May 25, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 46

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఈ కీర్తనలో “త్రికరణశుద్దిగా చేసిన పనులకు..దేవుడు మెచ్చును లోకము మెచ్చును” అని హెచ్చరిస్తున్నాడు అన్నమాచార్యుడు. అసలు త్రికరణశుద్ధి అంటే ఏమిటి? త్రికరణాలు అంటే ఏమిటి? అవి 1.మనసా (మన ఆలోచన, సంకల్పం) 2.వాచా (వాక్కు ద్వారా, చెప్పినటువంటిది) 3.కర్మణా (కర్మ, చేతల ద్వారా) మనలో చాలామందికి మనస్సులో ఒక సంకల్పం ఉంటుంది. అది ఎదుటివారి మెప్పు కోసమో, లేక మన సంకల్పం బయల్పరచడం ఇష్టం లేకో, లేదా మరొక కారణం చేత అనుకున్నది చెప్పలేక, చెప్పిన పని చెయ్యలేము. మనస్సు అనుకున్న విషయం నాలుక ద్వారా చెప్పలేము, చెప్పినది ఆచరించలేము. అది ఏది పడితే అది ఆలోచించి మాట్లాడి చేసెయ్యడం కాదు. ధార్మికమైన, శాస్త్ర ఆమోదయోగ్యమైన, అందరికీ ఉపయోగి పడే కర్మ ఉండాలని శాస్త్రం చెబుతుంది. అదే త్రికరణశుద్ధి. ఎవరు చూసినా చూడక పోయినా మనలోని అంతరాత్మగా మెలిగే భగవంతునికి అన్నీ తెలుస్తాయి. మన మనస్సులో విషయం మరొకరికి తెలియకపోవచ్చు కానీ మన సంకల్పాలన్నీ చదవగలిగిన దేవునికి ఇది తెలిసి ఉండదా? అని అన్నమయ్య ప్రబోధిస్తున్నాడు.
కీర్తన:
పల్లవి: త్రికరణశుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును
వొకటి కోటిగుణితంబగు మార్గములుండఁగఁ బ్రయాసపడనేలా ॥పల్లవి॥
చ.1 తనమనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి
కనకబిందు యమునా గయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్
దినకరసోమగ్రహణకాలముల తీర్థాచరణలు సేసిన ఫలములు
తనుఁ దానే సిద్ధించును వూరకే దవ్వులు దిరుగఁగ మఱి యేలా ॥త్రిక॥
చ.2 హరియను రెండక్షరములు నుడివిన నఖిలవేదములు మంత్రములు
గరిమ ధర్మశాస్త్రపురాణాదులు క్రమమునఁ జదివిన పుణ్యములు
పరమ తపోయోగంబులు మొదలగు బహుసాధనముల సారంబు
పరిపక్వంబై ఫలియించంగా బట్టబయలు వెదకఁగనేలా ॥త్రిక॥
చ.3 మొదల శ్రీవేంకటపతికినిఁ జేయెత్తి మొక్కిన మాత్రములోపలనే
పదిలపు షోడశదానయాగములు పంచమహాయజ్ఞంబులును
వదలక సాగంబులుగాఁ జేసినవాఁడే కాఁడా పలుమారు
మదిమదినుండే కాయక్లేశము మాఁటికి మాఁటికి దనకేలా ॥త్రిక॥
(రాగం గుజ్జరి; సం.2 సంకీ.236 – రాగిరేకు – 151-2 )

విశ్లేషణ:
పల్లవి: త్రికరణశుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును
వొకటి కోటిగుణితంబగు మార్గములుండఁగఁ బ్రయాసపడనేలా
మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధిగా చేసిన పనులు ఎప్పుడూ ఘనంగానే ఉంటాయి. అలాంటి పనులను చూసి లోకమే కాదు భగవంతుడుకూడా మెచ్చుకుంటాడు. ఒక్కో సత్కార్యం కోటిపనులకు సమానమైన మార్గముండగా ఇంకా ప్రయాస పడతారు భక్తులారా! ఏపని చేసినా త్రికరణశుద్ధిగా చేయండి అంటున్నాడు అన్నమయ్య.

చ.1
తనమనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి
కనకబిందు యమునా గయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్
దినకరసోమగ్రహణకాలముల తీర్థాచరణలు సేసిన ఫలములు
తనుఁ దానే సిద్ధించును వూరకే దవ్వులు దిరుగఁగ మఱి యేలా
ప్రతి ఒక్కరి మనసు కూడా పవిత్ర నదులైన గంగా, గోదావరి, కావేరి నదులవలె..ఆ స్వర్ణబిందువులు లాగా ఎంతో పవిత్రమైనవి. యమున, గయ మొదలైన పుణ్యక్షేత్రములంత మహిమను సంతరించుకొన్నవి. త్రికరణశుద్ధిగా చేసిన సత్కార్యాలన్ని సూర్య, చంద్ర గ్రహణకాలాల్లో తీర్ధాలలో మునిగినంత ఫలితాన్ని యిస్తాయి. ఊరకే అటూ ఇటూ తిరిగి అక్కడా ఇక్కడా మునుగ వలసిన పనిలేనేలేదు. సత్కార్యాలన్ని కూడా అలాంటి ఫలితాలను మీకు తమంతతాముగా సిద్ధిస్తాయి.

చ.2
హరియను రెండక్షరములు నుడివిన నఖిలవేదములు మంత్రములు
గరిమ ధర్మశాస్త్రపురాణాదులు క్రమమునఁ జదివిన పుణ్యములు
పరమ తపోయోగంబులు మొదలగు బహుసాధనముల సారంబు
పరిపక్వంబై ఫలియించంగా బట్టబయలు వెదకఁగనేలా
హరి అనే రెండు అక్షరములు నోటితో ఉచ్చరించినమాత్రాన సర్వ వేద మంత్రములు పఠించిన ఫలితం సిద్ధిస్తుంది. ధర్మ శాస్త్ర పురాణాలు, ప్రస్థాన త్రయం పఠించిన ఫలితం క్రమముగా సిద్ధిస్తుంది. తపస్సు మొదలైన యోగనిష్టలు చేసి పొందే పుణ్యాన్ని కేవలం హరినామస్మరణ ద్వారా సిద్ధిస్తుంది అని ప్రబోధిస్తున్నాడు అన్నమయ్య.

చ.3
మొదల శ్రీవేంకటపతికినిఁ జేయెత్తి మొక్కిన మాత్రములోపలనే
పదిలపు షోడశదానయాగములు పంచమహాయజ్ఞంబులును
వదలక సాగంబులుగాఁ జేసినవాఁడే కాఁడా పలుమారు
మదిమదినుండే కాయక్లేశము మాఁటికి మాఁటికి దనకేలా
శ్రీవేంకటేశ్వరునికి ఒక్కసారి చేతులెత్తి మ్రొక్కితే చాలు. షోడశదానములు అంటే 1.గోవు, 2.భూమి, 3.బంగారము, 4.వస్త్రము, 5.ఆభరణము, 6.ఛత్రము, 7.చామరము, 8.శయ్య, 9.వ్యజనము, 10.సాల గ్రామము, 11.ధనము, 12.ధాన్యము, 13.దీపము, 14.పాదుక, 15.ఆజ్యము, 16.కన్య మొదలైన అన్ని దానములు చేసిన ఫలితమే కాక, పంచ-మహాయజ్ఞములు అనగా 1.బ్రహ్మయజ్ఞము(అధ్యాపనము), 2.పితృ యజ్ఞము(తర్పణము), 3.దేవయజ్ఞము(హోమము), 4.భూతయజ్ఞము(బలి ), 5.నృయజ్ఞము (అతిథిపూజ) చేసిన సర్వ ఫలితములు దక్కుతాయి అంటున్నాడు. ఈ హరి నామం వదలకుండా మదిలో స్మరిస్తే చాలు. శరీరశ్రమ ఏమాత్రం లేకుండా స్వర్గలోక ప్రాప్తి సిద్ధిస్తుంది. నోరారా త్రికరణ శుద్ధిగా ఒక్కసారి “శ్రీహరీ! శరణు! శరణు!” అనండి చాలు అని తాను నమ్మిన, ఆచరించిన హరినామ విశిష్టతను అందరికి పంచిపెడుతున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధాలు: కోటిగుణితంబగు = కోటిరెట్ల ఫలితము; ప్రయాస = అధిక శ్రమ; కనకబిందు = బంగారు నీటి చుక్కలు; దినకర సోమగ్రహణ కాలము = సూర్య చంద్ర గ్రహణకాలము; దవ్వు = దూరము; నుదివిన = చెప్పిన; గరిమ = ఘనమైన, గొప్పవైన; క్రమముగ = ఒకదాని తర్వాత మరొకటి; బట్టబయలు = బాహ్యప్రపంచములో; కాయక్లేశము = శరీరాన్ని కష్టపెట్టుకోవడం.
-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *