March 29, 2024

నథింగ్ బట్ స్పెషల్

రచన: లక్ష్మీ చామర్తి

” మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ”, “త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ”. పాట వస్తోంది టీవీలో. ఒకప్పుడు ఈ పాట వింటే ఆడ జన్మ ఎత్తినందుకు ఎంతో గర్వంగా అనిపించేది. ఈ రోజు ఎందుకో చాలా చిరాగ్గా ఉంది. టీవీ ఆఫ్ చేసి బాల్కనీలోకి వచ్చింది స్ఫూర్తి. ఉతకాల్సిన బట్టల్ని మిషన్లో వేసి బయటకు చూస్తూ నిల్చుంది. ఎదురింటి బోర్డు సుహాసిని ఎంఏ పిహెచ్ డి లెక్చరర్, పక్కనే విశాలాక్షి బీఎస్సీ బీఈడీ టీచర్, రెండింటిని మార్చిమార్చి చదువుతోంది. తన బతుకుని పోల్చి చూసుకుంటోంది. అప్రయత్నంగా కన్నీళ్లు వస్తున్నాయి. తను సాధారణ గృహిణి మరి.

ఈ రోజు కాలేజీకి వెళ్ళలేదు అనుకుంటా, సుహాసిని గారు బయటికి వచ్చారు. నా కన్నీళ్ళని కనబడనీయకుండా అటు వైపు తిరిగింది పని ఉన్నట్లుగా, కాసేపటికి తలుపు చప్పుడైంది. వెళ్లి చూస్తే సుహాసినిగారు. నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది. పక్కపక్క ఇళ్లలో నే ఉన్నా, బయటికి వచ్చినప్పుడు పలకరించి పోవడమే కానీ, ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లలేదు ఎప్పుడు. ఆవిడని కూర్చోమని టీ తీసుకొద్దామని వంటగదిలోకి వెళ్ళింది. చొరవగా ఆవిడ తన వెనకే వెళ్లింది. మీ ఇల్లు అద్దంలా మెరుస్తూ ఉంది. నాకు ఇలా సర్దుకోవడం చాలా ఇష్టం. కానీ ఏం చేస్తాం హడావిడి అంది ఆవిడ. అవునండి మీరు ఉద్యోగం చేస్తున్నారు. మీరు ఆర్థికంగా స్వతంత్రులు. మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలను గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అన్నది స్ఫూర్తి. ఆర్థిక స్వాతంత్రం చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇంతకీ ఏదో డిప్రెషన్ లో ఉన్నట్లు ఉన్నావు. నీకు అభ్యంతరం లేకపోతే నీ బాధ నాతో పంచుకోవచ్చు అన్నది ఆవిడ. ఇద్దరూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు.

ఎందుకో బాధ ఎవరితో అయినా పంచుకుంటే తగ్గుతుంది అనిపించింది. అవునండి ఈ రోజు ఆరోగ్యం బాగోలేదు. కానీ తప్పని పని. ఏ సహాయం అందక పోగా ఇంట్లో ఖాళీగానే ఉంటావుగా అనే నిర్లక్ష్యపు మాటలు. సమాజం దృష్టిలో కూడా ఓ ఇంట్లోనే ఉంటారా అనే చిన్న చూపు. గృహిణిగా ఏ ప్రత్యేకతా లేకుండా బతికేస్తన్నాను. పిల్లల దృష్టిలో కూడా నేను వంట చేసి పెట్టే యంత్రాన్ని అంతే కదా. నేను ఎవరి కోసం అయితే నా జీవితాన్ని త్యాగం చేస్తున్నానో వారికే నేను నథింగ్. పొద్దుటి నుంచి రాత్రి దాకా గొడ్డు చాకిరీ చేసిన ఖాళీగానే ఉన్నావు అనే మాట. ఆరోగ్యం బాగో లేకపోయినా తప్పని పని. తన గోడు వెళ్లబోసకుంది స్ఫూర్తి.

అంటే ఉద్యోగం చేసే మా లాంటి వాళ్ళు నీ కన్నా గొప్ప అని నీ ఉద్దేశం అవునా అడిగింది సుహాసిని. అంతేగా అండి మీరు నాలా నథింగ్ కాదుగా. మీకంటూ ఓ గుర్తింపు, జీతం, జీవితం అన్నీ ఉన్నాయి. మరి నేను జీతం లేని శ్రామికురాలిని. జీవితమంతా కుటుంబం కోసం ధార పోసే అల్పజీవని అంతేనండి. ఆవేశంగా మాట్లాడింది స్ఫూర్తి.

అబ్బో నీకు చాలా విషయాలు తెలిసే. కానీ నేను నీకు తెలియని కొన్ని నిజాలు చెప్తా ఓపిగ్గా వింటావా? అడిగింది సుహాసిని.

మౌనంగా తలూపింది స్ఫూర్తి.

స్ఫూర్తి! నాకు ప్రతిరోజు నీ కంటే ముందే రోజు మొదలవుతుంది. నీ కంటే ముందే నిద్ర లేవాలి. నువ్వు అన్నావే నేను సంథింగ్ అని, ఆ సంథింగ్ ల వెనక ఎన్ని నథింగ్ లు ఉన్నాయో తెలుసా! భర్త సహాయం నథింగ్! పిల్లల సహకారం నథింగ్! ఇంటి పని వంట పని తప్పించుకోవడం జరగని పని. అందరం బాక్సులతో బయట పడడానికి నేనెంత పరిగెత్తానో నాకు తెలుసు. తీరా బయటపడ్డాక బస్సులో ఆటోల్లో వెకిలి చూపులని, ద్వంద్వార్థం మాటల్ని, విని విననట్టు వదిలేసి కాలేజీకి వెళ్తే అక్కడ పనిలో కూడా పురుషాధిక్యత. ఆడవాళ్ళని చిన్న చూపు. నెల జీతం కోసం తలవంచుకుని పని చేయడం. తీరా జీతం వచ్చినా నా ఏటీఎం మా వారు జేబులోనే ఉంటుంది. ఇప్పుడు చెప్పు ఆర్థిక స్వాతంత్రం ఎక్కడుంది? ఇంటికి వచ్చిన తర్వాత నా పనులు నాకు మామూలే. కనీసం పిల్లలకి మంచి చెడు చెప్పుకునే తీరిక కూడా ఉండదు.

పిల్లలు అంటే గుర్తొచ్చింది, వెనక వీధిలో ఎమ్మార్వో ఆఫీస్ లో పనిచేసే సంధ్య గారి అబ్బాయి సెల్ ఫోన్స్ గేమ్స్ కి అలవాటుపడి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడుట. ఆఫీస్ పనుల్లో పడి పిల్లల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అంతెందుకు మా పిన్ని చిట్ ఫండ్ కంపెనీ లో పని చేస్తుంది. 14 ఏళ్ల తన కూతురిని ఫోన్ లో ఎవరో బెదిరిస్తున్నారు. అమ్మానాన్నలతో ఆ విషయం చెప్పుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసింది. దేవుడి దయవల్ల వీళ్లు చూడడం వల్ల అమ్మాయి బతికి బయటపడింది. ఉద్యోగం చేసే ఆడవాళ్లు అందరూ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అని చెప్పలేను కానీ ఏదో ఒక సమస్యతో అయితే బాధపడుతూనే ఉంటారు. కుటుంబ జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించలేరు. అలా అని మహిళలు ఇంటికే పరిమితం కావాలి అని నేను అనను.

సమస్యలు ఎందులోనైనా ఉంటాయి అని చెప్పడానికే ఇదంతా చెప్పాను. సమర్థత, ఆర్థిక స్వాతంత్రం, స్వావలంబన, సాధికారత ఇవన్నీ అవసరమే. మంచి కుటుంబం ఉంటేనే, మంచి సమాజం వస్తుంది. మంచి సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత కచ్చితంగా గృహిణి దే. ఆలోచించు, ఏం చేయాలో బాగా ఆలోచించుకో. ఒకవేళ నీకు ఉద్యోగం చేయాలి అనిపిస్తే తప్పులేదు నేను నీకోసం కచ్చితంగా ఉద్యోగాన్ని చూపిస్తాను. నిర్ణయం నీదే అన్నది సుహాసిని.

వద్దండి ఒకవేళ అవసరం అయితే అడుగుతాను. మనస్ఫూర్తిగా చెప్పింది స్ఫూర్తి. ఏవో మబ్బు పొరలు తొలగిపోతున్నాయి. తన కర్తవ్యం తనకు తెలిసి వచ్చింది.

సాయంత్రం భర్త ఇంటికొచ్చేసరికి నవ్వుతూ ఎదురయింది. ఈ మధ్యకాలంలో ఆమె అలా చూడడం ఇదే. ఎంతో ఆశ్చర్యంగా చూసాడు అతను. పిల్లలకు కూడా ఇష్టమైన అన్నీ చేసి పెట్టింది. దగ్గరుండి వాళ్ల హోం వర్కులు చేయించింది. ప్రేమగా అన్నం తిని పించింది. కథలు కబుర్లు బోలెడు చెప్పింది. రామాయణం భారతం లోని కథలు వివరించి మరి చెప్పింది. పిల్లల్ని పడుకోబెట్టి తన భర్తతో కలిసి ఆనందంగా భోజనం చేసింది. వారు చాలా సేపు మాట్లాడుకుంటూ భోజనం చేశారు. పడక గదిలోకి వెళ్లగానే భర్తకి తన మనసులో మాట చెప్పింది. గృహిణిగా తను మొదలు పెట్టబోయే ఈ కార్యక్రమానికి అతని సహకారం కోరింది. ఎంతో ఆసక్తిగా విన్నాడు అతను.

తను ఓ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయదలచుకున్నాననీ, గ్రూప్ పేరు “నథింగ్ బట్ స్పెషల్”. గృహిణి లందరినీ ఒక వేదికపై చేర్చడం, పిల్లల పెంపకం పై అవగాహన కల్పించడం, సమాజంలో గృహిణి పాత్ర ని అత్యున్నతంగా తీర్చిదిద్దడం ఆ గ్రూపు యొక్క ఉద్దేశాలు. తనతో పాటు ఎంతోమంది గృహిణులులలో ఉన్న అసంతృప్తి పొరల్ని తొలగించి, ఎంత బాధ్యతాయుతమైన పాత్ర గృహిణిలదో ప్రపంచానికి తెలిసేలాగా కార్యాచరణ రూపొందించాలని, ప్రతి వారం స్ఫూర్తినిచ్చే సందేశాలతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, ఉద్యోగం చేసే ఆడవాళ్లు కూడా పిల్లల పెంపకంలో సరైన దిశా నిర్దేశం చేయాలని, తన ప్రణాళికల గురించి చెబుతూ ఉంటే ఆశ్చర్యంగా విన్నాడు తన భర్త.

తెల్లవారి తను లేచేటప్పటికి లేచిన భర్తని, తను లేపకుండా నే లేచి రెడీ అయిన పిల్లల్ని చూసి, ఎంతో ఆనందపడింది స్ఫూర్తి. అన్ని రకాలుగా తన భర్త తనకు సహాయం చేయడం చూసి తన అసంతృప్తి అంతా మాయమై పోయింది.

మరో వారం తర్వాత స్ఫూర్తి అడ్మిన్ గా ఓ వాట్సాప్ గ్రూప్ రెడీ అయింది. ఆరోగ్యకరమైన కుటుంబాన్ని అందించే గృహిణుల సమూహం అది. స్ఫూర్తి యొక్క స్ఫూర్తినిచ్చే సందేశాలతో, అనతికాలంలోనే ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో స్ఫూర్తి ఒక మోటివేషనల్ స్పీకర్. ఇప్పుడు కచ్చితంగా తనైతే నథింగ్ కాదు. ఎంతోమంది ఉద్యోగం చేసే ఆడవాళ్లు కూడా ఆమె సలహాల కోసం రావడం విశేషం.

1 thought on “నథింగ్ బట్ స్పెషల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *