March 30, 2023

అక్షరాలే ఊపిరిగా రూపుదిద్దుకున్న కవితాస్ఫూర్తి

రచన: సి. ఉమాదేవి

అక్షరమంటే ఉన్న ఆర్తిని, ఆప్యాయతను తన కవితలలో ప్రతి పదములోను ప్రతిఫలిస్తూ కవితలు, హైకూలు, రవీంద్రనాథ్ టాగూర్ గీతాంజలికి అనువాదంవంటి ఎన్నో రచనలు తనదైన శైలిలో రచించి మనకందించారు డా. పి. విజయలక్ష్మీ పండిట్.
జపాన్ దేశంలో పురుడుపోసుకున్న హైకూలు నేడు ప్రపంచమంతా చక్కటి హైకూలుగా రచింపబడి అందరినీ అలరిస్తున్నాయి. విశ్వపుత్రిక హైకూలుగా రచింపబడిన సంపుటిలో సాంఘిక, సామాజిక అంశాలను తన హైకూలలో పొందుపరచి అనంతార్థాన్ని అందించడం ముదావహం. కళలు, కవితలు కవిహృదయాలను కలుపుతాయనడం అక్షరసత్యం.


శిథిల శిల్పాలు, గతకళల వైభవాలు చరిత్ర ఆనవాళ్లు అని చెప్పిన హైకూలో చరిత్ర పరిణామక్రమాన్ని అత్యంత సహజంగా పారదర్శకం చేసారు. వారు గొప్ప అనుకరణశీలురు పసిపిల్లలు అనడంలో పెద్దలు చేసే పనులను నిశితంగా పరిశీలించే పిల్లలు అనుకరణ విద్యలో తమదైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు అనడం హైకూలోని అంతరార్థాన్ని మనకు విశదపరుస్తుంది. పిల్లలకు తల్లిదండ్రుల గొప్ప బహుమతి వారికి పంచేకాలం. ఈ హైకూలో మనకందరకు తెలిసిన విషయమే కాని పిల్లలకు కేటాయించే సమయం కుచించుకుపోతోంది అనే అవగాహన మనోఫలకంపై ముద్రించబడుతుంది. సింధువులో బిందువుకాదు బిందువులో సింధువు మనిషి మనసు అని వ్యక్తీకరించడంలో మనసు సంద్రమై తనలో నిక్షిప్తమైన భావాలకు ప్రతీకగా నిలబడుతుంది.
నీ ముఖ తొడుగు తొలగించు ప్రేమతో వెలుగుతుంది అనడం వెనుక మనిషి తనకు తెలియకుండానే ముసుగు వేసుకుని తనకే తెలియని నీడలో బ్రతుకుతూ ప్రేమ, ఆప్యాయతలను దూరంచేస్తాడు. అందుకే ముసుగు తొలగిననాడు ప్రేమతో వెలుగును అందుకోవడం ఆనందదాయకం. వరుణిడి కరుణకై నింగినంటిన చూపు రైతుల ఆత్మఘోష. వ్యవసాయం వర్షంపైనే ఆధారపడుతుంది. వర్షించే మేఘాలకై ఆకాశంవంక చూసే రైతుకు వర్షం జాడ కనబడనినాడు కేవలం ఆత్మఘోషే మిగులుతుందనడం నేటి రైతులందరి ఆవేదనను వినిపించింది. భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం భారతదేశపటం. మన భారతదేశ జీవనవిధానాన్ని అలతి పదాలలో అనల్పార్థాన్ని వివరించడమే. భూమాత ఊపిరితిత్తులు ఆకుపచ్చ అడవులు. వసుధకు ఊపిరాడడం లేదు వనాలు మాయం. ఈ రెండు హైకూలు చదివినప్పుడు మన అడవులను నరికివేయడంలోని మన అజాగ్రత్తను తేటతెల్లంచేస్తుంది. చక్కటి హైకూలనందించిన డా. పి. విజయలక్ష్మి పండిట్ అభినందనీయురాలు.


ఇక నా అక్షరాలు కవితాసంపుటిలో విజయలక్ష్మిగారి మనసును తడిమిన ప్రతి సంఘటన అక్షరసేద్యంలో మొలకెత్తి మనల్ని అలరిస్తాయి. నా అక్షరాలు ప్రభాతవేళ అలలై తేలివచ్చే గుడిగంటలు. ఎంత చక్కటి భావన!ప్రతివాక్యంలో అక్షరాలను వర్ణించినతీరు మనసును అక్షరసంద్రంలో ఓలలాడిస్తుంది. కలంపేరును విశ్వపుత్రికగా తీర్చిదిద్దుకున్న వీరి భావనాలహరికి నా పుస్తకాల అలమారా కవిత ప్రతి పాఠకుల మనోచిత్రంలో పుస్తకాల అలమారా తటిల్లతలా మెరుస్తుంది.
అక్షరమానవుణ్ణి కవితలో మనోభావాల అక్షరీకరణే మనిషి. నా జీవితం అక్షరమయం, నేను అక్షరమానవుణ్ణి అనడంతో పులకించిన అక్షరాలు చినుకులై వర్షించాయి. భూమాత గురించి చెప్పిన కవితలో తుదకు తన ఒడిలో మొలిచి పరిఢవిల్లి మరణించిన తన బిడ్డల శరీర అవశేషాలను దుఃఖాన్ని దిగమింగి తన కడుపులో దాచుకుని ఊరటనిచ్చే. . . . అమ్మతనం భూమాత అని చదివినపుడు మనసు ఘనీభవిస్తుంది. అక్షరబలహీనత కవితలో ప్రతి అక్షరప్రేమికులకు మనసున ఉన్న అక్షరప్రేమను చక్కగా వ్యక్తీకరిస్తారు. రైతుల నిరంతర ఆత్మనివేదనలే పండిస్తున్నాయి ప్రజలందరి జీవితపంటలను పచ్చగా ఏమిచ్చి తీర్చుకోవాలీ కృషీవలుని రుణం అనడం రైతుకు అక్షరనీరాజనమే.
బరువుల బాల్యం, అక్షర సముద్రం, నా భాషంటే వంటి కవితలెన్నో మనల్ని అక్షర ఊయలలూగిస్తాయి. చక్కని కవితలనందించిన డా. విజయలక్ష్మి పండిట్ గారికి శుభాశీస్సులు, శుభాభినందనలు.

2 thoughts on “అక్షరాలే ఊపిరిగా రూపుదిద్దుకున్న కవితాస్ఫూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

May 2020
M T W T F S S
« Apr   Jun »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031