April 16, 2024

జలజాక్షి.. మధుమే( మో) హం

రచన: గిరిజారాణి కలవల

“వదినా! ఓ పంకజం వదినా!” అంటూ వీధంత గొంతేసుకుని కేకేస్తూ వచ్చింది జలజాక్షి .
ఆ కేక వినపడగానే.. మళ్లీ తెల్లారిందీ దీనికి.. ఈ పూట ఏ అప్పుకోసమో…తెచ్చిన నెల వెచ్చాలు అన్నీ ఈ జలజానికి చేబదుళ్ళు ఇవ్వడానికే సరిపోతున్నాయి.. ముదురుపాకం పట్టిన బెల్లప్పచ్చులా పట్టుకుంటే వదలదు.. అని మనసులో అనుకుంటూ.. పైకి చిరునవ్వు చిలికిస్తూ..”ఏంటి ? జలజం వదినా.. పొద్దున్నే నీ దర్శనం అవందే నాకు తెల్లారదనుకో.. నీ పిలుపే నాకు బూందీ లడ్డూ.” అంది పంకజం.
“ మా వదిన మనసు పాలకోవానే.. ఎంత మంచిదానవో.. నాకు తెలీదూ నీ మనసు వెన్న వేసిన నెయ్యి అప్పమే.. ఇట్టే కరిగిపోతావు..” అంటూ తియ్యగా ఉబ్బేసరికి.. పంకజం అరిసెలా పొంగిపోయింది.
“ఔనూ! ఏంటొదినా! ఇంత పొద్దు పొద్దున్నే వచ్చావు.. ఏదైనా విశేషమా?” అంది పంకజం..
“విశేషమూ లేదు.. విడ్డూరమూ లేదు.. మా చంటాడి పుట్టినరోజు ఈరోజు.. సేమియా పాయసం చేద్దామని చూస్తే పంచదార నిండుకుంది.. ఇదిగో ఈ గ్లాసుడు పంచదార ఇయ్యి.. సరుకులు తెప్పించగానే ఇచ్చేస్తాను.. “అంటూ కొంగు చాటు నుండి.. ఓ పేద్ద గ్లాసు తీసి ముందుకు చాపింది జలజం.
“ఇప్పటికే ఇలాంటి గ్లాసులతో అరడజనుసార్లు పంచదార ఇచ్చిన గుర్తు నాకు..”అని పంకజం అనేసరికి..
“అయ్యో.. నువ్వు గుర్తు చేయాలా వదినా! కేలండర్ మీద రాసుకుంటూనే ఉన్నా.. మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాలే.. అయినా అన్నయ్య గారికి షుగర్ ఫాక్టరీ యే ఉందట కదా! మా ఆయన చెప్పారు “అంది జలజం..
“ఆ.. ఉంది.. ఉంది.. ఏకంగా వంట్లోనే ఉంది ఉయ్యూరు షుగర్ ఫాక్టరీ” వెటకారంగా అంది పంకజం.
” ఏంటోయ్.. భార్యమణీ.. బందరు లడ్డూ.. ఏదో నా మీద సైటైర్లు వేస్తున్నావూ“ అంటూ వచ్చాడు పంకజం భర్త పుల్లారావు.
“ఆ.. మీరు మాత్రం సెటైర్లు వేయడంలో తక్కువేంటీ.. కాస్త బొద్దుగా ఉన్నాననేగా.. నన్ను బందరు లడ్డూ అంటున్నారు.. అదీ జలజం ముందు..” అంది పంకజం మూతి తిప్పుకుంటూ..
“ఆ.. చెల్లెమ్మ మనకేం పరాయిది కాదుగా.. అలా ఉడుక్కోకే..” అన్నాడు.
“చూడు.. జలజం.. మీ అన్నయ్య.. నేను కాస్త బొద్దుగా ఉండేసరికి ఎలా అంటున్నాడో.. నేను ఇలా ఉన్నా.. నాకు ఇంతవరకూ.. బిపీ.. సుగరూ.. ఏవీ దగ్గరకి రాలేదు… ఈయనగారికే వంట్లో ఉన్న షుగర్ కి రోజూ చీమలు పట్టడమే.. పౌడర్ బదులు చీమల మందు రాసుకోవాలి.. అంతలా పెంచుకున్నారు డయాబెటిస్ ని “ అంది పంకజం నిష్టూరంగా..
“ఔనా.. వదినా.. అన్నయ్య గారికి షుగర్ ఫాక్టరీ ఉందని మా ఆయన అంటూంటే నిజమే అనుకున్నా.. ఉన్నది ఈ షుగర్ ఫాక్టరీ యా? “ అంటూ ముక్కున వేలు వేసుకుంది జలజం.
“మీ వదిన మాటలు పట్టించుకోకమ్మా.. ఆ షుగర్ నాకే ఉందీ.. తనకి రాలేదని కుళ్ళు..ఇదిగో చూడవోయ్ రిపోర్టు లు.. ఇప్పుడ అన్ని షుగర్ టెస్టులూ చేయించకుని
వస్తున్నాను.. బావుంది.. అన్నీ నార్మల్ గా ఉన్నాయి.. ఇలాగే ప్రొసీడ్ అవమని డాక్టర్ గారు చెప్పారు. “అన్నాడు పుల్లారావు
“ఆ.. లేక లేక ఈ షుగర్ లేదనే కుళ్ళుకోవాలా మహాశయా! మీరు లక్ష రూపాయలు ఆశ పెట్టినా ఈ మాయదారి షుగర్ ని కోరుకోను.. మీకో దండం.. మీ షుగర్ కి ఓ దండం. “ అంది పంకజం.
“పంకజం వదినకి చతురలు ఎక్కువ.. భలే మాట్లాడుతుంది.. “ అంది జలజం… మనసులో మాత్రం… ఈవిడగారిని పొగడకపోతే.. నా గ్లాసుడు పంచదారకి ఎగనామం పెడుతుంది.. అనుకుంటూ..
“చతురలూ కాదు.. చట్టుబండలూ కాదు జలజమొదినా! ఈయన సంగతి నీకు తెలీదు.. అమ్మో.. వెయ్యి కళ్ళతో కనిపెట్టాలి. ఎప్పుడూ వంటింట్లో డబ్బాలు వెతుక్కుంటూనే ఉంటారు.. ఏ స్వీట్ కనపడుతుందా.. మెక్కేద్దామా అని.. అయినా.. నేను లేనూ.. ఎక్కడికక్కడ మీ అన్నయ్య ని కంట్రోల్ లో పెట్టడానికి.. మొన్నటికి మొన్న తీపి ప్రసాదాలు ఎటూ పెట్టడం లేదూ.. కనీసం కాఫీలో కొంచెం షుగర్ వేయమని ఒకటే పేచీ… నేనొకటే సమాధానం చెప్పాను.. అలాగే వేస్తా కానీ… మొన్ననే గడప దాటుతూ బోర్లా పడి కాలి వేలు చితక్కొట్టుకున్నారు… ఇప్పుడు ఇలా పంచదార అలవాటు పడి షుగర్ పెరిగితే.. పొరపాటున గాంగ్రీన్ వచ్చి.. ఆ పచ్చిపులుసు పద్మనాభం లాగా.. కాలు తీసేసే పరిస్థితి వస్తే.. ఒంటికాలితో కుంటడం ప్రాక్టీస్ చేయాలి మరి సరేనా!అనేసరికి మళ్లీ కాఫీలో పంచదార మాట ఎత్తలేదు మీ అన్నయ్య. అలాగే అప్పుడప్పుడు ఉప్మాలో గుప్పెడు జీడిపప్పు వేయమని అడిగినప్పుడు.. హార్ట్ఎటాక్ వచ్చి ఒక బైపాస్.. రెండు స్టంటులు వేయించుకున్న మూడో వీధిలోని హరిబాబు గారిని గుర్తు చేస్తాను.“ అంది పంకజం
జలజం “అదేంటొదినా! అలా అంటావూ !?” బుగ్గలు నొక్కుకుంది.
“ఔనొదినా.. షుగర్ వచ్చేసరికి లేనిపోని తిండి కోరికలు పెరుగుతాయి కాబోలు..
పోనీ మైసూరు బోండా చేయవే అంటే… ఇంకేమైనా ఉందా మైదా షుగరు వారికే కాదూ అందరికీ ప్రాణాంతకం..అని చెపుతాను..
సరే తీపెటూ వద్దన్నావు.. కనీసం ఆవకాయ అయినా వేస్తున్నావా!? అంటే..
బీపీ, షుగరూ అన్నదమ్ములు…కలిసే వచ్చేస్తాయి…. వాటికి తోడుగా వచ్చే కొత్త జబ్బు లతో.. ఫలానా వారిలా మీరూ యూరిన్ బ్యాగ్ పట్టుకుని తిరగాలి మరి…”అని చెపుతూ ఉంటాను అంది పంకజం.
“అదేంటీ.. హేండ్ బేగ్ పట్టుకుని తిరుగుతారు కానీ.. ఈ యూరిన్ బేగ్ ఎంటొదినా.. మరీ విచిత్రంగా చెపుతావు నువ్వు.. “ అంది జలజం..
“నీకు విచిత్రంగానే ఉంటుంది జలజం.. ఆ బాధ పడేవారికి తెలుస్తుంది.. తీపి ఎటూ పెట్టడం లేదు.. కనీసం ఆవకాయైనా వేయమంటూ ఉంటారు. ఒకదాని వెంట ఒకటి జంటగా పెరుగుతాయి ఆ షుగరూ, బీపీ..మరి ఆవకాయలలో ఉప్పు, కారాలకి షుగరు వలన బలహీనమైన కిడ్నీలు పాడైపోతే డైలీ డయాలసిస్సేగా… ఎందుకండీ.. నిజం చెపితే నిష్టూరం అంటారు ఇదే కాబోలు.. ఏమండోయ్.. పతిదేవులవారూ! నా మీద కోపంతో మరీ అంతలా గట్టిగా పళ్ళు నూరకండి, షుగర్ వాళ్ళ కు పళ్ళు అసలే తొందరగా ఊడతాయట… సోమయ్యను చూడలేదూ…!? ఎంత కోపం వచ్చినా మరీ అంతలా కాళ్ళలా నేలకు గుద్దుకుంటూ వెళ్ళకండి… షుగరు వారికి మొదట సమస్య వచ్చేదే పాదాలలో రక్తప్రసరణ తగ్గటం వల్లనట… ఏమండోయ్.. ఇంతకీ కంటి చూపు ఎలా ఉందీ? కళ్ళకి కూడా ముప్పే అండోయ్.. కాస్త చూపించుకోండి ఓసారి.. అయ్యోయ్యో! అలా జుట్టు పీక్కుంటారేం… షుగర్ వాళ్ళ కెటూ జుట్టు త్వరగానే ఊడుతుందటకదా!.. “ అంటూ పంకజం భర్తని ఆట పట్టించసాగింది.
ఇంతలో పక్కన ఢాం అని చప్పుడు..
చూసేసరికి.. జలజం…. నేల మీద వెల్లకిలా పడి కనపడింది.
“అయ్యో… జలజమా! ఏమైంది ? అలా పడిపోయావు? ఏమండీ కాస్త మంచినీళ్లు తీసుకురండి.. “ ఆదుర్దాగా అరిచింది పంకజం.
మొహం మీద కాసిని నీళ్లు కొట్టేసరికి నెమ్మదిగా తేరుకుని చుట్టూ చూసింది జలజం.
“ఏమైంది వదినా? ఇప్పుడు ఎలా ఉంది?” అంటూ లేవదీసి కుర్చీలో కూర్చోపెట్టి.. ఫేన్ స్పీడు పెంచింది పంకజం..
“ఏంటి చెల్లెమ్మా.. ఏమైంది? “అంటూ కంగారుగా పుల్లారావు అడిగాడు..
బిత్తర చూపులు చూస్తూ.. జలజం.. లోగొంతుతో… “నిన్న బ్లడ్ టెస్టులు చేయించుకున్నాను.. షుగర్ వచ్చిందని డాక్టర్ చెప్పారు.. ఏదోలే పెద్ద పట్టించుకోక్కర్లేదు అనుకున్నా. కానీ ఇప్పుడు పంకజం వదిన చెప్పినవి వింటూంటే.. కంగారు వచ్చేసింది.. భయంతో కళ్ళు తిరిగాయి అన్నయ్యా!” అంది జలజం.
“మామూలుగా నేను స్వీట్స్ అంటే పడి చచ్చిపోతాను. పేరుకి పిల్లలు కోసం అని చేయడం.. నేను లాగించేయడం.. ఇదే పని నాకు.. గులాబ్ జాములు తినడం మొదలెడితే చాలు.. ఆపే పనే లేదు… మొదటిది ఆప్యాయంగా.. రెండోది ఆత్రంగా.. మూడోది ఆరాటంగా… గుటుకు గుటుకు మింగుతూనే ఉంటాను.. హల్వా చేసుకుంటే చాలు కప్పులు కప్పులు లాగించడమే.. జాంగ్రీలు అయితే పదివేళ్ళకీ పదీ తగిలించుకుని… పరపరా నమిలేస్తూ ఉంటాను.. అంతపిచ్చి నాకు… రెండు రోజులకోసారి తీపి పురుగు కుడుతూ ఉంటుంది నాకు..ఇక నుంచీ వళ్ళు దగ్గర పెట్టుకుంటాను.. స్వీట్స్ తినడం మానేస్తాను… వాకింగ్ మొదలెడతాను… పనిలో పనిగా మా ఆయన్ని కూడా లాక్కెడతాను. నాకు తగ్గితే నీ నోట్లో కేజీ పంచదార అభిషేకం చేస్తాను.. “ అంది జలజం.
“ అభిషేకాలూ వద్దు కానీ… . నువ్వేం బెంగ పెట్టుకోకు.. వంటలలో ఎలా జాగ్రత్తలు తీసుకుని వండాలో మీ వదిన దగ్గర తెలుసుకుని.. ఆ ప్రకారం మొదలెట్టు… నెల రోజుల్లో షుగర్ కంట్రోల్ లోకి రాకపోతే నా పేరు పుల్లారావే కాదు. షుగర్ గురించి ఫికర్ కాకు.. “అంటూ ధైర్యం చెప్పాడు పుల్లారావు.
“ఇదిగో.. జలజం వదినా! పంచదార అడిగావుగా.. తీసుకో.. “అంటూ గ్లాస్ నిండా పంచదార తెచ్చింది పంకజం..
“వామ్మో! వదినా! పంచదారా వద్దు.. పాలకోవా వద్దు. . ఈ రోజు నుంచి.. నో స్వీట్స్.. నో పాయసమ్స్.. నో ఐస్క్రీమ్స్.. వంట్లో ఉన్న తీపిని తగ్గించుకుంటే.. లైఫ్ స్వీట్ గా.. ఉంచుకోవచ్చని తెలుసుకున్నాను.. ఆరోగ్యవంతమైన డయాబెటిక్ లేని జీవితమే.. మూడు లడ్డూలూ.. ఆరు జిలేబీలూ .. నువ్వు, అన్నయ్య.. చెప్పినవన్నీ గుర్తు పెట్టుకుని ఇక నుంచి జాగ్రత్తలు తీసుకుంటాను.. . అంటూ జలజం ఖాళీ పంచదార గ్లాస్ తీసుకుని వెళ్లిపోయింది.
“హమ్మయ్య షుగర్ భూతాన్ని చూపించి…షుగర్ అప్పు ఎగ్గొట్టి.. జలజాన్ని బెదరకొట్టగలిగాను” అనుకుంది పంకజం..

2 thoughts on “జలజాక్షి.. మధుమే( మో) హం

  1. వాస్తవపరిస్థితులను మంచి సెటైరికల్ గా రాసిన విధానం బాగుంది. అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *