఎలా ఉన్నారండీ!! మీరు, అమ్మాయి, మనవరాలు క్షేమమేనా!! అని పరామర్శించి, “విషయం ఏంటంటే, అదేనండి!! రేపు మీ అత్తగారు తిరిగి ఇక్కడికి వస్తుంది కదా!! వచ్చేటప్పుడు మర్చిపోకుండా తనని పిల్లాడివి నూలు దుస్తులు, మెత్తగా ఉండేలా తీసుకురమ్మని చెప్పండి. . , అలాగే, వేసవికాలం సెలవులు ఎప్పుడు అవుతాయో చెప్పితే, ఓ వారం రోజుల ముందు చంటోడ్ని ఇంట్లో దింపుతాను. . ఇప్పటికే జానకి, ‘పిల్లాడు ఇంటి దగ్గర లేడని బెంగగా ఉంది నాన్నా!! పంపించండి వాడిని, మీరు దింపిన వెంటనే హాస్టల్లో వేస్తారు ఆయన. . , అప్పుడు బెంగ మరీ ఎక్కువ అవుతుంది’ అంటుంది. . , కనీసం ఆ వారం రోజులు అయినా పిల్లాడు జానకి దగ్గర ఉంటే బాగుంటుందని నా తాపత్రయం. . . ” అని అన్నాడు. .
రాము మనస్ఫూర్తిగా నవ్వుతూ, “అయ్యో మావయ్య గారు!! మీరు చేసినా నేను చేసినా వాడి మంచి కోసమే కదా!! నేను లోకం తీరు బట్టి అలా ఆలోచించాను అంతే!, వాడి భవిష్యత్ రాష్ట్రం మారితే బావుంటుంది అని ఆలోచించాను తప్ప, నేను తీసుకున్న నిర్ణయం వెనుక చెడును ఆలోచించలేక పోయాను. ఆ చివరి వారం కూడా పిల్లాడు మీతో పాటే ఉంటాడు. . , అంతగా జానకీకి చూడాలనిపిస్తే, వీలుంటే ముగ్గురం రేపే అక్కడే వస్తాము. . కుశగాడిని ఇప్పుడు చదువుతున్న బడిలోనే కొనసాగిద్దాము. . ” అని తన మాటలు విని ఆగి, చూస్తున్న జానకి వంక చూస్తూ కరవాణి పెట్టేశాడు.
భర్తను చూస్తూ, అతను తండ్రితో మాట్లాడిన మాటలు విన్న జానకి, పరుగున వెనక్కి వచ్చి తల్లిని హత్తుకుని, కృతజ్ఞతగా ఆమె చెయ్యి పట్టుకుని, ఆనంద బాష్పాలతో ముద్దుల వర్షం కురిపించింది. .
*********శుభం*********

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *