February 21, 2024

కంభంపాటి కథలు – పొలమారిన జ్ఞాపకం

రచన: రవీంద్ర కంభంపాటి

ఆ రోజు రాజమండ్రిలో లోవరాజు గాడి ఫ్రెండొకడి స్వీటు షాపు ఓపినింగంట ..ఉదయాన్నే బయల్దేరదీసేడు లోవరాజు గాడు. ‘నీ ఫ్రెండెవడో కూడా నాకు తెలీదు , మళ్ళీ నేనెందుకురా బాబూ’ అంటే , ‘ఏమో ..ఎవరు చెప్పొచ్చేరు .. దార్లో నీకు ఏదైనా కధ దొరుకుతుందేమో ‘ అంటూ నవ్వేసరికి , ఇంక తప్పక బయల్దేరేను.

ఊరు దాటి హైవే ఎక్కగానే ఉన్న వీర్రాజు హోటలు దగ్గిర ఆడి బండి ఆపి , ఆ హోటలు వెనకేపుకెళ్తే వచ్చే తాటితోపు వేపు నడుస్తూంటే , ‘అదేంటీ .. టిఫిన్ తిండానికి కాదా ఇక్కడాగింది ?’ అడిగేను .

‘.. ఫర్లేదులే..టిఫినూ తిందువుగాని.. ఇక్కడి దాకా వచ్చి మన మడికి తాతారావు గాడి తాటి ముంజెలు తినకపోతే వచ్చే పాపం ఎంత పుణ్యం చేసుకున్నా పోదు .. కాబట్టి .. ముందు ముంజి కాయలు కొట్టించుకుని తిందాం ‘ అంటూ , అక్కడ తాటి చెట్టు కింద ముంజికాయలు గుట్టగా వేసుకుని కూచునున్న తాతారావు గాడిని పలకరించేసరికి , ఆడు చేతిలో ఉన్న కత్తితో రెండు ముంజి కాయలు కొట్టి , మా ఇద్దరికీ అందించేడు .

‘ఈ ముంజికాయని చేత్తో పొడిచి , గుజ్జు తీసుకుని తినొచ్చు , కానీ ఎవడైతే ముంజి మొత్తాన్నీ నోటితో పీల్చేస్తాడో ఆడే అసలైన మగాడు ..అంటూ ఒక్కో ముంజెనీ లటుక్కున పీల్చేస్తున్న లోవరాజు గాడి వేపు నేను ఆశ్చర్యంగానూ , తాతారావు నవ్వుతూనూ చూస్తున్నాము !

‘అదేంటీ .. నువ్వింకా మొదలెట్టలేదా ?…సరే .. నువ్వు మెల్లగా తింటూండు .. నీకు ఓ గొప్ప లవ్వు స్టోరీ చెబుతాను’ అన్నాడు

‘ముందు నువ్వు చెప్పు … గొప్పదో కాదో నేన్జెబుతాను ‘ అన్నాను

నవ్వుతా చెప్పడం మొదలెట్టేడు లోవరాజు

‘నీకు జనిపల్లి రామ్మూర్తి మాస్టారు గుర్తున్నారా ?’

‘ఎందుకు గుర్తు లేరూ ? మన సైన్సు మాస్టారు.. ఓ రెండేళ్ల క్రితం పోయేరనుకుంటా కదా ‘ అన్నాను

‘అవును .. ఆయనకి గుండె జబ్బు బాగా ముదిరిపోయింది .. ఆ పోయేదేదో డాక్టర్ల చేతి మీదుగా కాకుండా , ఇంట్లో వాళ్ళనందరినీ చూసుకుంటూ హాయిగా పోతాను అని పట్టుబట్టడంతో ఆయన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేసేరు.

ఆయన పోవడానికి ఓ రోజు ముందు వాళ్ళ ఆవిడ కుసుమ ని పిలిచి ‘ .. నాకు వీలైనంతలో మిమ్మల్నందరినీ బాగా చూసుకోడానికి ప్రయత్నించేను .. నా వల్ల ఏదైనా తప్పు జరిగి , నిన్ను బాధపెడితే క్షమించు ‘ అని ఆవిడ చేతులు పట్టుకుని ఆయనంటే , ఆ కుసుమ గారు ‘దేవుడిలాంటి మనిషి మీరు .. మీరు తప్పు ఎందుకు చేస్తారండీ ‘ అంటూ భోరుమని ఏడ్చేసేరు.

‘నేనేం దేవుణ్ణి కాదు .. నాకు తెలిసి ఒకరిని చాలా బాధ పెట్టేను ..మరి తెలియకుండా ఎంతమందిని బాధపెట్టేనో తెలీదు .. .తనని మటుకు నేను తప్పకుండా క్షమించమని అడిగేనని చెప్పు .. ‘ అని ఆయనంటే .. ఆశ్చర్యపోతూ ‘ఎవరి గురించి మాట్లాడుతున్నారు ?’ అని కుసుమ గారడిగేరు !

‘నిన్ను పెళ్లి చేసుకోక ముందు .. మా వీధిలో ఉండే పోస్టుమాస్టరు చెల్లుబోయిన సుబ్రహ్మణ్యం గారమ్మాయి నిర్మలని ఇష్టపడ్డాను . ఇద్దరం పెళ్లి చేసుకుందామనుకున్నాం .. కానీ .. కులాలు వేరని ఇంట్లో ఒప్పుకోలేదు .. ఇలా లాభం లేదని .. ఇద్దరం ఊళ్ళోంచి పారిపోదామనుకుని , ఆ రాత్రి రైల్వే స్టేషన్ కి వచ్చేయమని చెప్పేను .. నేను బయల్దేరదామనుకుంటే .. మా అమ్మ నూతి గట్టు మీద కూచుని .. ‘నన్ను నూతిలోకి తోసేసి .. నీ దారి నువ్వు చూసుకో నాయనా ‘ అంది . ఇంక నేను ఆ స్టేషన్ కి వెళ్ళలేదు .. ఆ నిర్మల ఎంత బాధపడుంటుందో ఏమిటో . ఆ తర్వాత ఇద్దరం ఎప్పుడూ మాట్లాడుకోలేదు .. కలుసుకోలేదు .. ఇప్పుడు తను ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు .. కానీ తనకి ఆ రోజు మాట ఇచ్చి మోసం చేసేననే బాధ మటుకు నన్ను లోపల తినేస్తూంది .. అవకాశం ఉంటే .. తనకి క్షమాపణ చెప్పుకోవాలనుకున్నాను .. కానీ నాకు ఆ యోగం ఉన్నట్టు లేదు ‘ అని రామ్మూర్తి గారంటే , కుసుమ గారు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయేరు .

‘ఈ విషయం నీకు చెప్పి బాధ పెట్టేను ‘ అని ఆయనంటే .. ‘నిజం చెప్పేరు .. అందుకు సంతోషించాలి గానీ బాధ ఎందుకు ?.. మీకు నయమయ్యాక .. ఆవిడెక్కడుందో కనుక్కుందాం .. ‘ అని కుసుమ గారంటే , రామ్మూర్తి గారు తృప్తిగా కళ్ళు మూసుకుని నిద్దరోయి , ఆ రాత్రే నిద్దర్లో వెళ్ళిపోయేరు .

దశదిన కర్మలూ అవీ అయ్యాక , కొడుకు వెంకటేశ్వర్లుని పిలిచిన కుసుమగారు , విషయం చెప్పి .. ‘ఆ నిర్మల ఎక్కడుందో కనుక్కోవాలి .. వీలైతే మీ నాన్నగారి తరఫున క్షమాపణలు చెప్పుకోవాలి ‘ అని అనేసరికి , ఆశ్చర్యంగా తల్లిని చూస్తూండిపోయిన వెంకటేశ్వర్లు , ‘ఈ డిజిటల్ యుగంలో కనుక్కోవడం పెద్ద కష్టం కాదమ్మా ‘ అనేసి వెళ్ళిపోయేడు .

ఆ రాత్రంతా ఇంటర్నెట్లో అవీ ఇవీ వెతికేసిన వెంకటేశ్వర్లు మర్నాడు ఉదయానికల్లా తల్లి దగ్గిరకెళ్ళి , ‘ఆ నిర్మల గారి వివరాలు కనుక్కున్నాను .. ఫేస్బుక్ లో ఉంది ఆవిడ.. భర్త పోయినట్టున్నారు ..మనకి దగ్గిర్లోనే .. రాజమండ్రిలో ఉంటూందావిడ .. పిల్లలకి కూడా పెళ్లిళ్లు అయిపోయినట్టున్నాయి ..ఫేస్బుక్ లో ఫోటోలు పెట్టిందావిడ ‘ అని చెప్పి , ఆవిడ ఫోటో చూపించబోతే , ‘వద్దులే .. వీలు చూసుకుని ఆవిణ్ణి కలిసి , మీ నాన్న గారి క్షమాపణ సంగతి చెప్పు ‘ అనేసి లోపలికి వెళ్లిపోయిందావిడ .

ఆ తరువాత మెల్లగా ఫేస్బుక్ ద్వారా ఆ నిర్మల గారితో పరిచయం పెంచుకున్న వెంకటేశ్వర్లు , రాజమండ్రి కి ఓ పని మీదొస్తున్నానని , వచ్చేటప్పుడు మా తోటలోవి అమృతపాణి అరటిపళ్ళు ఓ నాలుగత్తలు పట్టుకొస్తున్నానని చెబితే , సరే రమ్మందా నిర్మల గారు!

ఆ ఆదివారం పొద్దున్నే వాళ్ళ మండపేట నుంచి ఉదయాన్నే రాజమండ్రి బయల్దేరి వెళ్లిన వెంకటేశ్వర్లు ఆ మధ్యాన్నం నీరసం మొహం వేసుకుని ఇంటికొచ్చేడు .

‘ఏవైందని ..’ ఆతృతగా అడిగిన కుసుమగారితో చెప్పేడు ‘అప్పట్లో ఆవిడికి నాన్న కన్నా గొప్ప సంబంధం వచ్చిందట ..ఆ రోజు స్టేషన్ కి వెళ్లకపోతే నాన్న విషయం అర్ధం చేసుకుంటాడు అనుకుని , ఆవిడసలు స్టేషన్ కే వెళ్లలేదట ‘ అని వెంకటేశ్వర్లు చెబుతూంటే , గోడ మీదున్న రామ్మూర్తి ఫోటో వేపు జాలిగా చూసిందా కుసుమగారు ‘ అంటూ కధ ముగించేడు లోవరాజు !

‘ఇందులో గొప్ప లవ్వు స్టోరీ ఏముందీ ? ఆ నిర్మల గారేమీ రామ్మూర్తి గారిని ప్రేమించలేదు కదా ?’ అని నేనంటే .. ‘ఇద్దరూ కలిసి ప్రేమించుకుంటేనే గొప్ప లవ్వు స్టోరీ అవ్వాలా ఏమిటీ?.. నువ్వే ఆలోచించు ‘ అని బయల్దేరదీసేడు లోవరాజు !

2 thoughts on “కంభంపాటి కథలు – పొలమారిన జ్ఞాపకం

  1. చాలా బావుందండీ
    అమృతపాణి అరటిపళ్ళత్తం తిన్నంత తృప్తిగానూ ఉంది
    కంభంపాటి వారూ

  2. చాలా బాగుంది. ఆఖరిలో మీ మార్కు ట్విస్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *