March 29, 2024

చంద్రోదయం.. 1.

రచన: మన్నెం శారద

అవి కృష్ణపక్షపు తొలి రోజులు.
మిగలకాగిన పాలలా వెన్నెల ఎర్రగా వుంది.
దూరంగా చర్చి గంటలు పదకొండుసార్లు మ్రోగేయి. సారధి చెయ్యి చుర్రుమంటే చేతిలో చివరిదాకా కాలిన సిగరెట్టుని క్రిందకి విసిరేసి మరొకటి అంటించేడు.
ఆ చీకటిలో అతని నోట్లో వెలుగుతోన్న సిగరెట్టు ఒంటికన్ను రాక్షసుడిలా ఎర్రగా వుంది.
కళ్ళెర్రబడి మండుతుంటే సారధి ఇదమిద్దంగా లేని ఆలోచనలతో అస్థిమితంగా కదిలేడు.
గుమ్మం దగ్గర గాజుల చప్పుడు.
సారధి వెనక్కి తిరిగి చూసేడు.
స్వాతి నిలబడి వుంది వుదాసీనంగా.
“రా, కూర్చో” సారధి సాదరంగా ఆహ్వానించేడు.
స్వాతి మెల్లిగా వచ్చి కూర్చుంది
సారధి స్వాతికేసి చూసేడు.
సన్నగా వంచినట్లున్న కనుబొమల మధ్య ఉదయిస్తోన్న సూర్యుడిలా భాసిస్తోన్న ఎర్రని కుంకుమ.
ఆమె కాస్సేపు మాట్లాడలేకపోయింది.
ఆ తర్వాత అతనికేసి చూసి మంద్రస్వరాన అంది.. “ఈ రోజుకోసం యౌవనంలో అడుగుపెట్టిన ప్రతి యువతీ యువకుడు ఎన్నో కలలు కంటారు. ఎన్నో ఆశలతో, ఊహలతో ఎదురు చూసిన రాత్రి – మొదటి రాత్రి.. యిలా నిస్తేజంగా కరిగిపోవటం ఎవరూ సహించలేరు. కానీ… నేను…నేను… ఇంకా ఎందుకో సమర్ధించుకోలేకుండా వున్నాను. నా కోసం.. మీ అందమైన జీవితాన్ని ఎక్స్‌పెరిమెంటు చేస్తున్నారనిపిస్తోంది. మీ కలల్ని… కోరికల్ని నాశనం చేస్తున్న నన్ను క్షమించండి” ఆ మాట అంటున్నప్పుడు ఆమె కంఠం సన్నగా వొణికింది.
సారధి బదులుగా నవ్వేడు.. అది కేవలం తనకే బాధా లేదని చాటుకొవడానికి నవ్విన నవ్వని చెప్పకపోయినా అర్ధం అవుతోంది.
“స్వాతీ! బహుశా నువ్వు నన్ను చాలా తక్కువగా అంచనా వేసుకున్నావని అనుకొంటున్నాను. ఒక వయసులో మనిషి కోరికల్ని అదుపులొ పెట్టుకోగలగటం అసాధ్యమే. కాదనను. కాని యిప్పుడు ఆ స్థితిని మనమిద్దరం దాటేసేం. నాకు అవే ముఖ్యమైతే ఇంతకాలం యిలా నీకొసం ఎదురు చూస్తూ ఒంటరిగా బ్రతకాల్సిన అవసరం లేదు. ఈ రోజు గురించి నువ్వేం బాధపడకు. ఈ రోజునుంచి మనం నామమాత్రమే భార్యాభర్తలం. నీకు నా మీద పూర్తి నమ్మకం కలిగిననాడు, నీ జీవితం మీద నీకు అనురక్తి కలిగిన రోజునే ఈ రాత్రి గురించి ఆలోచిస్తాను. అంతవరకు నీకు బాధ కలిగేలా ఏ విధంగానూ తొందరపడనని మాట యిస్తున్నాను. నాకేదో అపకారం జరిగిందని ఆలోచించటం మానేసి నువ్వు సుఖంగా వుండటం నేర్చుకో” అన్నాడు సారధి.
ఎన్నాళ్లుగానో వెలుగు చూడని బ్రతుకుకు ఉదయరేఖలా?
చేతులనిండా అందంగా మెరుస్తోన్న ఎర్రని గాజులు.
చాలా రోజులుగా స్తబ్దత ఆవరించుకొన్న జీవితంలో చిరుసందడులు. అతని కళ్ళలో మెరుపు మెరిసింది. తృప్తిగా గాలి పీల్చుకున్నాడు. “స్వాతీ, నువ్వు ఎంత బాగున్నావో తెలుసా?” అతను ఆమె చేతిని పట్టుకుని మృదువుగా నొక్కేడు.
స్వాతి తల వంచుకుంది. మునిపళ్లతో పెదవుల్ని నొక్కి పట్టింది. ఎన్నాళ్ళగానో, ఎన్నేళ్ళగానో తనకు లభించని పురుష స్పర్శ ఆమెకు వుద్రేకాన్నీ, వుద్వేగాన్నీ కలిగించకపోగా, భయంతో మంచుముక్కలా బిగుసుకుపోయేట్లు చేసింది.
ఆమె మొహంలోకి ఓసారి చూసి అతనేమనుకున్నాడో గానీ, ఆమె చేతిని వదిలేశాడు.
ఆ క్షణం ముందు అతని గుండెలో పొంగి పొరలిన ఆనందం ఒక్కసారిగా చల్లబడిపోయింది.
ఇద్దరిమధ్యా కొన్ని నిముషాలు మౌనంగా దొర్లిపోయాయి.
“నేను..నేను మిమ్మల్ని బాధ పెడ్తున్నాను కదూ?” ఆ నీరవ నిశ్శబ్దంలో స్వాతి గొంతి విచిత్రంగా వినిపించింది.
సారధి ఆశ్చర్యంగా చూశాడామెని.
“అలాని ఎందుకనుకుంటున్నావు?” అన్నాడు సన్నగా నవ్వడానికి చిన్న ప్రయత్నం చేస్తూ.
స్వాతి అరచేతిలో మౌనంగా గీతలు గీసుకుంటూ కూర్చుంది. “అమ్మా” లోపలనించి చిన్న గొంతు వినబడింది.
సారధి వెనక్కి తిరిగి చూసి “నాని లేచినట్లున్నాడు. చూడు భయపడుతున్నాడేమో?’ అన్నాడు.
స్వాతి మౌనంగా లేచి లోపలికెళ్ళింది.
స్వాతి వెళ్లిన వైపే కొన్ని క్షణాలు చూశేడు సారధి.
ఆ రోజు అతని జీవితంలో విశిష్టమైనది. మొదటి చూపులోనే ప్రేమించిన అమ్మాయిని, మరోక్షణంలో తనకు కాకుండా పోయిన యువతిని విచిత్రంగా తను పెళ్లి చేసుకున్నాడు.
అయితే ఆ రెండు సంఘటనల మధ్య ఎన్ని అగాధాలు.
ఎన్ని అవాంతరాలు! ఎన్ని ఎదురు దెబ్బలు!
మనిషి జీవితం ఎంత విచిత్రమైనది!
అతను ఆర్తితో చేతులు చాచి అందుకోవాలని తపన చెందినపుడు ఆ చేతులు శూన్యాన్ని నింపుకొంటాయి.
కోరినది దూరమై, మనసు వికలమై, మనిషి నిరాశతో కృంగి నిర్లిప్తంగా తయారయినపుడు అనుకోకుండా అనుకున్నది జరిగితే…?
ఇలానే వుంటుందా?
కాకుంటే ఎన్నో మురిపాలతో కరగిపోవాల్సిన ఈ తొలిరేయి ఇంత నిశ్శబ్దంగా కరిగిపోతుందా?
పెళ్ళికొడుకయిన సారధి భారంగా నిట్టూర్చాడు.
బయట వెన్నెల పేలవంగా వుంది.
భయంకరమైన తన గతం ముందు వర్తమానంలా అది వెలావెలాబోతోంది.
జరిగిన సంఘటన ఒక్కొక్కటే అతన్ని వెంటబడుతోంటే సారధి భరించలేనట్టు కణతలు నొక్కుకున్నాడు.
భవిష్యత్తు ఎలాంటిదో అంతుబట్టని అతను గతాన్ని ఆశ్రయించక తప్పలేదు.

…..

4 thoughts on “చంద్రోదయం.. 1.

  1. ‘నోట్లో వెలుగుతోన్న సిగరెట్టు ఒంటికన్ను రాక్షసుడిలా ఎర్రగా వుంది’ -super

  2. Excellent starting anxiously scrolled down for further lines thanks to Maalika mazine for publishing the animutyalu of Mannem Sarada garu enabling nus to read Reqest to keep posting her novels thanks

  3. ప్రారంభం చాలా బావుందండీ.తర్వాతి భాగం కోసం ఎదురు చూస్తున్నాం.

Leave a Reply to Gauthami Cancel reply

Your email address will not be published. Required fields are marked *