March 28, 2024

తప్పంటారా ?

రచన: డాక్టర్. కె. మీరాబాయి

సరోజ కథనం :-
బి ఎ ఆఖరి సంవత్సరంలో వున్న నేను, ఇంటర్మీడియేట్ తప్పి, ఆటో నడుపుకుంటున్న సందీప్ ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని కలలో కూడా వూహించలేదు.
అందుకేనేమో ప్రేమ గుడ్డిది అంటారు. మేము వుండే హౌసింగ్ బోర్డ్ కాలనీ కి నేను చదివే కాలేజీ చాల దూరం. నాకు మోపేడ్ నడపడం వచ్చినా మా నాన్నది బండి కొనివ్వలేని ఆర్థిక పరిస్థితి. నన్ను ఇంతవరకు చదివించడమే గొప్ప విషయం. అది కూడా పేదవాళ్ళకు ఇచ్చే స్కాలర్ షిప్ నాకు రావడం వలన ఎలాగో ఇంతవరకు చదువు సాగింది.
మా కాలేజీ మా ఇంటికి అయిదు మైళ్ళ దూరంలో స్టేషన్ రోడ్ లో వుంది. జూనియర్ కాలేజీ,, డిగ్రీ కాలేజీ రెండు ఒకే కాంపస్ లో వున్నాయి. ఒకప్పుడు కర్నూలు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా వున్నప్పుడు ఈ భవనం గవర్నర్ భవంతి ట. పొద్దున్న ఎనిమిది గంటల నుండి పన్నెండున్నర దాకా జూనియర్ కాలేజీ, పన్నెండున్నర నుండి సాయంత్రం అయిదున్నర దాకా డిగ్రీ, పిజి క్లాసులు.
పొద్దున్న పదకొండు గంటలకే అన్నం తినేసి, పుస్తకాలతో బయలుదేరాల్సిందే. మా కాలనీ నుండి బి కాంప్ దాక నడిచి అక్కడ ఎదో ఒక షేర్డ్ ఆటో లో వీలయినంత దూరం వెళ్ళడం, అక్కడినుండి మళ్ళి నడక. ఆయాస పడుతూ క్లాసుకు పరిగెత్తడం.
నేను బి ఏ రెండవ సంవత్సరం లో వున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ రోజు బి కేంప్ సెంటర్ లో నేను అలవాటుగా ఎక్కే ముసలాయన ఆటొ కనబడలేదు.
“ స్టేషన్ రోడ్ కేనా ? ఎక్కండి “ అంటూ పిలిచాడు ఒక ఆటో అబ్బాయి. ఒత్తైన జుత్తు, సన్నని మీసం, శుభ్రం గా వున్న బట్టలు – చూస్తే చదువుకునే విద్యార్థి లా వున్నాడు.
“ అ యమ్మ ముసలోళ్ళ బండి తప్ప ఎక్కదులే. ఆటో కుర్రాళ్ళకు ఆడపిల్లలను రేప్ చేయడమే పని అనుకునే రకం” వెకిలి గా నవ్వుతూ అన్నాడు ఇంకో ఆటొ బండి అతను.
“ ఇదిగో ఇట్లాంటి కూతలు కూస్తే రౌడిలనే అనుకుంటారు. “ అంటూ అమాట అన్నవాడిని ఒక తోపు తొసి, “ మీరు బండి ఎక్కండి “ అన్నాడు.అక్కడినుండి తప్పించుకుంటే చాలు అన్నట్టు గభాలున ఎక్కేసాను. ఆటోని సి కేంప్ లో ఆపి వేరేవాళ్ళను ఎక్కించుకుంటాడు అనుకున్నాను. కానీ ఎక్కడా ఆగకుండా కాలేజీ దారి పట్టాడు.
“ అదేంటి ఎవ్వరినీ ఎక్కించుకోలేదే? షేర్డ్ ఆటో అని ఎక్కాను “ అని సందేహంగా అన్నాను.
“ ఫరవాలేదు. మీరు అంతే ఇవ్వండి. క్లాస్ కు ఆలస్యం అవుతుందని ఆపలేదు. వెనక్కి వెళ్ళేటప్పుడు ఇంకో ఇద్దరిని ఎగస్ట్రాగా ఎక్కించుకుంటే సరిపోతుంది. “ మర్యాద గా అన్నాడు.
అలా పరిచయమయ్యాడు సందీప్.
ఆ రోజు సాయంత్రం కాలేజీ నుండి బయటకు వచ్చేసరికి నా కోసమే ఎదురు చూస్తున్నట్టు సందీప్ కనిపించాడు. తటపటాయిస్తూనే ఆటో ఎక్కాను. మరో నలుగురు అమ్మాయిలు సి కేంప్ వెళ్ళాలని ఎక్కారు.
అది మొదలు సందీప్ ఆటో లోనే వెళ్ళెదాన్ని. ఆఖరి స్టాప్ లో దిగేది నేనే. అందరూ దిగిపోయాక కబుర్లు చెప్పేవాడు.
ఒకరోజు బుధవార పేట లో అందరూ దిగిపోయాక “ఒక్క నిముషం “ అంటూ రమ హొటెల్ కు వెళ్ళి టిఫిన్ కట్టించుకు వచ్చాడు. “ అమ్మకు జ్వరం. వంట చెయ్యలేదు. మా ఇల్లు ఇక్కడే. “ అని పక్కనే వున్న సందులోకి పరిగెత్తుకు వెళ్ళి అయిదు నిముషాలలో ఖాళీ చేతులతో వచ్చాడు..
సరిగ్గా అతని ఇంటర్ పరీక్షల ముందు వాళ్ళ అమ్మ కు బి పి, సుగర్ ఎక్కువై పడిపోయిందట. వుండేది వాళ్ళిద్దరే. ఆమెను హాస్పిటల్ లో చేర్పించాల్సి వచ్చింది. పరీక్షలు రాసాడు గానీ గట్టెక్కలేకపొయాడు. అంతకు ముందు వాళ్ళ అమ్మ ఒక కేంటీన్ లో పనిచేసెది. ఇక పని చెయలెని స్థితి కావడం తో చదువుకు స్వస్థి చెప్పి ఆటొ నడపడం మొదలు పెట్టాడు. తన గురించి క్లుప్తంగా చెప్పాడు.
తల్లిని. ప్రేమించే వాడు స్త్రీలను గౌరవిస్తాడని ఎక్కడో చదివాను. చిన్న వయసులోనే బాధ్యత తెలుసుకున్నందుకు అతనిమీద గౌరవం కలిగింది. నా మీద కనబరచే శ్రద్ధ గమనించి అభిమానం మొలకెత్తింది. నా సలహా మీద అతను తప్పిన పరీక్ష రాసి పాస్ అవడం తొ ఇష్టం కలిగింది. నా చదువు పూర్తి అయ్యేనాటికి అది ప్రేమగా మారింది.
తరువాత మామూలే. అమ్మ, నాన్న నన్ను కట్టడి చేయడం, నేను ఇంట్లో నుండి వచ్చేసి అతన్ని గుడిలో పెళ్ళి చేసుకోవడం, అమ్మా వాళ్ళు కర్నూలు వదిలి వెళ్ళిపోవడం. జరిగాయి.

అదే ఏడాది సందీప్ అమ్మ గుండెపోటుతో పోయింది. మేము వెంకట రమణ కాలనీలో చిన్న ఇంటికి మారాము. ఒక కంప్యూటర్ సెంటర్లో మూడువేల జీతానికి వుద్యోగంలో చేరాను. సందీప్ కి నచ్చచెప్పీ బి ఏ దూర విద్యలో చేయించాను. ఇంట్లోనే ముందుగదిలో సాయంత్రం వేళ గాజులు, చీరల ఫాల్స్, బొట్లు గోళ్ళ రంగులు వంటివి అమ్మకానికి పెట్టాను. అమ్మకాలు పెరగడంతో, బ్యుటీషియన్ కోర్స్ చేసి, పుట్టింటి నుండి నాకు వచ్చిన ఒకే ఒక నగ, ఒంటిపేట బంగారు దండ అమ్మి, కాస్త రద్దీ వుండే చోట షాపు అద్దె కు తీసుకుని గాజుల అంగడి, బ్యూటీ పార్లర్ మొదలుపెట్టాను.
పెళ్ళి అయిన రెండేళ్ళలో మా జీవితాలను సఫలం చేస్తూ కవల పిల్లలు శ్రావణి, శర్వాణి కలిగారు.
సందీప్ ని టీచర్ ట్రైనింగ్ చేయమని ప్రోత్సహించాను. ఆ సమయంలో ఇంటి బాధ్యత, షాఫులో పని, పిల్లల ఆలన పాలన ఒంటిచేత్తో ఎలా ఈదానో భగవంతుడికే తెలుసు. బి ఈ డి డిగ్రీ వచ్చాక, సందీప్ పోటీ పరీక్ష రాసి, ఎంపికయ్యాడు. దగ్గరే వున్న పల్లెలో చిన్న స్కూల్ లో వుద్యోగం వచ్చింది. ఆటో డ్రైవర్ నుండి ప్రభుత్వ పాఠశాలలో టీచరుగా ఎదిగిన అతన్ని చూసి గర్వపడేదాన్ని. “ఇదంతా నీ సాహచర్యం వలననే సాధ్యమైంది “ అన్నాడు సందీప్ చమరించిన కన్నులతొ.
గడిచిన ఈ పద్ధెనిమిది ఏళ్ళలో సందీప్ చేయి పట్టుకుని ఇల్లు వదలి వచ్చినందుకు ఎప్పుడూ పశ్చాత్తాప పడవలసిన అవసరం రాలేదు
జీవితంలో ఒకే ధ్యేయం, ఒకే లక్ష్యంగా అడుగులు వేసాము. పిల్లలు ఏ కొరత లేకుండా పెరగాలి. మమ్మల్ని కాదనుకున్న మా అమ్మా, నాన్న గర్వపడాలి. వాళ్ళ అద్రుష్టమో, మా శ్రమ ఫలితమో మా షాపులో దొరకని సౌందర్య సాధనం లేదనీ,. అలాగే బ్యూటీ పార్లర్ లో చక్కని సర్విస్ అందిస్తున్నామనీ మంచి పేరు తెచ్చుకున్నాను. ఎప్పుడూ రద్దీగా వుంటూ ఆదాయం గురించి చింత లేకుండ పోయింది. శ్రావణి, శర్వాణి చక్కగా చదువు కుంటున్నారు.
పగటి పూట షాపులో అమ్మకాలు చూసుకోవడానికి షాపులో ఇద్దరు కుర్రాళ్ళని పెట్టాడు సందీప్. నాకు ఒక మధ్య వయస్కురాలు సహాయకురాలుగా వుంది. మరో సహాయకురాలిగా చలాకీగా వుండే పడుచుపిల్లని పెట్టుకుంటే బావుంటుందని అనిపించి ప్రకటన ఇచ్చాను. ఆది చూసి వచ్చిన ఆరు మందిలో అందంగా, చలాకీగా వున్న కోమలను ఎంపిక చేసుకున్నప్పుడు ఈ నిర్ణయం నా జీవితాన్ని అతలాకుతలం చేస్తుందని అనుకోలేదు నేను.

సందీప్ కథనం:-
సరోజను చూసిన మొదటి రోజే ఆమె అంటె ఇష్టం కలిగింది. అయితే అంత చదువుకున్న అమ్మాయి నన్ను ప్రేమించాలనుకోవడం అత్యాశ అని నా మనసును బుజ్జగించే వాడిని. ఆమె ప్రేమను గెలుచుకున్న రోజు ప్రపంచాన్ని జయించాను అని మురిసి పోయా. ఆమె నా చేయి అందుకున్నాక జీవితమంటే వెన్నెలలో పడవ పడవ ప్రయాణం కాదనీ, అంతులేని పోరాటమనీ అర్థమయ్యింది. జీవితంలో నిలద్రొక్కుకోవడానికి, ఆర్థికంగా స్థిర్త పడడానికి, సమాజంలో గౌరవ ప్రదమైన స్థానం పొందడానికి, మా ఇద్దరు చిన్నారులకు ఏ లోటు లేకుండా పెంచడానికి, ప్రతి పైసాను ఆలోచించి ఖర్చుపెడుతూ, పేదరికంతో పోరాడడానికే మా జీవితంలో మొదటి పది సంవత్సరాలు గడిచి పొయాయి.
జంటగా బాధ్యతలను మోయడంలో, బరువును పంచుకోవడంలో,గూడు నిర్మించుకోవడంలో సాగింది మా అనుబంధం.
జరీ చీర కట్టుకుని, మల్లె పూలు పెట్టుకుని, మంచి గంధం వాసనతో సరోజ నన్ను చేరిన రాత్రులు నా అనుభవంలోకి రాలేదు. కట్టవలసిన పిల్లల బడి జీతాలు, చెల్లు బెట్టవలసిన బాకీలు, ఇవే మా ఇద్దరి మధ్యన మాటలు.
కోమల రాకతో అంతవరకు నాలో దాగి వున్న అసంత్రుప్తి నిద్ర లేచింది. రెడు పదుల వయసులో మిస మిస లాడె యౌవ్వనంలో వున్న కోమలి బిగుతైన చుడిదార్లలో, వయ్యారంగా నా ముందు తిరుగుతుంటె నలభై ఏళ్ళ వయసులో నాలో కొత్త కోరికలు తల ఎత్తాయి.
కాకతాళియమో, కావాలని నన్ను రెచ్చగొట్టడమో నన్ను రాచుకుంటూ పోయి సారీ అనేది.
శర్వాణిని, శ్రావణిని పదవ తరగతి పరీక్షలకు చదివించడంలో తలమునుకలగా వున్న సరోజ షాపుని నామీద వదిలేసింది. దగ్గరే వున్న ఐస్ క్రీం పార్లర్ నుండి హొటెల్ ఫామిలీ గదులలో కబుర్ల వరకు సాగిన మా చనువు, నా స్నేహితుడు వూళ్ళో లేనప్పుడు అతని ఇంటిలో మేమిద్దరం ఒకటి కావడం దాకా వచ్చింది.
చాటుమాటు గా సాగుతుందనుకున్న మా వ్యవహారం కోమలి తనని పెళ్ళి
చేసుకోవడం తప్పనిసరి అయ్యేట్టు చేస్తుందని, సరోజకు అన్యాయం చేయవలసి వస్తుందనీ నేను వూహించ లేదు.

కోమలి కథనం:-
అమ్మ నాలుగు ఇళ్ళలో అంట్ల గిన్నెలు తోమి నాలుగు రాళ్ళు తెస్తే నాన్న ఆ డబ్బుతో తాగి అమ్మని చావగొడతాడు. ఏ రోజూ ఇంట్లో కడుపునిండా తిండి వుండేది కాదు. నన్ను కూడా చదువు మానిపించి పనిలో పెట్టమంటాడు నాన్న. నాన్నతో కొట్లాడి అమ్మ నన్ను పది దాకా చదువుకోనిచ్చింది. అమ్మ పని చేసే ఇళ్ళ లోని అమ్మగారిలా నేనూ మంచి చీరలు కట్టుకుని, కారులో తిరగాలని ఎన్నో కలలు కన్నాను.
సరోజ మేడం నాకు వాళ్ళ బ్యూటీ పార్లర్లో పని ఇచ్చినప్పుడు ఆమె దేవత అనిపించింది. అంత డబ్బు వుండీ ఆమె సాదా చీరలే కడుతుంది. అందంగా తయారవ్వాలని అస్సలు అనుకోదు. తన వద్ద పని చేసేవాళ్ళ దగ్గర చాలా ఖచ్చితంగా వుంటుంది. సందీప్ గారితొ కూడా ఆమె సరదాగా మాట్లాడడం నేను చూడలేదు.
సందీప్ గారు చక్కగా తయారవుతారు. బాగా మాట్లాడుతారు. ఆయనకు నేనంటే ఇష్టం అనిపించింది. కావాలని తాకుతూ వెడితే ఏమీ అనేవారు కాదు. నా అందం మెచ్చుకున్నట్టు చూసేవారు. ఇంకాస్త చనువుగా మసలితే ఆయన నాకు స్వంతం అవుతారనిపించింది. అతను నా వాడయితే దర్జాగా బ్రతకవచ్చు ఆన్న ఆశతో నేనే మరింత దగ్గర అయ్యాను. సరోజ గారు కూతుళ్ళ చదువు విషయంగా తీరిక లేకుండా షాపుకు రాకపోవడంతో నా పని సులువయ్యింది.
నేను కోరుకున్న జీవితం పొందడానికి ఇదే సులభమైన మార్గం అనిపించింది. సందీప్ గారిని మోహంలో ముంచి నావాడిని చేసుకోడానికి ప్రయత్నించాను. ఆయన కోరిక తీర్చి నా చుట్టు తిప్పుకున్నాను. సందీప్ గారు నానుండి దూరం కాలేని పరిస్థితి కల్పించడానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు.
నాకు మూడో నెల నిండిందని చెప్పినప్పుడు సందీప్ అదిరి పోయాడు. ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తామన్నారు. అబార్షన్ చేయించుకొమని బ్రతిమలాడారు. డాక్టర్ నా ప్రాణానికే ముప్పు అన్నదని, పెళ్ళి చేసుకోక పోతే చచ్చిపోతాననీ కన్నీళ్ళు పెట్టుకున్నాను. అతన్ని వీధిలోకి ఈడ్చి పంచాయితీ పెడతానని బెదిరించాను. తప్పని పరిస్థితి లో సందీప్ నాకు తాళి కట్టాడు. అయితే సరోజ మేడం ఇంత పని చేస్తుందని నేను అస్సలు వూహించలేదు.

శ్రావణి, శర్వాణి కథనం :-
వున్నట్టుండి ఒక రోజు నాన్న కోమలను వెంటబెట్టుకుని ఇంటికి వచ్చారు. ఇద్దరి మెడలో పూలహారాలున్నాయి. “ నేను కోమలను పెళ్ళి చేసుకున్నాను. ఈ రోజు నుండి తను మనింట్లోనే వుంటుంది. “ అని అమ్మతో చెప్పారు. అమ్మ షాక్ తిన్నట్టు అలా నిలబడిపోయిందీ. ఇదేమి అన్యాయమని నాన్నని నిలదీయలేదు. ఆరిచి గోలచేసి పోట్లాడ లేదు. పాలిపోయిన ముఖంతో బొమ్మలా నిలబడిన ఆమ్మను చూసి భయం వేసింది మాకు.
మా కుటుంబం ఈరోజు ఈ స్థితిలో వుండడానికి అమ్మ ఎంత శ్రమించిందో, తనకు అంటూ ఒక సరదా, సంతోషం అనుకోకుండా పాటుబడుతుందో అర్థమవుతున్న వయసు మాది.
మా కన్నా నాలుగేళ్ళు పెద్దదేమో కోమల. తనని ఎంతో ప్రేమించే అమ్మను అన్యాయం చేసి ఈ పెళ్ళి చేసుకోవాలి ఆన్న పాడు బుద్ధి నాన్న కు ఎందుకు పుట్టింది? నాన్న కోమలను తన గదిలోకి తీసుకెళ్ళి తలుపు వేసుకున్నారు. అమ్మ ఏమయిపోతుందో అన్న బెంగతో అమ్మ ఒడిలో తలపెట్టి పడుకున్నాము.
తరువాత అమ్మ నాన్నతో మాట్లాడలేదు. లాయరు గారితో చెప్పించింది. మా షాపు, బ్యూటీ పార్లర్, ఇల్లు మా ముగ్గురికి వదిలేసి విడాకులు ఇవ్వకపోతే కేసు పెడతాననీ, నాన్న కష్టపడి సంపాదించుకున్న ప్రభుత్వ ఉద్యోగం పోవడమే కాక జైలుకి పోవలసివస్తుందనీ.
అమ్మ ఇంతకి తెగిస్తుందని నాన్న వూహించలేదేమో. అమ్మ ముఖంలోకి చూసే ధైర్యం లేనట్టు తల వంచుకున్నారు. విజయ గర్వంతో ఇంట్లో అడుగు పెట్టిన కోమల చిన్నబోయిన ముఖంతో నాన్న వెంట బయటకు నడిచింది.
ఇప్పుడు మా ఇంట్లో మేము ముగ్గురం వుంటున్నాము. నాన్న కోమలతో సహా తను పనిచేస్తున్న స్కూలు వున్న పల్లెకు వెళ్ళిపోయారు. అమ్మ మా ఇద్దరినీ టవున్ జూనియర్ కాలేజీలో చేర్పించింది. మాకు అమ్మను చూస్తే గర్వంగా వుంది. నాన్న చేసిన మోసానికి అమ్మ క్రుంగిపోయి మంచం పట్టలేదు.ధైర్యంగా మాకు కొండంత అండగా నిలబడింది. అమ్మ నాన్న నుండి విడిపోవడం మాకు అవమానంగా అనిపించడం లేదు. “నాకు, నా పిల్లలకు అన్యాయం చేయవద్దు అని నాన్నతో సర్దుకుపోయి, ఆ కోమలను సవతిగా అంగీకరించి వుంటే అమ్మను ఇంత గౌరవించే వాళ్ళము కాదేమో!
ఆడది అంటే అబల కాదు, ఆదిశక్తి అనినిరూపించిన అమ్మ నిర్ణయం ఆదర్శప్రాయంగా అనిపిస్తోంది మా ఇద్దరికీ. తన ఆత్మ గౌరవం కాపాడుకోవడానికి అభిమానవతి అయిన అమ్మ తీసుకున్న నిర్ణయం తప్పంటారా ?

————. ————- ———— ————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *