March 29, 2024

ప్రయత్నం

రచన: రమ శేషు

“మామయ్యా, మామయ్యా,” బైట నుండి పిలుస్తూ గేట్ తీసుకుని హాల్ లోకి వచ్చాడు హర్ష.
“ఏంటిరా హడా‌వుడి, అమ్మ ఏమైనా కబురు చెప్పమందా!” అనడుగుతూ గది లోంచి హాల్ లోకి వచ్చాడు శేఖర్, హర్ష మామయ్య.
“ఏమయ్యా, ఇదేనా రావడం, వదిన బాగుందా” అంటూ మంచినీళ్ళు ఇచ్చింది శేఖర్ భార్య లక్ష్మి.
“బాగుంది అత్తయ్యా. మిమ్మల్నందరినీ అడిగానని చెప్పమంది.” అన్నాడు హర్ష మంచినీళ్ళు తాగుతూ.
“కబుర్లకేం గానీ, కాఫీ పట్రా, ఎప్పుడు బైల్దేరాడో ఏమో.” అన్నాడుశేఖర్ భార్య నుద్దేశించి.
“అయ్యో, అత్తయ్యా, అదేమొద్దు, మామయ్య అలాగే అంటాడు. ఇప్పుడెందుకు శ్రమ.” అన్నాడు హర్ష.
“వాడలాగే అంటాడు, నువ్వు కాఫీ తేవే, పో.” అంటూ “నీ పేరు చెప్పి తాగుదాం అనుకుంటే, నువ్వేంటి‌ నాకు గండి కొడతావ్” అన్నాడు శేఖర్ నవ్వుతూ హర్ష తో.
“నాకు తెలియదా మీ సంగతి, ” అంటూ నవ్వుతూ కాఫీ తేవడానికి వెళ్ళింది లక్ష్మి.
“ఇప్పుడు చెప్పరా, ఏం పని మీద వచ్చావ్, ఏమైనా కావాలా.” అడిగాడు శేఖర్.
“ఏం వద్దు మామయ్యా, ఇక్కడ దగ్గర లో ఇంటర్వ్యూ ఉందని వచ్చాను. తిరిగి వెళ్తూ కల్సి పోదామని వచ్చాను.” అన్నాడు హర్ష‌.
” ఓహో, ఉద్యోగ ప్రయత్నమా. ఏమన్నారు?” ఉత్సుకతతో అడిగాడు శేఖర్.
” ఏముంది, మామూలే. తర్వాత కాల్ చేస్తామంటారు. కొందరు రిగ్రెట్ లెటర్ పంపుతారు, మరి కొందరు అదీ ఉండదు. మనం మరో ఇంటర్వ్యూ వచ్చేదాకా ఈ జాబ్ మీద ఆశ పెట్టుకుని కూర్చుంటాం. అదే జరుగు తోంది.” అన్నాడు నిరాశ గా.
ఇంతలో అత్తయ్య కాఫీ తేవడం తో, మౌనంగా కాఫీ తాగారు. “మామయ్యా, ఇంక బైల్దేరతాను. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను అత్తయ్యా.” అని లేచాడు హర్ష.
” సరేరా. వచ్చే వారం మీ ఇంటి వైపు నాకు పనుంది. నేను భోజనానికి వస్తానని అమ్మకి చెప్పు.” అన్నాడు శేఖర్.
“అలాగే మామయ్యా, అత్తయ్య ని, విన్నీ ని కూడా తీసుకు రావచ్చు కదా.” అడిగాడు హర్ష.
“అలాగే లే. వచ్చినా తొందరగా వస్తాం. సరేనా.” అంటూ వీడ్కోలు పలికాడు శేఖర్.

* * * * *

మొబైల్ అదేపనిగా మోగే సరికి గబగబా వెళ్ళి చేతిలోకి తీసుకుని “హా, చెప్పు మామయ్యా.” అంటూ ఆయన చెప్పింది విని “అలాగే మామయ్యా, అమ్మకి చెప్తాను.” అంటూ ఫోన్ పెట్టేసాడు.
“అమ్మా, అమ్మా,” అని తల్లి ని పిలిచాడు. “వస్తున్నా,” అంటూ వచ్చి ” ఏంటి హర్షా, ఎవరు ఫోన్” అడిగింది హర్ష తల్లి సరోజ.
“మామయ్య అమ్మా. తను ఒక్కడే వస్తున్నాడట. తను పని చూసుకుని వచ్చే సరికి కొంచెం టైం పడుతుందిట. భోజనం సమయానికి వస్తానన్నాడు.” అని వివరంగా చెప్పాడు హర్ష.
“సరే. నేను వంట చెసేస్తాను. నీకేమైనా బైటికి వెళ్ళే పని ఉందా.”అడిగింది ఆవిడ హర్ష ని.
“లేదు. మామయ్య వస్తున్నాడుగా. అర్జెంటు పనులేమీ లేవు. నీకేమైనా తెచ్చి పెట్టాలా.” అడిగాడు హర్ష.
“లేదు. అన్నీ ఉన్నాయి. సరే, నేను వంట మొదలు పెడతాను.” అంటూ వెళ్ళిపోయింది సరోజ.
హర్ష కూడా తన లాప్టాప్ లో వాంటెడ్ కాలమ్స్ చూసుకోవడం లో బిజీగా ఉన్నాడు. లాప్టాప్ చూస్తూ, అవసరమైన వారితో ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా 2 గంటలు గడిచాయి. కాస్త అలసట అన్పించింది. లాప్టాప్ మూసి హాల్ లోకి వచ్చేసరికి మామయ్య గేట్ దగ్గర బండి పార్క్ చేయడం కన్పించింది.
“రా మామయ్యా,” అంటూ గేట్ తీశాడు హర్ష.
ఆయన నవ్వుతూ “ఇంట్లోనే ఉన్నావా. బైటికి వెళ్ళావేమో అనుకున్నా.” అన్నాడు శేఖర్ అల్లుడు చేతిని తన చేతిలోకి తీసుకుని.
“లేదు మామయ్యా, ముఖ్యమైన పనులేవీ లేవు. ఇంటర్వ్యూ కి పిలిస్తే వెళ్తాను. లేదా ఎవరినైనా కలవాల్సి ఉంటే వెళ్తాను.” అన్నాడు హర్ష.
“ఇదేనా రావడం, వదిన, విన్నీ ఎలా ఉన్నారు? వాళ్ళని తీసుకు వస్తావనుకున్నా.” అన్నను పలుకరిస్తూ ప్రశ్నలు వేసింది సరోజ.
“అనుకున్నానమ్మా. కానీ కుదరలేదు. నేను వేరే వాళ్ళని కలవాల్సిన పని ఉండి ముందు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది.విన్నీ కి కాలేజీ ఉంది. మీ వదినని నెనే తీసుకురాలేదు.” అన్నాడు శేఖర్ సమాధానంగా.
“ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా?” అడిగాడు శేఖర్ చెల్లెల్ని అభిమానంగా.
“నాకేం ఫర్వాలేదు అన్నయ్యా. దేనికీ లోటు లేకుండా జరుగుతుంది. కానీ వాడి గురించి నాకు బెంగ. ఇన్నాళ్లు అయినా ఉద్యోగం రాలేదు. నిరాశ పడుతున్నాడు.” అంది సరోజ విచారంగా.
“వాడి గురించి నాకు వదిలేయమ్మా. నేనున్నాను కదా. ఇన్నాళ్లు ఏదో వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు అని ఊరుకున్నా. ఇప్పుడు నేను చూసుకుంటా. నువ్వు దిగులు పడకు.” అంటూ చెల్లెలి కి ధైర్యం చెప్పాడు శేఖర్.
ఇంతలో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు హర్ష. అవి అందుకుని “ఇంతకీ మీరు భోజనం చేసారా.” అడిగాడు శేఖర్.
“లేదురా, నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉన్నాం.” అంది సరోజ.
“అయ్యో, ఇప్పటికే ఆలస్యం అయింది. పదండి, భోజనం చేసేద్దాం.” అన్నాడు శేఖర్.
“రండి, అన్నీ రెడీగా ఉన్నాయి.” అంటూ సరోజ భోజనాల‌ గది కిదారి తీసింది.
భోజనాలు ముగించి మామా, అల్లుడూ కబుర్ల లో పడ్డారు. కొంచెం రెస్ట్ తీసుకుంటానని సరోజ గది లోకి వెళ్ళి పోయింది.
“ఇప్పుడు చెప్పు అల్లుడూ, నీ ఉద్యోగ పర్వం ఎంత వరకు వచ్చింది? ఏమైనా వచ్చే సూచనలు ఉన్నాయా?” హర్ష ని అడిగాడు శేఖర్.
“ఏం ఉద్యోగమో మామయ్యా. నిజానికి కేంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగం వస్తే వచ్చినట్లు. ఆ కేంపస్ దాటి వస్తే పడరాని పాట్లు. ఎక్కడ చూసినా ఫ్రెషర్స్ కావాలంటారు.మా తర్వాత బాచ్ కి కూడా ఉద్యోగాలు వచ్చాయి. మరి నా బాచ్ లో నాలా ఇద్దరు, ముగ్గురు ఉన్నాం. ఏదీ లేకుండా.” అన్నాడు హర్ష బాధగా.
“ఒరేయ్, సమయాన్ని బట్టి ప్రాతినిధ్యం మారుతూ ఉంటుంది రా. మా కాలం లో గవర్నమెంట్ జాబ్ కోసం తెగ ఆరాటం. అది వస్తే జీవితంలో సెటిల్ అయినట్లే. అది రాగానే పెళ్ళి కూడా అయిపోయేది.” అన్నాడు శేఖర్.
” అప్పట్లో ఆ ఉద్యోగాలకి పెద్ద పోటీ ఉండేది కాదేమో. ఉద్యోగం ఈజీ గా వచ్చేదేమో.” అన్నాడు హర్ష.
“అదెవరు చెప్పారు? అలా అయితే అందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులే అయ్యే వారు కదా. ఆ కాలంలో అది మాకు గగన కుసుమం. ఉద్యోగాలు దొరక్క చిన్నా, చితకా ఉద్యోగాలతో సంసారాలు ఈడ్చిన వారూ ఉన్నారు. జీతాలు చాలక, ఏ షాప్ లోనో పద్దులు రాసే వాళ్ళూ ఉండేవారు. ఎప్పటికప్పుడే. ఉద్యోగాల బెడద.” అన్నాడు శేఖర్ కొంత బాధతో.
“మనకి కావాల్సినదే రావాలంటే ఎప్పుడూ రాదు. రాజీ తప్పదు.ఇప్పట్లో మీకున్న అవకాశాలు కూడా ఉండేవి కావు.” మళ్ళీ అన్నాడు శేఖర్.
“ఇంత కష్టపడి పెద్ద చదువులు చదివి ఉద్యోగం దగ్గర రాజీ పడాలంటావా మామయ్యా.” బాధగా అడిగాడు హర్ష.
“మరి ఏం చేస్తార్రా. మా కాలం లో మాకూ ఆశలుండేవి. చదువుకున్న బియ్యే కి ఆఫీసరో, బ్యాంకు ఆధికారో అయి పోవాలని. కుదిరిందా. దొరికిన గుమాస్తా ఉద్యోగాలతో సరి పెట్టుకున్నాం.” ఆగాడు శేఖర్.
“ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఉద్యోగం అంటే చిన్న చూపు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలి. అయినా ఈ కాలంలో అమ్మాయి నిచ్చే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి అంటే నే పిల్లని స్తున్నారు. ఆ పిల్ల కూడా అదే వెలగ పెడుతూ ఉంటుంది కాబట్టి.” మళ్ళీ అన్నాడు శేఖర్.
“మరేం చేయాలి మామయ్యా. సరిగ్గా నా ఫైనల్ ఇయర్ లో నాన్న గుండె పోటు తో చనిపోయారు. నేను కాస్త డిస్టర్బ్ అయి మార్కులు సరిగా సాధించలేక పోయాను. నాన్నది మీలా గవర్నమెంట్ ఉద్యోగం కాదు. ఆయన తర్వాత నేను ఆశిద్దామన్నా. అక్కడికీ అడిగితే నేను మంచి ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక ఉద్యోగం ఇవ్వనన్నాడు. మరి నేనేం చేయాలి చెప్పు.” అన్నాడు హర్ష ఆవేదనగా.
“చూడు హర్షా, అవకాశం మనకు దక్కక‌ పోతే, మనమే దానిని దక్కించు కోవాలి. మీ నాన్న బ్యాంకు లో గుమాస్తా అయినా అవుదామని ఆశ పడ్డవాడు, బట్టల కొట్టు లో గుమాస్తా అయ్యాడు. కొద్దిగా ఆస్తి, స్వంత ఇల్లు మీ తాత ముందుగానే ఏర్పరచి ఉంచడం తో ఏం ఇబ్బంది లేకుండా సంసారం నడప గలిగాడు. తక్కువ చేసి మాట్లాడా ననుకోకు. పరిస్థితుల గురించి చెప్తున్నాను.” ఆగాడు శేఖర్.
“మరి నేనేం చేయాలి మామయ్యా. నాన్న లాగా నేను కూడా…” మధ్య లోనే గొంతులో అడ్డు పడినట్లై ఆగిపోయాడు హర్ష.
“ఛ, ఊరుకో. నువ్వెందుకు మీ నాన్న లాగా చేయాలి? చూడు.నువ్వు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశావ్. ఉద్యోగం కాక మరింక నీకు ఉన్న అవకాశాలు ఏమిటో, ఆలోచించు. మీ కాలం వాళ్ళు ఉద్యోగాలు చేస్తూనే సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నారు. ఆలోచించు. నువ్వేమి చేయగలవు? నీకేది బాగుంటుంది?ఆలోచించి చెప్తే నేను చేయగల సహాయం చేస్తాను. ఏమంటావ్?” అడిగాడు శేఖర్.
భరోసా ఇస్తున్నట్లుగా ఉన్న మామయ్య మాటలు ఎంతో ఊరటనిచ్చాయి హర్షకి.
“అలాగే మామయ్యా, తప్పకుండా. నువ్వు చెప్పిన విషయం ఆలోచిస్తాను.” అన్నాడు హర్ష.
” చూడు హర్షా, కాలం మన చేతి లో ఉన్నట్లే ఉండి మనని తన గుప్పిట్లో బంధిస్తుంది. కాలం ఎవరి కోసం ఆగదు. కాలం తో మనం సమానంగా పరుగు పెట్టాలి. మనం అక్కడే ఉంటామంటే కాలం మనని దాటి వెళ్ళిపోతుంది. అందుకే కాలం తో పాటుమారాలి. అప్పుడే కాలాన్ని అందుకోగలం.” అంటూ ముగించాడు శేఖర్.
” మామయ్యా, ఈ రోజు నీ దగ్గర చాలా విషయాలు నేర్చు కున్నాను. కాలంతో పాటు నడవాలంటే కాలాన్ని బట్టి మారాలి అని అర్థమైంది. చాలా థాంక్స్ మామయ్యా.” అన్నాడు హర్ష ఆనందంగా.

* * * * *

సంవత్సరం తర్వాత మామయ్య సహాయం తో సైబర్ ‌కేఫ్ పెట్టు కున్న హర్ష 6 నెలల్లో నిలదొక్కుకుని మెల్లిగా లాభాల‌ బాట పట్టాడు. కాలం తో పాటు తనను తాను మార్చుకుంటేనే మనుగడ అని మామయ్య మాటల‌ద్వారా తెలుసు కున్న హర్ష సైబర్ ‌కేఫ్ కి స్వంతదారు కావడం మాత్రమే కాక మరో నలుగురి కి ఉపాధి చూపించిన వాడయ్యాడు.
మరొక ఆరునెలలకు విన్నీ చదువు పూర్తి కావడంతో ఇరు వైపులవారు ఆనందంగా వారి వివాహం జరిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *