April 16, 2024

కంభంపాటి కథలు – మాటరాని మౌనమిది

రచన: కంభంపాటి రవీంద్ర

ఒరే నాన్నా .. ఎలా ఉన్నావు ?
నీకు ఇదంతా ఎందుకు రాయాలనిపించిందో తర్వాత చెబుతాను .. నీ చిన్నప్పుడు తాతగారికి గుండె జబ్బు బాగా ఎక్కువయ్యి, హాస్పిటల్ లో చూపించుకోడానికి మన ఊరొచ్చేరు గుర్తుందా ? ఒక్క రోజు హాస్పిటల్ లో ఉండేసరికి ‘బాబోయ్ .. నన్ను చంపేయనైనా చంపేయండి .. గానీ ఈ ఆసుపత్రిలో ఒక్క క్షణం కూడా ఉండను ‘ అని తెగ గోల చేసేస్తే మన ఇంటికి తీసుకొచ్చేసేము .
ఆయన పోతారేమోననుకుని కంగారుపడి మీ అత్తయ్యలూ , బాబాయ్ వాళ్ళ కుటుంబం అందరూ మన ఇంటికి వచ్చేసేరు . నువ్వేమో చిన్న పిల్లాడివి, వాళ్ళందరూ ఎందుకొచ్చేరో అర్ధం చేసుకునే వయసు కాదు , అందుకే హుషారుగా మంచం మీద పడుకున్న మీ తాతయ్య దగ్గిరకి వెళ్లి ‘తాతయ్యా .. మనింటికి చుట్టాలందరూ వచ్చేసేరు .. ఇంక హాయిగా ఆడుకోవచ్చు ‘ అని నువ్వు మురిసిపోతూ చెబుతూంటే , అంత సుస్తీ చేసినాయనా హాయిగా నవ్వేరు !
ఆ తర్వాత ఏదో మంత్రం వేసినట్టు, ఆయన చాలా త్వరగా కోలుకున్నారు .. తిరిగి ఊరు వెళ్లేముందు ఆయన నవ్వుతూ ఒక మాట ఉన్నారు ‘చుట్టూ , నా పిల్లలు , మనవలూ ఇంత సందడిగా ఉండేసరికి .. ఆ దేవుడికి కూడా జాలేసి ..”సరేలే .. వీణ్ణి కొన్నాళ్ళు ఇక్కడే ఉండనిద్దాం “అనుకుని మళ్ళీ నా ఆరోగ్యం నాకు ఇచ్చేసేడు’ . నాలుగు వారాలు కూడా బతకడం కష్టం అని డాక్టర్లు చెప్పిన మనిషి ..ఆ తర్వాత ఐదేళ్ల పాటు హాయిగా బతికి , నిద్దర్లో పోయేరు .
ఆయన చెప్పింది నిజమే కావచ్చు .. మన చుట్టూ మనవాళ్ళు ఉంటే.. హమ్మయ్య .. నా కోసం వీళ్ళున్నారు అనే భావన వచ్చి .. ఏ పరిస్థితినైనా, రోగాన్నైనా ఎదిరించే ధైర్యం వస్తుంది!
మీ నాన్నగారు ఆక్సిడెంట్ లో పోయినప్పుడు , నాకు నా జీవితం మీద విరక్తి పుట్టుకొచ్చేసింది . ఆ సమయంలో మళ్ళీ మన చుట్టాలే మేమున్నాం అని ధైర్యం చెప్పి, నిన్ను పెంచే బాధ్యత ని గుర్తుచేసేసరికి మళ్ళీ మామూలు మనిషినయ్యాను !
మన చుట్టాలెవరూ మనకి ధన సహాయం చెయ్యలేదు .. నేను కూడా తీసుకోను. నా కష్టంతో నిన్ను పెంచగలననే నమ్మకం నాకుంది … కానీ .. ‘నీ కోసం మేమున్నాం ‘ అనే మాట ఉంది చూడు .. అది వెయ్యి ఏనుగుల బలంతో సమానం . నాకు ఆ బలం ఇచ్చిన మన చుట్టాలందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను .
అఫ్కోర్సు .. ఇప్పుడు రోజులు మారిపోయి , ఎవరి లోకంలో వాళ్ళు బతుకుతున్నారనుకో .. అందరూ పెద్దవాళ్ళైపోయేరు .. ఈ పెరిగిన ట్రాఫిక్ మూలంగా ఒకే ఊళ్ళో ఉంటున్నా .. ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవాలంటే .. ఏదో ఊరెళ్ళాలి అనేంత టైం పడుతూంది .. దాంతో ఒకళ్ళనొకళ్ళం కలుసుకోడమే గగనం అయిపోతూంది .
ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే .. భవిష్యత్తులో మనుషుల మధ్య బంధాలెలా ఉంటాయోనని .. తల్చుకుంటే భయం వేసేస్తూంది! ఎప్పటిదాకానో ఎందుకు ఇప్పుడే చూడు .. నాకు వారం రోజుల్నుంచీ జ్వరం .. ఇంట్లో నువ్వు, కోడలు, పిల్లలు అందరూ ఉంటారు. ఫోన్లతో తప్ప ఒకళ్ళతో ఒకళ్ళు ఎప్పుడైనా మాట్లాడుకుంటారా? ఇలా అందరూ ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటూంటే , నాకు “మాటరాని మౌనమిది” పాట గుర్తుకొస్తూంటుంది నువ్వు నా దగ్గిర మందులు పెట్టేసి , సాయంత్రం ఓసారి “ఆఁ .. ఎలా ఉన్నావు ..?.. టాబ్లెట్ వేసుకున్నావా ..ఓకే..” అనేసి వెళ్ళిపోతావు.
ఇవి తప్ప మన మధ్య మాట్లాడుకోడానికి వేరే మాటలే ఉండవా ? ఏదో హోటల్లో కస్టమర్ కి టేబుల్ మీద ప్లేట్ పెట్టేసి వెళ్ళిపోయినట్టు ..కోడలు భోజనం, టిఫిను నా గదిలో పెట్టేసి , ఓ నవ్వు నవ్వేసి ఫోన్ చూసుకుంటూ వెళ్ళిపోతుంది .. తనే కాదు .. నీక్కూడా .. ఎప్పుడూ ఓ చేతిలో ఫోన్ ఉండాల్సిందేనా ? మీ ఇద్దరూ మీ ఫోన్లతో వాట్సాప్పులు చూసుకుంటూ బిజీగా ఉంటే , మనవలిద్దరూ చెరో టాబ్లెట్ పట్టుకుని వాళ్ళ లోకంలో వాళ్ళుంటారు . మొన్నెప్పుడూ నీ కూతురు దాని ఫ్రెండ్ తో అంటూంది ‘బ్రహ్మ దేవుడిలాగా నాకు కూడా నాలుగు చేతులు ఉంటే బావుణ్ణు .. ఎంచక్కా .. రెండు టాబ్లెట్స్ ఒకేసారి చూసుకోవచ్చు ‘. ఇలా ఉన్నాయి పిల్లల ఆలోచనలు !
అందరం సరదాగా కూచుని మాట్లాడుకోవడం అన్నది ఎప్పుడు అని అడిగితే ఠక్కున సమాధానం చెప్పగలవా ? చెప్పలేవు .. ఒకటి మటుకు అర్ధమైంది .. మనకంటూ ఓ మనిషి ఉన్నా లేకపోయినా తేడా ఉండదు కానీ చేతిలో ఫోన్ లేకపోతే మటుకు మనిషి బతకలేని పరిస్థితి కి వచ్చేసేడు . ఇదేదో ఈ వారం రోజులుగా వచ్చిన కోపం అనుకోకు .. చాలాకాలం నుంచి ఇంట్లో చూస్తున్నాను కదా .. ఇదే తంతు .
అందుకే .. నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చేసేను .. ‘అబ్బే .. సూసైడ్ లాంటివి చేసుకుంటానేమో ‘ అని కంగారు పడకు .. ఈ ఇంట్లో నాకంటూ ఓ గుర్తింపు లేనప్పుడు .. నా దారి నేను వెతుక్కుని , ఎక్కడో ఒక చోట హాయిగా బతగ్గలననే నమ్మకం నాకుంది . నాకోసం వెతకడం లాంటివి చెయ్యద్దు .. వృధా ప్రయాస .
అన్నట్టు ఇదంతా ఉత్తరం కింద రాయడం నాకు చాలా ఈజీ .. కానీ నువ్వు ఏదైనా ఫోన్లో ఉంటే తప్ప చదవవు కదా .. అందుకే.. ఇదంతా కష్టపడి వాట్సాప్ లో టైపు చేసేను ..
ఎప్పటికైనా మీరందరూ మారాలని , మెషిన్ లతో కాకుండా మనుషులతో బంధాలు పెంచుకోవాలని, దీవిస్తూ .. అమ్మ

2 thoughts on “కంభంపాటి కథలు – మాటరాని మౌనమిది

 1. రవీంద్ర గారూ…
  ఇది కథ కాదు ప్రస్తుతం మనందరి జీవితాలను ప్రతిబింబించే నిజమైన వ్యధ.
  మొబైల్ ఫోన్ అనేది అన్నివైపులా పదునైన అంచులున్న చురకత్తి. మనం ఎలా ఉపయోగించినా…’ గాటు ‘ తప్పటం లేదు.

  మీ మార్క్ ‘హాస్యం’ లేకపోయినా కొసమెరుపు తో పాఠకులకు కలవరపాటు కలిగించారు.

  ధన్యవాదాలు
  సుందరం శొంఠి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *