March 29, 2024

చంద్రోదయం 2.

రచన: మన్నెం శారద

సారధి ఎలమంచిలి నుంచి ఎంప్లాయిమెంటు కార్డు రెన్యూయల్‌కి వచ్చేడు.
ఎంప్లాయిమెంటు ఎక్స్‌చేంజి సంతర్పన జరుగుతున్న ప్రదేశంలా వుంది. క్యూ కొల్లేటి చాంతాడులా వుంది. నిజానికి అక్కడ వుద్యోగాలు పంచి పెట్టడం లేదు. ఉద్యోగం రావడానికి యింకా అర్హతుందంటూ ఆశ పెడుతున్నారు. ఆ అర్హత కాపాడుకోడానికి దేశం నలుమూలలనుంచి యువతరం కదిలి వచ్చి కిటికీల దగ్గర పడిగాపులు పడుతున్నారు.
సారధి పేరు సాయంత్రం దాకా వచ్చేట్టు లేదు.
ఇంతలో ఆఫీసువారికి లంచ్ టైమైంది. కౌంటరు తలుపులు మూసుకున్నాయి.
జనం రెస్టారెంట్ల మీద పడ్డాడు.
సారధి చెయ్యి అప్రయత్నంగా జేబులో కెళ్ళింది.
చేతికి దొరికింది బయటకి తీసేడు.
తళతళలాడుతోన్న క్రొత్త పావలా.
అతని పెదవులపైన సన్నగా చిరునవ్వు కదిలింది.
సారధికి భరించలేనంత ఆకలిగా వుంది. కాని దానితో ఏం వస్తుంది? టీ నీళ్లయినా త్రాగాలని ఎదురుగా వున్న రెస్టారెంటులోకి దారితీసేడు
రెస్టారెంట్ రష్‌గా వుంది. అందరూ బిజీగా తింటున్నారు. సారధి బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తూ వెళ్ళి ఓ మూలగా వున్న కుర్చీలో పిలవని పేరంటానికి వెళ్ళినట్లు భయంగా కూర్చున్నాడు. అతని ముందు టేబుల్ దగ్గర అరడజనుమంది యువకులు కూర్చుని రకరకాల డిష్‌లు ఆర్డరిస్తున్నారు. తెచ్చినవి తెచ్చినట్లు హడావుడిగా తింటున్నారు. మళ్లీ ఆర్డరిస్తున్నారు.
ఆ వాసనలకి సారధి కడుపులో తిప్పుతోంది. బేరర్ విలాసంగా ట్రేలో దోసెలు తెచ్చి వాళ్ల ముందు పెట్టేడు. సారధి అతన్ని భయపడుతోన్నట్లు పిలిచి టీ ఖరీదు అడిగేడు. అలా అడుగుతోన్నప్పుడు అతనికి అకస్మాత్తుగా గుండాగిపోతే బాగుణ్ననిపించింది.
“యాభయి పైసలు” బేరర్ నిర్లక్ష్యంగ జవాబు చెప్పేడు.
అతనికి సారధి సంగతి అర్ధమయిపోయినట్లుంది.
సారధి చిన్నగా అడిగేడు. “పావలా కేమొస్తుంది?”
బేరర్ పకపకా నవ్వి పక్క టేబుల్ దగ్గరకెళ్ళేడు. ఆ విషయం వాళ్లకి జోక్‌లా చెప్పి నవ్వుతోన్నాడు.
అందరూ నవ్వుతూ యిటువైపే చూస్తున్నట్లనిపించి తల వంచేసుకున్నాడు.
మరో క్షణంలో సారధి టేబుల్ మీద ఘుమఘుమలాడే గులాబ్ జాం, దోసె వచ్చేయి.
సారధి అయోమయంగా చూసేడు బేరర్ వైపు.
“ఆ సార్ మీకు కావాల్సినవన్నీ యివ్వమన్నారు. బిల్లు చెల్లించేసేరు.” బేరర్ మాటలకి సారధి అటు చూసేడు.
ఖరీదైన గోల్డ్ రిం కళ్లద్దాలతో తనవైపే చూస్తున్నాడతను.
సారధి కళ్లలో నీళ్లు తిరిగేయి.
లేచి వెళ్లి అతనికి కృతజ్ఞతలు చెప్పుకొందామనుకున్నాడు. కానీ నోరు పెగలలేదు.
తను లేచేలోగానే అతను అతను స్నేహితులతో కలిసి వెళ్లపోయేడు. సారధి ఆత్రంగా తినబోయేడు. ఆకలితో అలమటించి, నీళ్లతో నిద్రపోయిన పేగులు ఒక్కసారి అంత ఆహారాన్ని తీసుకోవటానికి నిరాకరించేయి.
కడుపులో తిప్పింది…
సారథి తినలేక చెయ్యి కడుక్కుని బయటకి నడిచేడు.
*****
చీకటి తెరలు అలుముకొంటున్నాయి.
సారధి రైల్వే ట్రాక్ పక్కన కూర్చున్నాడు. అతని కళ్లు ఎర్రగా జ్యోతుల్లా వున్నయి. అతని వంట్లో నరాలు ఏదో నిర్ణయానికొచ్చినట్లు బిగుసుకుంటున్నయై.
“ఈ మద్రాసు ఎక్స్‌ప్రెస్ ఎప్పుడూ యింతే. అనుకున్న టైముకి రాదు” అతను విసుక్కున్నాడు.
అతనికి భయంగా వుంది. ఆలస్యమైతే తన నిర్ణయం మారిపోతుందేమోనని. పోనీ అదిగాకపోతే మరో బండి రాకూదదూ. కనీసం గూడ్స్యైనా. ఏదయితే తనకేమిటి?
దూరంగా ట్రెయిన్ వస్తోన్న చప్పుడు.
సారధి లేచి నిలబడ్డాడు. అతని ముఖం విచిత్రంగా వుంది. రైలు దగ్గరవుతోన్నకొద్దీ అతని ముఖం వింతంగా మారిపోతున్నది. ఒక్కసారిగా తెగింపుతో.. శరీరం నిలువుగా వణికిపోయింది. అకస్మాత్తుగా ట్రాక్ మీద అడ్డంగా బోర్లా పడుకున్నాడు. రైలు ధనధనమని గుండెలదిరే శబ్దంతో వస్తోంది. దగ్గరవుతోన్న రైలు శబ్దం భరించలేనట్టు అతను చెవులు మూసుకున్నాడు.
క్షణం… మరో క్షణం.. ఆతని శరీరం ట్రాక్ మీదనుండి ఎగిరి పక్కకి పడింది.
రైలు ధనధనలాడుతూ పరిగెత్తింది.
మరో నిమిషానికి రైలు దూరమయినట్లు సన్నని శబ్దానికి సారధికి స్పృహ వచ్చింది. కళ్లు తెరిచి చూసేడు. ఎదురుగా పేలవంగా మెరుస్తోన్న నక్షత్రాలతో ఆకాశం కంపించింది. సరధి ఆశ్చర్యపోయాడు.
తను చచ్చిపోలేదా? అకస్మాత్తుగా అతను వళ్లంతా తడిమి చూసుకున్నాడు. కాళ్లూ, చేతులూ యథాస్థానంలోనే వున్నాయి. పక్కనున్న తుప్పల్లో పడిపోవడం వల్ల వళ్లంతా కాస్త గీరుకుపోయింది.
నిజంగా తను రైలు క్రిందపడి చచ్చిపోవాలనుకున్నాడా?
ఎదురుగా వున్న రైల్వే ట్రాక్ నిజమని చెబుతోంది. మరి. మరి తనెందుకు చచ్చిపోలేదు?
సారధి చుట్టూ చూసేడు.
..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *