March 29, 2024

నాచారం నరసింహస్వామి గుడి

రచన: రమా శాండిల్య

ఇవాళ ఉదయం లేస్తూనే ఏదైనా గుడికెళ్లాలనే కోరిక కానీ పిల్లలకు బోలెడన్ని పనులు .ఇద్దరికి వారి వారి కుటుంబాలతో పనులు నాకేమో ఎప్పటినుండో ( దగ్గర దగ్గర 8 సంవత్సరాల నుండి ) నాచారం నరసింహస్వామి గుట్ట అని వినడమే కానీ వెళ్ళడానికి అవలేదు . ఇవాళ్టి మూడ్ ఎలా అయినా గుడికెళ్లాలనుంది, నాతో పాటు ఎప్పుడైనా అడిగితే గుడికొచ్చే పంజాబీ స్నేహితురాలు ఉంది, తనకు ఫోన్ చేసాను . వెంటనే వస్తానని ఒప్పుకుంది వెంటనే ఇంట్లోంచి 7.30 కి బయలు దేరాము .
తెలంగాణలో ఇంత మంచి గుళ్ళు ప్రాచుర్యంలోకి తేలేకపోవడం విచారించాల్సిన విషయం .


చుట్టూ పొలాలు, చిన్న వాగు , చిన్న గుట్టమీద తాయారమ్మా ఆండాళ్లమ్మలతో పాటుగా వెలసిన నరసింహస్వామి. చాలా బావుంది గుడి. గుడి పరిసరాలు కూడా ప్రశాంతంగా ఉంది.
అక్కడ చాలా కోతులున్నాయి , చేతుల్లో ఏమైనా వుంటే లాక్కుంటున్నాయి .
గుడి తెరచి వుండే సమయం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12.00 వరకు . 1.00 కు బ్రాహ్మణ భోజనం ఉంది, తినడానికి బయట ఏమి దొరకవు . హోటల్స్ లెవనుకుంటాను . కొబ్బరికాయ దుకాణాలు మాత్రం ఉన్నాయంతే . గుళ్లో పులిహోర, లడ్డుతో పాటు అక్కడ ముఖ్యంగా పండే మొక్కజొన్నల రవ్వతో చేసే ప్రసాదం చాలా బావుంది.

అక్కడ మిగతా ఉపాలయాలు సీత రామ లక్ష్మణుల గుడి, సత్యన్నారాయణ స్వామి గుడి , శివాలయం , దత్తాత్రయుడు, సాయిబాబా గుడి మాత్రం 85 లో కట్టారట .
ఇక్కడి గుడి మొత్తం ఒక గుహమీదనే కట్టారు . గుహలోంచి గిరిప్రదక్షిణ చాలా బావుంది .
కొండమీదే ఒక పక్కన ఉన్న మండపంలో సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నారు సామూహికంగా .

స్థల పురాణం
ఆ ప్రాంతమంతా హిరణ్యం అనే నది ప్రవహించే చోటు . ఆ నది వాగుగా, ఆ వాగు చిన్న చెలమగా రూపాంతరం చెందాయి. హిరణ్య కశ్యపుడిని చంపాకా నరసింహస్వామి ఉగ్రంగా అరుస్తుంటే అక్కడికి దూరంగా ఉన్న గుహలోంచి ప్రతి ధ్వని విన్పిస్తుంటే, ఇంకొక నరసింహమనుకొని అక్కడికి వచ్చి గుహలో తిరిగి అరుస్తుంటే లక్ష్మీ దేవి అమ్మవార్ల రూపంలో వచ్చి శాంత పరిచిందని, శాంతించిన స్వామి అక్కడే వెలిసాడని గుడిలోని పురోహితులు చెప్పిన పురాణం.

ఇక్కడి విశేష హారతి ప్రత్యేకం. ఎవరికైనా కోరిన కోరిక తీరితే వారు తలకు పగిడి పెట్టుకుని ఆ పగిడి మీద స్వామివారి విశేష హారతి ఎత్తుకుని మూడు ప్రదక్షిణలు చేస్తున్నారు . ఇలాటి హారతి నేను మొదటిసారి చూడడం .


ఈ గుడి హైద్రాబాద్ కి చాలా దగ్గరలో ఉంది. తూముకుంట గజ్వేల్ రోడ్ లొనే వుంది . వర్గల్ వరకు మనకు తెలుస్తుంది. అక్కడినుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది . మనకు అతి దగ్గరలో చూడదగ్గ గుడి ఇది. యాదగిరిగుట్ట కంటే పవిత్రంగా అందంగా ఉంది అని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *