March 29, 2024

మనసు

రచన: వై.కె.సంధ్యశర్మ

ఏమయ్యిందో
ఈ మనసుకు
ఎంత పిలిచినా పలకడం లేదు
రెక్కలొచ్చి
ఎగిరే పక్షిలా…
పచ్చని చేలకు పంటనవ్వాలని
పసిపాపాయి నవ్వులా
పాల నురుగలా తేలిపోతోంటుంది

ఏమయ్యిందో
ఈ మనసుకు
ఎంత పిలిచినా పలకడం లేదు
కనపడని కన్నీటి ధారకు
అడ్డుపడాలని ఆశగా
ఆశల నిచ్చెనను
ఎరగా వేస్తూ
బంధాల తాయిలాలను
రుచి చూడమంటోంది!

ఏమయిందో ఈ మనసుకు
ఎంత పిలిచినా పలకడం లేదు
ఆకాశపు పందిరిలోని
మెరుపు గీతలను
అక్కున చేర్చుకుని
చీకటిని చిటికెలో
తరిమేయాలని
అజమాయిషీ చేస్తుంది!

ఏమైయిందో ఈ మనసు
ఎంత పిలిచినా పలకడం లేదు
కర్తవ్య భోదనతో
కొంగుముడిలో
దాగున్న చిత్రాలన్నీ
అనిర్ధిష్టమైన ఊసులను
నిత్యం గుసగుసలాడుతూనే
వుంటుంది!

ఏమైయిందో ఈ మనసు
ఎంత పిలిచినా పలకడం లేదు
రాతి వెన్నెలను కరిగించి
ప్రేమ చిగుళ్ళను పండించి
అక్షర ఫలాలను అందించాలనే
ఆరాటంలో తపన పడుతూ
ఓ స్వాంతనా సమీరంతో
కబురంపా ….
మంచు రెక్కవై కరిగిపో…
నా నెచ్చెలి నీవైతేనని…
మనసున మనసై ప్రేమతో పరవశించింది!
కవనసోయగాలను విరబూసింది!!

3 thoughts on “మనసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *