March 28, 2024

అమ్మమ్మ – 13

రచన: గిరిజ పీసపాటి

వరలక్ష్మమ్మ గారు కోరినట్లే ఇల్లు వారికే అమ్మేసి, ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చేసి, వారు కోరిన విధంగానే వారు తనకోసం కేటాయించిన గదిలో ఉండసాగింది అమ్మమ్మ. ఆ చిన్న గదిలోనే ఒక మూల వంట, మరోమూల పడక.
ఆ మాత్రం నీడైనా దొరికినందుకు చాలా సంతోషించింది అమ్మమ్మ. వారు అంత అభిమానం చూపించడానికి ఒకప్పుడు అమ్మమ్మ, తాతయ్యలు చేసిన సహాయం ఒక కారణం అయితే, చిన్నప్పటి నుండి నాగను పెంచిన మమకారం కూడా మరొక కారణం అయింది.
ఇంకా మానవత్వం బతికి ఉన్నందుకు సంతోషిస్తూ కృతజ్ఞతగా వరలక్ష్మమ్మ గారికి నమస్కరించింది అమ్మమ్మ. అప్పులు తీరిపోగా చేతిలో ఎనిమిది వందలు, మరికొంత చిల్లర మాత్రమే మిగిలాయి.
ఆ ఎనిమిది వందలలో కొంత డబ్బును నాగకు పుట్టిన సంతానానికి ఏదైనా కొని ఇవ్వడానికి దాచి, మిగతా డబ్బును తనకు ఏదైనా ఉపాధి దొరికేవరకు తన కడుపు నింపుకోవడానికి ఉపయోగించుకోవాలని అనుకుంది అమ్మమ్మ.
ఈలోగా వాళ్ళ అన్నయ్య వచ్చి ఎనిమిది వందల రూపాయలు తనకి ఇస్తే దాచిపెడతాననీ, నాగకు డెలివరీ కాగానే ఇస్తాననీ, ఒంటరిగా ఉంటున్న నీ దగ్గర అంత డబ్బు ఉండడం క్షేమం కాదని చెప్పడంతో ఆయనకు ఎనిమిది వందలూ ఇచ్చింది.
ఆయన అవి తీసుకుని వెళ్ళిపోయాడు. కనీసం మాట వరసకైనా ఇంటికి రమ్మని పిలవలేదు. ఆచారం ప్రకారం అయితే భర్త చనిపోయిన స్త్రీని పుట్టింటి వారు (తల్లిదండ్రులు గాని, అన్నదమ్ములు గాని) తీసుకెళ్ళి కనీసం ఒకరోజైనా భోజనం పెట్టి, నిద్ర చేయించి, కీడు బట్టలు పెట్టి ఆదరించాలి.
ఆ తరువాతే వేరే ఎవరి ఇంటికైనా వెళ్ళాలి. లేకపోతే వేరే ఎవరూ తమ ఇంటికి కనీసం రమ్మని కూడా పిలవరు. ఇప్పటికీ ఆ ఆచారం ఉంది. కానీ ఆయనకి ఆ ఉద్దేశం కూడా ఉన్నట్టు కనిపించకపోవడంతో చాలా బాధపడింది అమ్మమ్మ.
తాతయ్య చనిపోయాక ఇరవై ఎనిమిది రోజులపాటు తన అన్నయ్య పుట్టింటికి తీసుకెళ్తాడేమో అని ఎదురు చూసింది. మళ్ళీ రెండో నెల వచ్చేస్తే వెళ్ళకూడదు. మూడో నెల వరకు ఆగుదామంటే నాగకు అప్పటికి డెలివరీ అయిపోయి బిడ్డ కూడా పుట్టేయొచ్చు.
పైగా ఈలోగా తను నాలుగిళ్ళలో పాచి పని చేసుకునైనా కడుపు నింపుకోవాలి. అలా ఎవరింటికైనా పని అడగడానికి వెళ్ళాలన్నా తను పుట్టింట్లో నిద్ర చేసి రావాలి. చేతిలో ఉన్న డబ్బు అయిపోయింది.
అప్పటికీ వరలక్ష్మమ్మ గారు బియ్యం, కూరలు వంటివి ఇచ్చి సహాయపడుతున్నారు. ఎన్నాళ్ళని తను మాత్రం వాళ్ళ మీద ఆధారపడుతుంది? ఆరోజు, మర్నాడు కూడా ఎడతెగని ఆలోచనలతోనే గడిపిన అమ్మమ్మ.
ఇరవై తొమ్మదవ రోజు సాయంత్రం సూర్యాస్తమయం అవడానికి మరో గంట సమయముందనగా తను కట్టుకునే పంచెలు రెండింటిని ఒక పాత పంచెలో మూట కట్టుకుని, వరలక్ష్మమ్మ గారిని కేకేసి, ఆవిడతో తను చెయ్యదలుచుకున్న పని చెప్పింది. అమ్మమ్మ తీసుకున్న నిర్ణయం విన్న ఆవిడ షాక్ తిన్నట్టు ఉండిపోయింది.
కాసేపటికి తేరుకుని “ఇంత బంధుజనం, బలగం ఉండి మహారాణిలా బతికిన నీకు ఇలాటి గతి పట్టిందా రాజ్యలక్ష్మమ్మా!!!” అని ఏడ్చింది. “తప్పదు వరలక్ష్మమ్మ గారూ! కనీసం నా కూతురిని చూసుకోవడానికి వియ్యాలవారి ఇంటికి వెళ్ళాలన్నా ఇప్పుడు నేను ఈ పని చెయ్యాల్సిందే కదా!”
“పోనీ పెద్దవారు, వేరే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను” అంది అమ్మమ్మ. ఆవిడ మరి మాట్లాడలేనట్లు తల దించుకుంది కన్నీరు కారుస్తూనే. వేరే మార్గం అంటూ ఉంటే కదా చెప్పడానికి.
“నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనని మీకూ తెలుసు. బాధ పడకండి. ఉదయం వస్తాను” అని చెప్తూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ, చేతిలో మూటతో తను నిర్దేశించుకున్న గమ్యం వైపు సాగిపోయింది అమ్మమ్మ.
అలా నడుచుకుంటూ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళింది. కొంచెం పెద్ద గుడి కావడంతో గుడి ప్రాంగణంలో చాలా రకాల పూల మొక్కులు, పళ్ళ చెట్లు పెంచుతున్నారు.
గుడిలో ఒక మూలగా ఉన్న బావిలోని నీరు తోడి ఆ చెట్లకు పోస్తారు. అమ్మమ్మ గుడి ఆవరణలోకి ప్రవేశించగానే తిన్నగా బావి దగ్గరకు వెళ్ళి, నీళ్ళు తోడుకుని కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుంది.
తరువాత గుడిలోకి వెళ్ళి, బట్టల మూటను ఒక మూల పెట్టుకుని, స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళింది. పూజారి స్వామికి సాయంత్రం హారతి ఇస్తున్నారు. గుడిలో భక్తులు పలుచగా ఉన్నారు.
స్వామికి హారతి ఇచ్చిన అనంతరం ఆ హారతిని భక్తులకు చూపించారు పూజారి. అందరితో పాటు అమ్మమ్మ కూడా భక్తిగా హారతిని కనులకు అద్దుకుంది. అందరితో పాటు తీర్ధ ప్రసాదాలు పుచ్చుకొని తన బట్టల మూట పెట్టుకున్న చోటుకి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చుని మంత్ర జపం చేసుకోసాగింది.
రాత్రి ఎనిమిది గంటలు కావస్తుండగా స్వామి వారికి రాత్రి నివేదన చేసి గుడి మూసేయబోతూ అప్పుడు గమనించారు పూజారి అమ్మమ్మని. “ఏమ్మా! ఎవరు నువ్వు? గుడి మూసేసే సమయం అయింది. మీరు వెళ్తే… మేం తాళాలు వేసుకుంటాం” అన్నాడాయ.
అప్పుడు లేచి ఆయనకు నమస్కరిస్తూ ఎదురుగా వెళ్ళి నిలుచుంది అమ్మమ్మ. దీపపు వెలుగులో అమ్మమ్మను చూసి నిర్ఘాంతపోయిన పూజారి ” నువ్వా అమ్మా!” అనడంతో తల దించుకుంది అమ్మమ్మ.
అమ్మమ్మ, తాతయ్య, నాగను తీసుకుని తరచూ వచ్చే గుడి అది.
వచ్చినప్పడల్లా పుజారికి తాంబూలంలో దక్షిణ పెట్టి నాగ చేత ఇప్పించి, ఆయన ఆశీస్సులు నాగకు ఇప్పించేది. పెద్ద కుంకుమ బొట్టు, కళ్ళనిండా కాటుక, జరీ చీర, పెద్ద జుత్తును ముడి చుట్టుకుని, ముడి చుట్టూ పువ్వులు పెట్టుకుని పెద్ద ముత్తైదువులా అమ్మమ్మని చూసిన ఆయన ఇప్పుడు ఉన్న ఈ విధవరాలి వేషంలో పోల్చుకోలేక పోయారు.
“ఎంత కష్టం వచ్చింది తల్లీ నీకు!” అని కాసేపు అమ్మమ్మను ఓదార్చి, “మరోసారి వేళుంటుండగా రా తల్లీ! ప్రస్తుతం ఇంటికి పదమ్మా! ఒక్క క్షణం అలా సింహద్వారం దగ్గర నిలబడ్డావంటే గుడి తాళాలు వేసి, నిన్ను కూడా మీ ఇంటి దగ్గర దగపెడతాను” అంటూ గర్భగుడి తలుపు తాళం వెయ్యడానికి వెళ్ళారాయన.
ఆయన గర్భగుడి తాళం వేసి వచ్చేదాకా అక్కడే నిలబడ్డ అమ్మమ్మ ఆయన తిరిగి తన దగ్గరకు రాగానే ” అయ్యా! నాదో విన్నపం. మీరు కాదనరనే ధైర్యంతోనే అడుగుతున్నాను” అంది. “ఏమిటో అడుగు తల్లీ! ఈ పరిస్థితిలో ఉన్న ఆడకూతురికి కాదని చెప్తానా అమ్మా!” అన్నారాయన దయగా.

****** సశేషం *******

2 thoughts on “అమ్మమ్మ – 13

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *