June 25, 2024

అక్షరపరిమళమందించిన పూలమనసులు

రచన: సి. ఉమాదేవి

నండూరి సుందరీ నాగమణి బ్యాంక్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూనే అక్షరఆర్తి నింపిన స్ఫూరినందుకుని విభిన్న అంశాలతో నవలలు, కథలు మనకందించడం ముదావహం. శాస్త్రీయసంగీతంలో ప్రవేశం వీరికున్న సంగీతాభిలాషను మనకు విశదపరుస్తుంది. గడినుడి ప్రహేళికలు వీరందించిన ఆటవిడుపులే. పూలమనసులు కథాసంపుటి వైవిధ్యభరితమైన కథాంశాలతో సమస్యలను స్పృశిస్తూనే పరిష్కారాన్ని సూచించడం రచయిత్రి మనసులోనున్న సామాజిక అవగాహనను ప్రస్ఫుటం చేస్తుంది.
పిల్లలు విదేశాలకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులను రమ్మని వారికి ఆ దేశంలోని ప్రదేశాలను చూపించాలని ఆశిస్తారు. అయితే పరిస్థితులు అతలాకుతలమై తమ మనుగడే వికటించినపుడు స్వదేశానికి తిరిగి వచ్చెయ్యడం తెలిసిన విషయమే. అయితే అందులో కూడా తాము నేర్చుకున్న జీవనవిధానాలు ధైర్యం, చాకచక్యం, మనోబలం, కష్టపడటం మనిషినెలా తీర్చిదిద్దాయో చక్కటికోణంలో ప్రతిఫలించిన కథ, దేశమాత చల్లని ఒడి, తెలియుము ఒక దేవుని గుడి!
మరో చక్కని కథ దానము చేసిన తరుగనిది. తమ ఇంటిలో పనిచేస్తున్న అచ్చమ్మ కొడుకును చదివించిన సదాశివ ఆ కుర్రాడికి చక్కని బ్రతుకుబాట పరుస్తాడు. ఉన్నత పదవిని అందుకున్న అచ్చమ్మ కొడుకు తనను చదివించిన వారికి కానుకలు సమర్పించుకుంటాడు. అన్నం అరిగిపోతుంది, వస్త్రం చిరిగిపోతుంది కాని విద్యకు నాశనం లేదు. మరింత వృద్ధి చెందుతుంది. సదాశివ చూపినబాటలోనే ఎంతోమందికి ఎదుగుదలను కలిగిస్తాననడం కథాశీర్షికకు అక్షరసుమాలే!
అహంకారం, అభిజాత్యం తన మనసులో నిక్షిప్తం చేసుకున్న వ్యక్తి భవానీప్రసాద్. అతడి కొడుకు నవనీత్ ఆటోలోనుండి దిగుతుండగానే గమనించని ఆటో డ్ర్తెవర్ ముందుకు నడపడంతో క్రిందపడి గాయపడతాడు. ఆ సమయంలో వారి వాచ్ మ్యాన్ భార్య రాములమ్మ తన తమ్ముడు వార్డ్ బాయ్ గా పనిచేస్తున్న నర్సింగ్ హోమ్ కు తీసుకునివెళ్తుంది. భవానీ ప్రసాద్ కొడుకు దగ్గరకు చేరేలోపే అతడి కొడుకుకు వైద్యం పూర్తవుతుంది. తన అహంకారానికి పశ్చాత్తాపపడుతూ అందరితో మంచిగా మాట్లాడుతూ, ఆదరంగా మెలగాలనే మానవతావిలువలను తెలిపిన కథ ఇచ్చుటలో ఉన్న హాయి.
బంటీ-బనానా నేటి సామాజికతీరును ప్రతిఫలించిన కథ. స్మార్ట్ ఫోన్లపై పిల్లలకున్న ఆసక్తిని విశదపరిచిన కథ. జీవనరాగం హృదయాన్ని కుదిపిన కథ. భార్యను కోల్పోయిన వ్యక్తి మానసిక సంఘర్షణ తట్టుకోలేక ఆమె జ్ఞాపకాలలో భార్య ఉందనే భ్రమతో ఒకసారి, లేదనే స్పృహతో మరోసారి తల్లడిల్లుతున్న వైనం పాఠకులను సైతం కంటతడి పెట్టిస్తుంది. తండ్రి ఇల్లు వదిలేసి వెళ్లిపోతే కొడుకు జీవన్ తన వేదనను అక్కతో పంచుకుంటాడు. తండ్రి నివసించిన ఇంటిని వయోజన విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతాడు. అతని మనసున ఉత్సాహం భూపాలరాగమై అతడిలో నూతనశక్తిని ప్రవేశపెట్తుంది. కథాసంపుటానికి శీర్షికగా నిలిచిన కథ పూలమనసులు. పూలను అమ్ముకునే వ్యక్తి ఒక మూర పూలను తనకు తక్కువగా ఇచ్చి, అవి వేరేవారికిచ్చి తనను మోసం చేసిందనే భావనలో ఉన్న వ్యక్తి రమణి. ఇక ఆగలేక పూలమ్మిన యాదమ్మను పదిహేను రూపాయలకు రెండు మూరలకు బదులుగా ఒక్కమూరే ఇచ్చావని నిలదీస్తుంది. అయితే తన పొరపాటును అంగీకరించిన యాదమ్మ తాను మరచిన మూరలను రమణికి అందిస్తుంది. మనసులో తననుకున్నదానికి భిన్నంగా యాదమ్మ ప్రవర్తనను చూసిన రమణిలో అంతర్మథనం మొదలవుతుంది. కథ చక్కటి ముగింపునందుకుంది.
ప్రేమించు –ప్రేమ పంచు కథలో శిలాక్షరాలుగా నిలిచిన మాటలు ఎన్నో మనసును తట్టిలేపుతాయి. మంచిని ప్రేమించండి, ఎవరిమీదా కోపం, అసూయలు పెట్టుకోకండి. అసహనానికి దూరంగా ఉండండి. అప్పుడే ప్రతి క్షణంలోను మీరు జీవిస్తారు. ఈ మాటలే కథను తీర్చిదిద్ది చక్కటి ముగింపునందిస్తాయి. మరిన్ని మంచికథలున్న కథాసంపుటి తప్పక చదవాల్సిన పుస్తకం. తన విలువైన కాలాన్ని కథాతోరణాలుగా మార్చి మనకందించిన నండూరి సుందరీ నాగమణి అభినందనీయురాలు.

2 thoughts on “అక్షరపరిమళమందించిన పూలమనసులు

  1. మీ సమీక్ష ఒక కథకురాలిగా నా బాధ్యతను మరింత పెంచిందని భావిస్తున్నాను అక్కయ్యా. చాలా చాలా ధన్యవాదాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *