March 28, 2024

చేయదలచిన పనులు, చేయవలసిన పనులు

రచన: శారదాప్రసాద్


పూజ్యులు శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యుల గారిని గురించి ఆధ్యాత్మిక అభిరుచి ఉన్నవారికి పరిచేయనవసరం లేదనుకుంటాను. వారు నా చిన్నతనంలో గుంటూరు హిందూ కళాశాలలో ఆంద్ర, సంస్కృత అధ్యాపకులుగా పనిచేసారు. పిల్లలతో పిల్లవాడిగా చాలా సరదాగా ఉండేవారు. వారితో కలిసి నేను ‘మాయాబజార్’ సినిమా రాత్రి రెండో ఆటను చూడటం జరిగింది. ప్రతిసారీ ఆ సినిమాలోని ఏదో ఒక గొప్ప విషయం గురించి చెప్పేవారు. వారు హోమియో వైద్య నిపుణులు. వారి ఆధ్యాత్మిక ప్రసంగాలు విన సొంపుగా ఉండేవి. ఆంద్ర విశ్వ విద్యాలయం, విశాఖపట్నంలో కొంత కాలం పనిచేసి, తర్వాత రాజీనామా చేసి, ‘వరల్డ్ టీచర్స్ ట్రస్ట్’అనే సంస్థను స్థాపించి దేశవిదేశాలలో ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్మారు. 60 సంవత్సరముల వయసు రాకముందే స్వర్గస్తులయ్యారు.
వారు చేసే చాలా ప్రసంగాలలో ఎక్కువగా చెప్పే విషయం ఒకటి ఉండేది. అది ఏమిటంటే, మనం చేయ వలసిన పనులు రెండు రకములుగా విభజించుకోవాలి, ఎలానంటే, ‘చేయదలచిన పనులు, చేయవలసిన పనులు’అని. చేయదలుచుకున్న పనులంటే ఏమిటో కాసేపు ప్రక్కన పెట్టి, చేయవలసిన పనులేమిటో పరిశీలిద్దాం. నేను పొద్దున్నేనిద్ర లేస్తాను, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత కాఫీ త్రాగుతాను. . . ఇలా మనం రోజూ చేసే పనులన్నీ మనం చేయవలసినవే! ‘నేను మా పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసాను’అని మనం గొప్పలు చెప్పుకుంటాం. అవి ఎలా చేయగలిగామంటే, అవి మనం’చేయ వలసిన పనులు’ కాబట్టి. మన కన్నా ఎంతమంది ధనవంతులు, పలుకుబడీ గలవారు లేరూ!వారందరూ వారి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయగలిగారా? అంటే , సమాధానం కొంతమంది చేయలేకపోయారు అని నిస్సందేహంగా చెప్పవచ్చును. ఎందుకు చేయలేకపోయారు అంటే సమాధానం, అవి వారు ‘చేయవలసిన పనులు’కావు కాబట్టి. మనకు ఒకటే గుర్తు మనం చేయవలసిన పనులు మన దగ్గరికే వస్తాయి, పదే పదే వస్తాయి కూడా. జాగ్రత్తగా ‘గమనించి’తే మనం చేయవలసిన పనులు ఏమిటో మనకు తప్పకుండా తెలుస్తాయి. ఉదాహరణకు మన దగ్గరికి ఎవరన్నా సహాయం కొరకు వచ్చారనుకోండి, నా వరకు నేను వెంటనే స్పందించను. వారు పదే పదే వచ్చి ప్రాధేయ పడితే, అతని పని మనం తప్పక చేయవలసినదే!(పదే పదే రప్పించుకోవటం నా ఉద్దేశ్యం కాదు). మీకు ఇంకా ఉత్సాహం కలిగేందుకు ఒక చిన్న పురాణ కథను చెబుతాను. ఇది పురాణాల్లో ఉన్న కథే!
‘హరివంశం’ లో ఉంది! పూర్వం ద్వారకా నగరంలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సంతాన భాగ్యం కలగలేదు. కొంతమంది పిల్లలు పురిటిలోనే పోవటం, మరికొంతమంది రెండు, మూడు నెలలు జీవించి పోవటమో జరిగేది. ఇలా ఏడుగురు సంతానం కలిగి చనిపోయారు. వారు చెయ్యని వ్రతాలూ, పూజలూ లేనే లేవు. కాని ఫలితం శూన్యం. అతని భార్య మళ్ళీ గర్భం ధరించింది. ఒక రోజు, అతని భార్యకు చక్కటి ఆలోచన వచ్చి, భర్తతో ఇలాగంది ‘మనం ఇంత కాలం చాలా పొరపాటు చేసాం . సాక్షాత్తు పరమాత్ముడైన శ్రీ కృష్ణుని ద్వారకలోనే ఉంచుకొని, మనం వారి సహాయం, ఆశీర్వాదం పొందలేకపోయాం. ఒకసారి, ద్వారకకు వెళ్లి శ్రీకృష్ణుల వారిని కలిసి అన్ని విషయములు చెప్పి వారి సహాయం కోసం ప్రార్ధించి, ప్రాధేయపడి రండి’. ఆ ఆలోచన భర్తకు కూడా నచ్చి, ‘నిజమే! మనం చాలా పొరపాటు చేసాం . ఇప్పుడే ద్వారకకు ప్రయాణం అవుతున్నాను’ అని భార్యకు చెప్పి ద్వారకకు బయలుదేరాడు. ద్వారకకు అర్జునుడు కూడా బావగారి యోగక్షేమములు తెలుసుకోవటానికి ఆ సమయంలోనే వచ్చాడు. ఈ సమయంలోనే వసుదేవుని వద్దనుండి ఒక వార్తాహరుడు ఒక పత్రం తీసుకొని శ్రీకృష్ణులవారి వద్దకు వచ్చాడు. ఆ వార్త ఏమిటంటే, వసుదేవుడు పెద్దవాడు అవటంచేత ఒక యాగం చేస్తున్నాడు. ఆ యాగ బాధ్యతలన్నీ చూసుకోనటానికి శ్రీకృష్ణుల వారిని రమ్మని! శ్రీ కృష్ణుల వారు అంతా విని, అలాగే వస్తానని నాన్నగారికి చెప్పు అని వార్తాహరునికి సమాధానం చెప్పి పంపారు. వార్తాహరుడు వెళ్ళిన మరుక్షణమే ఆ బ్రాహ్మణుడు తాను వచ్చిన గోడు వెల్లడించుకొని , తన భార్య ప్రసవ సమయంలో వచ్చి ‘అష్ట దిగ్బంధనం’ చేసి సంతానాన్ని కాపాడమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు శ్రీ కృష్ణుల వారు ‘మీరు కొద్దిగా ముందు వచ్చినట్లయితే, మీకోసమే నేను వచ్చేవాడను! కానీ మా నాన్నగారికి ఇప్పుడే వర్తమానం పంపాను, అక్కడికి వస్తానని. ఒక పని చేద్దాం! అక్కడి పని పూర్తి అయిన తరువాత నేరుగా మీవద్దకే వస్తాను, మీరు కోరిన విధంగా సహాయం చేస్తాను’ అని చెప్పగానే
ఆ బ్రాహ్మణుడు ‘మీరు వచ్చేటప్పటికీ ఆవిడ ప్రసవించటము పూర్తి అవుతుంది. తర్వాత మీరు వచ్చి ఏమి లాభం?ముందు నా వద్దకు వచ్చి తర్వాత మీ నాన్నగారి వద్దకు వెళ్ళండి!’ అని పదేపదే ప్రాధేయ పడ్డాడు. శ్రీ కృష్ణుల వారు ‘అది సరి కాదు, ముందుగా వస్తానని నాన్న గారికి మాట ఇచ్చాను, ఆ తర్వాతే మీ వద్దకు వస్తాను’అని నిక్కచ్చిగా ఆ బ్రాహ్మణుడికి చెప్పాడు. బ్రాహ్మణుడు ప్రాధేయ పడుతున్నాడు. చిరునవ్వుతో శ్రీ కృష్ణుడు మౌనంగా ఉన్నాడు. ప్రక్కనేవున్న అర్జునుడు బావగారి అవస్థ చూసి జాలి కలిగి, ఆ బ్రాహ్మణుడితో’నేను వచ్చి మీ కార్యం చక్క పెడతాను, మీరేమీ బాధ పడనవసరం లేదు’ అని చెప్పి శ్రీ కృష్ణుల వారి వంక చూసాడు. శ్రీ కృష్ణుడు మౌనంగా, చిద్విలాసంగా ఏ సమాధానం చెప్పకుండా అంతా గమనిస్తున్నాడు. సరే, ఆ బ్రాహ్మణుడు , ఎవరో ఒకరు దొరికారుగా అని సరి పెట్టుకొని ఆర్జునుడిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. భార్యకు పురిటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. అర్జునుడు తన శస్త్రవిద్యనంతా ప్రదర్శించి, ‘అష్ట దిగ్బంధనం’ చేసాడు. ఫలితం శూన్యం, మళ్ళీ శిశువు మరణించింది. ఆ బ్రాహ్మణుడికి కోపం కట్టలు తెంచుకొని వచ్చి, ఆర్జునుడిని నానా మాటలు అన్నాడు. ‘దీనంతటికీ అసలు కారణం నీవే! నేను నిన్ను రమ్మన్నానా?తగుదునమ్మా! అని నీ అంతట నీవే వచ్చావు. నీవు నోరు మూసుకొని ఉంటే, శ్రీ కృష్ణుల వారి కాళ్ళు, గడ్డం పట్టుకొని ప్రాధేయ పడితే, వారే వచ్చేవారేమో!’ అని అర్జునిడిని అనరాని మాటలు అన్నాడు. అర్జునుడు బిక్క చచ్చి, ఆ బ్రాహ్మణుని తీసుకొని ద్వారకకు వెళ్ళాడు!జరిగిందంతా చెప్పాడు. శ్రీ కృష్ణులవారు మరిది అవస్థ చూసి జాలిపడి నరకలోకానికి పోయి, యమధర్మరాజును మెప్పించి, ఆ బాలుని సజీవుడిగా తీసుకొని వచ్చి, ఆ బ్రాహ్మణునికి ఇచ్చి పంపాడు. ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషంతో ఇంటికి వెళ్ళాడు. ఇదీ కథ!అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునికి ఒక ఉపదేశం చేసాడు. ‘చూడు అర్జునా!అతను ద్వారకకు వచ్చింది నా కోసం. వచ్చి పదేపదే నన్నే ప్రాధేయపడ్డాడు. అది నేను చేయవలసినపని. నిన్ను రమ్మన్నాడా? లేదు. నీవే నీ అంతట వెళ్లావు. ఆ పని విజయవంతం కాలేదు. ఎందుకంటే! అది నీవు చేయవలసినపని కాదు’అని చెప్పగానే అర్జునిడికి జ్ఞానోదయం అయ్యింది. చూసారా! మనం చేయవలసిన పనులు ఎలా ఉంటాయో! ఇక ‘చేయదలచిన పనులు’ అంటూ ఏమీ ఉండవు. ఎందుకంటే, ‘నీవు’కర్తృత్వం ‘ వహించేవి, నీవు చేయదలచినపనులు అనుకుంటావు. అన్నిపనులు ‘నీ’ చేత చేయబడుతాయే గాని’నీవు’ చేసేదేమియూ లేదు!మనము చేయవలసిన పనులు మన దగ్గరికే వస్తాయి!అందులో ఏమాత్రం సందేహం లేదు!!
కథలోని అంతరార్ధం మీకు పూర్తిగా అర్ధమయిందనుకుంటాను.
పూజ్యులు శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యుల గారికి స్మృత్యంజలి ఘటిస్తూ. . . . . . . . . . .

5 thoughts on “చేయదలచిన పనులు, చేయవలసిన పనులు

  1. మిత్రమా,
    మంచిస్వామ్యంతోకూడిన వ్యాసాన్ని రాసినందుకు ధన్యవాదములు.మనంచిన్నప్పుడు ఎవరన్నా అనవసరవిషయాలలోజోక్యంచేసుకుంటే అరే ‘ కెపిఎం ‘ అనేవాళ్ళం అంటే కలిపించుకొని పూసుకొని మాట్లాడేవాడు అని. నీకుగుర్తుండే ఉంటుంది అలా దూరి తన్నులుతిన్నవాల్లనుకూడ ఎరుగుదుముగదా! మంచి ప్రబోధం చేశావు.
    ఎక్కిరాలవారికి కృతఙ్ఞతలతో.
    వియస్ కెహెచ్ బాబురావు.

  2. Very interesting.Glad to read about Hindu College and Sri yekkirala Krishna Murthy garu
    Thanks a lot

Leave a Reply to Nagaiah Cancel reply

Your email address will not be published. Required fields are marked *