April 19, 2024

ఆ ముగ్గురు – సమీరా

రచన: లత పాలగుమ్మి

హై వే మీద రయ్ రయ్ న జిగ్ జాగ్ గా అందరిని ఓవర్ టేక్ చేసుకుంటూ ఒక బైక్ దూసుకు వెళుతోంది. భయమంటే ఏమిటో తెలీదు బైక్ మీదున్న ఆ ముగ్గురు యువకులకు. వాళ్ళే సంతోష్, అమర్, సూర్యాలు. ఒకోసారి ఇలాంటి వాళ్ళ వలనే యాక్సిడెంట్స్ అయి అమాయకులు బలి అయిపోతూ ఉంటారు.
ఒకటే నవ్వులు, అరుపులు, కేకలతో ఇంజినీరింగ్ కాలేజీ చేరుకున్నారు. ఫోర్త్ ఇయర్ లో ఉన్న ఈ ముగ్గురు ప్రబుద్ధులు ఒక్క సంవత్సరం కూడా పాస్ కాలేదు. అయినా బిందాస్ గా తిరుగుతున్నారు ఏ విధమైన ధ్యేయం లేకుండా.
చీఫ్ గెస్ట్ గా అప్పుడప్పుడు క్లాసులకి అటెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళకి కాలేజీ ఎంట్రన్స్ లో ఒక అడ్డా ఉంది. అక్కడ కూర్చుని వచ్చే పోయే అమ్మాయిలని కామెంట్ చేయడం, ఫ్రెషర్స్ అయితే టీజ్ చెయ్యడం ఇదే వాళ్ళ దినచర్య.
సడన్ గా ఒక బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ కార్ వచ్చి ఆగింది స్పీడ్ గా. “ఎవర్రా మనకి తెలియని ఈ కొత్త అడ్మిషన్” అని వాళ్ళు తర్జన భర్జనలు పడుతూ ఉండగా డ్రైవర్ ఖంగారుగా డోర్ ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి కార్ దిగి లోనికి వస్తోంది. ఎంత అందంగా ఉందంటే ఎప్పుడు కామెంట్ చేసే ముగ్గురు కిమ్మనకుండా చూస్తూ ఉండిపోయారు. ప్యాంటు, షర్ట్ వేసుకుని, చిన్న హెయిర్ కట్ తో సింపుల్ గా చూడచక్కగా ఉంది. ఆమే సమీర. వాళ్ళని ఏమైనా అడుగుతుందేమోనని ఏ ఇయర్ లో జాయిన్ అయిందో లేదా ఎవరి నైనా కలవడానికి వచ్చిందా? వివరాలు తెలుసుకోవాలని ఉత్సుకతతో ఉన్నారు ముగ్గురు.
కానీ సమీర వీళ్ళని గమనించినట్లే లేదు. మెల్లగా ఆమెని ఫాలో అయ్యారు పరిచయం చేసుకుందామని. “యస్క్యూజ్ మీ మిస్” అని పిలిచాడు సంతోష్ , వాళ్ళలో కొంచెం పొలైట్ గా ఉండేది అతనే.
ఆమె వెనక్కి తిరిగి చూసింది. “మీరు ఏ క్లాస్ కి వెళ్ళాలి” ? అని అడిగాడు గొంతులో ఎక్కడ లేని నమ్రత తెచ్చుకుని.
“ఐ నో ది క్లాస్ రూమ్, ఎనీవే థాంక్ యు” అని సింపుల్ గా రిప్లై ఇచ్చి సమీర వెళ్ళిపోయింది. మరునాడు కూడా ఆమెతో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించారు

రోజులు గడిచి పోతున్నాయి, ఎలాఅయినా సమీరాతో దోస్తీ చెయ్యాలనే ప్రయత్నం నెరవేరక పోవడంతో ఆమెని చూస్తేనే వాళ్ళకి కంటకింపుగా ఉంది. డబ్బు, అందం అన్ని ఉన్నాయనే పొగరు బాగా ఉంది ఈమెకి, ఎలా ఐనా అది అణచాలి అనుకున్నారు.
ఇది ఇలా ఉండగా వాళ్ళకి అస్సలు ఇష్టం లేని కార్తీక్ తో ఆమె ఫ్రెండ్లీ గా ఉండటం అగ్గికి ఆజ్యం పోసినట్లు అయింది. కార్తీక్ ఆల్ రౌండర్. ఎంతో వినయ విధేయతలు, అన్ని ఆక్టివిటీస్ లో ముందు ఉండబట్టి అతనంటే ప్రొఫెసర్స్ కి, స్టూడెంట్స్ కి అందరికీ ఇష్టం.
రోజూ కార్తీక్ తో నవ్వుకుంటూ వారి ముందు నుండే వెళ్ళటం, అతనికి తన కారులోనే లిఫ్ట్ ఇవ్వటం ఇవన్నీ చూసి సహించలేక అతి హీనమైన పనికి పూనుకున్నారు ముగ్గురూ. ఏ అందం చూసుకుని ఇంత మిడిసి పడుతోందో ఆ అందమే లేకుండా ఆమె మీద యాసిడ్ ఎటాక్ చేయాలనుకున్నారు. ఇవన్నీ ఏమీ తెలియని సమీర ఎప్పటి లాగానే కాలేజీకి వచ్చి వెళుతోంది.
ఆరోజు సాయంత్రం వాళ్ళ కాలేజీలో సమీర వాళ్ళ ఆంటీ రాజేశ్వరి గారి గెస్ట్ లెక్చర్ ఉండటంతో ఫ్రెండ్స్ తో కలసి హుషారుగా ఆడిటోరియం కేసి నడిచింది.
సంతోష్ వాళ్ళ గాంగ్ కి ఇలాంటి లెక్చర్స్ పైన పెద్ద ఇష్టం లేకపోయినా అల్లరి చేయటం కోసం చేరారు అక్కడికి.
ఇక్కడ రాజేశ్వరి గారి గురించి కొంచెం చెప్పుకోవాలి మనం. ఆమె ఒక సోషల్ వర్కర్. యువతకి మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వటంలో ఆమెకి ఎవ్వరూ సాటి లేరు. ఎప్పుడూ చిరు దరహాసంతో అందరికీ సహాయం చేస్తూ, మంచితనానికి మారు పేరులా ఉంటారు.
కాలేజీ వాళ్ళు ఆమెకి ఎదురెళ్ళి ఘనంగా స్వాగతం పలికారు. పెద్ద ఆడిటోరియం, సుమారుగా ఆరు, ఏడు వేల మంది విద్యార్థులు ఉన్నా, అక్కడ పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంది. ఆమె ప్రసన్నవదనంతో హుందాగా డయాస్ మీదకి నడిచి వెళ్ళారు. ఎంతో ఆర్తి కలిగిన గొంతుతో ఆమె తన ఉపన్యాసం ప్రారంభించారు.
నేను చెప్పే ఈ విషయాలు మీకు తెలియనివి అని కాదు. అయినా అసాంతం నా ఈ మాటలు విని ఆచరణలో పెడతారని భావిస్తున్నాను.
ఈమధ్య యువత ప్రతి చిన్నదానికి డిప్రెషన్ కి లోనవడం, ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోలేదనో, ర్యాంక్స్ సరిగా రాలేదనో, ఇంట్లో పేరెంట్స్ తిట్టారనో ఇలా ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. స్టూడెంట్ లైఫ్ లో ఫస్ట్ ప్రియారిటీ స్టడీస్ కి ఇవ్వండి. జీవితం చాలించాలనే ఊహనే రానివ్వద్దు. ఎంతో అందమైన జీవితం ముందుంది. సూయిసైడ్ పిరికివాళ్ళు చేసే పని. జీవితాన్ని జీవించండి. అందరితో కలిసి ఎంజాయ్ చేయండి.

మరో ముఖ్యమైన టాపిక్ యాసిడ్ అటాక్స్. ఈమధ్యన కాలేజీలలో యాసిడ్ అటాక్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం.
మీరు ఇష్టపడిన అమ్మాయి తిరిగి మిమ్మలిని ఇష్టపడాలని రూల్ ఏముంది? ఇష్టపడకపోతే ఆసిడ్ ఎటాక్ చేసి ఆమె లైఫ్ స్పాయిల్ చేసేస్తారా?ఇది ఎంతవరకు న్యాయం?? ఈమాత్రం కనీస జ్ఞానం లేకపోతే ఎలా? మనం ఆటవికులం కాదు. నాగరిక సమాజంలో ఉంటున్నాం. విద్యాబుద్ధులు కలిగిన వాళ్ళం. మిమ్మలిని ఇష్టపడలేదనే చిన్న విషయానికి ఇంత కిరాతకానికి పాల్పడటం సబబా?? ఇదే మీ చెల్లెలికో, అక్కకో జరిగితే మీకెంత బాధ గా ఉంటుంది. ఇవన్నీ ఇప్పటి యువత ఆలోచించవలసిన విషయాలు.
సో స్టూడెంట్స్, ఆలోచించండి. ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తే ఏ తప్పూ చేయరు. ఆ నమ్మకం మీమీద నాకుంది. బాధ్యతాయుతమైన పౌరుడిగా మసాలాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది.
జైహింద్, అంటూ తన ఉపన్యాసానికి ముగింపు చెప్పారు రాజేశ్వరి గారు. ఆ హాలంతా కరతాళధ్వనులతో హోరెత్తిపోయింది.
క్రమంగా ఆడిటోరియం అంతా ఖాళీ అయిపోయింది. ఆ ముగ్గురు కూడా బైక్ తీసుకుని బయలు దేరారు. రాజేశ్వరి గారి మాటలు సంతోష్, సూర్యల మీద కొంత వరకు బాగానే ప్రభావం చూపించాయనే చెప్పొచ్చు. ప్లాన్ విత్ డ్రా చేసుకుందామంటే అమర్ మాత్రం “ ఇప్పటికి మనం ఇలాంటి లెక్చర్స్ ఎన్ని వినలేదురా, ఈ మాత్రానికే ఇలా ఐపోయారేంటి అని కొట్టిపారేశాడు. ఎలా ఐన యాసిడ్ ఎటాక్ చేసి ఆమె పొగరు అణచాలని డిసైడ్ చేశాడు. మిగతా ఇద్దరు ససేమిరా ‘నో ‘ అన్నారు.
వాళ్ళు స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఒక లారీని ఓవర్ టేక్ చేస్తుండగా లారీ వాడు వీళ్ళని గుద్ది స్పీడ్ గా కనుమరుగు అయ్యాడు. వీళ్ళు బ్రతికారో లేదో కూడా చూడకుండా.
సంతోష్, సూర్యలకి దెబ్బలు తగిలాయి, అమర్ డ్రైవ్ చేస్తూ ఉండటంతో అతనికి సివియర్ గా దెబ్బలు తగిలి రక్తం మడుగు లో ఉన్నాడు. హెల్ప్ కోసం అని ఎంత అర్ధించినా ఎవరూ వెహికల్స్ ఆపడం లేదు.
ఇంతలో వాళ్ళకి సుపరిచితమైన బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ వచ్చింది. ఆమె వీళ్ళని చూసి ఆగి వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి, వాళ్ళు డాడీ కి ఫోన్ చేసి డాక్టర్స్ తో మాట్లాడించింది. ఆపరేషన్ కి కావలిసిన మనీ పే చేసి వెళుతుంది.
సుమారుగా రెండు రోజుల తర్వాత అమర్ కి ప్రాణాపాయం లేదని చెప్పారు డాక్టర్స్. సంతోష్, సూర్యలు చిన్న ఫ్రాక్చర్స్ తో బయట పడ్డారు. సమీర రోజూ వచ్చి చూసి వెళుతోంది.
ఆమె ప్రవర్తిస్తున్న తీరు చూసి వాళ్ళకి సిగ్గుతో ప్రాణం పోయినట్లు అయింది. ఇంత మంచి మనిషి గురించి ఎంత తప్పు గా అనుకున్నామో కదా అని ఫీల్ అవుతారు.
అమర్ జరిగింది తెలుసుకొని పశ్చాతాపంతో కుమిలి పోతాడు. మా లాంటి వాళ్ళకి మీతో మాట్లాడే అర్హత కూడా లేదు సమీర గారు అని అమర్ చేతులెత్తి నమస్కరిస్తాడు.
సంతోష్, సూర్యలు కూడా సమీర ని క్షమించమని అడుగుతారు మనస్ఫూర్తిగా. ఆమె జరిగింది తెలుసుకోని వీళ్ళలో వచ్చిన మార్పుకి సంతోష పడుతుంది. రాజేశ్వరి అంటీకి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *