May 19, 2024

అమ్మమ్మ – 12.

రచన: గిరిజ పీసపాటి

స్పృహ తప్పిన తాతయ్యను అతి కష్టం మీద విజయవాడ నుండి టాక్సీలో తెనాలి తీసుకువచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉండడంతో ఒక్కసారిగా నిస్పృహగా అరుగు మీదే కూలబడిపోయారు పాతూరి రామకృష్ణ మూర్తి గారు.
తరువాత తెలివి తెచ్చుకుని అమ్మమ్మ, నాగ ఎక్కడికి వెళ్ళారని ఆరా తీయగా ఊరిలోనే ఉంటున్న చుట్టాలింటికి వెళ్ళారని తెలిసి, పెద్దన్నయ్య ఆఫీసులో ఉండడంతో, వాళ్ళ అమ్మగారికి తాతయ్యను తను వచ్చేవరకు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, వేరేవాళ్ళని డాక్టర్ నమశ్శివయ్య గారికి విషయం చెప్పి తీసుకురమ్మని పంపించి, తను రిక్షాలో వెళ్ళి విషయం చెప్పి అమ్మమ్మని, నాగని ఇంటికి తీసుకువచ్చారు.
ఇంటికి రాగానే అమ్మమ్మ, పాతూరి గారు కలసి తాతయ్య శరీరాన్ని గోరువెచ్చని నీటితో తుడిచి, వాంతులు చేసుకున్న బట్టలు మార్చి, ఉతికిన బట్టలు వేసి, మెత్తటి పక్క మీద పడుకోబెట్టారు. ఈలోగా డాక్టర్ గారు వచ్చి తాతయ్యను పరీక్షించి హైబిపి వల్ల బ్రెయిన్ హెమరేజ్, పక్షవాతం వచ్చాయని చెప్పారు.
తరువాత రెండు ఇంజక్షన్స్ ఇచ్చి, ఎప్పుడు స్పృహలోకి వస్తారో తెలియదని, వారం రోజుల కన్నా బ్రతకరనీ, ఈ స్థితిలో హాస్పిటల్ లో చేర్చినా ఫలితం ఉండదు కనుక రెండు పూటలా ఇంటికి వచ్చి ట్రీట్‌మెంట్ ఇస్తానని, స్పృహలోకి రాగానే ఇవ్వాల్సిన మందులు రాసి వెళ్ళిపోయారు.
దగ్గిర బంధువులందరికీ టెలిగ్రామ్స్ వెళ్ళాయి. ఆరోజు అర్ధరాత్రి సమయంలో తాతయ్య స్పృహలోకి వచ్చి పక్కనే కూర్చుని ఉన్న అమ్మమ్మని చూసి నోరు తెరిచి నాగ ఏదని అడగబోయి, పక్షవాతం కారణంగా మాట, కుడివైపు కాలు, చెయ్యి పడిపోవడంతో సైగలు చేసి అడిగారు.
నిద్ర పోతోందని జవాబు చెప్పి, గబగబా నాగను నిద్ర లేపడానికి వెళ్ళబోతున్న అమ్మమ్మను వద్దని వారించారు. దానితో అమ్మమ్మ తన ప్రయత్నాన్ని విరమించుకుని జావ కాచి స్పూన్ తో పట్టి, డాక్టర్ ఇచ్చిన మందులు వేసింది. జావ తాగి, మందులు వేసుకున్నాక మగతగా పడుకున్నారు తాతయ్య.
స్పృహలోకి రాగానే తనున్న పరిస్థితి అర్ధమయినా అధైర్య పడలేదు సరికదా అప్పుడు కూడా కన్న కూతురి నిద్రను పాడుచెయ్యడానికి ఇష్టపడని ఆయన్ని చూసి అమ్మమ్మ కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి.
ఆయన లేకపోయినా కూతురిని ఎలా చూసుకోవాలో అన్యాపదేశంగా చెప్పినట్లుగా అనిపించింది ఆవిడకి. దగ్గరి బంధువులు వచ్చి చూసి వెళ్తున్నారు. కొందరు అమ్మమ్మకి సహాయంగా అక్కడే ఉండిపోయారు. మూడురోజుల తరువాత పీసపాటి తాతయ్య, పెద్ద కొడుకుతో సహా వచ్చి చూసి, మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళిపోయారు.
లేవలేని స్థితిలో ఉన్న భర్త బట్టలు, పక్కబట్టలు దుర్వాసన రాకుండా మారుస్తూ , వేళకు మందులు, లిక్విడ్ డైట్ ఇస్తూ, కంటికి రెప్పలా చూసుకుంటోంది అమ్మమ్మ.
ఎప్పుడైనా అమ్మమ్మ పనిలో ఉన్న సమయంలో నాగ ఒళ్ళు తుడవబోతే రెండో చేత్తో నాగ చెయ్యి తోసేసి, నువ్వొద్దు అమ్మ చేస్తుందని సైగలతో చెప్పేవారు తాతయ్య.
నోటి నుండి వచ్చే సలైవాను కూడా తుడవనిచ్చేవారు కాదు. గర్భవతివి, నువ్వు నా దగ్గరకు రాకు, ఇన్ఫెక్షన్ వస్తుంది, నీ ఆరోగ్యానికి మంచిది కాదని సైగల ద్వారా హెచ్చరించేవారు.
డాక్టర్ నమశ్శివయ్య గారు చెప్పినట్లే వారం రోజులపాటు మృత్యువుతో పోరాడి భార్యను, గర్భవతిగా ఉన్న కూతురిని వదిలిపెట్టి తిరిగి రాని లోకాలకు తరలి వెళ్ళిపోయారు తాతయ్య. మళ్ళీ బంధువులకి టెలిగ్రామ్ ద్వారా కబురు చేరింది.
దగ్గరి బంధువులు, పీసపాటి తాతయ్య టెలిగ్రామ్ అందగానే బయలుదేరి వచ్చారు. పన్నెండు రోజులపాటు జరగవలసిన కార్యక్రామలన్నీ యాధావిధిగా జరిగిపోయాయి. పన్నెండవ రోజు సాయంత్రానికి బంధువులంతా వెళ్ళిపోయారు. .
పదవరోజు బంధువులు వారిస్తున్నా వినకుండా హిందూ ఆచారం ప్రకారం బొట్టు, గాజులు, పువ్వులు, తాళి, నల్లపూసలు, మెట్టెలు మొదలైన అలంకారాలను తీసేసి, శిరోముండనం చేయించుకుని, తెల్లని పంచెని అడ్డకచ్చ పోసుకుని విధవ స్త్రీ లాగా తయారైంది అమ్మమ్మ.
ఎంతో అందమైన అమ్మమ్మను ఈ వికారమైన రూపంలో చూసి కంట నీరు పెట్టని వారు లేరు. అడిగినవారందరకీ “ఇప్పుడు నేను ఒంటరిగా బతకాలి. చేతిలో ఉన్న డబ్బంతా ఆయన ట్రీట్‌మెంట్‌ కి అయిపోగా అయినవారి దగ్గర అప్పు కూడా చేసాను. ఆయన సంపాదించిన డబ్బు ఏమైనా ఉందో లేదో ఒకవేళ ఉంటే ఎవరి దగ్గర ఉందో నాకేమీ చెప్పలేదు. ఎప్పుడైనా నేను అడిగినా నీకు ఏం కావాలో చెప్పు సమకూరుస్తాను. ఈ విషయాలన్నీ నీకెందుకు? అనేవారు. నా పరిస్థితి మరే ఆడదానికి రాకూడదు”
“రేపు నా జానెడు పొట్టకు పట్టెడు మెతుకులు ఎలా సంపాదించుకోవాలో తెలియని స్థితిలో ఉన్న నేను కొత్త సమస్యలను కోరి తెచ్చుకోలేను. అయినా ఈ అలంకారాలు చూసి మెచ్చుకునే మనిషే పోయాక ఇక ఇవన్నీ నాకెందుకు?” అంటూ సమాధానమిచ్చింది.
పీసపాటి తాతయ్య అమ్మమ్మతో ఈ పరిస్థితుల్లో మీరు పురుడు పోయలేరు కనుక పురిటికి ఇక పంపనని, మంచిరోజు చూసి టెలిగ్రామ్ ఇస్తాను మీరే అక్కడికి రండి అని చెప్పి పదమూడవ రోజు నాగను తీసుకుని బొబ్బిలి వెళ్ళిపోయారు.
తాతయ్య పోయిన పదిహేనవ రోజు నుండి ఎవరెవరో చూడడానికని వచ్చి “మీ ఆయన మా దగ్గర అప్పుగా డబ్బు తీసుకున్నారు, తీర్చకుండానే చనిపోయారు” అని ఆవిడ ముఖం మీదే అనసాగారు. ఆ మాటలు భరించలేక ఉంటున్న ఇల్లు అమ్మి అప్పులు తీర్చాలని నిర్ణయించుకుంది అమ్మమ్మ.
ఆవిడ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకించారు. ఆయన చేసిన అప్పుకి, నాకు ఏ సంబంధమూ లేదని ఖచ్చితంగా సమాధానం చెప్పమని సలహా ఇచ్చారు.
కానీ, పోయిన భర్తకు మాట రానీయనని, నేను అప్పు తీర్చకపోతే మల్లాది గౌరీనాధం చేసిన అప్పు తీర్చకుండానే చచ్చాడని ఆయన గురించి నీచంగా మాట్లాడతారని, అది తను భరించలేనని చెప్పింది.
ఇక ఎవరూ ఆవిడని నమాధానపరచలేక వెళ్ళిపోయారు. “ఉన్న ఇల్లు కూడా అమ్మేస్తే మీరెక్కడ తలదాచుకుంటారు?” అని అడిగిన వరలక్ష్మమ్మ గారితో ఊరిలోనే వేరే ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటానని చెప్పింది.
పెద్ద కొడుకు అప్పటికే ఉద్యోగం చేస్తూ స్థిరపడడం, చిన్న కొడుకు కూడా డిగ్రీ పూర్తి చేసి ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండడం వల్ల వరలక్ష్మమ్మ గారి కుటుంబం ఆర్ధికంగా స్థిరపడ్డ కారణంగా అమ్మమ్మ దగ్గర ఇంటిని వారే కొనుక్కుని, ఒక గదిలో అమ్మమ్మను ఉండమని చెప్పారు. అద్దె ఎంత అని అడిగిన అమ్మమ్మతో మీరు ఇదే ఇంట్లో ఉంటే అంతే చాలు. అద్దె విషయం ఎత్తి తమను బాధపెట్టొద్దని అన్నారు.

******* సశేషం *******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *