May 25, 2024

సంధ్యాదీపం

రచన: లక్ష్మీ పద్మజ

‘‘ఒసేయ్‌ రంగీ ఆ కాగులో నీళ్ళుపోసి అంటించవే… అమ్మాయి వచ్చి స్నానం చేస్తుంది. ‘‘ఒరేయ్‌ కొండా వాకిళ్ళంతా శుభ్రంగా వూడ్పించు. అమెరికా నుండి వస్తున్న నా మనవరాలికి అంతా నీట్‌గా ఉండాలిరా. ఎన్నో ఏళ్ళ తర్వాత వస్తొంది నా తల్లి నన్ను వెతుక్కుంటూ. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను… మళ్ళీ ఇన్నాళ్లకు అదృష్టం కలిగింది. ఆ తర్వాత పై మేడ మీద గది శుభ్రం చేయించు అక్కడ ఏ.సి. అన్నీ పని చేస్తున్నయా లేదో చూడు’’ గుక్క తిప్పుకోకుండా పూరమాయిస్తోంది సీతమ్మ.
లంకంత ఇంట్లో వంటరి జీవితానికి ఏనాడో అవాటు పడిపోయింది సీతమ్మ. చిన్పప్పుడే భర్త మరణించడంతో ఒక్కగానొక్క కొడుకుని పెంచి పెద్ద చేసి డాక్టరుని చేసింది. అమెరికా పంపింది. ఉన్న ఒక్క కొడుకు, కోడలు , మనవరాలు వున్నారన్నమాటే గానీ ఏళ్లకు ఏళ్లు రారు సీతమ్మ దగ్గరికి. ఏదో పని వత్తిళ్లులే అని సరిపెట్టుకుంటుంది సీతమ్మ. కాలచక్రం అలాగే తిరిగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు తన మనవరాలికి దయ కలిగింది సంతోషం పట్టలేక పోతోంది సీతమ్మ.
‘‘ఏంటి అమ్మమ్మా అంత సంతోషంగా వున్నావు’’ అంటూ వచ్చాడు రవి పక్కింటివాడు. రవి తండ్రి, తన కొడుకు స్నేహితులు. సీతమ్మకు ఏ అవసరము వచ్చినా చూస్కునే కుటుంబం.
‘‘సంతోషమేరా మరి, నా మనుమరాలు అమెరికాలో డాక్టరు చదవి ఈ నాన్నమ్మని చూడటానికి వస్తోంది రా’’ అంది సీతమ్మ.
‘‘ఐతే నువ్విక బిజీ అన్నమాట. బై అయితే’’ అంటూ వెళ్ళిపోయాడు రవి.
వూళ్లో తనకు సంక్రమించిన పాతిక ఎకరా పొలం, రైసు మిల్లును చూస్కుంటూ సునాయసంగా ఒంటరి జీవితాన్ని వెళ్లదీస్తోంది సీతమ్మ
‘‘పాపం ఒంటరిది’’ అంటే ఎవరన్నా అస్సలు ఒప్పుకోదు సీతమ్మ. ‘‘నా భర్త నా గుండెల్లో వున్నారు. నా బిడ్డ దూరంగా వున్నా వాడి మనసంతా నాతోనే వుంటుంది. నా వ్యవసాయం, రైసుమిల్లు దైవంతో సమానం. నా పనే నాకు దైవం’’ అంటుంది సీతమ్మ. వూళ్లో వారికి ఏ కష్టమెచ్చినా నేనున్నానంటూ నిబడుతుంది. ఎంతటి సాయం చేయడానికైనా వెనకాడదు. నిత్యం మిల్లు పనుల్లో, వ్యవసాయంలో, వచ్చీపోయే వారితో బిజీ, బిజీ ఎప్పుడూ సీతమ్మ.
*****
వాకిట్లో కారాగింది. జీన్స్‌, కుర్తీ వేస్కుని, ఖరీదైన డైమండ్స్‌, దిద్దులు చెవులకి ధరించి, రేబాన్‌ కళ్లజోడు ధరించి, అలల్లాంటి జుట్టును వెనక్కి తోస్కుంటూ, చేతిలో హ్యాండ్‌బ్యాగ్‌ని పట్టుకొని దిగింది డాక్టర్‌ ప్రీతి సీతమ్మ మనవరాలు.
పసిమిఛాయతో మెరిసిపోతున్న ఆమెని చూసి చేష్టలుడిగిన రంగి సీతమ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది.
‘‘అమ్మాయికి దిష్టి తీయవే’’ ఆజ్ఞాపించింది సీతమ్మ. రంగిని చూసి చిన్నగా నవ్వింది ప్రీతి.
‘‘రామ్మా నా తల్లే ఎన్నాళ్లకు వచ్చావే, ఈ నానమ్మను ఇన్నాళ్లకు చూడాలనిపించిందా నీకు’’ అంటూ ముద్దులు కురిపిస్తోంది సీతమ్మ. ‘‘కూచోమ్మా ఎందుకు తల్లీ నించోవడం’’ అంటూ దగ్గరున్న కూర్చీలో కూచో బెట్టింది సీతమ్మ. ప్రీతి నానమ్మ భుజాన్ని పట్టుకుని, ‘‘అబ్బా ఏంటి నాన్నమ్మ నీ హడావుడీ, ఇక ఆపు పద లోపలికెల్దాం’’ అంటూ సీతమ్మని లోపలికి తీసుకొచ్చింది ప్రీతి.
*****
‘‘అమ్మా ప్రీతీ ఎక్కడున్నావే’’ మేడ మీద గదిలో వున్న ప్రీతి దగ్గరకు వచ్చింది సీతమ్మ. సీతమ్మ భర్త రంగనాధం ఫోటోవంక తదేకంగా చూస్తోంది ప్రీతి.
‘‘నానమ్మా తాతగారు అచ్చం నాన్నలాగే వున్నారు కదా’’ అంది ప్రీతి. ‘‘ఓసి పిచ్చిమొద్దూ మీ నాన్నే వాళ్ళ నాన్నగారిలాగా వున్నాడు’’ అంది సీతమ్మ. ఇద్దరూ నవ్వుకున్నారు.
‘‘ఏమ్మా రాత్రంతా నిద్ర పట్టిందా నీకు, కొత్తగా వుందా’’ మురిపెంగా అడిగింది సీతమ్మ.
‘‘ఓ చాలా హాయిగా నిద్రపోయాను నానమ్మ’’ అంది ప్రీతి, ‘‘అమ్మా, నాన్న ఎలా వున్నారు’’ అడిగింది సీతమ్మ. ‘‘ఎప్పుడూ బిజీ బిజీ నానమ్మా, ఇప్పుడు మనమిద్దరం మాట్లాడుకుంటున్నంత ఫ్రీగా ఉండరు. ఇద్దరిలో ఒకరు ఎప్పుడూ ఉండరు ఇంట్లో, ఎవరి పనులు వాళ్ళవి.. అంతే…’’ అంది ప్రీతి ‘‘నువ్వు అమెరికా నుండి వస్తున్నావని మన వూరి వాళ్లంతా చూడ్డానికి వస్తామన్నారు తల్లీ, ఇదిగో ఈ చీర కట్టుకుని క్రిందికి రా’’ అంది సీతమ్మ. ఇవిగో నగలు, పెట్టె అందించింది ప్రీతికి.
‘‘అలాగే నాన్నమ్మా’’ తీసుకుంది ప్రీతి.
ఆకుపచ్చరంగు పట్టుచీర జాకెట్టు ధరించి, నగలు పెట్టుకుని లక్ష్మీదేవిలా అలంకరించుకుని కిందికి వచ్చింది ప్రీతి. అప్పటికే గుంపులు గుంపులుగా జనం వచ్చి హాలంతా కూచున్నారు. సీతమ్మతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు.
ఇదిగోనర్రా నా మనవరాలు మన మాటల్లోనే వచ్చేసింది. డాక్టరు చదివింది….. అంటూ ప్రీతిని తీసుకెళ్ళి పేరుపేరునా పరిచయం చేసింది సీతమ్మ. అందరితో మాట్లాడి పంపించేటప్పటికి భోజనాలు సిద్దం చేసేసింది రంగి. కొసరి కొసరి వడ్డించింది సీతమ్మ ప్రీతికి… ప్రీతికి ఆశ్చర్యంగా అనిపించింది. నాన్నమ్మ ప్రేమని చూసి పోగొట్టుకున్నది ఏదో దొరికిందనిపించింది… మనసంతా నిండిపోయినట్లైంది.
‘‘పైన గదిలో మంచి గాలి వస్తుంది, హాయిగా పడుకోమ్మా’’. రంగి ఆ ఏర్పాట్లు చూడు అనటమే ఆలస్యం, పరుగు తీసింది రంగి. ప్రీతి నిద్రలేచేసరికి సాయంత్రం 5.30 అయిపోయింది.
మెట్లు దిగి కిందికి వచ్చింది. హాలంతా ఎవరెవరో కూచున్నారు. వారందరితో ఎంతో చాకచక్యంగా లెక్కలడుగుతూ, విషయాలు తెలుసుకుంటూ, ఏదో రాసుకుంటోంది సీతమ్మ.
‘‘ఎవరు రంగీ వాళ్ళంతా’’ అడిగింది ప్రీతి. పొలం పన్లు చేసేటోరు అమ్మా. అమ్మగార్ని అడక్కుండా ఏ పనీ చేయ్యరు. చుట్టుపక్క పల్లెటూళ్ళలో కూడా అమ్మగారి కన్నా తెలిసిన వ్యవసాయ దారుడు లేడమ్మా అంది మురిపెంగా రంగి.
యజమానురాలంటే దీనికెంత ప్రేమ అనుకుంది ప్రీతి అదే మాట రంగితో అంది. ‘‘అమ్మగారు మాకు దేవత… అమ్మగారి కోసం మా ప్రాణాడ్డేస్తాం అమ్మా’’ అంది రంగి, ఆశ్చర్యపోయింది ప్రీతి. సీతమ్మ పని మీద ఉండటంతో పాత ఫోటో ఆల్బం తెచ్చివ్వమంది ప్రీతి…. తీసుకొచ్చింది రంగి.
మొదటి ఫోటో సీతమ్మ భర్త రంగనాధంది కనపడింది. పొడుగ్గా, ఠీవిగా, దర్పంగా తలపాగా ధరించిన ఆయన ఫోటో ఎంతో బాగుంది. ప్రీతి మనసంతా నిండిపోయినట్లై అలాగే చూస్తుండి పోయింది.
*****
‘‘అమ్మా ప్రీతి భోజనం చేద్దామా’’ అంటూ సీతమ్మ పైకొచ్చింది. ‘‘ఆకలిగా లేదు నాన్నమ్మా కాసేపు కబుర్లు చెప్పుకుందాం రా అంది ప్రీతి.
‘‘ఏం కబుర్లే’’ అంటూ ప్రీతి జుట్టు విప్పి చిక్కు తీయసాగింది సీతమ్మ. ‘‘నాన్నమ్మా తాతయ్య ఎప్పుడు పోయారు?’’ అంది ప్రీతి, సీతమ్మ కళ్లలో నీళ్ళు తిరిగాయి. అయ్యయ్యో నాన్నమ్మ నేను బాధపెట్టానా సారీ ఖంగారు పడింది ప్రీతి. కాసేపు మౌనం వహించింది సీతమ్మ. నెమ్మదిగా చెప్పడం మొదలెట్టింది.
మీ తాతగారు నేను కలిసి ఉన్నది ఆరు సంవత్సరాలు మాత్రమే. ఆ ఆరేళ్లలో నాకు అరవై ఏళ్ళ అనుభవం ఇచ్చారు. తన గుర్తుగా మీ నాన్నను ఇచ్చారు. ఊళ్లో అందరికీ తలలో నాలుకలా మసిలేవారు. నాకు ఎన్నో విషయాలు చెప్పేవారు. ఎంతో ధైర్యం చెప్పేవారు. వైద్య సౌకర్యం లేని ఈ ఊళ్ళో ప్రజలకు తెలిసిన వైద్యం చేసేవారు. ఆఖరికి ఆయనకే జ్వరం వస్తే వైద్యం అందలేదు. ముందు మామూలు జ్వరమనే అనుకున్నాం. ఆయనే మందు వేసుకునేవారు. ఒక అర్ధరాత్రి ఆ జ్వరమే ఆయన ప్రాణాలు తీసింది’’ ఆగింది సీతమ్మ. ఎంతో బాధగా అయిపోయింది ప్రీతి.
‘‘మీ నాన్న మూడేళ్లవాణ్ణి తండ్రిలేని లోటు తెలియకుండా పెంచి పెద్ద చేసి, చదివించి పెద్ద డాక్టర్ని చేశాను. వ్యవసాయం చేసి నెగ్గుకొచ్చాను. పదిమందిలో శభాష్‌ అనిపించుకున్నాను. మీ అమ్మ కూడా తండ్రిలేని పిల్ల అవడంతో నా కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేశాను. మీ అమ్మమ్మ నా చిన్ననాటి స్నేహితురాలు. చదువంతా అయ్యాక అమెరికా వెడుతానని గొడవ చేశాడు. కాదనలేక పోయాను ఇద్దరూ వెళ్ళిపోయారు. అక్కడే నువ్వు పుట్టావని ఫోటోలు పంపారు. రోజూ నీ తాతయ్యది, మీ నాన్న ఫోటోలు చూస్కుంటూ ఆనందం వెతుక్కుంటూ ఏదో గడిపేస్తున్నాను. భూమాత మాత్రం నాకు అన్యాయం చెయ్యలేదు. నా జీవితం అయిపోయినా, మీ నాన్నని ఈ పొలాలు మాత్రం అమ్మొద్దని చెప్పు అంది సీతమ్మ.
ఈ ధైర్యం నీకెవరిచ్చారు నానమ్మా అంది ప్రీతి. మీ తాతయ్యేనమ్మా అంటూ నవ్వేసింది. ఆయన నా తోటే వుంటారు ఎప్పుడూ అంది సీతమ్మ. ‘‘నాన్నమ్మా మన పొలాన్నీ చూపిస్తావా రేపు’’ అంది ప్రీతి. ‘‘అంతకన్నానా భూమాతకు రుణపడి ఉన్నాం మనమంతా’’ ‘‘నువ్వు చూడక పోతే ఎలా రేప్పొద్దున వెళ్దాం’’, ఇక చాలు గానీ లేలే భోజనం చేద్దాం, ఆకలేస్తుంది నీకు మళ్ళీ అంటూ కిందకెళ్ళి పోయింది సీతమ్మ వెనకాలే ప్రీతి.
తెల్లారింది సీతమ్మ ప్రీతి స్నానాలు, కాఫీ, టిఫిన్లు ముగించుకుని కారెక్కి పొలాల వైపు బైల్దేరారు. అంతే అంతులేని సంతోషం ప్రీతి సొంతమయింది. కారు దిగుతూనే ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఆడవారు, మగవారు కారు చుట్టుముట్టారు. ప్రీతికి దిష్టితీసి, కొబ్బరి బోండాలు కొట్టిచ్చి ఏవేవో తినడానికి తెచ్చిచ్చారు. దూరంగా కుర్చీలో కూచుని చూస్తూ ఆనందిస్తోంది సీతమ్మ.
గుళ్లో పూజలు జరిపి అక్షింతలు వేసి ప్రసాదాలు పంచుకున్నారు. ఎంతో నచ్చింది ప్రీతికి, మనసుకి ఎంతో తేలికైనట్టుంది. మీరు డాక్టరంటగా మాకు మందు రాస్తారా అంటూ కొందరు గొడవ. అందరిలో గడిపి ఒంటి గంటవుతుండగా ఇంటికి చేరారు ఇద్దరూ. కాసేపు రెస్టు తీస్కొమ్మా సాయంత్రం పట్నం వెళ్దాం. నీకు నగలు కొనిస్తా అంది సీతమ్మ.
ఓ అలాగే నానమ్మా అంటూ సరదా పడింది ప్రీతి. మళ్ళీ రేపు శనివారం మీ నాన్న ఫోన్‌ చేస్తాడు. నీ ప్రయాణం గురించి మాట్లాడతాడు. నాకు ఖంగారు వస్తుంది. మళ్ళీ బోల్డన్ని తయారు చేసి పంపించాలి మీ నాన్నకి. ఈ రోజే వెళ్దాం…. మళ్ళీ కుదర్దు అంది సీతమ్మ.
*****
శనివారం రానే వచ్చింది అనుకున్నట్లుగానే అమెరికా నుండి ఫోన్‌ వచ్చింది. ‘‘మీ నాన్నే అయ్యుంటాడు. అలా మొద్దులాగా కూచుంటావేంటే అంటూ ఫోన్‌ తీసింది సీతమ్మ.
‘‘అమ్మా’’ అని వినపడగానే చీర చెంగుతో కళ్ళొత్తుకుంటూ మాట్లాడసాగింది సీతమ్మ. ప్రీతి లేచి ఫోన్‌ దగ్గరికి వచ్చి సీతమ్మను గమనించసాగింది. క్షేమసమాచారాలు అయ్యాక మనవరాలి ముచ్చట్లు మొదలెట్టింది. ‘‘ఇంకా ఒక నెల వుండి వస్తుంది లేరా’’ అర్ధింపుగా అడిగింది సీతమ్మ. ‘‘లేదమ్మా ఇక్కడ చాలా పనులు వున్నాయి. ఇంకో వారం ఆగి బైల్దేరమను చాలా చూసుకోవాలి. ఇక్కడ జాబ్‌లో చేరాలి దాని ఫ్రెండ్స్‌ అందరూ చేరిపోతున్నారు. ఇంకా వారం వుందిగా వచ్చే సంవత్సరం మళ్ళీ ముగ్గురం వస్తాము. దానికివ్వు ఫోను అన్నాడు.
‘‘ఊ.. అంటూ దు:ఖంతో గొంతు పూడుకుపోతుండగా ప్రీతికి అందించింది.’’
‘‘హాయ్‌ డాడీ’’ ఎలా వున్నారు. అంది ప్రీతి,
‘‘హాయ్‌ డియర్‌ నీ టికెట్టు కొని పంపిస్తాను. అన్నీ చూస్కుని స్టార్ట్‌ అయిపో, నేను మళ్ళీ రెండ్రోజుల్లో ఫోన్‌ చేస్తాను. బై నాన్నా’’ అన్నాడు.
‘‘డాడీ ఒక పదినిమిషాలు మీతో మాట్లాడాలి’’ అంది ప్రీతి. స్ధిరంగా చెప్పు అన్నాడు అవతల నుండి. ‘‘మీరనుకున్నట్లు నేను రావట్లేదు అమెరికా’’ అంది ప్రీతి.
‘‘వ్వాట్‌’’.. అన్నాడు
‘‘ఎస్‌ డాడీ మీరు విన్నది నిజమే,
‘‘ అంటే ఏంటి’’ అన్నాడు.
ఇందులో తెలియనిది ఏముంది మీకు.. మిమ్మల్ని తాతయ్య లేనిలోటు తెలియకుండా కష్టపడి పెంచి పెద్ద చేసిన నాన్నమ్మ గురించి మీరేనాడైనా ఆలోచించారా సూటిగా అడిగింది ప్రీతి.
‘‘అయితే’’ అన్నాడు.
నేను ఆలోచించాను డాడీ… ఇప్పటి వరకు సంపాదించింది చాలు. ఇక్కడ జీవితమంతా మీకోసం ఎదురు చూస్తున్నవారిని గుర్తించండి. ఇక అక్కడ జీవించింది చాలు. ఇప్పటికైనా ఇది మీ బాధ్యత అని నేను చెప్పనక్కర్లేదు. నాన్నమ్మకు మీరూ, తాతయ్య ఇచ్చిన ఒంటరితనం ఇక చాలు. ఇప్పటికైనా వచ్చేసి ఆమెకి అండగా ఉండడం మీ ధర్మం. మనమందరం ఉండగా నాన్నమ్మ ఒంటరిగా ఎందుకుండాలి, మీ ఆలోచనా విధానం మార్చి చూసుకోండి. ఇక్కడే నానమ్మ పేరు మీద హాస్పిటల్‌ కట్టి, ఈ ఊరివారికి సేవ చేద్దాం’’ అంది ప్రీతి.
“మీ మమ్మీ”….. నీళ్ళు నమిలాడు……
ఏమిటి మమ్మీ పెట్టే అడ్డంకులు, తను మాత్రం అమ్మమ్మని చూస్కోనక్కర్లేదా అది నాతో చెప్పించుకో నక్కర్లేదు. మనుషులకోసం డబ్బు… అది ఇప్పటికి చాలానే సంపాదించారు. ఇప్పటికైనా మిమ్మల్ని పెంచి, పెద్దచేసిన వారిని గుర్తు చేస్కోండి. మీకు ఇంతకంటే చెప్పేదేమీ లేదు. సో.. టిక్కెట్లు కొనుక్కొని సామాన్లు ప్యాక్‌ చేయించి మీరే వచ్చేయండి. పెట్టేస్తున్నానంటూ పెట్టేసింది ఫోను. వెనక్కి తిరిగింది ప్రీతి.
సీతమ్మ కన్నీరు ఆనంద భాష్పాలయ్యాయి.
మనవరాలిని హత్తుకు పోయింది.
రంగి సంబరంగా చప్పట్లు కొడుతోంది.
*****

14 thoughts on “సంధ్యాదీపం

  1. Shrimati Lakshmi padmaja is is known to us as a film playback singer and good stage singer at various places such as Sri Thyaagaraya gaana sabha etc., Her another talent as a writer is proved now hearty congratulations.

  2. We know smt Lakshmi Padmaja garu as a good singer. She is proved to be a good writer too. Multi talented. I wish her all the best.

  3. మీ కథతో మమ్మల్ని కాసేపు పల్లె ఒడిలోకి నెట్టేశారు.. అక్కడి వారి ప్రేమ అభిమానాలను మీరు వ్యక్తికరించిన తీరు తల్లి జోలపాట పాడుతూవుంటే ఉయ్యాలలో ఊగుతున్న బిడ్డకి కలిగే అనుభూతి ఎట్లా ఉంటుందో ఈ కధ చదువుతున్నంత సేపు మాకు అట్లాగే ఉంచింది… మామ్మ మనవరాళ్ల కారెక్టర్ లతో మంచి కథను అందించిన మీరు నిజంగా అభినందనియురాలు మేడం
    …..శ్రీపాద శ్రీనివాస్

  4. మీ కథతో మమ్మల్ని కాసేపు పల్లె ఒడిలోకి నెట్టేశారు.. అక్కడి వారి ప్రేమ అభిమానాలను మీరు వ్యక్తికరించిన తీరు తల్లి జోలపాట పాడుతూవుంటే ఉయ్యాలలో ఊగుతున్న బిడ్డకి కలిగే అనుభూతి ఎట్లా ఉంటుందో ఈ కధ చదువుతున్నంత సేపు మాకు అట్లాగే ఉంచింది… మామ్మ మనవరాళ్ల కారెక్టర్ లతో మంచి కథను అందించిన మీరు నిజంగా అభినందనియురాలు మేడం

  5. ఒక తరం పెద్ద వాళ్ళ గురించి ఆలోచించ కుండా సంపాదన అనుకున్నారు..తరువాత తరానికి డబ్బు ఇబ్బందులు తెలియవు..అందుకే ఇలాంటి మార్పు కోరుకుంటున్నారు..కధనం బాగుంది..చక్కటి వర్ణన తో బాగా రాసారు..

  6. వాస్తవానికి దగ్గరగా నేటి సమాజంలో వున్న తీరు తెన్నులకి సరిపడా వ్రాయడం లో లక్ష్మి పద్మజగారి శైలి అభినందనీయం ….ఏదో మార్పు తేవాలనే ప్రయత్నం హర్షించదగ్గ విషయం ….బాగుందండి మీ దృక్పధం ….అభినందనలతో ….మోహన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *