April 22, 2024

రాజీపడిన బంధం – 5

రచన: ఉమాభారతి కోసూరి

సందీప్, శ్యాంల కోసం నా ఈ నిరీక్షణ క్షణం ఓ యుగంలా గడుస్తుందా అనిపిస్తుంది. ఆదుర్దాతో తలనొప్పిగా అనిపిస్తే….. కాసేపు కళ్ళు గట్టిగా మూసుకున్నాను. అలా గంటకి పైగా సమయం గడిచాక, బాబుని భుజాల మీద ఎక్కించుకొని, విజయ్ చేయి పుచ్చుకొని తిరిగి వస్తున్న శ్యాంని చూసాక గాని మనసు కుదుట పడలేదు..
దగ్గరగా వచ్చాక, “వీడు తమరి లాగానే సుకుమారం, నడవలేక ఒకటే ఏడుపు. నా భుజాల మీదే స్వారి” అంటూ సందీప్ ని క్రిందికి దింపారు శ్యాం..
‘ఏ దెబ్బా తగలకుండా నవ్వుతూ శ్యాంతో తిరిగి వచ్చిన బాబు’ .. ఇది కలా? నిజమా? అనుకున్నాను. బాబు క్షేమంగా ఉన్నందుకు హాయిగా ఊపిరి తీసుకున్నాను. బాబుకి తండ్రి వల్ల హాని కలగవచ్చన్న నా ఊహ అపోహేనేమో! అన్న ఆలోచన నాకు ఎంతో ధైర్యానిచ్చింది.
**
డ్రైవింగ్ నేర్చుకున్నాక వారానికో రోజు పశు-సంరక్షణ సంస్థలో వాలంటరీగా సాయం జేయడం, అత్తయ్యవాళ్ళని ఆదివారాలు గుళ్ళకి, యోగా క్లాసుకి తీసుకెళ్లడం చేస్తున్నాను.
ఐదోయేడు రాగానే సందీప్ ని ఇంటి దగ్గరి కాన్వెంట్ లో వేసాము. వాడిని స్కూల్లో వదిలి, మార్కెట్ పని కూడా చేసుకొని వస్తుంటాను.. నాకంటూ కారు చేతిలోకి వచ్చాక పనులు చేసుకోవడం హాయిగా ఉంది.
**
“సందీప్ క్రికెట్ ఆటలో రాణిస్తాడేమో! ఇది సరయిన వయస్సు మొదలెట్టడానికి” అన్నారు శ్యాం ఓ రోజు పొద్దున్నే కాఫీ తాగుతూ. అది విని కంగారుపడి ..అత్తయ్య వంక చూసాను.
“వాడికి నాకంటే మంచి కోచ్ ఎవరూ ఉండరు. రేపు ఆదివారం నుండే మా స్పోర్ట్స్ క్లబ్బుకి తీసుకువెళ్ళి కోచింగ్ మొదలు పెడతాను” అన్నారు ఉత్సాహంగా.
సందీప్ కి క్రికెట్ నేర్పాలని శ్యాం ఆత్రుతగా ఉన్నారని తెలుసును… నేనే ఒప్పుకోడంలేదు.
“ఐదేళ్ళ పసివాడికి అటువంటి ఆటలు వద్దని ముందే చెప్పానుగా! మరో రెండేళ్లు గడవనీయండి” అన్నాను.
“ఐదేళ్ళ వాడు నా బాట్ తో కాదుగా ఆడేది! చిన్నపిల్లల బాట్ కూడా ఉంటుంది. అన్నిటికి భయపడితే ఎలా?” అన్నారు నిస్సహనంగా.
అత్తయ్య కలగజేసుకున్నారు. “అయినా శ్యాంబాబు, నువ్వు నెలలో వారం రోజులు అగ్రా ఆఫీసుకి వెళ్తావు. ఇక్కడ ఉన్నా బిజీగా ఉంటావు…నీకు టైం ఎక్కడుంది? సందీప్ కి నీ ఇష్టప్రకారమే ఏ ఆట కావాలన్నా నేర్పించవచ్చు. మన ఇంటి పక్కనే ఉన్న క్లబ్బులో కూడా అన్ని ఆటలు నేర్పుతారు. పక్కనే కాబట్టి మీ నాన్నైనా తీసుకువెళతారు” అన్నారామె నవ్వుతూ కొడుకుతో…
అత్తయ్య నాకు వత్తాసు పలకడంతో కాస్త ఊపిరి తీసుకున్నాను.
**
సందీప్ కి మరో రెండు రోజుల్లో ఐదేళ్ళు నిండుతాయి. పెద్దెత్తున పుట్టినరోజు వేడుక జరపాలనే ఏర్పాట్లు చేస్తూ చాలా మంది స్నేహితులని ఆహ్వానించాము. అమ్మావాళ్ళు కూడా ఓ రోజు ముందే ఊరి నుండి వస్తున్నారు.
**
పార్టీ రోజున వాతావరణం ఆహ్లాదంగా ఉంది. అమ్మావాళ్ళతో సహా అందరం తెల్లారుఝామునే లేచాము. మామయ్య, శ్యాం ఉదయం నుంచే ఏర్పాట్లతో హడావిడిగా ఉన్నారు. పొద్దున్నే ఇంటిముందు షామియానా వేయించారు.
పదింటికల్లా అక్కడే పిల్లలకి ముందుగా ‘మ్యాజిక్ షో’ మొదలయ్యింది. చిన్నవాళ్ళతో పాటు నేను కూడా ఆ గారడీలు చూస్తుండిపోయాను.

గంటసేపు సాగిన మ్యాజిక్ షో తరువాత పిల్లల ఆటలపోటీలు మొదలయ్యాయి. సందీప్ సంతోషం చూసి మనసు నిండిపోయింది.. అక్కడి నుండి కదిలి వెళ్లి … భోజన సన్నాహాల్లో ఉన్న అత్తమ్మావాళ్లకి సాయం చేయసాగాను.
***
వంటకాలు భోజనహాల్లో సర్దుతుండగా, ఉన్నట్టుండి బయట నుండి సందీప్ ఏడుపు వినిపించింది.
పరుగున వెళ్ళేప్పటికి, తన కుడి మోచేతిని గట్టిగా పట్టుకొని.. గగ్గోలుపెడుతున్న బాబుని చూసి నా గుండె ఆగినంత పనయ్యింది.
వాడిని ఓదారుస్తూ ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తున్న తమ్ముణ్ణి పక్కకి తప్పుకోమని బాబుని వొళ్లోకి తీసుకున్నాను. కుడిచేయి మణికట్టు దగ్గర వంగిపోయినట్టుగా వేలాడుతుంది. సందీప్ నొప్పికి తట్టుకోలేకపోతున్నాడు.
అమాంతం వాడిని చేతుల్లోకి ఎత్తుకుని, కార్లో డాక్టర్ దగ్గరికి బయలుదేరాను. వినోద్ నాతో పాటే కారెక్కాడు. శ్యాం, మామయ్యతో వేరే కారులో మా వెనుకే బయలుదేరారు.
***
హాస్పిటల్లో ఎక్సరేలవీ అయ్యాక, డాక్టర్లు సందీప్ కి ‘మణికట్టు’ విరిగిందని ‘తేల్చారు. కొంత కాలం స్కూల్లో కుడిచేత్తో పనిచేయడం కూడా కష్టమే నన్నారు..
“ఇలా ఎలా అయింది? చెట్టు మీద నుండి పడ్డాడా?” అని అడిగారు డాక్టర్.
అప్పుడే నాకూ తోచింది. “అవును ఎలా ఈ ప్రమాదం జరిగింది?” అని పక్కనే ఉన్న తమ్ముణ్ణి అడిగాను.
“బావ, సందీప్ తో ‘ఆర్మ్ రెస్లింగ్’ చేసేప్పుడు, ఇలా జరిగింది. బాబు చేతిని తెలీకుండానే గట్టిగా వంచారేమో బావ. నొప్పితో పాపం వీడు గిలగిలా కొట్టుకుని బాగా ఏడ్చాడు కూడా. ఇలా అవుతుందని మేము అనుకోలేదక్కా” అన్న తమ్ముడి మాటలకు నా కాళ్ళకింద భూమి జారినట్టయ్యింది.
‘నేను కోరుకొన్న మార్పు ఆ తండ్రిలో రాకపోగా, బిడ్డ గిలగిలా కొట్టుకునేటంత బాధపెట్టి మరీ మణికట్టు ఎముక విరిచాడన్నమాట ఆ మొరటు మనిషి’ అనుకొంటూ కుర్చీలో కూలబడ్డాను. శ్యాంపై కోపంతో నా మనసు రగిలిపోయింది. నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది.
‘ఎలా? ఎలా? నా బిడ్డని కాపాడుకోవాలి? నా బిడ్డని తీసుకొని దూరంగా వెళ్లిపోవాలి. అంతే, పారిపోవాలి’ అనుకున్నాను నిశ్చయంగా.
**
సందీప్ మణికట్టు ఫ్రాక్చర్ కి కట్టు వేయడం అయ్యాక ..ఇంటికి తీసుకొని వచ్చాను. నా కన్నీరు, దు:ఖం ఆపుకోలేక అత్తమ్మా వాళ్ళ గది తలుపు గట్టిగా తట్టి, విసురుగా లోనికి వెళ్ళాను.
“మీ అబ్బాయి మొరటుతనం నా బిడ్డని అవిటి వాడిని చేసింది. ఇవాళ మణికట్టు, రేపు మరోటి. నేను భరించలేను అత్తయ్యా. నేను మా అమ్మావాళ్లతో వెళుతున్నాను. నన్ను క్షమించండి” అన్నాను బిత్తర పోయున్న అత్తగారికి మారు మాటాడే అవకాశం కూడా ఇవ్వదలచుకోక వెను తిరిగాను.
అత్తఃయ్య గబక్కున లేచి వడివడిగా నా వెనుకే అడుగులు వేస్తూ నా భుజం పట్టి ఆపారు.
“చూడు తల్లీ, నీ కోపం నాకు అర్ధమవుతుంది. కాని ఇది ఓ ఆక్సిడెంట్ తల్లీ. పిల్లలందరూ శ్యాంతో అదే ఆట అడుతున్నారట. మీ మామయ్య ‘వద్దురా’ అంటున్నా సందీప్ బాబే మొండికేసి వాళ్ళ డాడీతో ఆడి, ఇలా చేయి విరకొట్టుకున్నాడు” , “జరిగింది పొరపాటే తప్ప శ్యాం కావాలని చేసింది కాదమ్మా. మన గ్రహపాటు బాగోక ఇలాటివన్నీ మనకి జరుగుతున్నాయి” అంటూ అత్తయ్య వాపోయారు.
ఆవిడ చెప్పింది విన్నాక .. ఆవిడ చేతిని విడిపించుకుని .. ఆ గది నుండి బయటపడి… అమ్మావాళ్ళని హైదరాబాద్ కి బయలుదేర దీశాను.
నిముషాల్లో బట్టలు సర్దుకుని, సందీప్ ని తీసుకొని గది తలుపు దాటుతుండగా శ్యాం వచ్చారు. నా చేయి గట్టిగా లాగి మంచం మీద కూలేశారు. బలవంతంగా నా ముఖం పైకెత్తి, “ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఇలా పెద్దవాళ్ళ ముందు నన్నో నేరస్తుడిలా నిలబెట్టి, మీ అమ్మవాళ్ళతో వెళతావా? నీ ఉద్దేశం నాకేమీ నచ్చలేదు. పిల్లలకి దెబ్బలు తగలవా? అయినా నువ్వు వెళ్ళిపోతే నీ కుక్కల్ని ఎవరు చూసుకుంటారు?
అసలు నీకు, సందీప్ కి ఆ ఊళ్ళో ఇక్కడి లాగా వసతులు ఉన్నాయా? కనీసం కారు కూడా లేదుగా? డోంట్ బి క్రేజీ” అని ఏకబిగిన చెప్పాలనుకున్నదంతా చెప్పి నా చేతి మీద పట్టు వదిలారు శ్యాం.
ఆయన మీద నాకు కోపం రెట్టింపయింది. ఆయన మాటల్లో నా మీద గాని, బాబు మీద గాని కనీసపు శ్రద్ధ కనబడలేదు. పై పెచ్చు ఆ మాటల్లో నా పెంపుడు కుక్కల బధ్రతపై ఓ బెదిరింపు, మరో వెక్కిరింపు తోచాయి.
అదీ కాక అతని నిర్లక్ష్యం వల్ల ఇది మూడవసారి బాబుకి గాయాలవడం. ఈ సారైతే ఏకంగా రిస్ట్ ఫ్రాక్చర్. ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆలస్యం చేయక ఎలాగోలా గది నుండి బయటపడ్డాను. కన్నీళ్ళనాపుకుంటూ మా వాళ్ళతో హైదరాబాదుకి ప్రయాణమయ్యాను.
**
అమ్మావాళ్ళింట మునుపటి నా గదిలోనే సర్దుకున్నాను. వారం దాటినా, మనసులోని అలజడి ఏమాత్రం తగ్గలేదు. ఆలోచన కుదరక ఆదుర్దాగా ఉంది…బయటకి వెళ్లేందుకు ఆసక్తి లేదు. నిద్ర కరువైంది…
ఈవేళ తెల్లారుజాము నుండి తలనొప్పిగా కూడా ఉంది. గదిలో పైకప్పు వంక చూస్తూ పడుకొని ఉన్నాను. సందీప్ నా పక్కనే నిద్రపోతున్నాడు. నిద్రలో వాడు విరిగిన చేతిమీదకి ఒరగకుండా కనిపెట్టుకుని ఉండడం అలవాటుగా మారింది.
పెళ్ళై వెళ్ళిన ఆరున్నరేళ్ళల్లో నేనేనాడు పుట్టింట ఇన్నిరోజులు గడపలేదు. ఈ రాకకి దారి తీసిన సంఘటనలు మాత్రం సబబైనవి కావు. సందీప్ మణికట్టు విరిగిన నాటి జ్ఞాపకాలు నా మనసును అవిరామంగా కలిచివేస్తున్నాయి. సందీప్ చదువు కూడా అర్ధంతరంగా ఆగిపోయింది. ఓ మారు వాడిని ఇక్కడ డాక్టర్ వద్దకి కూడా తీసుకెళ్ళాను.
**
అత్తయ్యవాళ్ళని వదిలిపెట్టి వచ్చి రెండువారాలయింది. అత్తవారింట నా మీద ఆధారపడ్డ ఆ పెద్దవాళ్ళు, పనివాళ్ళు ఎలా ఉన్నారో? అన్న ఆలోచన మొదలయింది. పెంపుడు కుక్కల గురించి కూడా మనసులో గుబులుగా ఉంది. మామయ్య రోజంతా బాబుతో గడిపేవారన్న సంగతి పదే పదే గుర్తుకొస్తుంది. అత్తయ్యతో, సందీప్ తోటంతా తిరిగి మొక్కలికి నీరు కూడా పెట్టేవాడు. కుక్క లతో ఆడేవాడు.
ఉండబట్టలేక అత్తయ్యకి ఫోన్ చేసాను. జవాబు లేదు. నిరుత్సాహంగా అనిపించింది. “ప్చ్, ఏమిటో నా వింత సమస్య’ అనుకుంటూ పక్క మీద నుండి లేచిన నాకు అమ్మ ఎదురు వచ్చింది. “కాఫీ పెట్టుంచాను. వెళ్లి తీసుకో. కాసేపట్లో ఉప్మా చేస్తాను..ఇప్పుడైతే సందీప్ బాబుని నిద్ర లేపి వాడి పని నేను చూస్తాలే” అంది అమ్మ పక్క మీద కూర్చుంటూ. ….
**
వంటింట్లో పొయ్యి వద్ద, ఉప్మా చేయడానికి అన్నీ తయారుగా ఉండడంతో, ఉప్మా తిప్పేసి బల్లమీద ఉంచాను. కాఫీ కప్పుతో బయటకి వస్తుంటే, చిత్ర, రమణి ఇంట్లోకి వస్తూ ఎదురయ్యారు. పొద్దుటే తీరిగ్గా వచ్చిన వాళ్ళని చూసి ఆశ్చర్య పోయాను…
“నువ్వికడే ఉన్నావని వినోద్ ద్వారా నిన్న సాయంత్రం తెలిసింది. అందుకే పొద్దుటే వచ్చాము. మా నుండి దాక్కోవడం ఏమిటి నీలూ?” అడిగింది చిత్ర, నా భీజంపై తట్టి….
“నీ ఆరోగ్యం బాగుందా? బాబు ఎలా ఉన్నాడు?” ఆదుర్దాగా రమణి…
“అంతా బాగున్నాము. పదండి వెనుక మెల్లాలో ఉండుంటాడు సందీప్” అంటూ ఇంటి వెనకాలకి నడిచాను…
మెల్లాలో కూరలు తరుగుతున్న అమ్మ పక్కనే ఆడుకుంటున్న సందీప్ వద్దకెళ్ళి కూర్చున్నారు రమణి, చిత్ర… “ముద్దుగా ఉన్నాడు బాబు” అంటూ వాడి చెంపలు నిమిరింది రమణి. వాడి చేతికున్న కట్టు గమనించి, “అరే, పాపం! చేతికి ఏమయింది ఇంత చిన్నవాడికి?” అడిగింది.
“ఏదో, పుట్టినరోజు నాటి ఆటల్లో మణికట్టు విరిగింది బాబుకి” అని జవాబిచ్చింది అమ్మ.
“… వీడికి ఇలా దెబ్బ తగలిందన్న చిరాకులో ఉండిపోయాను. మీ నుండి దాక్కోవడం కాదు…ఇక ఇవాళో, రేపో మిమ్మల్ని పిలిచేదాన్ని” అంటూ సంజాయిషీ చెప్పుకున్నాను..
“మగపిల్లలకి ఇవన్నీ మామూలే. కాకపోతే, మరీ ఇంత చిన్నవాడికి రిస్ట్-ఫ్రాక్చర్ అంటే….ఎలా జరిగిందాని అడగాల్సిందే” అంది యధాలాపంగా చిత్ర.
“ఏముందమ్మా… చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఆడితే ఇలా ఏదో ఒకటి తప్పదుగా!” అంది అమ్మ.
“సరే, మీరిద్దరూ ఎలా ఉన్నారు?” అడిగాను స్నేహితురాళ్ళని…
చిత్ర ట్రైనింగ్ పూర్తయ్యాక, భర్తతో కలిసి ఎక్కడన్నా పెద్ద కార్పరేట్ హాస్పిటల్ కి పని చేస్తుందట. రమణి ఇక ఆలస్యం చేయకుండా వెంటవెంటనే ఇద్దరు పిల్లల్నన్నా కనేసేయాలన్న ప్లాన్ మీద ఉందట.
మా కబుర్లు చాలాసేపు సాగాయి. అమ్మ వంట చేసి అందర్నీ భోజనానికి పిలిచేంత మటుకు, మాకు సమయం తెలియనే లేదు.
**
ముగ్గురం మాట్లాడుకుంటూ భోంచేస్తున్నాము..
“ఇంతకీ ఇలా చెప్పాపెట్టకుండా దిగావు. ఏమిటి సంగతి. ఊరి మీద బెంగా? భర్త మీద అలకా?”, “లేక విరహం ఎలా ఉంటుందో భర్తకి తెలియాలని ఇలా వచ్చావా?” అడిగింది రమణి.
“అమ్మలా చూసుకునే అత్తగారు కదా! అందుకే పుట్టిల్లు గుర్తు రాదులే. అదటుంచితే సందీప్ ని వదిలి వుండగలరా ఆ పెద్దవాళ్ళు?” మళ్ళీ చిత్ర.
వారి ప్రశ్నలన్నిటికీ నవ్వి ఊర్కున్నాను.
“సరే, క్యాండి, మిండి ఎలా ఉన్నాయి?” రమణి మరో ప్రశ్న..
“నేను లేనుగా! ఎలా ఉన్నాయో అని దిగులుగా ఉంది.” అన్నాను జవాబుగా.
మా కబుర్లు అయ్యేప్పటికి సాయంత్రమయ్యింది. టీ తాగి, “మళ్ళీ వస్తాము” అంటూ కదిలారు చిత్ర, రమణి.
గేటు వరకు నాతో పాటు వచ్చి వాళ్ళని సాగనంపాడు సందీప్.
**
స్నేహితురాళ్ళతో మాట్లాడాక, అత్తయ్య గురించి ఆలోచన ఎక్కువయింది. ఇక అత్తయ్యావాళ్ళని వారి మనవడి ముద్దుమురిపాలకి దూరం చేయకూడదని నిశ్చయించుకొన్నాను. ఫోన్ చేసి ఆమెతో తీరిగ్గా మాట్లాడాలి అనుకున్నాను.
**
రాత్రయ్యాక, బాబుకి కథ చెబుతూ నిద్రపుచ్చాలని ప్రయత్నిస్తుండగా, అమ్మ నా గదిలోకి వచ్చింది. సందీప్ పడుకున్న వైపు మంచం మీద కూర్చుంది.
కళ్ళెత్తి చూసి, “ఏమిటమ్మా” అన్నాను.
“నీ అవస్థ చూస్తుంటే మనసు బాగోలేదమ్మా. నాన్న కూడా బాధ పడుతున్నారు. శ్యాంప్రసాద్ అంతటి వారు అల్లుడవడం అదృష్టమని పొంగిపోయాము. అల్లుడిగారి హోదా, పరపతి చూసి మురిసిపోయాము. నువ్వో పెద్దింటి కోడలయ్యావని సంతోషించినంత సేపు పట్టలేదు. ఇప్పుడు నీ విషయం బాగా దిగులైపోయిందమ్మా” అంటూ కన్నీళ్ళ పర్యంతమైంది. “అసలు అల్లుడు గారి గురించి అలాగని నమ్మలేకుండా ఉన్నాము” అంది అమ్మ.
చీకాకుతో గజిబిజిగా ఉన్న నా మనస్సుకి, అమ్మనాన్న ఇంతలా దిగులుపడుతున్నారని తెలిసి రగులుతున్న మంటలో ఆజ్యం పోసినట్టయింది.
అంతలో నాన్న కూడా గది గుమ్మం దగ్గరికి వచ్చారు. “ఏమ్మా ఇంకా పడుకోలేదా?” అంటూ లోనికొచ్చారు.
మంచం మీద నుండి లేచి, “రండి” అన్నాను. వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చున్నారు. “చూడమ్మా, మీ మామయ్యగారి బంధువు ఒకాయన, దుర్గాప్రసాద్ గారు. నీ పెళ్ళికి వచ్చారు. మొన్న ఢిల్లీలో బాబు పుట్టినరోజు పార్టీకి కూడా వచ్చాడాయన. చాలా ఆప్యాయంగా పలకరించారు. పిల్లల ఆటలు చూస్తూ చాలాసేపు మాట్లాడుకున్నాము” చెప్పడం ఆపి మా వంక చూసారు నాన్న……..
మేము ఆసక్తిగా వింటున్నాము.
**
సశేషం

2 thoughts on “రాజీపడిన బంధం – 5

  1. చాలా బాగుంది స్టోరీ. బయట నిజంగా నేను ఒకామెను చూసాను, శ్యాం ప్రసాద్ లాగే ప్రవర్తించేది. పిల్లలయందు ఆమె చర్యలకు అడ్డుపడే అత్తామామగార్ల మీద విరుచుకుపడేది, అహంతో. కావాలని చేస్తున్నట్టుండేది మరి చూసేవాళ్ళకి.

    1. Yes.. అటువంటి వాళ్ళు ఉంటారనే ఉంటాను.. కనీ కనపడని మూర్ఖత్వం, క్రూరత్వం..ఆడ-మగా తేడా లేకుండా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *