April 20, 2024

మనసుకు చికిత్స

రచన: లక్ష్మీ రాఘవ

అక్క భారతి వచ్చిందని చాలా సంతోష౦గా వుంది మూర్తికి.
ఒక వయసు తరువాత చిన్ననాటి బాంధవ్యాలు గానీ జ్ఞాపకాలు కానీ తలుచుకుంటూ వుంటే చాలా అపురూపంగా వుంటాయి. రెండు రోజులు ఎన్నో జ్ఞాపకాలను గుర్తుచేసుకుని మరీ ఆనందపడిపోయారు ఇద్దరూ ఆ వయసులో. అక్కా, తమ్ముళ్ళ ముచ్చట్లు వింటూ మురిసింది మూర్తి భార్య రాధ కూడా.
భారతి వున్న వూరికి దగ్గరగా ట్రాన్స్ఫర్ అవగానే వెళ్లి భారతిని చూసి వచ్చాడు మూర్తి. అక్క కోడలు సావిత్రి బాగానే మాట్లాడింది. అప్పుడే చెప్పింది భారతి “తమ్ముడూ మీరు పూర్తిగా సెటల్ అయ్యాక నీ దగ్గరికి వచ్చి పది రోజులు వుంటానురా” అని. ఆ మాట మీదే వెళ్లి భారతిని తీసుకుని వచ్చాడు మూర్తి.
ఇక రెండు రోజులు తరువాత వెళ్లి పోవాలనప్పుడు భారతి కొంచెం బెంగగా మూడ్ బాగాలేదన్నట్టు వుంటే
“ఎప్పుడూ మనల్ని మనం ఉత్సాహపరచుకోవాలి అక్కా…” అన్నాడు వాతావరణాన్ని తేలిక చెయ్యడానికి.
“ఏమి ఉత్సాహమో మూర్తీ. ఎందుకు ఇంకా బతుకుతున్నానా అనిపిస్తుంది అప్పుడప్పుడూ..” నాలుగు రోజులుగా బయటకు రాని విషయాలు తెలుస్తాయా అనిపించింది మూర్తికి.
“ఎందుకక్కా…కొడుకు దగ్గర హాయిగా వున్నావు.”
“హాయిగా అనకు…కోడలుకు నేనంటే విసుగు.”
“అలా ఏమీ అనిపించలేదే…”
“పైకి అలాగే అనిపిస్తుంది. ఎవరు వచ్చినా చక్కగా పలకరిస్తుంది..నాతో మాటలు వుండవు… తిండి పెట్టినప్పుడు తప్ప…నేను చెబితే ఎవరూ నమ్మరు ఆఖరికి నా కూతురు కూడా…”
“అదేంటి?”
“అవునురా…మీకు అర్థం కాదు.”
‘చెప్పు చెప్పు నాకు తెలిస్తే ఏమైంది” ఆసక్తిగా అడిగాడు
“నాకేమో పొద్దున్న 5 గంటలకు లేవటం అలవాటు కదా..లేచిన వెంటనే కాఫీ అలవాటు. వాళ్ళేమో తీరిగ్గా లేచి 7 గంటలకి కాఫీ ఇస్తే ప్రాణం వూసురూ అంటుంది. నేనే కాఫీ చేసుకుంటానంటే ‘గ్యాస్ తో జాగ్రత్త మీరేమీ వెలిగించోద్దు ‘ అన్న ఆ౦క్షలు…బాత్ రూమ్ కి వెడితే బాగా నీళ్ళు పోసి వస్తాను..కానీ ఆవిడ వెంటనే వెళ్లి ఇంకోసారి నీళ్ళు పోసి వస్తూంటే చూసి అడిగితే మీరు వెళ్లి వచ్చాక వాసన వస్తుంది’అంటుంది. నేనేమైనా చిన్న పిల్లనా??ఎందుకు వాసన వస్తుంది?? ఇక వారి కొడుకూ, కోడలూ వూరినుండీ రాగానే నన్ను రూము ఖాళీ చేయించి హాలులో వున్న బాల్కనీ లోకి మారుస్తారు. బాల్కనీ కి చుట్టూ పరదాలు కట్టినా రూము అవుతుందా? పోనీ హాలులో ఒక మూలగా వుంటాను అంటే.’ఎవరైనా వస్తే బాగుండదు ‘అన్న సమాధానం! భోజన౦ కూడా అన్నీ హోటల్ లలో లాగా ప్లేట్ లో వడ్డించి రెండు కప్పులలో రసమూ, పెరుగూ పెట్టేస్తుంది. మళ్ళీ తిరిగి అడిగే పని లేకుండా…పోనీ వాళ్ళతో బాటు నేను కూడా తినవచ్చు కదా అంటే “మీరు తినడం నిదానం అవుతుంది. మీదయితే మేమిద్దరం తింటాం ‘ అంటే మారు మాట్లాడలేను కదా… ఇక నీకు నాకున్న సంగీతం పిచ్చి తెలుసు కదా..ఇంట్లో మనసారా పాడుకుంటే గోల’ అంటూంటే మానేసాను. సాయంకాలం ఇంటి ఎదురుగా వున్నా గుడిలోకి వెళ్ళినప్పుడు దేవుడి ముందు ఒక పాట పాడుకుంటాను. మొన్న కొత్తగా పక్కింట్లో దిగిన ఒక కుటుంబం గుడిలో కలిసి. వాళ్ళ అమ్మాయికి పాట నేర్పుతారా అనింది. సరే అన్నాను. పదిరోజులు గడిచాక మీ పాట క్లాసులు న్యూసెన్స్ అని అంటే మానేసాను. ఏదో కాలక్షేపం అనుకున్నా అదీ పడనివ్వలేదు. ఇలా నిస్సారంగా సాగుతోందిరా జీవితం …ఇక నా కొడుకు కూడా ఏమీ మాట్లాడడు…ఎప్పుడైనా పెళ్ళాం లేని రోజు “అమ్మా మిరపకాయ బజ్జీలు తింటావా అని “ తెచ్చి ఇస్తాడు, ‘ఇంకేమైనా కావాలా ‘ అని కూడా అడుగుతాడు. అదే ఆవిడ వుంటే మాటా పలుకూ వుండదు. వాడికి నేనంటే ఇష్టమే కానీ పెళ్ళాం ముందు పిల్లి! ” అని ఆపింది. మూర్తి టైం చూసుకుని
“అక్కా, నేను ఆఫీసు నుండీ వచ్చాక మాట్లాడుకుందాము…” అని హడావిడిగా ఆఫీసుకు వెళ్ళాడు మూర్తి.
**
ఆఫీసులో ఒక ఫైల్ కోసం రాజారావు ను పిలవమని చెప్పాడు. “ఆయన లేటుగా వస్తారు కద సార్” అన్నాడు అటెండరు.
“రోజూ లేటుగా వస్తారా??”
“చాలా వరకు సార్. మీరు కొత్తగా వచ్చారని కొద్ది రోజులు సరిగా వచ్చినారు. మళ్ళీ మామూలే … కొంతమంది మేనేజర్లు ఆయనకు చెప్పి చెప్పి కుదరక సస్పెండ్ కూడా చేసినారు..పెర్మనెంట్ కద సార్…ఏమీ చెయ్యలేరు.” అటెండరు మాటలకూ అడ్డు వస్తూ “ఆయన వచ్చాక రమ్మను…”అని అన్నాడు మూర్తి.
ఒక అరగంట తరువాత వచ్చాడు రాజారావు. లోపలకు వచ్చిన ఆయన మొహంలో అలసట కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూంది. “ఈ ఫైల్ కావాలండీ”అని అన్నారు మూర్తి.
“సార్ ఒక్క అరగంట టైం ఇవ్వండి. పూర్తి చేసి తెస్తాను…” వయసులో పెద్దగా వున్న ఆయనను ఏమీ అనడానికి మనస్కరించక సరేనన్నట్టు తల ఊపాడు.
అరగంటకి టంచనుగా ఫైల్ తీసుకుని వస్తే అది తీసుకుని ఆయనను కూర్చోమన్నాడు ఎదురుగా వున్న కుర్చీ చూపుతూ.
ఫైల్ లో కావాల్సిన విషయం అంత చక్కగా రాసి వుండటం చూసాక తలయెత్తి “ బాగా పని తెలిసిన వారు. మీరు ఆఫీసు వేళకు సరిగా వస్తే సరిపోతుంది కదా సార్…” అనగానే రాజారావు ఒక నిస్సహాయమైన నవ్వు నవ్వారు.
“మీకు వున్న ప్రొబ్లెంస్ చెప్పండి రాజారావు గారూ..నేనేదైనా సాల్వ్ చెయ్యగలనేమో చూస్తాను…” అని మూర్తి గారు అనగానే రాజారావు మౌనంగా తలదించుకున్నాడు.
“సారీ అండీ. పర్సనల్ విషయాలు అడిగే హక్కు లేదు..కానీ మీరు సరిగా వుంటే ఈ పాటికి ఇంకా హయ్యర్ పోజిషన్ లో వుండేవారు కదా అనిపించి అడిగాను. మీకు వీలైతే రేపు ఆఫ్టర్ ఆఫీసు కొంచెం ఉంటారా? లేదా మాఇంటికి వచ్చినా సరే . ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు…” ఇబ్బందిగా అన్నారు మూర్తి.
“రేపు మీ ఇంటికే వస్తాను సార్. అడ్రస్ చెప్పండి”అని వెంటనే అతను అడగటం మూర్తికి కూడా బాగా అనిపించింది.
ఇంటికి వచ్చాక అక్కతో మాట్లాడుతున్నా రాజారావే గుర్తుకు వచ్చాడు.
మార్పు కోసమని ఆ సాయంకాలం అక్కను తీసుకుని ఇంటికి దగ్గరలో వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళారు మూర్తి దంపతులు..గుడిలో దర్శనం తరువాత ఒక మూలగా వున్నఅరుగు మీద కూర్చున్నప్పుడు “అక్కా ఇప్పుడు ఒకసారి అన్నమయ్య కీర్తన పాడవే అన్నాడు. మూర్తి భార్య రాధ కూడా సపోర్టు చేస్తే నెమ్మదిగా “కొండలలో నెలకొన్న …” పాడింది భారతి. అది పూర్తీ అయ్యేసరికి వీళ్ళే కాక మరికొంతమంది చుట్టూ చేరి చప్పట్లు కొట్టారు. ‘వన్స్ మోర్ ‘అని అరిస్తే ‘అదిగో అల్లదిగో …’ ‘కులుకక నడవరో కొమ్మలాలా “ పాడాక అలసి పోయినా ఆనంద౦గా అనిపించింది భారతికి. మూర్తి కూడా ఎంతో సంతోషపడుతూ అక్కకు నీళ్ళ బాటల్ అందిస్తూ “దేవుడు ఈ రోజు నీ పాటలు విని మురిసి పోయాడు అక్కా” అన్నాడు తృప్తిగా. భారతి ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపించింది.
*****!
మరురోజు సాయంకాలం రాజా రావు వస్తే ముందు గదిలో కూర్చో బెట్టి నీళ్ళు కాఫీ ఇచ్చి
”చెప్పండి సార్. మీరు ఎక్కడ వుంటారు? ఇంట్లో అందరూ కులాసా??” నవ్వుతూ పలకరించారు మూర్తి.
రాజారావు కొంచెం సంబ్రమంగా చూస్తూ “విజయనగర్ కాలనీలో వుంటాను సార్…”అన్నాడు
“విజయనగర్ కాలనీలోనా అది మన ఆఫీసుకు దూరం కదా. అందుకే మీరు ఆలస్యంగా వస్తారు అంతే కదా?”
“విజయనగర్ కాలనీ దూరం అనే అద్దెలు తక్కువ. అందుకనే అక్కడ వుంటాను…” కొంచెం ఇబ్బందిగా అన్నాడు రాజారావు.
“అందులో ఏముందండీ… మనకు అన్నీ సౌకర్యంగా వున్న చోటే కదా ఉంటాము…”
ఇంతలో రాధ ట్రే లో స్నాక్స్ తెచ్చి పెట్టింది. “ఈవిడ నా భార్య రాధ” అనగానే మర్యాదగా లేచి నమస్కారం పెట్టాడు రాజారావు. ప్రతి నమస్కారం చేసి రాధ వెళ్లి పోయింది.
“మాకు ఒక అబ్బాయి సతీష్ ఇంజనీరింగ్ పూర్తి అయి ఈ సంవత్సరమే ఉద్యోగం చేరాడు…” చెప్పాడు మూర్తి తన కుటుంబం గురించి.
ఇంతలో
“మూర్తీ…నేను గుడి దాకా వెళ్లి రానా?” అన్న అక్క గొంతు విని “రాధను తోడు తీసుకెళ్ళు అక్కా ..”అన్నాడు లోపలి చూస్తూ. తరువాత ఇటు తిరిగి రాజారావుతో “మా అక్క భారతి. కొద్దిరోజుల క్రితం నా దగ్గరికి వచ్చింది..”
“వద్దులే. దగ్గరేగా నేను ఒక్క దాన్నీ వెళ్ళగలను….” అక్క మాటలకి లేచి బయటకి వచ్చి అక్కను గేటు దాకా వెళ్ళాడు మూర్తి .
వెనక్కి వచ్చేసరికి రాజారావు న్యూస్ పేపర్ చూస్తూ కనిపించాడు.
మూర్తి సోఫాలో కూర్చుంటూ “రాజా రావు గారూ, మీకున్న సమస్యలు ఏవైనా అందరికీ కనిపించేవి మీరు టైం కి ఆఫీసుకి రాకపోవడం…ఎవరితోనూ మాటలు కలపక పోవడం. అందుకే పలువిధాల ఊహాగానాలకి తావిస్త్తున్నారు. నేను సైకాలజీ చదివినవాడిని కాబట్టి ప్రతిదీ ఇంకో కోణంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. మీ వర్క్ చూసాను. వర్క్ లో లోపం లేదు. మరేదో వుండాలి. దేనికైనా కొన్నిసార్లు ఎదుటి వారితో చెప్పుకుంటే కొన్ని పరిష్కారాలు స్పురిస్తాయి. అర్థం చేసుకునే వారు లేక, బయటకు చెప్పుకోలేక ఒంటరిగా కుమిలిపోయిన క్షణాలు ప్రతి ఒక్కరి జీవితంలో వుంటాయి. ఒంటరిగా బాధపడుతూ ముడుచుకు పోవడం కన్నా తెలియచెబితే అర్థం చేసుకునే కొందరు తారసపడతారు రాజారావుగారూ.
కొత్తగా వచ్చానని కాకుండా ఒక ఆత్మీయుడిగా నన్ను నమ్మి మీరు ఇలా ఉండటానికి కారణాలు చెబితే ఒక స్నేహితుడిగా మిమ్మల్ని అర్థం చేసుకుని ఆపై మీ పై అధికారిగా ఎలా సహాయపడగలనో ఆలోచిస్తాను. మీరు నన్ను నమ్మితేనే చెప్పండి. మీ మనసు తేలిక అవుతుంది…” ఆగాడు మూర్తి.
రాజారావు చేతులు నలుపుకుంటూ తలదించుకుని కూర్చున్నాడు. అతని కంట్లో నుండీ జల,జలా రాలుతున్న కన్నీళ్లను చూసి మూర్తి లేచి రాజారావు దగ్గరికి వెళ్లి భుజం మీద చెయ్యి వేశాడు. వెంటనే పక్కకు తిరిగి మూర్తి చేతులు పట్టుకుంటూ “ఇన్నాళ్ళకు నీ కష్టాలు ఏమిటి అని ప్రశ్నించిన మొదటివ్యక్తి మీరే సార్..” అన్నాడు .
మూర్తి మాట్లాడలేదు ఒక ఐదు నిముషాలు దగ్గరగా నుంచుని అతని భుజం మీద చేతితో నిమురుతూ వుండి పోయాడు. కొద్దిసేపట్లో రాజారావు తెరుకోగానే..పక్కగా వున్న బాత్రూం చూపుతూ “ఒక సారి ముఖం కడుక్కుని రండి. టవల్ అక్కడే వుంది” అనగానే రాజారావు లేచి బాత్రూం వైపు నడిచాడు. మూర్తి లోపలి వెళ్లి రాధతో చెప్పి రెండు కూల్ డ్రింక్స్ తీసుకుని వచ్చాడు.
రాజారావు కూర్చోగానే “ఇది తాగండి. చల్లగా వుంటుంది” అని కూల్ డ్రింక్ గ్లాసు చేతికి ఇచ్చాడు. నెమ్మదిగా తాగారు ఇద్దరూ…తరువాత మెల్లిగా మొదలు పెట్టారు రాజారావు
“నా జీవితం నాకే రోతగా వుంటుంది. మీకు చెప్పాలంటే…” ఆగాడాయన .
“సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికీ అలాగే వుంటుంది…నాకు సమస్యలు లేవనా? నాకు ఇప్పటికే హార్టులో నాలుగు బ్లాక్స్ వున్నాయి. హార్ట్ అటాక్ వస్తే తెలిసింది. చికిత్స చేయించుకున్నా. అలాగే మన మనస్సుకు చికిత్స అవసరం అప్పుడప్పుడూ. సమస్యలు ఎవరికి తగినట్టు వారికి వుంటాయి. మనం ఎలా తీసుకుంటాము అన్నదానిపై డిపెండ్ అవుతుంది కాబట్టి మీ గురించి నాకు చెప్పచ్చు అనిపిస్తేనే చెప్పండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.”
“సార్, మా అమ్మకు పక్షపాతం. పూర్తిగా బెడ్ లో వుంటుంది..ఆమెను చూసుకోవడం కష్టం అనిపించింది నా భార్యకు. నేను ఒక్కడినే కొడుకు కావడంతో ఆమెను ఎక్కడికీ పంపలేను అని నేను ఖచ్చితంగా అనడంతో ఆవిడ ఎదురింటి వాడితో లేచిపోయింది. అందరూ నన్ను చేతకాని వాడివని ఎన్నో మాటలు అన్నా నేను చలించలేదు. అమ్మను చూసుకుంటూ వుండిపోయాను. బెడ్ మీద వున్న పేషంట్ ను చూసుకోవడానికి పని మనుష్యులు దొరకరు. ఆశ్రమాలలో వదలటం నాకు ఇష్టం లేదు. కాబట్టి అన్నీ నేనే చేసేవాడిని. దానితో ఆమె పని ఎక్కువై ఆలస్యంగా ఆఫీసుకు రావటం జరిగేది.. అందరికీ కారణాలు చెప్పలేను… కొంతమంది ఆఫీసర్లకు నా తీరు నచ్చక ఎన్నో బాధలు పెట్టారు. పనిలో మాత్రం తేడా రానిచ్చే వాడిని కాను.. అది వారు గుర్తించలేదు.
ఇక నా భార్య మళ్ళీ తిరిగొచ్చింది. తీసుకెళ్ళిన వాడు రెండేళ్లకే వదిలేసాడుట. యాడాది బిడ్డతో వచ్చింది. “తప్పు చేసాను క్షమించండి”అన్న ఆవిడను నేను ‘వెళ్ళిపో ‘ అని తరిమేయ్యలేక పోయాను. కానీ అమ్మ మా భార్యను క్షమించలేదు. దగ్గర చేరనీయలేదు. రోజూ వీళ్ళ ఇద్దరితో నాకు తలనొప్పి తగ్గలేదు. అందుకని నా భార్యను ఒక రెసిడెన్స్ స్కూల్ లో ఆయాగా చేర్పించాను. ఆమె పాపతో అక్కడికి వెళ్లి పోయినా అప్పుడప్పుడూ ఏలా వుందో చూసి వస్తాను. విధి చేతిలో ఇంతగా చిందర వందర అయిన నా జీవితాన్ని ఎవరితోనూ చెప్పుకోలేను…ఉద్యోగ వదులుకోలేను. అదే మాకు ఆధారం…ఎవరిని చూసినా నన్ను వేలెత్తి చూపుతారని దూరంగా ఉంచుతాను. ఏమి చెయ్యమంటారు సార్??” అంటూ ఆగి మూర్తిని చూశాడు రాజా రావు.
“మీరు చాలా ఉన్నతులు రాజా రావు గారూ “ అంటోన్న మూర్తిని ఆశ్చర్యంగా చూసాడు రాజారావు.
“అవునండీ…ఇంతటి విషాదంలో వుండి కూడా మీరు వర్క్ సరిగా చేస్తున్నారు అంటే అర్థం మీరు ఎలాటిదైనా తట్టుకోగలరు అనే…బెడ్ కు పరిమితమైన అమ్మను చూసుకోవడంలో మీ ఆసక్తి ఆమె మీది ప్రేమను చూపుతుంది. ఆమెకు మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు ఎంత ఓర్పూ, శ్రద్దా వున్నాయో తెలుపుతుంది. ఇక మీ భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయినా వదలని మీ నిబ్బరం, ఆవిడ వెనక్కి తిరిగి వచ్చినా కాదనక పోవడం మీలోని బాధ్యత , నిస్సహాయురాలైన వ్యక్తికి సహాయ పడాలనుకోవడంలో మీ దయా గుణం అన్నే గొప్పవే…అర్థం చేసుకోవాలి. మీ ప్రతి సమస్యకీ మీరే సమాధానం ఇచ్చుకున్నారు. ఇక్కడ ఇతరుల ప్రసక్తి ఎందుకు.?? నా దృష్టి లో మీరు చాలా గొప్పవారు….” అలా అంటూన్న మూర్తిని అలాగే చూస్తూ ఉండిపోయాడు రాజారావు.
“అవునండీ ఎప్పుడూ మన సమస్యలనే పెద్దగా భూతద్దంలో చూసుకుంటూ వుండి పోవద్దు. ఎదుటి వారికి సమస్యలు వుంటాయి అన్నది గుర్తుంచుకోండి. ఎవ్వరిదీ సుఖమయ జీవితం కాదు. నా పర్సనల్ సమస్యల ను ఆఫీసు వరకూ రానివ్వను. అంతే కాదు. ఇతరులు ఎలా వున్నా వారినీ , వారి భావాలనూ గౌరవించి నప్పుడు, వారి గురించిన ఆలోచనలు గానీ, వారు మీ గురించి ఏమనుకుంటారో అన్న భావనలు కలగవు. ఎవరి జీవితం వారిది…ఇతరులను మనం సరిచేయ్యలేము కదా. వారి జీవితాల తీరుకు మనం జడ్జ్ మెంట్ ఇవ్వలేము. అది ఎలాగంటే ఒకరి బాంక్ ఎకౌంటు మనం ఆపరేషన్ చెయ్యలేము కదా అలాగే మన బాంక్ ఎకౌంటు వారూ ముట్టలేరు. ఎవరి అవసరాలను బట్టి వారు కావాల్సిన డబ్బు విత్ డ్రా చేసుకోగలరు అలాగే మన జీవితాలు కూడా. వారిని మార్చలేము వారు కాబట్టి మనం మారాలి. ఎవరు ఏమనుకున్నా మనం చేసే పని మనకు తృప్తిని ఇచ్చిందా లేదా అన్నది ముఖ్యం కానీ వేరే వారి ఆలోచనలతో మనకు పని ఏమి?? ఇలా ఇంకో కోణంలో ఆలోచించండి…ఎవరైనా లేచిపోయి తిరిగివచ్చిన భార్యకు ఆశ్రయం ఇస్తారా అన్న ఒక్క పాయింట్ కి ఒక ఆలోచన ఇవ్వండి సార్. చాలు. మీరు ఎంతో ఎత్తులో వుంటారు. అలా ఎదుటివాడి బలహీనతలు గురించి ఆలోచించక మనసు దిట్ట పరుచుకుంటే మీ దగ్గరికి సలహాలకు వచ్చేవారు వుంటారు…అలా మనసు కోణం మార్చండి ఏదీ సమస్యగా, ఎవరూ శత్రువులుగా కనిపించనే కనిపించరు. ఇది నా జీవితానుభవం కూడా… అందుకే ఇంత విశదంగా చెబుతున్నాను. మిమ్మల్ని మార్చేయ్యలని కాదు. మీకు ఒక అవగాహన ఇస్తున్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి…” అంటూన్న మూర్తిని ఆసక్తిగా సంబ్రమంగా చూస్తున్నారు రాజారావు.
“ఆఫీసరుగా నేను మీరు ఇలా ఉండటానికి కారణం కూడా తెలుసుకుంటే ఇంకా బాగా వర్క్ చేయించుకోగలను. అందుకే మీకు కొంచెం పర్సనల్ స్పేస్ ఇస్తే…అనిపించింది… మనం మనల్ని అర్థం చేసుకోవడమే కాదు ఇతరులను అర్థం చేసుకుంటేనే జీవిత౦ ఇంకా పచ్చగా వుంటుంది…అన్న పాలసీ నాది”
“మీకు నన్ను చూస్తే జాలి అనిపించిందా?”
“ఇదిగో ఇలాటి ప్రశక్తి మళ్ళీ రాకూడదు . అయినా జాలి ఎందుకు సార్. చాలా మీరు ప్రతిదీ బాగా ప్లాన్ చేసుకున్నారు… ఇంటికి వెళ్ళాక నేను చెప్పిన విధానం ఇంకోసారి తీరికగా ఒక ఆలోచన ఇవ్వండి. మీరు తప్పకుండా మారుతారు. ఆఫీసులోనూ, ఇంకెక్కడా శత్రువులుగా ఎవరూ కనిపించరు. మీకు ఉద్యోగం అవసరం కాబట్టి అది బాగా చేసుకోవాలి, బాగా పని చెయ్యాలి. మీ బాధ్యతలు, మీ పనులు గురించి ఇతరులు ఏమనుకున్నా పరవాలేదు అన్న నిర్ణయానికి రండి. చక్కగా ప్లాన్ చేసుకుని మీ టైమింగ్స్ మార్చుకోండి రేపటి నుండే …ఆరు నెలల్లో మీకు ప్రమోషన్ రాకపోతే అప్పుడు అడగండి…”మరింత ఉత్సాహపరిచాడు మూర్తి. ఒక పది నిముషాలు మౌనంగా వున్నతరువాత రాజారావు లేచి మూర్తికి కరచాలనం చేస్తూ
“వస్తాను సార్. ఈ రోజు నా జీవితంలో మరపురాని రోజు. ఎదుటివాళ్ళ సమస్యల తెలుసుకుని ఇంతగా స్పందించే ఆఫీసరును నేను ఇంతవరకూ చూడలేదు.”అన్నాడు ప్రసన్న వదనం తో.
“మీరు రేపటినుండీ ఆఫీసులో కనిపించే తీరు మారితే మీకు నేను ఉపయోగపడినట్లే ..”అన్నాడు మూర్తి రాజారావుకు వీడ్గోలు పలుకుతూ…
*****!
రాజారావు వెళ్ళగానే భారతి గుడి నుండి వచ్చేసింది. ఆవిడ మొహంలో ఎంతో సంతోషాన్ని చూసి మూర్తి అడిగాడు
“ఏమిటి ? ఈ రోజు కూడా దేవుడు నీ చేత పాడించుకున్నట్టు వున్నాడు.” అని
“అవునురా, ఈ రోజు కూడా ఒక పాట పాడాను వెంటనే నిన్న విన్నవాళ్ళు వచ్చి పలకరించారు. ఈ వయసులో కూడా ఎంత బాగా పాడుతున్నారు అని మెచ్చుకున్నారు…”
“అదే నేను కూడా నీకు చెప్పాలి అనుకున్నా. మీ వూర్లో కూడా రోజూ కాస్సేపు గుడికే వెళ్ళు హాయిగా పాడుకో.”
“ఎవరైనా ఇలా పాడుతున్నానని చెబితే మా కోడలు వూరికే వుండదు రా..”
“ఆమె అడిగితే చెప్పు నాకు దేవుడి సన్నిధిలో పాడటం ఇష్టం అని”
“కుదురుతుందా??”
“కుదురుతుంది. ఎందుకో తెలుసా నీవు చెప్పిన విషయాలను బట్టి చాలా సమస్యలు నీవు నీ కోణం నుండే ఆలోచిస్తున్నావు. ఒకసారి ఇంకోవిధంగా ఆలోచిస్తే ఎలా వుంటుందో చూద్దామా…” అంటూన్న మూర్తి, భారతి లకు టీ కప్పులు చేతిలో పెడుతూ రాధ “ముందు ఇది తాగండి..ఉత్సాహం వస్తుంది “అంది నవ్వుతూ .
“ఇది నిజం. థాంక్ యు రాధా” అంటూ కప్పు అందుకుని టీ సిప్ చేస్తూ “నీ కోడలు నీ చేత ఇంటి పని చేయిస్తుందా??”అనడిగాడు అక్కని
“లేదు..లేదు “
“అంటే నీవు ఇంటిలో ఏ పనీ చెయ్యటం లేదు. సరి అయిన టైం కి టిఫెన్, భోజనం పెడుతుంది కదా…
‘పెడుతుంది టైం కు కర్రెక్ట్ గా “
“మరి నీతో కూర్చుని మాట్లాడదు అనేగా…అది నీకే మంచిది కదా. నీకు కావాల్సింది నిదానంగా తినవచ్చు. నీకిచ్చిన గదిలో నిద్రపోవచ్చు. ఇంకా నీకు దినమంతా ఎంతో టైం ఉంటోంది..భగవద్గీత చదువుకో లేదా ఒక జపమాల పెట్టుకో జపం చెయ్యి. ఇక సాయంకాలం గుడికి వెళ్ళు. ఇంట్లో పాడితే వద్దు అనటం వల్లే కదా దేవుడు నీ పాట కోసం కాచుకుంటాడు. అక్కడ కొత్త ఫ్రెండ్స్ చేసుకో. కాస్త కాలక్షేపం అవుతుంది. ఇంటికి రాగానే భోజనం, నిద్ర …ఇంతకంటే మంచి లైఫ్ ఎవరికి వుంటుంది. కోడలు నీతో ఎలా వుంటుంది అని చూడద్దు. నీకు అన్నీ అమరుస్తూంది కదా. పెద్దవాళ్ళని దగ్గరపెట్టుకోకుండా ఆశ్రమాలలో చేర్పిస్తున్న ఈ రోజుల్లో నిన్ను అంతమాత్రం చూసుకుంటుందని సంతోషపడాలి గానే ఆవిడలో లోపాలు వెతకద్దు. ఏ సమస్య కైనా మన చూసే కోణంలో ఇతరులను విలన్లుగా కాక ఫ్రెండ్స్ గా కొంచెం పాజిటివ్ గా ఆలోచించాలి అప్పుడు అందరూ ఆత్మీయులే…ఆలోచించు..”
భారతి ఒక్క్కసారి మూర్తి చెప్పిన విధంగా ఊహించుకుంది.
కొద్ద్దిసేపు తరువాత ఒక్కసారిగా తెర తొలగిన ఫీలింగ్ కలిగింది..
ఆలోచన చేస్తే కోడలి బెహేవియర్ లో తప్పులే కనబడటం లేదు ఇప్పుడు.
*****!
మూర్తి మరు రోజు ఆఫీసుకు చేరుకునే సరికి రాజా రావు వచ్చి వున్నాడు. ఆయన ముఖంలో సంతోషం కనిపించి సంతృప్తి చెందాడు.
తన టేబల్ మీద వున్నఒక కార్డు ఆకర్షించింది. అందులో ఇలా వుంది
“జీవితం బాగుండాలంటే
పేరులో అక్షరాలూ మార్చుకోమని,
అంకెలు చేర్చుకోమని,
ఇల్లు మార్చుకోమని,
ఇలవేల్పు మార్చుకోమని
చెబుతారు కానీ “బుద్ది మార్చుకో వాలి” అని ఎవరూ చెప్పరు !”
సమస్యను ఇంకో కోణం నుండే చూడటం అసలు చెప్పరు!!!“
అది చూడగానే “ఎంత బాగా చెప్పారు” అనిపించింది.
ఒక వైపు రాజారావు , మరోవైపు అక్క సమస్యలు తనకు ఇంకో కోణంలోనే కనిపించాయి. వారి ఆలోచనా సరళిని ఇంకో కోణంలో మార్చడానికి తను చేసిన ప్రయత్నం వారికి ఉపయోగపడిందనే ఊహిస్తూ చిరునవ్వు నవ్వుకున్నాడు మూర్తి.
సమాజం లో ప్రతి మనిషీ ఇలా మరో కోణం లో సమస్యలు చూస్తే సమాధానాలు సానుకూలంగా మారి, మనుష్యులలో మార్పు అనేదే వస్తే అంతా ఆనందమయమే కదా. అందుకే అప్పుడప్పుడూ ఆలోచనలకు, మనసుకూ చికిత్స అవసరం.
*****

2 thoughts on “మనసుకు చికిత్స

  1. జీవితం బాగుపడాలంటి మన బుధ్ధి మార్చుకోవాలని చక్కగా చెప్పారు. నిజం.

Leave a Reply to Jyostna Reddy Cancel reply

Your email address will not be published. Required fields are marked *