April 20, 2024

పనివారూ మీకు జోహార్లు

రచన: ఉమాదేవి కల్వకోట

ఉదయాన్నే ఇల్లంతా ఒకటే గందరగోళం.
అందరిలో అసహనం,అశాంతి…అయోమయం.
ఒకరిపై ఒకరు చిరాకులూ పరాకులు…మాటల యుద్ధాలు.
పనమ్మాయి రాకపోవడమే దీనంతటికీ కారణం.
రెండురోజులుగా ఆమెకి జ్వరం.
కరోనా భయంతో ఉంచారామెను దూరం.
సామాజిక దూరం పాటించండంటూ టీవీల్లో ఒకటే హెచ్చరికలు.
అందుకే కష్టమైనా ఆమెను కొన్నాళ్ళు రానీయరాదనే నిర్ణయం.
పర్యవసానమే ఈ గందరగోళం.
బాగున్నప్పుడు ఆమెను పట్టించుకున్నదెవరనీ!
ఈ సామాజిక దూరం పనివాళ్ళకి ఈనాటిదా..
వీరిపట్ల జరుగుతున్న సామాజిక అన్యాయం మనమెరుగనిదా?
ఇది తరతరాలుగా సాగుతున్న శ్రమ దోపిడి.
యజమానులకు మాత్రం వేలల్లో లక్షల్లో వేతనాలు.
పనివాళ్ళకు ఒకటి రెండు వెలివ్వడానికి ఎన్నో మతలబులు.
గంటా రెండుగంటలలో ముగిస్తుందామె తన దినవారీ పనితంతు.
ఆమె రానప్పడు ఇంటిల్లిపాదీ చేయాలి పనులతో కసరత్తు.
పనమ్మాయికి రాకూడదు ఏ రోగమూ, అనారోగ్యము.
వచ్చిందంటే అది పని ఎగ్గొట్టే ప్రక్రియేనని యజమానురాలి అభిప్రాయం.
మనకు చేస్తే జలుబు.. ఉద్యోగాలకు సెలవు.
ఆమె మాత్రం తగ్గీ తగ్గకుండానే కావాలి పనికి హాజరు.
ముసలి అయితే పని సరిగాలేదని విసుర్లు.
వయసులో ఉన్నదయితే అనుమానపు ముసుర్లు.
ఆమెతో చాటుమాటుగా ఆ ఇంట్లో మగాళ్ళ వెకిలిచేష్టలు.
బయటపడితే తప్పెవరిదయినా ఈమెకే ఊస్టింగు.
తమ పిల్లలకు మాత్రం బంగారు బాల్యపు సరదాలు.
పనివారి పిల్లలకు మాత్రం అమ్మ గైర్హాజరీలో హాజరవాలనే నిబంధనలు.
తమ పిల్లలదేమో అమాయకపు బాల్యం…పనిపిల్లలకేమో బ్రతుకు భారం.
ఈ కరోనా కలకలంతోనైనా దొరికింది పనివారికి కొంత విశ్రాంతి.
లేదంటే రెక్కలు ముక్కలు చేసుకునె పరిస్థితి.
ఇప్పుడు బాగా తెలుస్తోంది అందరికీ ఆమె విలువ.
అర్థమవుతోంది ఆమె పనిమనిషికాదూ మన ఇంటి మనిషని.
ఇప్పటికైనా పనివారిని ఆదరిద్దాం..మన సహోదరిగా ప్రేమిద్దాం.
మీరెన్నో కష్టాలు పడుతూ, మాకందిస్తున్నారెన్నో సౌఖ్యాలూ సదుపాయాలు.
పనివాళ్ళూ!మీకు జోహార్లు…. మీకు జోహార్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *