March 28, 2024

ఇంతేలే ఈ జీవితం

రచన: వసంతశ్రీ

కావేరీ ఇంటి పనమ్మాయి వాళ్ళ స్వంత ఊరు వెళ్ళిపోతున్నాదట. అందుకని పని మానేసింది. కొత్త పనిమనిషిని పెట్టుకోవడం అంటే పని తర్ఫీదు ఇవ్వడం చాలా కష్టమైన పని అని ప్రతి ఆడవారికి తెలుసు.
కావేరీ పాత పనమ్మాయి లక్ష్మి పొందిగ్గా, నిదానంగా చేస్తూ ఉండడంతో సుఖంగానే ఇన్ని రోజులూ గడిచిపోయాయి.
తీరా సత్యవతిని పనిలో పెట్టుకున్నాక కథ మొదటికి వచ్చినట్లయింది.ఏ పల్లెటూరి నుంచి వచ్చిందో కానీ కొత్తగా సిటీలో అడుగుపెట్టిన సత్యవతికి బొత్తిగా ఫ్లాట్ ల గురించి కానీ, ఇంట్లో పని చేయడం గానీ అలవాటు లేదు అని మొదటి గంటలోనే అర్థమైపోయింది కావేరికి.
సింకులో మెతుకులు లేకుండా తియ్యాలని, kitchen వెనుక బాల్కనీ మోరీలో గిన్నెలు తోమడం మొదలు పెట్టమని వగైరా అన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి డిటర్జెంట్స్, హార్పిక్ వంటివన్నీ పెట్టే గూడు చూపించింది. సింక్ లో నుండి పట్టుకెళ్లి గిన్నెలు తోమడం మొదలు పెట్టమని చెప్పిన కావేరికి ఇంత సర్ఫ్ పొడి వేసుకొని పాత్రలు తోమడం మొదలు పెట్టిన సత్యవతిని చూసి నోరెళ్ళ బెట్టింది.
vim లిక్విడ్ నీళ్లలో ఎలా కలపాలో చూపించి గిన్నెలు తోమే విధానం నేర్పిస్తూ ..” ఇలా తోమాలి ఇలా కడగాలి, మళ్ళీ ఇంకొకసారి మంచి నీళ్ళ తో కడగాలి” అని చెప్ప సాగింది.
ఇల్లు తుడిచే పని చెప్పబోతే కాస్త నజ్జుగానే ఉంది ఆ పని కూడా. తర్వాత బట్టలు ఉతకడానికి బయలుదేరింది సత్యవతి.
“ముందు షర్టులు తడుపు, అక్కడున్న నీలం సబ్బుతో బట్టలకి సబ్బు రాయి” చెప్పింది కావేరి.
ఎందుకైనా మంచిది ఒక సారి చూద్దామని వెళితే.. విమ్ బార్ తో బట్టలకు సబ్బు పెడుతోంది. కూని రాగాలతో పాటని కూని చేస్తూ…పైపెచ్చు కావేరీ ని చూసి
“ఏంటమ్మా నురగ రావటం లేదు “అని కంప్లైంట్.
ఈ సత్యవతితో పనిచేయించుకోవడం అంటే పిచ్చి పట్టేలా ఉంది అనిపించింది కావేరీకి.
మర్నాడు ఆదివారం అందరూ పొద్దున్నే హడావిడిగా ఉండే సమయంలో ఫోనొచ్చింది. కావేరి అత్తగారికి ఒంట్లో బాలేదని మర్నాటి నుంచి పిల్లలకు పరీక్షలు ఉండటంతో పక్కింటి వాళ్ళకి పిల్లలని అప్పచెప్పి కావేరీ, భర్త అత్తగారి ఊరు చేరి, అదేరోజు సాయంత్రానికి ఆవిడని కార్లో తీసుకు వచ్చారు. ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయవచ్చని.
హాస్పిటల్ లో చూపించిన తర్వాత కావేరి అత్తగారు లలితమ్మగారు నెమ్మదిగా కోలుకోవటం మొదలు పెట్టారు.
పెద్దావిడ చూసుకోవడం, భర్త క్యాంపుల ఉద్యోగం, ఇటు పిల్లల పరీక్షలు వీటితోనే సతమతమవుతూ ఉంటే సత్యవతి చేత వాతా కానీ పనితో ఇంకా చికాకుగా ఉంది.
ఎంత హడావిడిలో ఉన్నా నో గడబిడ, సుతరామూ లేని వడివడి మన సత్యవతి తరహా.
అనుకున్నప్పుడు మరో పని మనిషి దొరకడం అంత సులువు కాకపోవడంతో పని నేర్పించుకుంటూ కొనసాగిస్తోంది కావేరి.
సత్యవతి భర్త దుబాయ్ వెళ్లాడని, తనకు పిల్లలు ఇంకా లేరని తెలియడంతో పొద్దున్నుంచి సాయంత్రం దాకా తనకు సహాయంగా ఉండిపొమ్మని చెప్పింది కావేరి. అయితే సత్యవతి పనితో తల ప్రాణం తోకకి రావడం అనేది కావేరీ విషయంలో నిజమైంది.
అత్తగారికి బాత్రూంలో వేడి నీళ్లు పెట్టమని చెప్పింది. ఈలోగా పిల్లల స్కూల్ కి టైం అయింది బాబు టై కనిపించకపోతే వెతికి, ఇచ్చి రమ్మని పంపింది. అప్పుడే కుక్కర్ విజిల్ వేసింది. కుక్కర్ ఆపమని ఒక కేక పెట్టింది కావేరి. తిరిగి చూస్తే అత్తగారికి వేడినీళ్లు ఇవ్వలేదు. వేరే పనికి వెళ్తే మొదట చెప్పిన పని మర్చిపోవడం సత్యవతి అలవాటు. మొబైల్ పట్టుకునో, టీవీ చూస్తూనో ఉండిపోతుంది.
కిచెన్ లో కాళ్ళు, చేత్తో కొట్టుకుంటుంటే సత్యవతి కూల్ కూల్ గా బాల్కనీ లో కూలబడి ఫోన్లో కబుర్లు చెప్తుంటే పిచ్చెక్కిన ట్టుంటుంది పాపం కావేరికి.
ఈ సరికి కావేరి అత్తగారు సణుక్కోవడం మొదలు పెట్టారు.సత్యవతి చెప్పిన పనుల్లో సగం మళ్ళీ తిరిగి చూసుకుంటూ చేసుకుంటూనే రోజువారీ కార్యక్రమాలు నడుస్తున్నాయి.
అదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఎవరూ ఇల్లు కదలలేని పరిస్థితి రావడంతో ఇద్దరు పిల్లలు, భార్య, భర్త అత్తగారుతో పాటు సత్యవతిని కూడా భరించడం తలకు మించిన భారమవుతోంది పాపం కావేరికి.
సత్యవతిని ఇంకెన్నాళ్లు భరించాలో తెలియటం లేదు కావేరికి. ఉగాది పండుగ వచ్చింది. పంచాంగంలో తన రాశి ఫలితాలు చూసుకునేందుకు వెళ్ళింది కావేరి.
******

12 thoughts on “ఇంతేలే ఈ జీవితం

  1. సమకాలీన సమాజంలో ప్రతీ ఇంటి పడతి పనిమనుషులు తో పడుతున్న పాట్లు ఎలాఉంటాయో, చక్కటి హాస్యం జోడించి బాగా వ్రాశారు. అభినందనలు.

  2. పల్లెల నుండి వచ్చిన వీళ్ళకు పనిలో స్మార్ట్ నెస్ ఉండదు కానీ కబుర్లలో, మనను వేళాకోళాలు చెయ్యడంలో, టీవీల దగ్గర కాలక్షేపం చెయ్యడంలో ఎక్కడలేని స్మార్ట్ నెస్ ఉంటుంది. కావేరి పాట్లు ఎవరికీ రాకూడదండి. బాగా రాసారు కధ.

  3. చాలా బాగుంది..నేటి జీవన విధానం లో కాలం తో పాటు మనం కూడా పరిగెడుతూ పని మనిషి లేకపోతే మనం లేము అనే స్థితి కి వచ్చేసాము.. అలాంటి పనిమనిషి దొరికితే…అమ్మో….అనేటట్లుగా వ్రాసారు..

  4. హహహ పని మందికి పని నేర్పటం కంటే పని చేసుకుంటే 5 మినిట్స్ లొ ఐపోతుంది పని అదియాస్త్రం నిజం

    బాగా రాసేరు పని తెలియని పని మనిషి గోల

    1. ధన్యవాదాలు మీనాక్షి గారు మీ అమూల్య స్పందనకు

  5. పనిమనుషుల మీద ఆధారపడే వారి జీవితాలకు చక్కని స్పూర్తినిచ్చే కధ.. పనిమనిషితో నే మన సుఖసంతోషాలు నిండి ఉన్నాయన్నది నిజం ! ఒక్కరోజు రాకపోతే అయ్యో ఎలారా దేవుడా అని భయపడిపోతున్నాం.. ఎంత ఎడ్డిగా పనిచేసినా భరించేస్తున్నాం అనడానికి కారణం మనలో ఓపికలు తగ్గిపోవడం అదీగాక మొదటినుండీ ఒక తరహా జీవితానికి బానిసలైపోయాం ! అన్ని సంవత్సరాలు చక్కగా పనిచేసిన పనిఅమ్మాయి మానేయడం ఆ మె స్తానంలో మరో కొత్తామె కు తర్ఫీదు ఇవ్వడం చాలా కష్టమైన పని.. బట్టలు ఉతకడానికి బట్టలసోప్ బదులు విమ్ బార్ వాడడం నవ్వు వచ్చింది. చాలా చమత్కారంగా హాస్యంగా ఉంది ‘ ఇంతేరా జీవితం ‘ కధ. కొంతమంది పనిమనుషులు మరీ నాగరీకంగా ఉంటారండోయ్. ఫలానా ఇంటామ్ ఫలానా బ్రాండ్ డిటర్జెంట్ వాడుతుందని, మీరు వాడేది మురికిపోదంటూ మనకే పాఠాలు చెప్పేస్తారు. మా పనిమనిషి అయితే రెండుమూడు రోజులు డుమ్మా కొడ్తుంది. ఫోన్ చేస్తే ఎత్తదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆమె పనిలోకి తిరిగిరాగానే, పోనీ ఎందుకు రాలేదో కారణం చెపుతుందా, ఆహా… చెప్పదు. ఫోన్ చేయలేదే అన్నా, ఫోన్ ఎత్తలేదే అన్నా, ఏమోనమ్మా, ఆ ఫోన్ అంతేనమ్మా, ఒక్కోసారి అంటుంది ! ఏం చేస్తాం, మన జాతకం బట్టే పనిమనుషులు కూడా దొరుకుతారు అనేవారు మా అమ్మగారు ! మీ కధను చదివితే అంతే అనిపిస్తోందండీ…. మన జీవితాలు అంతే…. మన భర్తగారితో, పిల్లలతో ముడిపడడం కాదు, మన ఇంటి పనిమనుషులతోనే పెనవేసుకుపోయింది. మీ రాశి ఫలితాలు పంచాంగంలో “మీకు రాబోయే రోజులన్నీ చాలా ఆనందాన్నిస్తాయి, కొత్త పనిమనిషితో ‘ అని లిఖించబడి ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చక్కని హాస్యప్రధానమైన కధను చదివించారు. అభినందనలు మిత్రమా !

    1. మన టైం బాగుంటే మనకు మంచి పని మనిషి దొరుకుతుంది .ఇది నాకు చాలా సార్లు రుజువైంది.
      ధన్యవాదాలు యశోద గారు మీ అమూల్య స్పందనకు

  6. పని వాళ్ళు ఉంటే నూ బాధే…లేకున్నా బాధే….కొత్త వారితో కష్టాలు….బాగా చిత్రించారు…నిజమే…ఓ వెయిట్ అయింది….. అంతే… మనమే నేర్పించి మన సమస్యని తేలిక చేసుకోవాలి…బాగుంది ఫన్నీ గా

  7. కధ బాగా వుంది. సగం చదివాకా “భర్త ని వెనక్కి రాప్పించేస్తే పోయేది కదా” అని ఐడియా వచ్చింది.

    1. వెనక్కి వస్తే మాత్రం పని చెయ్యాలి కదా భర్త!

Leave a Reply to raghava Cancel reply

Your email address will not be published. Required fields are marked *