April 20, 2024

రాజీపడిన బంధం .. 4

రచన: ఉమాభారతి


ఇవాళ ఆదివారం అవడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు.. పొద్దుటే సందడిగా ఇంటి వెనుకనున్న పోర్టికోలో స్టవ్ పెట్టించి దోసెలు వేసి వడ్డించారు అత్తమ్మ. తరువాత మార్కెట్టుకి వెళ్లి శ్యాం స్వయంగా తనకి కావాల్సిన కూరలవీ తెచ్చి దగ్గరుండి వండించారు.
మధ్యాహ్నం భోజనం అయ్యాక అందరూ కాస్త నడుం వాల్చారు. బాబుని నిద్రపుచ్చాక వాడి గదిలోనే క్రిబ్బులో వేసి, ఎదురు గదిలో పేపర్ చదువుతున్న శ్యాం వద్దకు వెళ్లాను.
“రాత్రంతా బాబు కడుపునొప్పితో బాధపడ్డాడు. ఇప్పుడే కాస్త నిద్ర పోతున్నాడు. నేను కిందకి వెళ్ళొచ్చేలోగా వాడు లేచినట్టు గాని, వాడి ఏడుపు గాని వినిపిస్తే నన్ను పిలవండి. వాడిని మాత్రం అక్కడినుండి లేపొద్దు” అని చెప్పి కిందికి వచ్చి ఇంటి వెనక భాగంలోకి వెళ్లాను.
బయట వాతావరణం చల్లగా, హాయిగా ఉంది. మంచి గాలి, పూల సువాసనలతో ఆహ్లాదంగా ఉంది. రాము చేత క్యాండి, మిండీల స్నానాలు చేయించి, డాగ్-హౌజ్ శుభ్రం చేయించాను.
**
బాబుకి పాల టైం అవడంతో అక్కడి నుండి వంటింట్లోకి వెళ్లాను.. వాడికి పాలు కలుపుకుని, శ్యాంకి ప్లేటులో ద్రాక్ష తీసుకొని పైకి వెళుతుండగా బాబు ఏడుపు వినిపించింది. పరుగున వెళ్లాను. క్రిబ్బులో ఉండవలసిన బాబు, శ్యాం గదిలో పందిరి మంచం మీద ఉన్నాడు.
కక్కటిల్లిపోతున్న బాబుని దగ్గరికి తీసుకొని పొదవి పట్టుకున్నాను. సముదాయించి పాలు పడుతూ, “బాబు ఎందుకు ఏడ్చాడు? అసలు ఎప్పుడు లేచాడు?” అని ద్రాక్ష తింటున్న శ్యాం ని అడిగాను.
“ముద్దులు పెడితే ఏడుస్తాడు. అంతా నీ పోలికే” అంటూ పక్కకి తిరిగి, ఫోన్ డైల్ చేసి ఎవరితోనో మాట్లాడ్డం మొదలెట్టారు శ్యాం.
బాబు తల నిమురుతూ వాడి కుడి బుగ్గ మీద, కాలు పైన కూడా ఎర్రగా గాయాలు గమనించాను.
శ్యాం ముద్దు చేస్తూ గట్టిగా గిచ్చుండాలి. లేదా ముద్దెక్కువై గట్టిగా కొరికన్నా ఉండాలి. అందుకే వాడు ఉన్నట్టుండి అంతలా ఏడ్చాడు.
బాబుని నిద్ర లేవమని సతాయిస్తారే గాని మరీ ఇలా సొంత బిడ్డని, అందునా పసివాడిని గాయపరుస్తారని ఊహించలేదు. ఆయన సతాయింపు, మొరటుతనం నావరకు, నా కుక్కపిల్లల వరకే పరిమితమవుతుందని అనుకోవడం కూడా నా బుద్ధితక్కువతనమే. నాదే తప్పు.
నాలోని అసహనం పాములా బుసకొట్టింది. కోపం, దు:ఖం ఆపుకోలేక శ్యాంతో గొడవకి దిగాను.
అతన్ని ఫోన్ పెట్టేయమని, నా మాటకి జవాబు చెప్పమని గొడవ చేసాను.
మా గొడవకి కిందనుంచి అత్తయ్య, మామయ్య కూడా పైకి వచ్చారు. బాబుకి ముఖం మీద, కాలు మీద శ్యాం చేసిన గాయాలు చూపించి వాళ్ళ మీద కూడా వొళ్ళు తెలియనంతగా విరుచుకు పడ్డాను. వారు కూడా అవాక్కయ్యారు.
మామయ్య కాస్త తేరుకుని, “హద్దు మీరిన ముద్దు కూడదు శ్యాం. పసివాడికి ఈ గాయాలేమిటి?” అంటూ శ్యాంని కోప్పడ్డారు. అత్తయ్య కూడా శ్యాంని గట్టిగానే మందలించారు. ఇకనుంచి ఇలా అతిగా చేయవద్దని, పసిపిల్లవాడితో సున్నితంగా మసలుకోమని చెప్పారామె.
**
దు:ఖాన్ని, కోపాన్ని దిగమింగుకొని బాబుని అంటిపెట్టుకొని ఉంటున్నాను. ఈ అవస్థ నాకు అలివికాని సంగతిగా మారింది. బాబు విషయంలో వాడి కన్నతండ్రి మీదే నాకు నమ్మకం లేకపోవడం నన్ను దహించి వేస్తుంది.
కొందరిలో మితిమీరిన మొరటుదనం ఉంటుందని తెలుసు. ఎక్కువగా మగపిల్లలు కొందరు చెట్లనున్న పూలని నలిపేయడం, దగ్గరకి వచ్చిన కుక్కపిల్లల్ని పొట్టలో తన్నడం లాంటివి చేస్తారని విన్నాను, చూసాను కూడా.
‘శ్యాంలా, నిద్రపోతున్న పసివాడిని లేపడం, ముద్దులంటూ బుగ్గలు కొరకడం కూడా ముద్దేనా? అనిపించింది. కలవరంగా ఉన్నా ఎలాగోలా మనస్సుని శాంతపరుచుకొని యధావిధిగా మసులుకోవడం అలవరుచుకోవాలి’ అనుకున్నాను.
**
సందీప్ కి పదినెలలు నిండాయి. వాడు కొత్తగా అడుగులు వేస్తున్నాడని అమ్మతో అన్నప్పుడు, వాడి నడకలు చూడాలనుందంటూ ముచ్చటపడింది.
తరువాత రెండురోజులకి ఉదయాన్నే ఢిల్లీకి వచ్చిన అమ్మవాళ్ళు….రోజంతా కబుర్లు చెప్పుకుంటూ, సందీప్ తోనే గడుపుతున్నారు. దాంతో బాబుతో తన సమయం తక్కువయిపోయిందని, వాళ్లకే ఫిర్యాదు చేసారు శ్యాం.
“నాలుగేరోజులు మీ ముద్దుల బాబుతో గడిపి వెళ్లిపోతాము లెండి అల్లుడుగారు, కాస్త ఓపిక పట్టండి” అన్నారు నాన్న జవాబుగా…
“పోయినసారి బాబుని కింద దింపకుండా ముద్దులాడాము…ఈ సారి, వాడిని ఎత్తుకోకుండా అడుగులు వేయించి ముచ్చటపడుతున్నాము..” అంది నవ్వుతూ అమ్మ…
“వాడి అడుగుల కింద అరిసెలు వేద్దామా వదినా!” అన్నారు అత్తయ్య వాడి వెనుకే వడిగా అడుగులు వేస్తూన్న అత్తయ్య…
“మీ ఆనవాయితీ అయితే, అలాగే వేద్దాం వదినా” అంటూ నవ్వేసింది అమ్మ.
**
వారం రోజులు అమ్మావాళ్లతో హాయిగానే గడిచిపోయాయి… మరునాడే వారి తిరుగు ప్రయాణం అనగా, ముందురోజు సాయంత్రం ఆరుగంటల టైములో ఇంటిల్లిపాదీ శ్యాంతో సహా వెనక వరండాలో కూర్చునున్నారు. బొద్దుగా బంతిలా ఉన్న సందీప్ బుడి బుడి నడకలు చూస్తూ అందరు చప్పట్లు కొడుతున్నారు. క్యాండి, మిండి చిన్నగేటు అవతల పరుగులు పెడుతూ రాము, జీవలతో బంతాట ఆడుతున్నాయి.
అక్కడినుండి లేచి వెళ్లి, అందరికీ ట్రేల్లో పలహారం, కాఫీ సర్దాను. పనిమనిషి చేత పట్టించుకొని తిరిగి వచ్చేప్పటికి, అక్కడి దృశ్యం చూసి గుండెలదిరి పోయాయి. బాబుని తలక్రిందులుగా వేలాడదీసి పట్టుకొని వరండా పొడుగునా వేగంగా నడుస్తూ, వాడిని నవ్వించాలని ప్రయత్నిస్తున్నారు శ్యాం.
అమ్మావాళ్ళందరూ దూరాన మల్లెపందిళ్ళ దగ్గర ఉన్నారు. ఒక్క అంగలో శ్యాం వద్దకు చేరి, బాబుని గట్టిగా చుట్టేసి దగ్గరికి లాక్కున్నాను.
“ఎన్నిసార్లు చెప్పాలి మీకు? బాబుతో ఇల్లాంటి మొరటు ఆటలు ఆడవద్దని. అర్ధమయ్యేలా ఇంకెలా చెప్పాలి మీకు?” అంటూ స్వరం పెంచి కన్నీళ్ళతో తల్లడిల్లితున్న నా దగ్గరికి అందరు పరిగెత్తుకొని వచ్చారు. బాబుని తీసుకొని గదిలోకి వెళ్ళిపోయాను.
**
బాబుని వదలకుండా తలుపులు వేసేసుకొని గదిలోనే ఉండిపోయాను. పొద్దుటే అమ్మ వచ్చి తలుపుతడితే, లేచి ఆమెని లోనికి రానిచ్చాను. లోనికి వచ్చిన అమ్మ నన్ను పక్కగా ఉన్న సోఫాలో కూచోబెట్టి, నా పక్కనే కూర్చుంది. భుజంమీద చేయి వేసి, “బాబుకి ఏమీ అవ్వలేదుగా. అంత గొడవ పడకు. కొందరు మగాళ్ళు పిల్లలతో ఇలాగే మొరటుగా ఆడతారు. నీ భర్త ఒక్కడే కాదు. నువ్వు కాస్త భద్రంగా చూసుకుంటూ ఉండు. అంతేగాని, మరీ అంత గగ్గోలు పెట్టి బెంబేలెత్తిపోతే ఎలా?” అంటూ నన్ను శాంత పరచాలని చూసింది.
“బొద్దుగా ఉన్న పదినెలల బాబుని ఆ రకంగా ఆడిస్తే? చేయి కాస్త జారితే? బాబు తల మీద పడితే? ఏమవుతుంది? అని ఆలోచిస్తే తెలుస్తుంది నా బాధ” అంటూ మాట మార్చేసాను.
“ఏమోనమ్మా… కాస్త స్థిమిత పడు. సాయంత్రమే మేము వెళ్ళిపోతున్నాము. బద్రంగా ఉండమ్మా…ముందైతే వచ్చి భోంచేయి. లేదంటే నీరసపడి పోతావు.
ఆమె మాటలకి బాధగా అనిపించింది.. మనసుని దిటవు చేసుకోవాల్సిందేనని.. పైకి లేచాను.
**
అమ్మావాళ్ళు బయలుదేరిన పోయిన కాసేపటికి శ్యాం నేనున్న గదిలోకి వచ్చి, పాపకి పాలు పడుతున్న నాకు ఎదురుగా ..సోఫాలో కూర్చున్నారు.
“సారీ నీలూ, నిన్న బాబుని సరదాగా ఆడించడానికే అలా తలక్రిందులుగా పట్టుకున్నాను తప్ప, వాడు పడతాడేమో అని ఆలోచించలేదు” అన్నారు సంజాయిషీగా.
అతని వంక సూటిగా చూసాను… కాస్త తత్తరపడి తల వంచుకున్నా క్షణంలో తలెత్తి అంతే సూటిగా నా వైపు చూసారు శ్యాం. “అయినా వాడిని కూడా నీలా సుకుమారంగా పెంచితే ఎలా చెప్పు? వాడు అన్నీ నేర్చుకోవాలి, అన్నీ చెయ్యాలి. నన్నసలు వాడితో ఆడనివ్వవా? ఇలా అయితే కష్టమే” అన్నాడు లేని కోపం నటిస్తూ…
ఎలా స్పందించాలో తెలియక నిముషం సేపు మిన్నకుండిపోయాను. కూడదీసుకుని శ్యాం వంకే చూస్తూ..“ఇంకాస్త పెద్దయ్యాక వాడికి నా విద్యలన్నీ నేర్పిస్తాలే” అంటూ లేచి దగ్గరగా వచ్చి నా చేయి అందుకున్నారు.
“క్యాండి, మిండి, సందీప్ అందర్నీ తీసుకొని అలా తిరిగొద్దాము పద” అంటూ నన్ను బయలుదేరదీసారు.
**
రెండేళ్ళ సమయం సందీప్ ప్రాపకంలో వేగంగానే గడిచిపోయింది. వాడిని జాగ్రత్తగా చూసుకుంటూ, పడుతూ లేస్తూ గడిచిన రెండేళ్ళల్లో, శ్యాంతో అవసరానికి మించి మాట్లాడ్డం కాని, పోట్లాడడం కానీ లేకుండా నడుచుకున్నాను. కేవలం అత్తయ్య సహకారం వల్లే, సందీప్ పెంపకం సజావుగా సాగుతుందనే చెప్పాలి. బాబుని అత్తయ్య చక్కగా ఆడిస్తారు. మాటలు పాటలు కూడా నేర్పుతారు. అర్ధమయినా, కాకపోయినా వాడు కూడా నానమ్మ వంక కన్నార్పకుండా చూస్తూ, నవ్వుతూ అన్నీ వింటాడు.
మామయ్య కూడా. బాబుని వొళ్ళో పెట్టుకొని న్యూస్ పేపర్ చదువుతారు. వాడితో టి.వి చూస్తారు. ఇంటి కాంపౌండ్ లో చేయిపట్టి నడిపిస్తారు.. సందీప్ ముద్దుమురిపాల్లో సమయం తెలియడం లేదు. అమ్మావాళ్ళు వీలు చేసుకుని, సందీప్ పుట్టినరోజు వేడుక కలిసొచ్చేలా కనీసం రెండు వారాలైన వచ్చెళుతున్నారు.
**
ఎన్నడూ ఇల్లు కదలని నేను సందీప్ ని తీసుకొని… నవంబర్ 12 న హైదరాబాదులో జరగనున్న చిత్ర పెళ్ళికి వెళ్ళాలని అత్తయ్యకి, శ్యాంకి కాస్త ముందుగానే చెప్పాను. తప్పకుండా వెళ్లి రమన్నారు అత్తయ్య. అయిష్టంగా ఒప్పుకున్నాడు శ్యాం. రెండు మూడు రోజుల్లోనే తిరిగి వచ్చేస్తానని అందరికీ చెప్పి, పదకొండవ తేదీన బయలుదేరాను..
హైదరాబాద్ కి కాస్త దూరంగా అందమైన తోటల మధ్యనున్న రిసార్ట్స్ లో ఏర్పాటయింది చిత్ర వివాహ వేదిక. వెయ్యికి పైగా అతిధులు. అమ్మావాళ్ళు, రమణివాళ్ళతో కలిసి ఆ రోజంతా రిసార్ట్ లో సరదాగా గడిపాము. అక్కడినుండి హైదారబాద్ తిరిగొచ్చాక, అమ్మ దగ్గర ఓ పూట గడిపి, అదే రోజు రాత్రి భోజనాల సమయానికి ముందే ఢిల్లీకి తిరిగొచ్చేసాను.
భోజనాల సమయంలో చాలా ఉత్సాహంగా కనిపించారు శ్యాం. మేము త్వరగానే తిరిగి వచ్చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఎందుకంటే మరునాడే నవంబర్ 14 న – పిల్లల దినోత్సవాన్ని ‘ఢిల్లీ రీగల్ స్పోర్ట్స్ క్లబ్’ వారు ఘనంగా నిర్వహిస్తున్నారట… కార్యదర్శిగా తానే అన్ని ప్రోగ్రామ్స్ ప్రత్యేకంగా చేపట్టారట. మరునాడే ‘అరవల్లి రేంజ్’ కి దగ్గరిలోని రిసార్ట్స్ లో జరగనున్న ఆ ‘చాచా నెహ్రు డే’ వేడుకల్లో భాగంగా .. రోజంతా పిక్నిక్ తో పాటు పిల్లలకి టెన్నిస్, క్రికెట్, స్విమ్మింగ్ ఏర్పాటు చేసారట.
అదే ఉత్సాహంతో సందీప్ బుగ్గన ముద్దుపెట్టి, నా వంక చూస్తూ…”రేపు మరి పొద్దున్నే అందరూ సిద్దంగా ఉండండి. కాస్త దూరం కదా,,,పెందరాలే బయలుదేరిపోవాలి..కావాలంటే రెండు కార్లల్లో వెళదాము. అమ్మా,నాన్నగారు లంచ్ తరువాత వచ్చేయచ్చు” అన్నారు..
**
పదిగంటలకల్లా అంతా ‘అరవల్లి రేంజ్’ చేరాము. ఆరేళ్ళలోపు పిల్లలకంటూ ప్రత్యేకంగా ఏర్పాటయిన
‘ గుఱ్ఱపు స్వారీ’ గురించి పిల్లలంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ లోగా ‘నెహ్రుచాచా గురించి ఎనెన్నో విషయాలు విశేషాలు చెబుతూ కాసేపు, ఆటలు, మ్యాజిక్ షో మరికాసేపు ఏర్పాటు చేసారు.
అత్తయ్యవాళ్ళు కాసేపు పిల్లల ఆటలు చూసి, లంచ్ వరకు ఉండి వెళ్ళిపోయారు. ఆడవాళ్ళంతా చెట్ల కింద కబుర్లు చెప్పుకుంటున్నారు. తండ్రులందరూ పిల్లలతో ‘పోనీ రైడ్స్’ దిశగా వెళుతున్నారు.
ఓ చేత సందీప్ ని, మరో చేత ఫ్రెండ్ కొడుకు ఆరేళ్ళ విజయ్ ని నడిపించుకు వెళుతున్నారు శ్యాం. అలా వెళుతున్న శ్యాంతో పాటు కొంత దూరం మాత్రం నడిచి ‘విశ్రాంతి ఏరియా’ లో కూర్చున్నాను. క్షేమంగా, గాయ పడకుండా సందీప్ తిరిగి రావాలని కోరుతూ గుండెలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నాను.
**
సశేషం…

1 thought on “రాజీపడిన బంధం .. 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *