April 16, 2024

ఎందుకోసం?.

డా.కె. మీరాబాయి

అమ్మా! ఆలస్యం అయిపోతూంది తొందరగా రా “ అంటూ హడావిడి పెట్టింది అపర్ణ.
“ కాస్త ముందు గుర్తు చేయవచ్చు కదా “ గబ గబ మెట్లు దిగింది రమ.
శనివారం స్కూలుకు సెలవు రోజైనా వర్క్ యూనిఫాం వేసుకుని మూడు ముప్పావుకే తయారై పోయి అమ్మను తొందర పెడుతోంది అపర్ణ.
చదువుతున్నది పన్నెండో తరగతి. వయసు చూస్తే పద్ధెనిమిదో సంవత్సరం నిండ లేదు. అప్పుడే స్వతంత్రంగా సంపాదించాలనే వుబలాటం ఏమిటో అర్థం కాక అయిష్టంగా చూస్తోంది అపర్ణ అమ్మమ్మ, మంగమ్మగారు.
“ బై అమ్మమ్మా! అనేసి గరాజ్ లోకి వెళ్ళి అమ్మ బెంజ్ కారు ఎక్కి కూర్చుంది అపర్ణ. మనుమరాలి ముందు తన అసమ్మతి వెలిబుచ్చడం వద్దులే అనుకుని “ బై తల్లీ “ అంది అమ్మమ్మ.
గడచిన నెల రోజులుగా శని ఆది వారాలు అప్పూ నాలుగేసి గంటలు ఉద్యోగం అంటూ వెళ్లడం జరుగుతున్నా ఇంకా మనసు ఒప్పుకోడం లేదు మంగమ్మగారికి
“అమ్మా! వెనక్కి వచ్చేటప్పుడు నేను ఇండియన్ స్టోర్ కి వెళ్ళాలి. నువ్వూ వస్తావా ? తెలుపు మీద ఎరుపు గులాబీ పువ్వులున్న జూట్ బాగ్ భుజానికి తగిలించుకుని, బయలుదేరుతూ అమ్మను అడిగింది రమ.
అంతకుముందు మైకేల్ కోర్, గుచ్చీలాటి ఖరీదైన బ్రాండెడ్ లెదర్ బాగ్ లే వాడేది. జంతుహింస తగ్గించడంలో భాగంగా తోలు సంచీలు వాడడం మానేసింది రమ ఈ నడుమ.
“ నీ బాగ్ బావుంది “అని మెచ్చుకుని, “ నేను రానులే, కావలసినవి జాబితా రాసుకున్నావా? మళ్ళీ వారం మధ్యలో పరిగెత్తాల్సి వస్తుంది’ అంటూ కూతుర్ని హెచ్చరించింది.
“ ఫోనులో రాసుకున్నాలేమ్మా“నవ్వుతూ చెప్పి కదిలింది రమ. “ పిల్లని అది పనిచేసే చోట వదిలి, వారానికి కావలసిన కూరగాయలు, పెరుగు, మురుకులు వంటి తినుబండారాలు కొనడం ముగించి అయిదున్నరకల్లా ఇల్లు చేరింది రమ.
“అబ్బా, వీకెండ్ కదా. ఇంత పొడుగు క్యూ షాపులో. అయితే మంచి ఏలకుల వాసనతో ఘుమఘుమలాడే టీ పెట్టాడు స్టీలు డ్రమ్ము నిండా. అదో ఆకర్షణ ఎక్కువమంది రావడానికి. “ నవ్వుతూ చెప్పింది రమ.
“ ఇండియాలో అయినా అమెరికాలో అయినా మనుషుల స్వభావం ఒకటే“ భోజనాల బల్ల దగ్గర కూర్చుని పక్కింటి గుజరాతీ పిల్ల వాళ్ళ తోటలో కాచినవని ఇచ్చిన చిక్కుడుకాయలు వలుస్తున్న రమ తల్లి మంగమ్మ తేల్చేసింది.
“ అయ్యో రామా. బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే కు సేల్స్ వుంటాయి అప్పుడు చూడాలి. తెల్లవారు ఝామునుండే క్యూ కట్టేస్తారు ఆ షాపుల ముందు. మనకు దసరా,దీపావళి కి చందనా, కళాంజలి లాటి షాపులు కిక్కిరిసి పోయినట్టు. “ రమ అంది.
ఇంకా ఎనిమిది కావడానికి పదిహేను నిముషాల ముందే రమ భర్త సారథి గబ గబ దిగి వచ్చి తన హోండా ఎలెక్ట్రిక్ కారు తాళం తీసుకుని “ అపర్ణను పిల్చుకు వస్తాను” అని చెప్పి బయలుదేరాడు.
సాయంత్రం నుండి మనసును తొలుస్తున్న విషయం గురించి మాట్లాడడానికి మంగమ్మగారికి అవకాశం దొరికింది.
“కాదే రమా ! అప్పుకు చదువుకోవడానికే సమయం చాలటం లేదు. దానికి తోడు అవేవో అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్, ఆపైన శాట్ పరీక్షకు చదవాలి. ఇంత ఒత్తిడి చాలనట్టు శనివారం, ఆదివారం సెలవు రోజుల్లోకూడా ఎక్కడో నాలుగు రాళ్ళ కోసం పనిచేసే ఖర్మ ఏమిటే? కాళ్ళు పీక్కు పోయేటట్టు నాలుగు నుండి ఎనిమిది దాకా నిలబడే వుండాలిట కదా? ఆ జాంబా జూస్ షాపులో వచ్చిన వాళ్ళకి మన పిల్ల జూసులు అందివ్వడమా? వాళ్ళు ఆ రెండురోజులకు గాను ఇచ్చే నూరు డాలర్లు మనం ఒక పూట రెస్తారెంట్ లో భోజనం చేయడానికి మీరు ఖర్చు పెట్టే సొమ్ము. ఎవరైనా వింటే నవ్విపోతారు. ఇంట్ళో పూచిక పుల్ల ఎత్తు పని చెప్పవు పాపకు. అంత గారంగా పెంచుతూ ఇదేమి ప్రారబ్ధం ” ఆక్రోశాన్నంతా వెళ్ళగక్కుతూ అడిగింది ఆవిడ.
“ ఇంత సేపు ఇదే మనసులో పెట్టుకుని మధనపడ్డావన్నమాట. అప్పుడే అనుకున్నా ఎదో వుంది సంగతి అని.” నవ్వుతాలుగా తేల్చేయబోయింది రమ.
“ ఎగతాళి కాదు. విషయం చెప్పు. “ నిగ్గదీసిన అమ్మకు వివరంగా చెప్పక తప్పలేదు రమకు.
“ అమ్మా! దీన్ని గురించి మా మధ్యన యుద్ధాలు జరిగాయి. ఇక్కడ ఇలా వీక్ ఎండ్ పార్ట్ టైం పనులు ఈ స్కూలు, కాలేజీ, పిల్లలు చేయడం మామూలే. అమ్మా ! ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులు కూడ రెస్టారెంట్స్ లో పనిచేస్తారు. నువ్వే చూసావు కదా మనం ఫ్రీమోంట్ లో కోల్డ్ స్టోన్ ఐస్ క్రీం షాప్ కు వెళ్ళినప్పుడు అక్కడ సర్వ్ చేసిన అమ్మాయి కాలేజిలో ఎం ఎస్ చదువుతున్నానని చెప్పలేదు? ఈ ఉద్యోగాలేమీ అల్లటప్పాగా ఇచ్చేయరు అమ్మా. ఇంటర్వ్యూలు వుంటాయి. ఆత్మ విశ్వాసంతో, ధైర్యంగా, నిజాయితీగా చెప్పిన వాళ్ళనే ఎంపిక చేసుకుంటారు. “
“అప్పూ ఇక్కడ పుట్టి పెరిగిన పిల్ల. నాకు స్వేచ్చ లేదా? అన్ని విషయాల్లో నాకు అడ్డు చెప్తారెందుకు ?” అని పోట్లాడుతుంది. అప్పూ స్కూలు గ్రేడ్స్ ఎప్పుడు తొంభై అయిదు పైనే వుంటాయి. నువ్వు అన్నట్టు నాలుగు రాళ్ళ కోసం కాదు అమ్మా! కష్టపడి సంపాదిస్తే పిల్లలకు డబ్బు విలువ తెలుస్తుంది అని నువ్వే అనేదానివి. నాకు గుర్తుంది అమ్మా! నీ చీరలకు నేను ఫాల్స్ కుట్టి పెడితే దర్జీకి ఇచ్చే డబ్బు నాకు నా పాకెట్ మనీ పైన అదనంగా ఇచ్చేదానివి.
“ డబ్బు సంగతి పక్కన పెడితే, పని చేసే చోట బాధ్యత నేర్చుకుంటారు. ఎవరితో ఎలా మసలాలో తెలుస్తుంది. జవాబుదారీతనం అలవడుతుంది. అందుకే సరే అని అన్నాము. పేరుకు గంటకు పన్నెండు డాలర్లు ఇచ్చే పార్ట్ టైం ఉద్యోగాలే గానీ బాధ్యతగా లేకపోతే ఊరుకోరు తెలుసా అమ్మా? అప్పూ స్నేహితురాల కెల్లీ అని, అమెరికన్ పిల్ల, థియేటర్ లో పనిచేసేది. వాళ్ళకి వారానికి కి రెండు టికెట్స్ ఉచితంగా ఇస్తారుట. మంచి సినిమా అయితే అప్పూని కూడా తీసుకువెళ్ళేది. క్రిస్మస్ కి వాళ్ళ కజిన్స్ వస్తున్నారని నెల ముందే సెలవు కావాలి అని చెప్పింది. వాళ్ళు కుదరదు అన్నారుట. వారం ముందు మళ్ళీ ఇంకోసారి సెలవు గురించి అడిగి ఆ నాలుగు రోజులు పనికి వెళ్ళలేదు. అంతే ఉద్యోగంలో నుండి తీసేసారు. రేపు యూనివర్సిటీ చదువు అయ్యాక పెద్ద ఉద్యోగంలో చేరితే ఎలా నడుచుకోవాలో ఇక్కడ నేర్చుకుంటున్నారు కదా! మనదేశంలో కాస్త వున్నవాళ్ళు చిన్న ఉద్యోగాలు చేయడం అంటే చిన్నతనంగా భావిస్తారు అమ్మా. మధ్యతరగతి వాళ్ళూ అంతే. పాతికేళ్ళు వచ్చినా పాకెట్ మనీ కోసం అమ్మా నాన్నల మీద ఆధార పడతారు. ఇక్కడ అలా కాదు. పోయినసారి స్కూలు వాళ్ళు డిస్నీలాండ్ టూర్ వేస్తే రెండువందల డాలర్లు తన సంపాదనలో నుండి కట్టింది అప్పూ.“ అమ్మ దగ్గరగా వచ్చి కూర్చుని ఆవిడ మనసుకు సాంత్వన కలిగేట్టు చెప్పింది.
“సరే అక్కడ ఎలా వెలగబెడుతూందో నేనూ చూస్తాను. ఒక రోజు తీసుకు వెళ్ళు. మొన్న మీ స్నేహితురాలి సిల్వర్ జుబిలీ పెళ్ళి రోజు పార్టిలో పెద్దవాళ్ళకు పెట్టిన క్విజ్ లో నేను సరైన సమాధానం చెప్పానని జాంబా జూస్ కూపన్ ఇచ్చారు. అదిపెట్టి అప్పూ దగ్గర కొనుక్కుంటాను.” నవ్వు ముఖంతో అన్నారు మంగమ్మ గారు.
“ అవునూ మొన్న నువ్వు డాక్టర్ ని చూడడానికి వెళ్ళినప్పుడు పదిన్నరకు రమ్మని, ఆవిడకు తీరిక దొరక లేదని పదకొండున్నర దాకా కాచుకో బెట్టినందుకు నర్స్ క్షమాపణ చెప్పి నీకు స్టార్ బక్స్ కాఫీ కూపన్ ఇచ్చింది కదా.అది ఇంకా వాడుకోలెదు నువ్వు.”నవ్వుతూ గుర్తు చేసింది రమ.
—- —
రెండు వారాలు గడిచాయి. ఆ శనివారం ఇంటికి రావడమే ముఖం చిన్నబుచ్చుకుని వచ్చింది అపర్ణ. రాత్రి ఆకలి లేదని భోజనం వద్దని పడుకుంది.
“ పసిపిల్ల ఏమీ తినకుండా పడుకుంటే ఎలా? “ మంగమ్మగారు నొచ్చుకున్నారు.
“అమ్మా అందరికీ ఇడ్లీలు చేస్తున్నానని చెప్పాను. తనకు ఇడ్లి ఇష్టం లేదు తనకు ఇష్టమైనది చేస్తే తింటుందిలే “ అని “ అప్పూ దామ్మా నాన్న నీకోసం బరిటో చేస్తున్నారు “ అంటూ పిలిచింది.
“ ఐ యాం నాట్ హంగ్రీ” అనేసి మేడమీదకి వెళ్ళిపోయింది అపర్ణ.
మరునాడు అస్సలు విషయం తెలిసింది. తను పని చేసే చోట తన ఐఫోను ఎక్కడో పడేసుకుంది.
“ వెయ్యి డాలర్లు పెట్టి కొని రెండు నెలలు కాలేదు. ఇంత అశ్రద్ధ అయితే ఎలా?” కోపంగా గద్దించింది రమ.
“వెనుక జేబులో జాగ్రత్త గానే పెట్టుకున్నాను అమ్మా.” ఏడుపు గొంతుతో అంది అప్పూ.
“ సరే. వాళ్ళకు మెయిల్ పంపించు. దొరికితే మన అద్రుష్టం “ శాంతంగా అన్నాడు సారధి.
“సాయబు సంపాదన బూబమ్మ కుట్టుపోగులకు సరి ‘ అన్న సామెతలా వుంది. బంగారంవంటి ఐఫోను పోగొట్టుకుంది.” అంటూ ఆ రాత్రి తమ గదిలో భర్త మంగపతి గారి దగ్గర వాపోయారు మంగమ్మగారు.
రమ, సారధిల మాట ఏమో గానీ ఆ రాత్రి మంగమ్మగారికి నిద్ర పట్టలేదు.
మేడ మీద వున్న నాలుగు పడక గదుల్లో అతిధి గది వదిలి మిగిలిన మూడు గదుల్లో ఇద్దరు పిల్లలు, కూతురు, అల్లుడు పడుకుంటారు. మెట్లెక్కలేని పెద్దవాళ్ళ కోసం క్రింద వున్న పడక గది మంగమ్మగారు, మంగపతి గారు వాడుకుంటారు.
ఆదివారం చిన్నబోయిన మోముతోనే డ్యూటీకి బయలుదేరిన అపర్ణ తిరిగి వచ్చేటప్పుడు కళకళలాడే ముఖంతో లొపలికి అడుగు పెడుతూనే “ అమ్మమ్మా ఐ ఫౌండ్ మై ఫోన్ “ అంటూ మంగమ్మగారిని హత్తుకుంది.
“ ఎలా దొరికిందమ్మా? ఎక్కడ పడిపోయింది? సంభ్రమంగా అడిగింది ఆమె.
“ కౌంటర్ దగ్గరే క్రింద పడి వుందిట. అక్కడ పని చేసే ఇంకో అమ్మాయికి దొరికింది. “ రమ చెప్పింది.
“ పోనీలే కష్టపడి సంపాదించిన సొమ్ము ఎక్కడికి పోతుంది? “ అంటూ అప్పూ తల నిమిరింది ఆవిడ.
మంగళవారం మధ్యాహ్నం నాలుగు అవుతున్నా అపర్ణ ఇంటికిరాలేదు. కంగారు పడి కూతురికి ఫొన్ చేసారు మంగమ్మగారు. “ ఈ రోజు స్కూలు నుండి తన స్నేహితురాలు టాన్యాతో షాపింగ్ కు వెళ్లుతున్నాము. సాయంత్రం ఆలస్యంగా వస్తాను అని చెప్పింది అమ్మా. నీకు చెప్పడం మరచిపోయాను. “ అంది రమ.
రాత్రి తొమ్మిదింటికి వచ్చింది అపర్ణ ఏవో బాగ్ లు మోసుకుని. నేరుగా మేడమీదకి వెళ్ళిపోయింది.. కాసేపు అయ్యాక రమ చెప్పింది “అప్పూ డిన్నర్ చేసి వచ్చింది అమ్మా నువ్వు పడుకో “ అని.
“అదేంటి? మీకు చెప్పకుండానా? “ అని ఆశ్చర్య పోయింది ఆమె.
“ చెప్పింది అమ్మా. “ అంది రమ.
“ ఏం పిల్లలో! ఏమి అమెరికానో ! “ అనుకుంటూ పడుకుంది ఆవిడ.
మరునాడు పొద్దున్నే ఒక అడుగుకి మూడు మెట్లు దూకుతూ దిగి వచ్చింది అపర్ణ.
రమా, సారధి కాఫీ తాగుతున్నారు.
“ హాపీ వెడ్డింగ్ ఆనివర్సరీ అమ్మా,నాన్నా “ అంటూ వాళ్ళిద్దరినీ కౌగలించుకుంది.
“ అవును కదా! రాత్రి పడుకోబోయే ముందు అనుకున్నాను. పొద్దునకు మరిచిపోయాను అమ్మలూ. పెళ్ళి రోజు శుభాకాంక్షలు మీ ఇద్దరినీ. ఒకేసారి అన్నారు మంగపతిగారు, మంగమ్మగారు
“ మీకేమి గిఫ్ట్ తెచ్చానో చూడండి” అంటూ రాత్రి మోసుకు వచ్చి అ బాగ్స్ లో నుండి వాళ్ళ అమ్మకు మంచి స్కర్ట్, బ్లౌజ్; నాన్నకు వింటర్ జాకెట్ తీసి అందించింది.
“ ఒహ్! లవ్లీ తల్లీ. థాంక్యూ. “ అని మెరిసిపోతున్న కన్నులతో కూతుర్ని బుగ్గ మీద పెట్టారు రమ, సారధి.
“ అమ్మానాన్నల నుండి బహుమతులు అందుకోవడమే కాదు, తమ స్వంత సంపాదనతో కొని ఇవ్వడంలోని ఆనందం కూడా తెలుసుకుంటున్నారు “ అన్నట్టు అమ్మ వైపు అర్థవంతంగా చూసింది రమ.
మంగమ్మగారి ముఖంలో సంతృప్తితో కూడిన చిరునవ్వు తొంగిచూసింది.

————- —————. ————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *