April 23, 2024

నా బంగారు తల్లి

రచన : సోమ సుధేష్ణ

“అమ్మకు వంట్లో బాగాలేదు, నిన్ను చూడాలంటుంది. ఒకసారి వచ్చి వెళ్ళు.” బెంగుళూరు నుండి తండ్రి ఫోనులో చెప్పినప్పుడు సుజన మనసులో అలజడి అనిపించింది.
“ఏమయింది? అసలు ప్రాబ్లమేమిటి? డాక్టరు చూసాడా?”
“రఘువర్మ చూస్తున్నాడు. ఒవేరియన్ కేన్సర్ అని డయగ్నోజ్ చేసారు. ట్రీట్ మెంటు ఇస్తున్నాడు.”
“ఎప్పుడు తెలిసింది? రఘువర్మ అంకుల్ బెస్ట్ కేన్సర్ స్పెషలిస్టు.”
“నువ్వు ప్రేగ్నెంటు అని చెప్పినపుడు నీకు సాయం అవుతుందని తను అమెరికాకు రావాలనుకుంది. వచ్చే ముందు రొటీన్ చెకప్ చేయించుకోవాలని డాక్టరు దగ్గరకు వెళ్ళింది. కానీ అప్పు డప్పుడు తనకు కడుపులో కాస్త నొప్పి రావడం గురించి డాక్టరుతో చెప్పింది. వెంటనే టెస్టులు చేసారు. కేన్సరని బయటపడింది. అప్పటి నుండి మందులు ఇస్తూనే ఉన్నారు. రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నారు.”
“నాకెందుకు చెప్పలేదు. అమ్మ వద్దని ఉంటుంది. అమ్మ ఎప్పుడు అంతే. కనీసం ఈ విషయం అయినా చెప్పొచ్చుగా!”
“నువ్వు ప్రేగ్నెంటు దూరంగా అమెరికాలో ఒక్క దానివి నానా అవస్థా పడుతూంటావు. ఇలాంటి వార్త విని రాలేవు, బాధ పెట్టడమెందుకు, తర్వాత చెప్పొచ్చు అంది అమ్మ. నేనూ ఊరుకున్నాను. సుమనతో చెప్పొద్దని చెప్పాము అందుకే తాను నీతో చెప్పి ఉండదు.”
“నన్నోక్క దాన్నే దూరం చేసారన్న మాట. ప్రతి విషయంలో అలాగే చేస్తారు.” కోపం, ఉక్రోషంతో గబ గబా అనేసింది.
“సుజా! అలా మాట్లాడకు. నువ్వు చిన్నదానివని నిన్ను కష్ట పెట్టకూడదని కొన్ని వెంటనే చెప్పకపోవచ్చు అంత మాత్రాన నీనుంచి దాచి పెడతామని ఎందు కనుకుంటావు!” తండ్రి గొంతులో ధ్వనించిన బాధ విని సుజన కాస్త తగ్గింది.
“అమ్మ నిద్ర పోతోంది. నువ్వు రావడానికి ప్రయత్నించు. నిన్ను కలవరిస్తోంది. ఫోన్ పెట్టేస్తాను.”
“సరే నాన్నా. నేను మళ్ళి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడతాను.” ఫోను పెట్టేసి సుజన నిద్ర పోతున్న పాప దగ్గర కెళ్ళి కూర్చుంది. మనసు పొరలలో ఉన్న భావాలన్నీ పురి విప్పుకున్నాయి.
తల్లికి అక్క సుమన అంటే చాల ఇష్టమని తనను చూస్తే విసుక్కుంటుందని సుజన మనసులో బలంగా నాటుకు పోయింది. ఇంటికి ఎవ్వరు వచ్చినా సుమనను పలకరిస్తారు. స్నేహితులకు కూడా సుమన అంటేనే ఇష్టం. సుమన అచ్చు అమ్మలాగ అందంగా నాజుకుగా ఉంటుంది. సుజన తండ్రి లాగ కాస్త నల్లగా చిన్న కళ్ళు వంకీలజుట్టును చిన్న పోనీటైల్ కట్టుకుని టాంబోయ్ లాగ ఉంటుంది. సుమన కంటే రెండేళ్ళు చిన్నదైన సుజన ఎత్తులో రెండు అంగుళాలు ఎక్కువే ఉంటుంది.
‘నన్నెందుకు అందంగా పుట్టించలేదు’ అని తల్లిని అప్పుడప్పుడు నిలేసేది. ‘దేవుణ్ణి అడుగు’ తల్లి తప్పించుకోవడానికి అలా అంటోందని సుజన అనుకునేది.
“నువ్వు నా బంగారు తల్లివి.” అని ముద్దు పెట్టిన అమ్మ ప్రేమ సుజన మనసులోనే చేదులో కరిగి పోయేది. సుమన మాత్రం ఎప్పుడు చెల్లిని ప్రేమగా చూసుకునేది. తల్లి ఏమి చేసినా చివరికి తినడానికి ఏదైనా ఇచ్చినా సుమన కంటే తనకు తక్కువే ఇస్తుందని గట్టిగా నమ్మేది. ఒక్కోసారి తల్లి సుమన ప్లేటు తీసి సుజనకు ఇచ్చేది.
“నా బంగారు తల్లివి కదూ! అలా మారాం చేయకు” అని బతిమాలేది. అయినా ఏదో అసంతృప్తితో సుజన మొహం ముడుచు కునేది. రాను రాను తల్లి మీద నిరసన తన రూపానికి తల్లే కారణమైనట్లు చేతల్లో మాటల్లో తల్లికి చూపించేది. తండ్రి కొన్నిసార్లు సుజన దురుసు తనానికి కోపంతో చీవాట్లు వేసేవాడు. తల్లి తన మీద తండ్రికి ఫిర్యాదు చేసిందని తల్లి వైపు ఏవగింపుగా చూసేది. ఎక్కడికి వెళ్ళాలన్నా అరగంట సేపు తల్లిని సాధించేది. తల్లి చెబితే వినక పోతె సుమన చేత చెప్పించేది.
సుజనలో వయసుతో బాటు తల్లి పై చేదు భావాలు కూడా మర్రి చెట్టు ఊడల్లా పెరుగుతూనే ఉన్నాయి. తల్లి వద్దన్న పనులన్నీ చేస్తూనే పెరిగింది. కెంప్ గౌడ మెడికల్ కాలేజీలో సీటు వచ్చినా నేను యమేస్ రామయ్య మెడికల్ కలేజీకే వెళతాను అని మొండికేసింది. కెంప్ గౌడ మెడికల్ కాలేజిలో తెలిసిన వాళ్ళు ఉన్నారు. బిడ్డకు ఏది కావాలన్నా సాయం చేస్తారు అని
తల్లి తండ్రి ఆలోచన. రామయ్య మెడికల్ కాలేజి చాల దూరం రోజు వెళ్లి రావడానికి సదుపాయంగా ఉండదు. తల్లి ప్రాణం అంతా కూతురు హాస్టల్లో ఎలా ఉంటుందో ఏం తింటుందో నని దిగులు. చివరికి తన పంతం నెగ్గించుకున్న సుజన రామయ్య మెడికల్ కాలేజిలో చేరి అక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంది.
ఒకసారి దీపావళి సెలవులకు ఇంటికి వచ్చిన కూతురికి కొత్త బట్టలు చూపించి
“సుజా! ఈ లేత నీలి రంగు అనార్కలి డ్రెస్ చూడు నీ కోసమని తీసుకున్నాను. నీకారంగు ఇష్టం కదా అందుకే తెచ్చాను. నువ్వు వేసుకుంటే బావుంటుంది.” ప్రేమగా బట్టలు తెచ్చి సుజన చేతి కందిచ్చింది తల్లి. అవి తీసుకుని అటు ఇటు తిప్పి,
“ఇవి నా కోసమా! నాకేమీ నచ్చలేదు. నేనివి వేసుకోను. నా దగ్గర ఉన్న వాటిలో ఏదో ఒకటి వేసుకుంటాను.”
అప్పుడే సుమన కొత్త బట్టలు వేసుకుని వచ్చింది. గులాబి రంగు అనార్కలి డ్రెస్.
“నా కెందు కలాంటిది కొనలేదు. ఎప్పుడో నిఇలి రంగు ఇష్టం అంటే ఇక ఎప్పుడు అదే రంగు బట్టలు కొంటావా! నాకు చిన్నప్పటి నుండి అనుమానమే నేను నీ స్వంత కూతురుని కాదేమో నని. అందుకే మీకు దూరంగా యం ఎస్ రామయ్యలో చదువు కుంటున్నాను.”
ఆ రోజు తల్లి ఎంతగా ఏడ్చిందో ఆమె ఎర్రబడిన కళ్ళు చెప్పాయి. సుజనలో ఒక మూల ఎక్కడో బాధ కలిగినా దులిపేసుకుని మామూలుగా గడిపింది. ఇప్పుడు అవి గుర్తుకు వచ్చి తనని నిందించుకుంటూ కన్నీరు కారుస్తోంది.
సుజన కలేజిఇలో చదివే వివేక్ ను పెళ్ళి చేసుకోవడం తల్లి తండ్రి కి అసలు ఇష్టం లేదు. వివేక్ కుటుంబం డబ్బున్న వాళ్ళు కాదు పైగా పెద్ద కుటుంబం. ఇద్దరబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. వివేక్ పెద్దవాడు. బిడ్డకు బాధ్యతలు ఎక్కువుంటాయని వారి ఆలోచన.
“కూతురిని గొప్పింటి కివ్వాలి, కోడలిని మనకంటే తక్కువ ఉన్న వాళ్ళ ఇంటినుండి తెచ్చుకుంటే ఇమిడి పోతారు.” అమ్మ ఉద్దేశ్యం.
సుజన మొండికేసి వివేక్నే చేసుకుంటానంది. తమ మనసునే సరి పెట్టుకుని పెళ్ళి ఘనంగా చేసారు. వివేక్ కుటుంబం అడిగినవన్నీఇచ్చారు. సుజన, వివేక్ ను అమెరికా పంపే బాధ్యత కూడా తీసుకున్నారు. అంత చేసినా తన కెందుకు సంతోషం కలుగ లేదు అని సుజన ఇప్పుడు ఆలోచిస్తోంది.
సుజన ప్రేగ్నెంటు అనే వార్త విని తల్లి తండ్రి చాల సంతోషించారు. తల్లి వచ్చి పాప పుట్టే వరకు ఉంటానంది. ఒక నెల రోజుల తర్వాత ఫోను చేసి తాను రాలేనని చెప్పింది. ‘నువ్వు అన్ని చేసుకోవడం నేర్చుకోవాలి’ అంది. ‘ఏ తల్లి కూడా ఇలాంటి సమయంలో అనే మాటలేనా! రావోద్దులే నేనే మేనేజ్ చేసుకుంటాను’ సుజన కోపంగా దబీ మని ఫోను పెట్టేసింది. కానీ ఇప్పుడు తెలిసింది తల్లి ఎందుకలా అందో! కేన్సర్ అని చెప్పొచ్చుగా.
“పాపకు ఆరునెలలు నిండగానే తీసుకుని ఇండియా వస్తాను. రెండేళ్ళ పాటు నా పాపను మీ దగ్గరే పెంచండి. నేను రెసిడెన్సీ చేయాలనుకుంటున్నాను.” అన్నప్పుడు
“నీ కూతురు నీ దగ్గర పెరిగితేనే బావుంటుంది. మీ ఇద్దరి మధ్య బంధం ఉంటుంది.” అమ్మ మాటలు సుజన మనస్సులో మోగుతున్నాయి. ఆ మాటలు విన్నాక జన్మలో తల్లితో మాట్లాడనని తీర్మానించుకుంది. తన మీద తన పాప మీద ఇష్టం లేదని అనుకుని కోపం పెంచుకుంది సుజన.
తల్లి మనసు ఇప్పుడు పూర్తిగా అర్థమవుతోంది- తనకు కేన్సర్ ట్రీట్ మెంటు జరుగుతోందని చెప్తే బిడ్డ బాధ పడ్తుందని తల్లి ఆరాటం. అనుమానపు మబ్బు పొరలు విప్పుకుని తల్లి మాటల వెనుక దాగిన ప్రేమ కనిపిస్తోంది సుజనకు.
సుజన మనసు ’అమ్మా! అమ్మా!’ అంటూ గగ్గోలు పెట్టింది. పుట్టినప్పుడు తల్లి ఎంత బాధ భరిస్తుంది! సుజన కిప్పుడు తెలుస్తోంది. బిడ్డ ఎలా ఉన్నా తల్లి ప్రేమిస్తుంది. రంగు, రూపం చూసి ప్రేమించదు ఎలా ఉన్నా తల్లి బిడ్డ ఎప్పుడూ దీవిస్తూనే ఉంటుంది.
‘అమ్మా! నేను నిన్ను నా మాటలతో నా చేతలతో చాల బాధ పెట్టాను’ సుజన మనసు విల
విల్లాడింది. నా మనసులో అసూయ ఉండి తల్లి ప్రేమ కనిపించలేదు. నా బిడ్డ ఇలా చేస్తే నేను భరించ గలనా! నో..నో.. అలా జరగ కూడదు. తల్లి ప్రేమ అన్నింటికీ అతీతమైనది. తల్లి మనసు అమృతమయం. ఈ విష బీజం నాలో ఎలా నాటుకుంది! దాన్ని తీసేయ్యాలి.
మరో ఆలోచన లేకుండా వెంటనే ఇండియా బయల్దేరారు.
సుమన కుటుంబంతో అక్కడే ఉంది. చెల్లిని ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. తండ్రి మొహం చుసిన సుజనకు బాధ అతన్ని ఎంత క్రుంగ దీస్తోందో తెలుస్తోంది. ప్రేమతో తండ్రిని హత్తుకుంది. ఇద్దరూ కళ్ళు తుడుచు కున్నారు.
“నీ కోసమే అడుగుతోంది వెళ్ళు.” అన్నాడు.
వెంటనే నీరసంగా ఉన్న తల్లి పక్కన కూచుని తల్లి తల నిమురుతూ వంగి తల్లి నుదుటిపై ముద్దు పెట్టింది. తల్లిని తాకగానే సుజన మనసు ప్రేమతో పులకరించింది. తల్లి సగం తెరిచిన కళ్ళతో కూతురి వైపు చూసింది. మాట్లాడాలని నోరు విప్ప బోయింది కానీ శక్తి సరి పోలేదు. చేయి లేపి బిడ్డ చెంపలను తాకాలని చేయి కదిపింది కానీ శక్తి సరిపోలేదు. సుజన తల్లి చేతిని తీసుకుని తన చెంపకు ఆనించుకుంది. తల్లి కళ్ళల్లో ఆనందం చూసింది. ప్రేమను గుర్తించని గుడ్డి దానిలా బతికాను. సుజన కళ్ళల్లోంచి ఆగని కన్నీరు. పశ్చాత్తాపంతో సుజన మనసులోని అసూయ అదృశ్యమైంది.
“నన్ను క్షమించు అమ్మా” ఏకధారగా కారే కన్నీటితో అంది.
కన్నీరు వద్దు అన్నట్టుగా తల్లి కళ్ళు కదిపింది. కళ్ళు తుడుచుకుని సుజన నవ్వడానికి ప్రయత్నిస్తూ తల్లితో అంది.
“నువ్వు నా బంగారు తల్లివి.” సుజన తన చెంపను తల్లి చెంపకు ఆనించింది.
అప్పుడే డాక్టరు రఘువర్మ ఫోన్ చేసి,
“ఆకలి లేకపోయినా తినాలి. బలమైన ఫుడ్ ఇవ్వండి. రిజల్ట్సు నెగెటివ్ వచ్చాయి. గుడ్ సైన్. నెమ్మదిగా కోలుకుంటుంది. ఒక నెల్ తర్వాత తీసుకు రండి.”

-సమాప్తం –

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *