April 19, 2024

అమ్మ ప్రేమించింది..

రచన: రమా శాండిల్య

ఉదయం మంచి నిద్రలో ఉండగా ఫోన్ రింగ్ కి మెలుకువ వచ్చి ఫోన్ వైపు చూడగా ‘ హర్ష’ అని కనిపించేసరికి ఇంత పొద్దున్నే వీడేందుకు ఫోన్ చేశాడబ్బా అని ఫోన్ తీసి ఏంటిరా నాన్నా అని కొడుకునడిగాను.
“అమ్మా చెప్పేది విను”.. వాడి గొంతులో కంగారు విని పై ప్రాణం పైనే పోయింది….
“ఏమైందిరా!” అన్నా కంగారుగా..
“ఏమి లేదమ్మా కంగారుపడకు నాకు తెలిసిన అమ్మాయి ‘పూర్ణి’ సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో ఉంది తన ఫోన్ నెంబర్ నీకిస్తాను. నువ్వు తనని కాంటాక్ట్ చెయ్యి వెంటనే. వివరాలు తరువాత చెప్తాను” అని చెన్నైలో ఉన్న మా అబ్బాయి ఫోన్ పెట్టేసాడు.
వెంటనే వాట్సాప్ లోవున్న నంబర్ కి ఫోన్ చేస్తే ఒక విచిత్రమైన గొంతు హాల్లో అని విన్పించి “మీ అడ్రెస్ ఇవ్వగలరా?” అని అడిగింది హిందీలో. నా అడ్రెస్ చెప్పేసరికి థాంక్స్ అని ఫోన్ పెట్టేసింది.
అప్పుడు గుర్తొచ్చింది మా అబ్బాయికి ఫోన్ చెయ్యాలని, వాడికి ఫోన్ చేస్తే అప్పుడు చెప్పాడు వాడు అసలు విషయం.
“మా కాలేజ్ గ్రూపులో మెస్సేజ్ చేసింది ‘పూర్ణి ‘ ఎవరైనా 10 రోజులు నాకు హెల్ప్ చేస్తారా? హైదరాబాద్, సికింద్రాబాద్ లలో ఉన్నవారు! ఉంటే ఉద్యోగం వెతుక్కుంటున్నాను దయచేసి హెల్ప్ చెయ్యండి’ అంటూ. నువ్వు అక్క ఫ్రెండ్స్ కి చేస్తుంటావు కదా, అదే చెప్పాను. ప్లీజ్.. అమ్మా, ఆ అమ్మాయికి సహాయపడు” అన్నాడు. సరేలే అని ఫోన్ పెట్టేసి,
నేను మొహం కడుక్కుని కాఫీ కలుపుకుంటుంటే డోర్ బెల్ మోగింది… తెరిచి చూస్తే, పొట్టిగా సన్నగా పెద్ద పెద్దకళ్ళు తమాషాగా ఆ కళ్ళను కవర్ చేస్తున్న కళ్ళద్దాలు, జీన్స్ పాంట్ పువ్వుల పువ్వుల కుర్తా వేసుకుని, మోహమంత పరుచుకున్న మంచి నవ్వుతో, చున్నీ తలమీంచి మెడ చుట్టూకట్టుకొని నా దృష్టిలో ఒక విచిత్ర వేషధారణలో ఉన్న అమ్మాయి..
“హర్ష మదర్ మీరేనా” అడిగింది నవ్వుతూ.
“అవును నేనే! లోపలకు రా పూర్ణి ”
“ఓ మీకు నాపేరు తెలుసా?” హిందీలో అడిగింది.
చచ్చానురా బాబు ఈ తెలుగు రాని అమ్మాయిని పదిరోజులు ఎలా భరించాలి? మొదటి ఆలోచన ఇది. ఎందుకంటే ఇంట్లో ఎవరైనా వుంటే మాట్లాడకుండా తోచదు నాకు, కానీ 10 నిమిషాల్లో తెలిసింది ఆ అమ్మాయి కూడా నాలాగే వాగుడు కాయ అని.
ఆ అమ్మాయి మాటల్లో తెలిసింది నాకు ఆ అమ్మాయి నెలల పిల్లగా ఉన్నప్పుడే తల్లి చనిపోయింది, నాయనమ్మ పెంపకంలో పెరిగిందని. తండ్రి మిలటరీ ఆఫీసర్ ఎక్కడెక్కడో బోర్డర్లలో తిరుగుతూ ఆయనకు దగ్గరగా ఉండే కాశ్మీర్ లో తల్లిని, కూతుర్ని ఉంచి, అప్పుడప్పుడు వచ్చి చూస్తుండేవాడని.. ఇప్పుడు రిటైరై కాశ్మీర్ లోనే సెటిల్ అయ్యాడని.
“సరే స్నానం చేసిరా, కాఫీ కలుపుతాను.” అనిచెప్పి నేను లోపలికెళ్లి బ్రేక్ఫాస్టుకి రెడి చేస్తూ ఆలోచనలో పడ్డాను.
మావారు హార్ట్ ఎటాక్ తో పోయిన తరువాత ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని పెంచాను. అమ్మాయి ఇంజినీరింగ్ చేసి ఎంబీఏ చేసి ఒకబ్బాయిని ప్రేమించింది. నాకు చెప్తే ‘నో’ చెప్పడానికి కారణం కనిపించక ఇంజీనీర్ అయిన ఆ అబ్బాయికిచ్చి పెళ్లిచేయ్యడం వారికి వెంటనే జపాన్ లో ఏదో ప్రాజెక్ట్ పని రావడంతో అక్కడే సెటిల్ అయ్యారు అల్లుడు, కూతురు అక్కడికెళ్లాక ఒక పాప, ఒక బాబు పుట్టారు. వాళ్ళ జీవితమేదో వాళ్ళది. వారానికి రెండు మూడు సార్లు ఫోన్ చేసుకోవడం, పిల్లలతో వీడియో కాల్ చేసి వారి ముద్దు ముద్దు మాటలు ఇదే నా కాలక్షేపం. మా అబ్బాయి మాత్రం ‘నిన్ను విడిచి వెళ్ళను’ అని ఇక్కడే ఉండి యమ్ బి ఏ పూర్తిచేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి కంపెనీలో జాబ్ లో చేరాడు చెన్నైలో.
మా అమ్మాయి అప్పుడప్పుడు తన స్నేహితులెవరైన చదువుకోడానికి, ఉద్యోగానికి ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడల్లా నా దగ్గరకు పంపిస్తుండేది. వాళ్ళు నాలుగు రోజులుండి పని చూసుకుని వెళ్లిపోతుండేవారు. వాళ్లున్నంతసేపు నాకు కూడా ఒంటరితనం ఉండేది కాదు. అలా చాలా సేపు ఆలోచనలలో ఉన్న నేను, ఆ అమ్మాయి పిలిచిన పిలుపుకు ఈ లోకంలోకి వచ్చాను
తనకు కాఫీ ఇస్తే కప్పు చేత్తో తీసుకుని తాగుతూ, ఎప్పుడు కాఫీ తాగలేదని, టీ తన అలవాటని చెప్పింది.
“అయ్యో కాఫీ బదులు టీ ఇచ్చేదాన్ని కదా?”
“ఫరవాలేదు కాఫీ చాలా బావుంది.” కాఫీ తాగి తనకు వచ్చిన ఇంటర్వ్యూల లిస్ట్ అంతా చెప్పింది.
“ఇంతకుముందు ఏం చేశావు?” అని నేనదిగిన ప్రశ్నకు..
“ఢిల్లీలో మెట్రోలో పనిచేసేదాన్ని. సౌదీలో జాబ్ వస్తే ఢిల్లీ జాబ్ వదిలేసి నాన్నకు, నానమ్మకు చెప్పేసి సౌదీ వెడదామని కాశ్మీర్ వెళ్ళిపోయాను. నానమ్మకు, నాన్నకు చెప్పేసరికి ఇద్దరూ ఒప్పుకోలేదు. పైగా పెళ్లి చేసేస్తాము అని చెప్పారు. అందుకే హైదరాబాద్ లో ఉద్యోగమొచ్చిందని చెప్పి వచ్చేసాను. వస్తూ దారిలో మా కాలేజ్ గ్రూపులో హైదరాబాద్ లో ఉన్న వారెవరైనా సహాయం చెయ్యమని రిక్వెస్ట్ పెట్టాను. దానికి హర్ష మా అమ్మ ఒక్కరే వుంటారు ఆమె దగ్గరకు వెళ్లొచ్చని చెప్పాడు.” అని చెప్పింది.
ముందుగా కొంచెం జాలి అనిపించింది. తరువాత తరువాత ఆ అమ్మాయి పద్ధతులు చూసి నవ్వొచ్చేది. ఒక వారం నా దగ్గరే కదలకుండా ఉంది. అలవాట్లు విచిత్రంగా ఉండేవి. నేను చాలామంది పెద్దవాళ్ళ రక్షణ కవచంలో వున్నాను. మావారు చనిపోయాక, మా పిల్లలు కూడా అంతే. మధ్యతరగతి కుటుంబంలో పెద్దలందరి మధ్య తండ్రి లేకపోయినా మేనమామలు, మేనత్తలు, వచ్చేపోయే చుట్టాలు.. అందుకని వారు చాలా కలివిడిగా ఉండేవారు.
పూర్ణి ఒంటరిగా బోర్డింగ్ స్కూలో చదువు, ఇంటికొచ్చినప్పుడు కూడా అరవై సంవత్సరాల వయసు పైనవున్న నానమ్మ, అందుకే మనసులో మాట చెప్పుకోడం కూడా సరిగా రాదని గమనించాను.
పగలు ఇంటర్వ్యూలకెళ్లడం రాత్రి వాటిగురించి చెప్పడం. రాత్రి 11 వరకు కబుర్లు చెప్తుండేది. నాకేమో నిద్ర ఆగేది కాదు, ఒక రోజు నేను నిద్రపోయాక కొంతసేపటి తరువాత వీధి తలుపు చప్పుడైతే ఎవరా అని హాల్లోకొచ్చి చూస్తే పూర్ణి బయటకు వెళ్ళడానికి రెడి అవుతోంది.
“ఎందుకమ్మా?” అని నేను అడిగితే తన సమాధానంకి ఆశ్చర్యమేసింది.
“ఆకలేస్తోంది నూడుల్స్ చేసుకుని తింటాను, అవి కొనుక్కోడానికి.”
నేను నవ్వుతూ “అర్ధరాత్రి 12గం. కి షాప్స్ ఏమీ వుండవు. దోసె పిండి ఉంది కావలిస్తే దోసె పోసిస్తాను తింటావా?”
వెంటనే సరే అంది. తనకు దోసె పోసిచ్చాను.
“8 గం. కే అన్నం తిన్నావు కదా మళ్ళీ ఎందుకిప్పుడు నూడిల్స్?” అలసటగా అడిగాను.
“నాకు ఇలా తినడం అలవాటు.” అంది. ఇలా రోజుకొక రకం వింతలతో చాలా రోజులు ఉంది. వెళ్ళమని నేను చెప్పలేదు. వెడతానని తను అనలేదు.
ఒక రోజు మా అబ్బాయికి ఫోన్ చేసి అడిగాను.
“ఏంట్రా? ఈ అమ్మాయి మనింటిలోంచి కదలదా?”
“అదేంటి నీకే తెలియాలమ్మా! నాకేం తెలుసు? ఏదో మానేజ్ చేసి పంపెయ్యి.”
ఇప్పుడు నా ఎదురుగా నిల్చుని ఉంది సమస్య. ఇంటికొచ్చిన అమ్మాయిని వెళ్లమని ఎలా చెప్పాలి? కానీ.. నేను మాత్రం ఎంతకాలం ఉంచుకోగలను? ఈ ఆలోచనలలో ఉండగానే ఒకరోజు నాకు పెళ్లి పిలుపు మా ఊరినుంచి, పెళ్ళికెళ్లాలి రెండురోజుల్లో నేను.. వేరే ఊరు వెడుతూ, “ఒంటరిగా ఆడపిల్లను ఇంట్లో ఎలా ఉంచను ” అదే ఆలోచనతో ఆ అమ్మాయి బయటనుండి రాగానే పరిస్థితి చెప్పాను.
నేను చెప్పింది శ్రద్ధగా విని చాలా తేలిగ్గా ఏం ఫరవాలేదు, మీరు ఊరినుంచి రాగానే వస్తాను. అప్పటి వరకు..’ మా మేనత్తల ‘ దగ్గరకెళ్లి చూసి వస్తాను అంది.
ఈసారి షాకవడం నావంతయింది. ఏంటి? మీ అత్తలు ఇక్కడే ఉంటారా !! మరి ఇన్నాళ్లు అక్కడికెందుకు వెళ్ళలేదు?” ఆశ్చర్యంగా అడిగాను
“అవును ఉన్నారు ఆరుగురత్తలు, ఒక పెదనాన్న, ఒక బాబాయ్ అందరూ వున్నారు. మా బాపు నన్ను ఎందుకో వీళ్ళందరికి దూరంగా పెంచారు”. అని చాలా మామూలుగా చెప్పింది.
“బతుకుజీవుడా” అనుకుని పెళ్లికి వెళ్లే ఆలోచనలో మిగిలినవేమి ఆలోచించకుండా ఆ అమ్మాయిని వాళ్ళ మేనత్తల దగ్గరకు పంపేసాను.
సరే, “నేను పెళ్ళికెళ్లి మా చుట్టాలందరి” దగ్గరా తలో రెండురోజులు గడిపి, మా ఊరి అమ్మవారి జాతర కోసం ఊరెళ్ళాను. అక్కడకి “పూర్ణి” ఫోన్ చేసింది. మొదట ఆ పేరు ఆ ఫొన్ నెంబర్ ‘ఎవరిదో గుర్తు రాలేదు ‘ “అందుకే పట్టించుకోలేదు. మళ్ళీ ఒక గంట తరువాత అదే నెంబర్ నుంచి ఫోన్ ‘ తీసి చూస్తే “హాస్కీగా “కొత్త గొంతు.. వెంటనే ఓ “పూర్ణి ” ఎలా వున్నావు ? అని అడిగాను.
అవతలనుంచి డైరెక్టుగా ఎప్పుడొస్తున్నారు? మీరు” అని విని..ఇంకో వారం పడుతుంది, అని చెప్పాను.
‘పూర్ణి ‘ గొంతు చాలా డల్ గా వినిపించింది. “సరే మీరొచ్చాక ఫోన్ చెయ్యండి !!” అని చెప్పి పెట్టేసింది. ఆ రోజు జాతర హడావిడిలో ఈ ఆలోచన మళ్ళీ రాలేదు.
వారం తరువాత అన్ని పనులు ముగించుకొని, ఇంటికొచ్చి.. ఇల్లు సద్దుకొని మా అబ్బాయికి ఫోన్ చేసి, ‘పెళ్లి కబుర్లు, జాతర కబుర్లు ‘ అన్ని చెప్పేసి ఫోన్ పెట్టేసే ముందు.. పూర్ణి నేను ఊర్లో ఉండగా ఫోన్ చేసిన సంగతి చెప్పాను.
దానికి వాడు అమ్మా ఆ అమ్మాయి నాకు తెలీదు, ఢిల్లీ కాలేజ్లో Mba చదివి నేను చెన్నై వెళ్లిన సంవత్సరం తను ఆ కాలేజీలో ఎంబీఏ కోర్స్ జాయిన్ అయింది, ముఖపరిచయం ఉంది. కానీ, ఆ అమ్మాయి గురించి అంతకు మించి ఏ వివరాలు నాకు తెలియవు. అని చెప్పాడు. కానీ మా కాలేజ్ కి ఒక గ్రూప్ ఉంటుంది అది మేనేజ్మెంట్ పెడతారు. ఆ గ్రూపులో మెసేజ్ చేస్తుంటుంది అప్పుడప్పుడు. అంతకు మించిన వివరాలు నాకు కూడా తెలియవు. అని చెప్పాడు వాడు.
రెండు రోజులు నా పనుల్లో నేనుండగా “పూర్ణి ” దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది నాకు.
ఏంటమ్మా అంటే, ఎప్పుడొచ్చారు ? ఇక్కడికి, రాగానే ఫోన్ చెయ్యలేదేమి అని వరసగా ప్రశ్నల వర్షం కురిపించింది. వచ్చినప్పటినుండి వరుసగా ఏవో పనులు చేస్తున్నాను. ఆ హడావిడిలో నీకు ఫోన్ చెయ్యలేకపోయాను, అని చెప్పాను. సరే నేనొచ్చాక మాట్లాడుకుందాము అని ఫోన్ పెట్టేసింది.
ఒక గంటలో పూర్తి బెగేజ్ తో వచ్చేసింది మా ఇంటికి పూర్ణి. జాబ్ దొరికిందని, సాలరీ బానే ఉందని, గలా గలా కబుర్లు మొదలు. నాకు కూడా ఆ అమ్మాయి కొత్తగా అనిపించడం లేదు ఇప్పుడు.
ఒక నెలకు ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాము. వాళ్ళ చుట్టాలు గురించి అడిగితే, మా బాపుకి పెద్దగా ఇష్టముండరు వీళ్ళందరు, ఎప్పుడైనా సెలవులకు వచ్చినా పది రోజులు మాత్రమే ఉండి అందరితో తలో రోజు గడిపి వెళ్లిపోయేదానను. నానమ్మే తక్కువ రావడం వల్ల వారెవరు నాకు అలవాటవలేదు అని చెప్పింది.
నాకు అర్ధమయింది ఎందుకో ఆయన వీరందరినీ దూరం పెట్టి పూర్ణిని ఒక రకంగా ఎవరూ లేని దానిలా పెంచారు అని.
ఏది ఏమైనా రోజులు నెలలుగా మారిపోతున్నాయి. ఇంతలో మా అమ్మాయి సెలవు పెట్టుకుని కుటుంబంతో వస్తున్నట్లు చెప్పింది. అదే సమయంలో మా అబ్బాయి కూడా వస్తున్నాడు. అదే విషయం పూర్ణికి చెప్పాను. సరే ఏదైనా లేడీస్ హాస్టల్ లో చేరతాను అన్నది.
ఒకరోజు నేను తను ఇద్దరం వెళ్లి నాలుగయిదు హాస్టల్స్ చూసి వచ్చాము. నాకు అంతగా నచ్చలేదు అవేవి. ఇంటికొచ్చి కొంతమంది స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాను. వారు కొన్ని అడ్రెస్సులు ఇచ్చారు. మొత్తానికి ఒక హాస్టల్ నాకు తనకు కూడా నచ్చింది. మంచిరోజు చూసి తనను అక్కడ చేర్పించాను.
మా అమ్మాయి కుటుంబం, మా అబ్బాయి రావడం వాళ్ళతో కాలక్షేపం అయింది. వాళ్ళు వెళ్లబోయేముందు పూర్ణి ఫోన్ చేసింది నేను రావచ్చా అని. అయ్యో పర్మిషన్ ఎందుకు వచ్చేయి అంటే సాయంత్రం ఆఫీస్ నుంచి డైరెక్టుగా నా దగ్గరకు వచ్చింది. శనివారం, ఆదివారం రెండురోజులు పిల్లలతో కలిసి పిల్లల్లా అందరూ కలిసి తిరిగారు. హోటల్స్, పార్కులు, మాల్స్ అన్ని. నా ఫ్యామిలీతో పూర్ణి కూడా చాలా కలివిడిగా వుండి పై పిల్లలా అనిపించలేదు.
కానీ పెద్దవాలతో కంటే మా మనవలతోను, నాతోను కంఫర్టబుల్ గా ఉండేది. అందరం అది గమనించాము.
ఎక్కడి వారు అక్కడికెళ్లగానే రెండు రోజులు ఒక్కదాన్ని అన్ని సద్దుకొని రిలాక్స్ అయ్యను. మళ్ళీ పూర్ణి దగ్గరనుంచి ఫోన్.. ఇంటికొస్తున్నానని, సరే రమ్మని చెప్పాను. మొత్తం సామానుతో వస్తుందని ఊహించలేదు. మొత్తం సామానుతో హాస్టల్ ఖాళీ చేసి వచ్చేసింది.
ఆ రోజు ఏమి అడగకుండా మర్నాడు అడిగాను ఏమైంది అని ఆఫీస్ నుండి వచ్చి చెప్తాను అంది.
రాత్రి వచ్చాక భోజనాలు అవి చెయ్యడం, కాసేపు టీవీ చూడడం, అలసిపొయిన నేను తొందరగా నిద్రపోవడం. పూర్ణితో మాట్లాడే సమయమే కుదరలేదు.
రెండు రోజుల తరువాత తను ఆఫీసుకి, నేను బయట పనిమీద వెళ్లి నేను కొంచెం ఆలస్యంగా వచ్చాను ఇంటికి. నేనొచ్చేటప్పటికి పూర్ణి వచ్చేసింది. తనదగ్గరున్న తాళంచెవితో తలుపు తీసుకుని స్నానం చేసి కూర్చుంది. నేను రాగానే ఎవరో వచ్చారు మీ కోసం అని విజిటింగ్ కార్డ్ చేతులో పెట్టింది.
కార్డులో నెంబర్ చూస్తే మా పక్కింటబ్బాయి పేరు ఉంది దానిలో, ఆ అబ్బాయ్ Usa లో ఉంటాడు మా అబ్బాయి తను కలిసే చదువుకున్నారు మంచి స్నేహితుడు, తనే వచ్చి వెళ్ళాడు అనుకున్నాను.
భోంచేసేసి ఆ అబ్బాయికి ఫోన్ చేసాను. ఫోన్ ఎత్తి మొట్టమొదటి మాట అదేంటి ఆంటీ చెప్పకుండా హర్షగాడి పెళ్లి చేసేసారా ? అని. నాకర్ధం కాలేదు.అదేం లేదురా ఎందుకలా అనిపించింది నీకు అని ఎదురు ప్రశ్న వేసా నేను. దానికి వాడు ఇంట్లో చాలా చనువుగా తిరుగుతుంటే అనుమానమొచ్చింది, అదే ఆలోచిస్తున్నాను… మొన్నకూడా మాట్లాడాను కానీ ఏమీ చెప్పలేదు అని, నాలో చిన్న అలజడి, అవును అందరూ ఇలాగే అనుకుంటున్నారా ? అని.
నెమ్మదిగా పూర్ణిని అడిగాను ఇక్కడ హాస్టల్ నచ్చడం లేదు నీకు, మీ ఫామిలీ వాళ్ళను కలవవు, పోనీ నాన్న గారి దగ్గరకు వెడతావా అని, దానికి ఏమి సమాధానం లేదు కానీ, నాతో నా మంచం మీద నా పక్కలో పడుకుని కబుర్లు చెప్పి వెళ్లి వేరే గదిలో పడుకునే పిల్ల… పూర్తిగా నా పక్కనే పడుకోడం మొదలు పెట్టింది.
నాకెలా ఇష్టమో అలా ఉండడం, నాతోనే ఉండేది. మా అమ్మాయి ఫోన్చేసి పూర్ణి ఏంచేస్తోంది అంటే “ఏదో సినిమాలో శ్రీలక్ష్మీలా పదహారవ ఏటా విషయాలు వింటున్నాను అనేసరికి ఫక్కున నవ్వి నీ ఓపికకు జోహార్ అమ్మ పదహారేళ్ళ చరిత్రంతా విన్నావా ? అని హాస్యంగా అన్నది, కానీ అది హాస్యమనుకుంటున్నది నిజమని నాకు మాత్రమే తెలుసు. ఎప్పుడు ఫోన్ చేసిన మొదట పూర్ణి విషయమే అడిగేది మా అమ్మాయి.
మా అబ్బాయితో నేను తరచు మిగిలిన విషయాలేమి ఎక్కువ మాట్లాడకుండా పూర్ణి గురించే ఎక్కువ మాట్లాడుతూ ఉండేదాన్ని.
ఒక రోజు పూర్ణి తనంతట తానే నాదగ్గరకొచ్చి, నేను పూర్తిగా మీతో ఉండాలంటే నేనెంచెయ్యాలి ? మీతో ఉంటే ఒంటరితనం ఉండదు, భయం ఉండదు చాలా శాంతిగా సెక్యూర్డ్ గా ఉంటుంది. ఎప్పుడు ఇలాంటి ఫీల్ నాకు తెలియదు. Friest టైం ఇలాంటి ఫీల్ నాకు అంది. కుటుంబంలో ఎవరు ఎవరిని ఆంక్షలు పెట్టరు, అలా అని వదిలేసి లేరు. మీ కుటుంబంలో దాపరికాలుండవు, అందరూ ఒకరితో ఒకరు అన్ని విషయాలు చర్చించుకుని ఏదీ బావుంటే అదే చేస్తారు. ఇవన్నీ నాకు నచ్చాయి. మీలో ఒకదాన్నిగా ఎప్పటికి ఉండాలని ఉంది అంది పూర్ణి.
నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. రేపు మాట్లాడుకుందాం పడుకో అని చెప్పి, నేను పడుకుంటే ఎంతకీ నిద్ర పట్టలేదు. రాత్రంతా ఆలోచించి తెల్లవారుఝాము మా అబ్బాయికి ఫోన్ చేశా. ఏంటమ్మా అంటే పూర్ణి గురించి పూర్తిగా చెప్పాను వాడికి. తను ఎందుకో ఒంటరితనం ఫీల్ అవుతోంది. నిజానికి తనకి చాలా బంధువర్గం వున్నారు, కానీ వారినెవరిని కలవకుండా పెంచారు ఈ అమ్మాయిని. చదువు, ఆఫీసు పని, బయటి విషయాలు ఎలా చూసుకుంటుందో నాకు తెలియదు. కానీ ఇంటి పని విషయంలో అస్సలు రాదు. హాస్టల్స్ పెరిగినట్లుగా ఉంటుంది. ఇది నా పని అని కల్పించుకుని చెయ్యడం రాదు, వంటకూడా చేతకాదు. ఇవన్నీ చూసి కూడా ఆ అమ్మాయి అడిగిన విషయం ఆలోచనల్లో పడేసింది నన్ను.
అయితే ఏంటంటావు అన్నాడు హర్ష…”నువ్వు ఆ అమ్మాయిని పెళ్లిచేసుకుంటావా ? ఆడపిల్ల వైపునుంచి అడుగుతున్నాను, బాగా ఆలోచించి చెప్పు. వాళ్ళ ఫామిలీ తెలియదు, ఆమెకున్న డబ్బు ఉందో లేదో తెలియదు, అసలు పూర్తిగా ఆమెవరో తెలియదు, ఆమెని చేసుకుంటే నువ్వు సుఖపడతావో, కష్టపడతావో కూడా తెలియదు బాగా ఆలోచించి చెప్పు ఈ విషయం అన్నాను. అవతల వాడి నుంచి నిశ్శబ్దం. చాలాసేపు ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నాము. ముందుగా మా అబ్బాయే ‘ పడుకోఅమ్మా రేపు మాట్లాడుతాను అంటే, నేను ఇంకేమి పడక, లేచి పని చేసుకుంటాను అని ఫోన్ పెట్టేసి లేచాను.
ఒక నెలరోజులు నిశ్శబ్దంగా ఎవరి పని వారు చేసుకోడం, మాటలే లేవు మా మధ్య. కానీ రాత్రి పూట హర్ష, పూర్ణి ఫోన్ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది నాకు. రోజు నాదగ్గరకొచ్చి కబుర్లు చెప్పే పిల్ల రాత్రి తొమ్మిది గంటలకల్లా “గుడ్ నైట్ ” అని చెప్పేసి వెళ్లిపోవడం తన గదిలోంచి కబుర్లు వినిపిస్తుండేవి. తను పరిచయమైన ఇన్నాళ్లలో ఎప్పుడు ఇంతగా ఫోన్ మాట్లాడడం తెలియదు నాకు. రోజు గమనిస్తూ ఉన్నాను.
ఒకరోజు మా అమ్మాయికి ఫోన్ చేసి విషయాలన్నీ చెప్పాను. విని అమ్మా తొందరపడి నిర్ణయాలేమి తీసుకోకు, ఇది రెండు జీవితాలు కాదు రెండు కుటుంబాలు కలవవలసిన విషయం… పూర్ణి వాళ్ళ పూర్తి కుటుంబం ఇక్కడే వున్నా, ఆ అమ్మాయి ఒక్కరోజు కూడా వెళ్ళటం లేదు వారి దగ్గరకు, మెమొచ్చినప్పుడు కూడా మాతో మా పిల్లలతో పిల్లగా కనిపించిందే కానీ, పెద్ద కలివిడిగా కనిపించలేదు నాకు. నువ్వు ఆ అమ్మాయిని పంపించెయ్యి వాళ్ళ ఇంటికి. నీ ఆరోగ్యం జాగర్తగా చూసుకో, ఇప్పట్లో నేను రాలేనేమో, నాకు మా ఆయనకు ఆఫీస్ సెలవులు లేవు. పిల్లలకు స్కూల్స్ కూడా ఉన్నాయి.
నెల తరువాత ఒకరోజు తెల్లారేటప్పటికి మా అబ్బాయి వచ్చేసాడు. స్నానాలు, టిఫిన్ల్ అయ్యాక పూర్ణి, మావాడు పక్క పక్కనే ఉండి అమ్మా పూర్ణి ఫాదర్ తో మాట్లాడుతావా ? మనం కావాలని అనుకునే వాళ్ళ కంటే మనని కావాలనుకునే వారి దగ్గర సుఖపడతాము. అని నువ్వు చెప్పిన మాటలు గురించి ఆలోచించాను అన్నాడు. అదీ నిజమే కదా! అనిపించింది నాకు. మేము పెళ్లి చూసుకుంటాము అని చెప్పేసరికి నా మనస్సు ద్వైది భావంతో తల బరువైపోయింది నాకు. “అమ్మా ! నేను చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను . నువ్వు తనతో కలిసిపోయి వుండగలుగుతావు అనిపించింది” అన్నాడు హర్ష.
ఆ విషయం వాళ్ళ నాన్నగారికి చెప్పు అన్నాడు. నేనె ఆయనకు ఫోన్ చేసి మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటాం అని ఒకసారి వచ్చి మాట్లాడండి అనేసరికి ఆయనకేమి అర్ధమైనట్లు లేదు. కొంచెం కంగారుపడి వారం రోజుల్లో మా అమ్మని తీసుకుని వస్తాను అని చెప్పారు.
అన్నట్లుగానే పది రోజుల్లో వచ్చారు, చెల్లెలి దగ్గర దిగి మా యింటికొచ్చారు. ఆయన వచ్చేముందే రెండురోజుల ముందు పెద్ద మేనత్త దగ్గరకు వెళ్ళింది పూర్ణి.
ఆయన రావడం అన్ని మాట్లాడడం జరిగింది. వారి కుటుంబ విషయాలలో ముఖ్యంగా వారి వారందరు కొంచెం డబ్బు మనుషులు, ఒకరితో ఒకరికి పడదు, స్వార్ధపరులు, ఈయన దగ్గరకు వారి వారి స్వార్థంతో వెడతారు కానీ ప్రేమతో కాదు. తల్లిని కూడా తన దగ్గరే వదిలేసి మళ్ళీ పిలవలేదు ఎవరి దగ్గరకు. ఆమెకూడా తన దగ్గరే సౌఖ్యంగా వున్నారు. అందుకే తల్లిని, కూతురిని మాత్రం తనతో దూరంగా ఉంచుకున్నాను. అక్కచెల్లెళ్లు డబ్బు అడుగుతుంటారు అది పంపిస్తుంటాను అని చెప్పారు. కాశ్మీరు వారింటికి మమ్మల్ని ఆహ్వానించారు.
ఆయన మాటల్లో చాలా మర్యాద, పెద్దమనిషి తరహా మాకు నచ్చింది.
మా అమ్మాయికి కూడా జరిగిందంతా చెప్పాము. బాగా ఆలోచించి చెయ్యండమ్మా అంది.
అన్ని విషయాలు, అందరికి నచ్చడం, తొందరలోనే తాంబూలాలు పాత పద్ధతిలో మా ఇంట్లోనే తీసుకున్నాము. వెంటనే ముహూర్తం కుదరడంతో చాలా సింపుల్ గా పెళ్లి చేసాము, కొంచెం మంచి రిసెప్షన్ ఒక హోటల్లో ఇచ్చాం… ప్రతి ఖర్చు పూర్ణి నాన్నగారు, నేను కలిసే పెట్టుకున్నాము.
ఏ కోడలు, కూతురిలా అత్తగారితోనే షాపింగ్, అత్తగారి సలహాతో పెళ్లిలో జరగాల్సిన ప్రతి బట్టలు, నగలు ఎలా తయారవ్వాలి అన్ని నామీదే పడ్డాయి. మా అమ్మాయికి ఆశ్చర్యం అమ్మా కోడలు ఇలా ఉండాలి అలావుండాలి అనే కోరిక లేదా? నీకు అని అడిగితే నా సమాధానం… నాకు ఇద్దరు కూతుళ్ళే. నవ్వుకూడా అలాగే అనుకో ఇప్పటి నుంచి చిన్నచెల్లి ఇంటికి వస్తోంది అనిచెప్పాను.
ఏదో కలలోలా జరిగిపోయాయి. పెళ్లి, రిసెప్షన్. రిసెప్షన్ లో దగ్గరి చుట్టాలు మావాడిని “ప్రేమ పెళ్ళెంటిరోయి” అంటే అవును మా అమ్మ ప్రేమించింది మా ఆవిడను, నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పిన ఆ కొడుకుని ఏ తల్లి గర్వంగా చూసుకోదు. అదే గర్వం నా మొహంలో అప్పటికి ఎప్పటికి కూడా..

4 thoughts on “అమ్మ ప్రేమించింది..

  1. I doubt అమ్మ ప్రేమించేలా అబ్బాయే చేసాడేమో…
    బావుంది కధ, ఉత్సుకతను రేపింది.

  2. చాలా చాలా బాగుంది
    చాలా వెరైటీగా ఉంది
    మహత్తుకుంది

Leave a Reply to Gauthami Cancel reply

Your email address will not be published. Required fields are marked *