March 29, 2024

గిలకమ్మ కతలు – “దీన్దుంపదెగ…పెద్దాలోసనే!”

రచన: కన్నెగంటి అనసూయ

“గిలకా …..ఏమేయ్ గిలకా..”
ఈధిలోంచి ఎవరో పిలుత్తున్నట్తనిపించి అవతల దొడ్లో..తిరగల్లో కందులు ఇసురుతున్న సరోజ్ని తిరగల్ని తిప్పుతుం ఆపి వంగదీసిన కొడవల్లాగ నడాన్ని బాగా ముందుకొంచి దూరంగా సూసింది ..ఈధి గుమ్మానికేసి.
సూడగానే గుర్తుపట్తేసింది సరోజ్ని ఆ పిల్లెవరో.
వంకోరి ఎంకాయమ్మ మన్రాలు సుబ్బలచ్వి. దోరబంధాన్నట్టుకుని అదేదో పుటో లాగ లోపలికి సూత్తా గిలకమ్మ కోసం అరుత్తుంది. గిలక కళాసే.
“ ఏటే .. సుబ్బలచ్వే..ఇలాగొచ్చేవ్..! జతకత్తు కోసవా?” వంగుని అలా సూత్తానే అరిసింది సరోజ్ని..
గుమ్మమవతలే నిలబడుందేవో ..గాలికి ఏవందో..ఇసుమంతైనా ఇనపళ్లేదు సరోజ్నికి..
“లోనకొచ్చి సెప్పొచ్చు గదా..గోడబల్లల్లే..అలా దోరబందానికతుక్కుపోపోతే. నువ్వేవంటన్నావో ..నాకినపడతల్లేదు బాబా.. ఇదెక్కడ పెత్తనాలు సేత్తందో. లేపోతే వచ్చేదే నీ గొంతినగానేనీ.. ” అనేసి ఎడం సేత్తో..సేట్లో కందుల్లోంచి గుప్పెడు కందుల్దీసి తిరగల్లో పోసి రెండు తిప్పుల్దిప్పి..
“ సర్లే.. పిల్లలు పిల్ల కోసం కాక..ఇంకెందుకొత్తార్లే. నాకోసవత్తారా? “ అని మనసులో ఓ సారనుకుని..లోనకి రమ్మని గిలకెక్కడికో బేటికెల్లిందని సెప్దావని తిరగల్ని సాంతం ఆపేసి..మల్లోపాలి వంగుని అదే పనిగా గుమ్మంకేసి సూత్తందేవో..తిరగలి గురుజొచ్చి జాకిట్ ఉక్కీసులు ఎట్టుకునే సోట గుండెల మీద గుచ్చుకుంటున్నా పట్టిచ్చుకోకుండా అటే సూత్తుండి పోయింది..అప్పటికే ఉరమని పిడుగులాగ ఎక్కణ్నించొచ్చిందో ఏవోగానీ వంకోరి సుబ్బలచ్చాన్ని గిలకేదో గదుంతుం సూసి..
అదేదో అంటానే ఉంది..అడ్దంగా బుర్రూపుతా.. ఇదేదో దాన్ని గదుంతూనూ ఉంది. కాసేపుంటే ఆ పిల్లని వంగదీసి కొట్టుద్దేవో గూడానని బయమేసిన సరోజ్ని..
కాసేపలా సూసి..” అమ్మో..! ఇదేదో గట్టిగానే అరుత్తుంది దాని మీద. అదెల్లి ఆల్ల మామ్మకి సెప్పిందంటే ఊరూ వాడా ఏకం పాకం సేసేత్తా..ఎవరున్నారు, ఎవర్లేరని కూడా సూడకుండా రేవు రేవెట్టేత్తది ఈది గుమ్మం ముందు నిలబడి….” అనుకుంటా గుండెలు బేజారెత్తి పోగా లేసి నిలబడి..తిరగలి కింద పరిసిన పాత మడతమంచం గుడ్దని నాలుగు మూల్లా పైకెత్తి తిరగలి మీదేసి..తిరగలి మూసేసి.. జారిపోతన్న పైటని పైకంటాలాగి ఎనక నించి తీసి సుట్టు తిప్పి సీర సెంగుని బొడ్లో దోపుకుంటా ఆమట్నే పరిగెత్తు కొచ్చింది..గుమ్మంకాడికి..”ఏటా దెబ్బలాట?” అంటాను.
సరోజ్నిని పట్టిచ్చుకోకుండా..
“ ఇందకట్నించి సెప్తుంటే నీగ్గాదా? సెవుడొచ్చిందా?” కసురుతుంది గిలక సుబ్బలచ్విని.
“ మరెవరన్నా అయితే అమ్మొత్తందిగదాని మెల్లగానో, గుసగుసలుగానో మాట్తాడతారు. దీనికసలు నదురూ బెదురూ ఉండదు గదా..దీన్దుంపతెగ.మంచైనా చెడైనా ఏదీ దాపరికవంటేనే తెలవని పుట్టక.” అని మనసులో అనుకుంటా..అక్కడే నిలబడింది సరోజ్ని..సోద్యం సూత్తన్నట్టు సూత్తా ..
సరోజ్నిన్జూసి ఎనుదిరగబోయింది సుబ్బలచ్చ్వి..అప్పుడుగానీ సరోజ్ని బుర్రలో జేర్లా అనుమానప్పురుగు… దాంతో తన్నించి ఏదో దత్తన్నారా ఏటని…
“తాడి సెట్టల్లే నిలబడ్డాను. కుర్రముండలు పట్టిచ్చుకునే పన్లేదా? పీక్కోసిన కోళ్ళా అరుత్తున్నాను ఇందాకట్నించీని ఏటి ఏటని. ఒక్కద్ది సెప్తేనా? ఏటే సుబ్బలచ్చ్వీ…ఎక్కడకీ రమ్మంట్నా..?” రెట్టిచ్చి మరీ అంది సరోజ్ని కుడు సెయ్యి నడుం మీదేసుకుని ఒకటొ నంబరంకెలాగా నిట్టారుగా నిలబడి ఇద్దర్నీ మార్సి మార్సి సూత్తా.
ఆల్లిద్దరూ అలా పట్టిచ్చుకోపోతం సిన్నతనంగా నిపిచ్చింది సరోజ్నికి.
దాంతో..ఎల్లబోయేదల్లా ఆగుతుం అయితే ఆగిందిగానీ సుబ్బలచ్చ్వి.. నోరు మాత్తరం ఇప్పలేదు.
సరోజిన్లో పట్టుదల మరింత పెరిగి పోయి..అక్కడే దొడ్లో నిలబెట్టున్న నులక మంచం కాడికొచ్చి దాన్ని వాల్చి కూకుంటా…
” లోనకి రావే పాపా..! ఎవరన్నా ఇన్నారంటే అదేదో పోట్లాటనుకునేరు. లోపలికొచ్చి అడుగు ఆ అడిగేదేదో..! ఏదో పెద్దదాన్ని ..ఎక్కడికనడుగుతుంటే ఒకళ్ళూ నోరిప్పరే. పొయ్యే కాలవా? నువ్వన్నే నోరిప్పే సుబ్బలచ్వే..” రెట్టిచ్చింది..సరోజ్ని..
దాంతో బెదిరిపోయిందేవో ఆ పిల్ల ..సెప్పాపోతే మల్లీ గిలక్కోసం రానిత్తదో రావివ్వదోనని..గిలకేదో..పేద్ద తప్పు సేసేసినట్టు..గిలక్కేసి సూత్తా..
“ కాదు..సరోజ్నత్తయ్యా..! మరేవో..సూరెపెబావతిని ఆకులేసి కూకోబెట్టేరు కదా అప్పుడెప్పుడోను..”
“ అవునూ ..పెద్దమడిసయ్యిందని కూకోబెట్టేరు. ఇయ్యాల నీళ్లోసేరు గదా..! అందరం తినొచ్చేం..ఆల్లింటికి పొద్దున్న ఎల్లి. ఏదో ఇస్టీలు డబ్బా గూడా పంచిపెట్టేరు..”
“ అవును మరి నువ్వొక్కదానివే ఎల్లేవు. మేవెల్లలేదు. పెద్ద సెప్పొచ్చింది..ఆ.ఆ…” వంకర్లు తిరుగుతా వయ్యారాలు బోయింది గిలక ఆల్లమ్మకేసి ఎటకారంగా సూత్తా..
“ ఎల్తే ఎల్లేర్లే జతకత్తులంతా కలిసి. అన్నట్టు పీకి పాకంపెట్టి మరీ రెండ్రూపాయలట్టికెల్లి పెట్టింది గిలక. సిన్న పిల్లలు..పైగా బళ్లో సదుంకునీవోళ్ళు. జతకత్తులు. మీరేవీ పట్టాపోయినా పర్లేదులేవే అన్నా పట్టిచ్చుకోకుండా మరీ పెట్టొచ్చింది. నువ్వేవన్నా పెట్టేవా? మియ్యమ్మిచ్చిందా పెడతాకి?”
“ఓ పక్కన జతకత్తులు కదాని పెట్టద్దంటావు. పెట్టావాని మల్లీ నువ్వే అడుగుతావు…అయినా జతకత్తులుం కాబట్తే ఏదో బమతియ్యాలి. కదే..సుబ్బలచ్వి. ఏవీ ఈయకుండా అలా ఎలా తినేసొచ్చేత్తాం పిల్సేకాను..! కదేమే..!”
అంది సుబ్బలచ్వి ఎనక్కి ఎకసక్కెంగా సూత్తా..గిలక.
ఈల్లిద్దరి మజ్జా పిల్లికి సెలగాటం ఎలక్కి పేణ సంకటం లాగుంది సుబ్బలచ్వి పరిస్ధితి..
గిలకమ్మ మాటలకి తలకొట్టేసినట్టయ్యింది సరోజ్నికి..
“ అయినా ఊరుకున్నావా ఏటి? సచ్చినట్టు ఇచ్చేంగదా ..! పెట్టొచ్చేవ్ . ఊరుకుంటావా ఇవ్వాపోతే. నేనదేదదిగాదు…పొద్దోళ్లం మేం పెడతన్నప్పుడు పిల్లలకంతవసరమేటని. అయినా ఊరుకున్నావా ఏటి ఇచ్చేదాకాను.. “ మరింత ఎటకారంగా నవ్వుతా అంది సరోజ్ని..
“ నిన్ను పిలిత్తే నువ్వెల్లాలి. మేం సేయితులుం గాబట్టి మమ్మల్ని పిలిత్తె మేవెల్లాలి. మా పక్క కళాసోల్లు మమ్మల్ని పిలుత్తారా? మా జత కాబట్టి పిల్సింది. అయినా నువ్వెల్లి ఆల్లింట్లో అన్నం తినకుండా వొచ్చేవా ఏటి? తిన్నాంగాబట్టి ఏదోటియ్యాలి..అల్లిచ్చినట్తే ..మనవూనూ. మేవూ అంతే..” అని మల్లీ గిలకే ఆల్లమ్మకేసి సూత్తా..
“ అయినా ఏటే అమ్మా..నువ్వు ఇలా మాట్తాడతన్నావ్. సూరేపెబావతిని ఆకుల మీద కూకోబెట్టిన కాడ్నించీ ఆల్లు అయ్యనీ ఇయ్యనీ పంచి పెడితే మాకే గదా దాసి అట్టే పెట్టేవు తినండని బళ్ళోంచొచ్చేకా.. అయ్యన్నీ ఏటి మరి? ఏటంట?”
సూరె ప్రభావతి….కొయ్యలమూడోరి పిల్ల. అల్లమ్మా, నానా ఏన్నో పూజలూ పునస్కారాలు సేత్తే ఎన్నో ఏళ్లగ్గాని పుట్ట లేదా పిల్ల. లేక లేక పుట్టిందని ..ఎప్పుడూ..ఏదో ఒకటి ఆయంతెట్టి ఆల్లనీ ఈల్లనీ, ఇరుగోల్లనీ, పొరుగోల్లనీ పిలుత్తానే ఉంటారు సిన్నా సితకా ఆటిక్కూడాను. అలాటిది పిల్ల పెద్ద మనిసయితే ఇక సెప్పొచ్చేదేవుంటది..
ఆకుల మీద కూకోబెట్టిన్నాడే సగమూరికి ఆకేసి భోజనవెట్టేరు ఆల్లు. దాంతో ఆగేరా? మా పిల్లగావట్టి పెద్దమడిసయ్యింది..ఈ పెపంచకమ్మీద ఇంకెవ్వరూ ముందూ ఎనకా గూడా పెద్దమడుసులవ్వరన్నట్టు..పూర్ణం బూర్లనీ, గార్లనీ, సలివిడనీ, మిఠాయుండనీ,కాజాలనీ గోర్మిఠీలనీ , ఎవరు ఎప్పుడు ఏ కావిడెడితే ఆ కావిణ్ణి వచ్చిందొచ్చినట్టు గుక్కతిప్పుకోకుండా ఊరోళ్లకి పంచి పెడతానే ఉన్నారు ముప్పొద్దులాను.
పంచిపెట్టీవోళ్ళు..తిరిగినోళ్లు తిరిగినట్టున్నారు..ఊరూవాడానూ. పిల్లకి నీళ్ళోసే దాకా ఏమూల్సూసినా కావిళ్ళోళ్ళే. అలాటిది..ఆయంతి నాడు..మామూలుగా ఉంటాయని ఊల్లోవాల్లెవరూ అనుకోలేదు..! ఊళ్ళొనే గాదు..సుట్టు పక్కలా ఉన్న ఏడెనిమిదూళ్లల్లో గూడా ఆళ్లనీ లేదు ఈళ్లని లేదు…గడపొదిలిపెట్ట కుండా పిలిసి బోజనాలెడతవే కాదు..తలకి రెండు జోడాల సొప్పున అరిసెలో? ఎంత రుచిగా ఉన్నాయని. మూడ్డజన్ల వంటోళ్ళు ఆత్రేపురం నుంచొచ్చి మరీ వండేరండి నువ్వులరిసిలు..
అరిసెల కోసవని వరిపిండిలో ఏసిన పోట్లు ఊర్ని దడదడలాడిచ్చేసినియ్యని ఊరు ఊరంతా సెప్పుకుంటవే. అలాటిది ఒకే కళాసనో..జతకత్తులనో ఏవో..పిల్సేరనుకో. పిల్లలు ..మీకేం పన్లేదని సెప్పినా ఇనకుండా పదో పరకో పట్టుకుని ఎల్లేరనుకో..పిల్సినప్పుడు..ఈల్లపని ఈల్లు సేసినప్పుడు ఆల్ల పని ఆల్లు సెయ్యాలి గదా..? అన్నీ పుచ్చుకుని పిల్లలని తాంబూలవూను, అరిసిలూ ఇయ్యకుండా పంపేరు. ఏదో ఇస్టీలు డబ్బా ఇచ్చేరు గదా..పిల్లకిచ్చేది కూడా కలిపితే జంటగా ఉంటాయనుకుంది. తీరా ..వట్టి సేతుల్తో వచ్చిన పిల్లని సూసి..”అరిసిలయ్యీ ఇయ్యలేదా ? “ అనడిగితే ఇంతెత్తున ఎగిరింది గిలక. దాంతో అప్పటికి నోరు మూసుకుని
తిరగలేసిందన్నమాటేగానీ..సవారుగా శేరు కందులన్నా ఇసిరిందో లేదో..గిలకమ్మ కోసం ఎవరో ఒకర్రాటం..ఆల్లెవరో..ఆల్లేం మాట్తాడుకుంటన్నారో..అదేటోనని..అటే సూత్తం ఓ పనైపోయింది సరోజ్నికి..
ఒకళ్ళా..ఇద్దరా..? వత్తానూ ఉన్నారు..ఎల్తానూ ఉన్నారు. అందరూ పొద్దున్నేసుకున్న బట్తల్తోనే ఉన్నారు..నగలెట్టుకుని ఒక్క గిలకమ్మ తప్ప. ఇది వత్తానే ఆటన్నిట్నీ ఇడిసి మామూలు లంగా జాకిట్తేసేసుకుంది.. అయితే ఆ వచ్చే వాల్లెంతుకొత్తాన్నారో..ఆ సంగతేందో తేలుద్దావని..
సుబ్బలచ్చ్వి వచ్చేతలికి తిరగలికి మూతేసి..పని మనుకుని మరీ గుమ్మంకాడికొచ్చిందేవో..తీరాసూత్తే సెప్పి సత్తేనా ఈ కుర్రముండలు..ముదురు టెంకలు.
అడిగీ అడిగీ నోరడిపోతవే తప్ప..పెద్దోల్లని ఈల్లకిది సెప్పాలని ఉండదు..తెలివిమీరిపోయేరు ఎదవలు. ఎదవలని.. అంటా తన్లో తనే గొనుక్కుంది సరోజ్ని..ఆల్లిద్దర్నే సూత్తా..
“నువ్వెల్తే ఎల్లు. నేన్రాను. “ ఖరాఖండీగా స్నేయితురాల్తో సెప్పేసింది ఇంకెల్లన్నట్టు గిలక.
అదేటో అర్ధమై సావక..
“ఎక్కడికే..ఇదైనా సెప్పి సావు..” ఇసుక్కుంది సరోజ్ని…
అప్పటికే ఎంతోమందికి సెప్పీ సెప్పీ సిరాకొచ్చేసిందేవో..గిలక్కి..
“ ఎక్కడికేటి..సూరే పెబాతి ఆల్లింటికి. నాకసలే సిరాగ్గా ఉంటే ..నువ్వొకద్దానివి..” అంటా ఇంతెత్తున ఎగిరింది అల్లమ్మ మీద గిలక.
“ అదేటి..? ఆల్లింటికా? పొద్దున్నెల్లొచ్చేరు గందా? మజ్జానం దాకా అక్కడే ఉండొచ్చేరు. మల్లీ..ఇప్పుడేటి? ఇలాటప్పుడెవరన్నా ఎల్తారా? ఇడ్డూరం కాపోతే? ఇచ్చెప్పదు గానీ ..ఎంతుకే ఆల్లింటికి? నువ్వైనా సెప్పే సుబ్బలచ్చ్వే..” అంది ఆ పిల్లకేసి సూత్తా.. సరోజ్నీ..
“సూరే పెబావతి పెద్ద మనిసయ్యిందని మేవందరం ఆల్లు పిలిత్తే భోజనానికని ఆల్లింటికెల్లేం గదా..సరోజ్నత్తా..!“
“ అత్తెలుసులే..తర్వాద్ది సెప్పు. ఇదొక్కద్ది.. సరిత్రంతా సెప్పుద్ది..” ఎటకారంగా అంది గిలక.
గిలకమ్మ ఇసురుకి దెబ్బతిన్నటు ఓసారి గిలకెనక్కి సూసి మల్లీ సరోజ్ని ఎనక్కి తిరిగి సూత్తా సరోజ్ని సైగతో.. దగ్గరకంటా వచ్చి,.
“మా తరగతోల్లం అందరం ఎల్లేం. ఉ..ఉఊ…అందరం ఎల్లలేదు. మా బెంచీలో కూకునేవోళ్ళవూనూ..మా ఎనక మెంచీలోల్లనే పిల్సేరు. ఆల్లవే ఎల్లేం..”
“ మొత్తవెందరుంటారేటి..?” అడ్డం పడింది సరోజ్ని..
సెప్పటం ఆపి గిలకెనక్కి తిరిగిన సుబ్బలచ్చ్వి ..” ఎంతమందుంటావే.. పారువాతి..సిలక..నువ్వూ, నేనూ..మా ఇంటెనకాల ఎంకటలచ్వి..”
“ఎందమందో కొంతమందెల్లేం లే..ఆజరు పట్టి సూచ్చెప్పాలి..నీకు.. “
దాంతో..సరోజ్ని ఎనక్కి తిరిగిన సుబ్బలచ్వి..
“ ఎల్లినోల్లందరం..ఏదో ఒకటిచ్చేం అత్తా..! అలా ఇచ్చినోల్లందరికీని పెద్దోల్లైతే ఏదో పేకెట్టిచ్చేరు. అందులోను ఐదరిసెలు, రెండరిటి పళ్ళూనూ..పోకసెక్కా..తవలపాకులూనూ..ఒక స్టీలు డబ్బాగూడా ఉన్నాయ్. మాయమ్మొచ్చింది గదా ఆల్లింటిది. మాయమ్మకిచ్చేరు అలాటి పేకెట్టు. మా ఇంట్లో సూసేన్నేను..”
“ మాకూ ఇచ్చేర్లే. పెద్ద సెప్పచ్చొంది ఎలాగైతే దీనిక్కాబట్టి ఇచ్చేరని. “ గిలక ఇసురు.
“ ..అయితేని ..మాకివ్వలేదు అత్తా. మాలో ఎవ్వరికీ ఇవ్వలేదు. సూరే పెబావతి మాతోనే అన్నం తింది కూకుని. అయినా ఇవ్వలేదు. సేలా సేపు సూసేం అక్కడే నుంచుని ఇత్తారేమోనని. గిలకైతే తిట్టింది కూడాను అలా సూడొద్దని, ఎల్లిపోదావని. అయినా మేమే అలా నిలబడేతలికి ఎవరో ఒక మామ్మ వచ్చి సెప్పింది..
“ ఇళ్లకెల్లిపోయి..మజ్జాన్నించి రండమ్మా..!. అందరూ ఎక్కడోళ్ళు అక్కడికెల్లిపోయాకా….పేకెట్లేవన్నా మిగుల్తుయ్యో లేదో..సూసి ఇత్తాం..” అని. అంతుకని అల్లింటికి ఎల్దావని గిలకని అడుగుతుంటే రానంటంది. మావోల్లొచ్చేరు గిలకని రమ్మని. రానందని నన్నంపేరు అడిగి రమ్మని. నువ్వైనా సెప్పత్తా. ఆల్లే రమ్మన్నారు గదా..ఓసారెల్తే ఏమవ్వుద్ది.. “
“ సెప్పుతుం అయ్యింది గదా..ఇంకెల్లు . నేన్రానంటే రానంతే. మాయమ్మ రికమండేసన్ మర్నీకు.. “ ఇంతెత్తునెగిరింది గిలకమ్మ సుబ్బలచ్వి మీద..
“అంతుకా…ఇందాకట్నించీ తిరిగినోల్లు తిరిగినట్టున్నారు. పాపం..నువ్వొత్తేనే గానీ ఎల్తం ఆల్లకి ఇట్టం లేదనుకుంటానే గిలకా ఆల్లన్నిసార్లడుగుతున్నప్పుడు ఎల్లొచ్చుగదా..” నాయమారతా అన్నట్టుగా అంది సరోజ్ని..
ఇంకంతే..తోక తొక్కిన తాసులా ఇంతెత్తున ఎగిరింది గిలక ఆల్లమ్మ మీద..
“ ఏటే..అమ్మా..! నువ్వూ అలాగే అంటన్నావు. అలాగ ఎల్తారా ఎవరన్నాను? మిగిల్తే ఇత్తారంట. నీసికంగా అనిపిత్తా లేదా నీకు? మిగిల్తే ఇత్తం ఏటి? ఒకేల మిగల్లేదనుకో…మేము అక్కడి దాకా ఎల్లాకా ..ఆల్లు మిగల్లేదని సెప్తే ఎంతవమానం. మమ్మల్నలా బోడి సేతుల్తో ఎనక్కి పంపుతా ఆల్లెంత బాధపడతారమ్మా..! సూరే పెబావతి మమ్మల్ని పిలుత్తుం ఆల్లమ్మా ఆల్లకి తెలుసో లేదో? మా సూరి బాధపడదా? అయినా అది మా జతకత్తు. పెద్దదయ్యిందంట. మేం ఏదో బగుమానం ఇచ్చుకున్నాం. తిరిగి అందరికీ ఇచ్చినట్టు మాకూ పేకెట్లు ఇత్తే ఇత్తారు.లేపోతే మానేత్తారు. ఇవ్వాపోతే ఏటి? ..” అని సుబ్బలచ్వి ఎనక్కి తిరిగి ..
“ ఇన్నావ్ గదా.. అంతుకే నేన్రాను. ఇంకెల్లు .ఆల్లందర్తో సెప్పు గిలక రానందని. ఇంకోసారొచ్చేవంటే నీ జత కట్టు..” అందావనుకుంది.
అప్పటికే సుబ్బలచ్చ్వి ఎనక్కి తిరిగి ఎల్లిపోతంది..
బుగ్గల్నొక్కుకుంది సరోజ్ని.. ”ఇంతిలాగ ఎవరైనా ఆలోసిత్తారా?” అని మనసులో అనుకుంటా…
—–
.

2 thoughts on “గిలకమ్మ కతలు – “దీన్దుంపదెగ…పెద్దాలోసనే!”

  1. గిలకమ్మ ఆలోచిస్తుంది అండీ, last month మీ కథ miss అయ్యాం .I like ur gilakamma very much.

Leave a Reply to Rajeswari Cancel reply

Your email address will not be published. Required fields are marked *