April 19, 2024

సహజ కథలు – మితం – హితం

రచన: శైలజ విస్సంశెట్టి

అనూహ్య ఆనంద్ అప్పటికి ఒక గంట నుంచి వాదించుకుంటూనే ఉన్నారు. ఎవరి ఆలోచన వారికే కరెక్ట్. ఎవరి వాదన వారికి సరైనదిగా తోచటం, ఇద్దరూ ఒక మాటమీదకి రావటం అనేది అసాధ్యంగా ఉంది. వీళ్ళు వాదించుకుంటున్న విషయం ఇవాళ్టిది కాదు. గత నెలరోజులుగా సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వాదనకు తెర లెగుస్తోంది. ఇంటిపని గురించో, ఆఫీస్ పనిగురించో, స్నేహితుల గురించో లేదా మీ అమ్మనాన్న ఇలాగా అంటే మీ అమ్మ నాన్న అలాగా అనే సర్వ సాధారణమైన అదే అందరి ఇళ్లల్లో జరిగే సాధారణ విషయాలపై కాదండి బాబు- వీళ్ళ వాదోపవాదనలు – మరి ఇంకేం విషయాలు ఉంటాయి గొడవపడటానికి అని ఆలోచిస్తున్నారు కదా… జీవితంలో అతి పెద్దది అయిన పిల్లల పెంపకం గురించే కదా మాకు తెలిసిపోయింది అని ఆనందపడుతూ ఉన్నారే మీ వరుస చూస్తుంటే. అవునండి వారి గురించే. మీ ఊహ నిజమే అయితే వీళ్ళు వాదించుకుంటున్నది చాకోలెట్ ల గురించి, హిమక్రీముల గురించి – అదేనండి ఐస్ క్రీములు.
ఇప్పుడు కూడా మీ ఊహాలోకంలోకి వచ్చిన ఆలోచనని చెప్పేయనా? నిజమే కదా పిల్లలకి చాక్లెట్లు, ఐసుక్రీమ్లు అవినాభావ సంబంధం ఉంటుంది అని మనకి తెలుసు. నెల రోజుల నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా అనూహ్య ఆనంద్ లాంటి చదువుకున్న యువ జంట ఆ విషయంగా అంతటి వాదోపవాదనలు చేసుకోవటం ఎంతవరకు సమంజసం అనుకుంటున్నారు కదా మీరు.
సాధారణంగా పిల్లలకు ఏ పరీక్ష పాస్ అయినపుడో, మంచి రాంక్ వచ్చినపుడో మనమే ఐస్ క్రీమ్ పార్టీ ఇస్తుంటాము. ఇకపోతే చాక్లెట్లు మన ఇంటికి వచ్చే స్నేహితులు, చుట్టాలు పిల్లలకోసం తెచ్చే చాక్లెట్లు తో మన ఫ్రిజ్ కళకళలాడుతూ ఉంటుంది. ఇంకా కొంచం ఆలోచిస్తే స్కూల్లో పుట్టినరోజు పండుగ అని తోటి పిల్లలు ఇచ్చే చాక్లెట్లు మనవాళ్ళు గుటుక్కుమనిపించటం ఉండనే వుంటుంది. ఇవన్నీ సరే అనూహ్య ఆనంద్ ల వాదన సంగతి వివరించకుండా ఏవోవో చెపుతున్నాను అనుకుంటున్నారు కదా.. అసలు విషయానికే వస్తున్నానండి బాబు.. వీళ్ళు ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీ లో స్విమ్మింగ్ పూల్, పిల్లలు ఆడుకోవటానికి చిన్న పార్క్, జిమ్ లాంటి సకల సదుపాయాలే కాక పుట్టినరోజులు, శ్రీమంతాలు, బారసాలలు, మొదలైనవి జరుపుకోవటానికి ఉచిత క్లబ్ హౌస్ కూడా ఉంది. సగటున ఆ క్లబ్ హౌస్ లోవారానికి ఒక పిల్ల లేక పిల్లవాడి పుట్టినరోజు పండుగ జరుగుతూ ఉంటుంది. దానికేముంది అక్కడ ఉండే పిల్లల సంఖ్యను బట్టి పుట్టినరోజులు, పండుగలు కూడా జరుపుకోవచ్చు అని అనుకుంటున్నారు కదా…
ఆ పుట్టినరోజు పండుగలకు కమ్యూనిటీ లో ఉన్న పిల్లలందరికీ పిలుపు వచ్చేస్తుంది. ఇక పిల్లల సరదాలు సంబరాలు చూడాలి. తల్లితండ్రులు కూడా తక్కువేమీకాదు ఒకరి పుట్టినరోజు కంటే ఇంకొకరి పుట్టినరోజు ఇంకా ఘనంగా జరపాలని, పిల్లలకు రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా గొప్పగా ఇవ్వాలని పోటీలు పడుతూ ఉంటారు. ఇదిగో ఈ పుట్టినరోజు పార్టీలు, రిటర్న్ గిఫ్ట్స్ దగ్గిరేనండి బాబు అనూహ్య ఆనంద్ లకు గత నెలరోజులుగా కోల్డ్ వార్ కాదు కాదు హాట్ వార్ కూడా జరుగుతోంది. ఇక నుంచి ఏ పుట్టినరోజు పార్టీలకు తమ పిల్లలు అభిరామ్, అక్షరలను పంపనని అనూహ్య వాదన. అలా పంపకపోతే పిల్లలకి సోషలైజేషన్ అదేనండి నలుగురిలో కలవటం చేతకాదు పార్టీలకు పంపాల్సిందేనని ఆనంద్ వాదన. ఈ వాదనలో అనూహ్య చెప్పే అంశాలు ఏమిటో తెలుసా మీకు? మీరు ఊహించగలరేమో చూద్దాము.
ఏంటి నన్నే చెప్పేయమంటారా! ఇదిగో ఇందాక చెప్పానే మీకు చాక్లెట్లు, ఐసుక్రీమ్లు అని. సరిగా వీటి గురించేనండి. పిల్లలకు పుట్టినరోజు సందర్బంగా కేక్, కూల్ డ్రింక్, చిప్స్, చాక్లెట్లు, ఐసుక్రీమ్లు, చీప్ ప్లాస్టిక్ వస్తువుల రిటర్న్ గిఫ్ట్స్ తో కూడిన పార్టీలు అవసరం లేదని అనూహ్య వాదన. ఇదివరకు కాలంలో మనం ముందు అనుకున్నట్లు పరీక్ష పాస్ అయిన లాంటి సందర్భాలలో మాత్రమే ఐసు క్రీములు పిల్లలకు ఇప్పించే వాళ్ళం. ఇప్పటి ఈ ఆహారాల్లో కల్తీలు పెరిగిన రోజులలో మన పిల్లలకి మనం వారానికి ఒకసారి అయినా అంటే చాలా తరచుగా పిల్లలకు అలాంటి ఆహారం అందించటం ఎంతవరకు న్యాయం. వారి ఆరోగ్యం ఎంతవరకు పాడవకుండా ఉంటుంది. తరచు డాక్టర్ల విజిట్లు, యాంటిబయాటిక్స్ వాడకం నివారించటానికి ఇలాంటి పార్టీలకు తమ పిల్లలు అభిరామ్ అక్షరలను పంపను అని అనూహ్య వాదన.

నలుగురిలో కలవటం, ఆడటం, పాడటం, పంచుకోవటం వంటి సామాజిక అంశాలలో పిల్లలు వెనుకబడి పోతారని ఆనంద్ వాదన. అదండీ సంగతీ. ఇంతేకాక నెలక్రితం సంక్రాంతి పండుగ సందర్భంగా అపార్టుమెంట్లో ఉంటున్న రావుగారి మనుమరాలికి భోగిపండ్లు పోసిన సందర్భంగా పిల్లలందరికీ పెద్దపెద్ద చాకోలెట్లు పంచటం దగ్గర మొదలైంది వీరి గొడవ. ఆ రోజు అనూహ్య తనని తాను నిభాయించుకోలేక రావుగారితో ‘అంకుల్ పండుగ సందర్భంగా పిల్లల చేతిలో పండు పెడితే బాగుండేది. ఇప్పటికే పిల్లలను చాకోలెట్ల బారి నుండి కాపాడటం కష్టంగా ఉంది’ అనటంతో దానికి ఆయన ‘మా ముచ్చట మాది అమ్మా మీ పిల్లలను చాక్లెట్ లు తినకుండా మీరు వారించుకోవాలి. అంతేకాక తల్లిగా అది నీ బాధ్యత’ అంటూ అందరి ముందు అనటంతో అక్కడ ఉన్న తన లాంటి మరికొందరు తల్లులు పరిహాసంగా నవ్వటం అనూహ్య జీర్ణించుకోలేకపోయింది.
అదిగో అప్పటి నుంచే నండి బాబు ఈ తగవులాట. అనూహ్య ఆనంద్ వాదనలతో అలిసిపోయారేమో ఇద్దరు ఎవరి ఆలోచనలలో వాళ్ళు ఉండగా ఆటలకు వెళ్లిన అభిరామ్, అక్షర పరుగెత్తుకుని ఇంట్లోకి వస్తూనే “అమ్మా అంకిత వాళ్ళ మమ్మీ నీతో మాట్లాడటానికి వచ్చారు అంటూ కాళ్ళు చేతులు కడుక్కోటానికి బాత్రూమ్ లో దూరి నేను ముందంటే నేను ముందని సందడి మొదలుపెట్టారు. వీరి వెనుకే ఇంట్లోకి అడుగు పెట్టిన అంకితను వాళ్ళ అమ్మ శ్రీలతను చూసి ఆనంద్ ఒక పలకరింపు నవ్వు నవ్వేసి లేచి లోపలి వెళ్ళిపోయాడు. అంకిత, వాళ్ళ అమ్మ శ్రీలత అనూహ్య వైపు తిరిగి ‘సారీ అనూహ్య ఒక తల్లిగా నువ్వు పిల్లల కోసం పడే తపనని సరిగా అర్థం చేసుకోలేక పోయాను. మా అంకిత తరచుగా దగ్గుతో భాధపడుతూ ఉంటే మందులు మార్చి మార్చి ఇచిన డాక్టర్ తన ఆహరం పట్ల శ్రద్ధ అవసారం అని చాకోలెట్లు, కూల్ డ్రింక్స్ మరియు ఐస్ క్రీముల విషయంలో, ఇతర నూనె పదార్ధాల విషయంలో జాగ్రత్త వహించమని చెప్పేదాకా నాకు నీ తాపత్రయం అర్థం కాలేదు’ అంది. ‘ఫరవాలేదు శ్రీలత, నా ప్రయత్నాన్ని మీరు ఒక్కరైనా అర్థం చేసుకున్నారు. మార్పు ఎప్పుడు ఒక్క అడుగుతోనే మొదలు అవుతుంది’ అని అనూహ్య అనడం బెడ్ రూములో ఉన్న ఆనందకి స్పష్టంగా వినిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *