May 19, 2024

తేనెలొలికే తెలుగు

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

ఏదైనా ఒక భాష రావాలంటే కేవలం వస్తువుల పేర్లో స్థలాల పేర్లో తెలిస్తే సరిపోదు. పేర్లనేవి కేవలం నామవాచకాల కిందికి వస్తాయి. పదాలు వాక్యరూపమయినప్పుడే మనం ఎదుటి వారికి మనం చెప్పదలచుకున్న విషయం చేరవేయగలం. సర్వసాధారణంగా వాక్యంలో కర్త కర్మ క్రియ అనేవి ఉంటాయి. ఉదాహరణ అందరు చెప్పే ప్రసిద్ధ వాక్యమే నేనూ చెప్తాను. రాముడు రావణుని చంపెను. ఇది అందరికీ బాగా తెలిసిన వాక్యం. ఇందులో రాముడు కర్త అనీ, రావణుడు కర్మ అనీ, చంపుట క్రియ అనీ చెప్తాము. మరి రాసేప్పుడు
రాముడు రావణుడు చంపుట అని రాస్తామా?
కేవలం కర్త, కర్మ, క్రియ సరిపోవు. రాముడు రావణు’ని’ చంపెను.
ఈ వాక్యం మాతృభాషలో చదివే వారికి ఏ మాత్రం కూడా అవగాహనలో కష్టమనిపించదు. ఎందుకంటే మనం చిన్న తనం నుంచే వింటూ వస్తున్నాం .
వాడు బంతితో ఆడుతున్నాడు
ఆమె నీళ్లకై వెళ్లుతున్నది
వారు కరోనా వలన బాధపడుతున్నారు
ఈ వాక్యాలు మాతృభాష తెలుగు కావడమో , తెలుగు మాట్లాడే ప్రాంతంలో నివసించే వారు అయినప్పుడు మాత్రమే సులభంగా తప్పులు లేకుండా అనగలరు. ఇందులో బంతి తో, నీళ్ల కై, కరోనా వలన ఇవి విభక్తులని తెలుగు బోధించే ఉపాధ్యాయుడు చెప్పే దాకా మనకు తెలియవు. ఏ మాత్రం చదువు రాని వారైనా విభక్తులనువారు నివసించే ప్రాంతంలో మాట్లాడే భాషలో అది తెలుగైనా, తమిళమైనా, కన్నడమైనా అవలీలగా ఉపయోగిస్తారు. కానీ తెలియని భాషకు వచ్చేసరికి అది ఎంత కష్టమో వచ్చీ రాని భాషలో మాట్లాడే అన్య భాషీయులను చూస్తే తెలుస్తుంది. మీదీ అమ్మా మాదీ ఇల్లు వచ్చింది అని పాపం ఏ ముస్లిం మహిళో మాట్లాడితే మనకు నవ్వు రావడం సహజం. ఇక అసలు విషయానికి వస్తే తెలుగు భాషకు 5 భాషాభాగలున్నాయని, అవి
1 నామవాచకము
2 సర్వనామమము
3 క్రియ
4 విశేషణము
5 అవ్యయము
ఇవి కాకుండా విభక్తి ప్రత్యయాలు అని ప్రత్యేకంగా చెప్పబడుతాయి. విభక్తుల ఉపయోగం బాగా తెలిసినప్పుడే భాషమీద అధికారం వస్తుంది. ఇది ఆంగ్లభాషలో మరీ ముఖ్యం. అయితే తెలుగు భాషకు అనేక సంస్కృత పదాలు దిగుమతి అయ్యాయి. అప్పుడు ప్రత్యేకమైన విభక్తుల అవసరం ఏర్పడింది.
రామః అనే శబ్దం తెలుగులో డు అనే ప్రత్యయం చేరి రాముడు అయ్యింది. అలాగే పుస్తకః -పుస్తకము, తరుః-తరువు, బహువచనాలకు పదాంతంలో లు ఉదా:-వస్తువులు, పుస్తకములు
ఇవి ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠీ, సప్తమి, సంబోధనా ప్రథమా అని ఎనిమిది విధాలు గా ఉండటం తెలుగుభాష బడిలో నేర్చుకున్న వారికి కొత్తేమీ కాదు.
అయినా ఆ పట్టిక ఒకసారి ఇక్కడ చూద్దాం

అవి:

ప్రత్యయాలు విభక్తి పేరు
డు, ము, వు, లు -ప్రథమా విభక్తి
నిన్, నున్, లన్, గూర్చి, గురించి -ద్వితీయా విభక్తి.
చేతన్, చేన్, తోడన్, తోన్ -తృతీయా విభక్తి
కొఱకున్ (కొరకు), కై -చతుర్ధీ విభక్తి
వలనన్, కంటెన్, పట్టి -పంచమీ విభక్తి
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ -షష్ఠీ విభక్తి.
అందున్, నన్ -సప్తమీ విభక్తి
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ -సంబోధన ప్రథమా విభక్తి

ఇక్కడ నా ఉద్దేశం కేవలం విభత్తులను పరిచయం చేయడం కాకుండా విభక్తులను ఉపయోగించి తెలుగులో ఉదాహరణమనే ప్రక్రియతో కొంతమంది కవులు భాషకు వన్నె తెచ్చారని చెప్పడమే. తొలుత పాలకురికి సోమన బసవోదాహరణాన్ని రచించినట్లుగా మన పరిశోధకులు తేల్చి చెప్పారు.
ఉదాహరణమనే ప్రక్రియలో కొన్ని నియమాలున్నవి.
ముందుగా ఒక్కో విభక్తి పదాలతో ఒక్కో పద్యం ఓ కళిక, ఓ ఉత్కళిక చివరలో సార్వవిభక్తికమనే అన్ని విభక్తులు కలిగిన పదాలతో పద్యం చెప్పటం. ఇది కూడా పాండిత్య ప్రకరషకు సంబంధించిన భాషాక్రీడ అని అనడం తప్పు కాదనుకుంటాను
అలాంటి ఉదాహరణ కావ్యం గురించి వచ్చే సంచికలో ముచ్చటించుకుందాం ఉదాహరణ ప్రక్రియ ఉదాహరణ పద్యాలతో సహా.

1 thought on “తేనెలొలికే తెలుగు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *