March 29, 2024

పిల్లల మనసు

రచన: లక్ష్మీ రాఘవ

‘”మమ్మీ ఈ వారం గిరిజా ఆంటీ వస్తున్నారా? కనుక్కో” హాస్టల్ నుండీ కొడుకు కౌశిక్ ఫోనులో ప్రత్యేకంగా చెప్పడం ఆశ్చర్యం వేసింది.
“ఫోన్ చేసి అడుగుతాను. నేనైతే వస్తాను వీకెండ్ . నాన్న రావటానికి కుదరదు. ”
“సరే మమ్మీ”
*****

ఎంసెట్ కోచింగ్ వున్న రెసిడెన్షియల్ స్కూల్ ల్లో వేసాక పేరెంట్స్ శనివారం కానీ ఆదివారం కానీ వెళ్లి 2 గంటలు గడపవచ్చు. చదువు గురించీ, వాళ్ళ కంఫర్ట్ గురించీ మంచీ చెడులు మాట్లాడే అవకాశం వుంటుంది. కొడుకు కౌశిక్ తో బాటు తన ఫ్రెండ్ డాక్టర్ గిరిజ కొడుకు సాకేత్ కూడా అదే కాలేజీలో వున్నాడు. పలుసార్లు కౌశిక్ అమ్మ శ్రీదేవి , గిరిజ కలిసే వస్తారు. కానీ పిల్లలతో
మీటింగు మాత్రం వేరుగానే. ఎవరి స్పేస్ వాళ్ళు చూసుకుంటారు అలా అయితేనే పిల్లలు ఫ్రీగా ఉంటారని అభిప్రాయం కూడా.
ఆ వారం గిరిజకు ఫోన్ చేస్తే ఆ వీకెండ్ మెడికల్ కాన్ఫరెన్స్ కోసం చెన్నై వెళ్ళాల్సి వుండటం వల్ల రాలేననీ సాకేత్ తో ఒకసారి మాట్లాడమనీ చెప్పింది. అలా చేయడానికి వార్డను పర్మిషన్ కూడా తీసుకుంటానని కూడా చెప్పింది.
ఆరోజు విజిటర్స్ రూమ్ కి కౌశిక్ వచ్చాడు కానీ కౌశిక్ తో బాటు సాకేత్ రాలేదు. స్నానం చేస్తున్నాడనీ కొద్దిసేపట్లో వస్తాడనీ చెప్పాడు కౌశిక్ .
“మమ్మీ, సాకేత్ వచ్చే లోపు నీకో విషయం చెప్పాలి. ఈమధ్య సాకేత్ బాగా డల్ అయ్యాడు. లాస్ట్ వీక్ గిరిజా ఆంటీ వచ్చాక మౌనంగా ఉంటున్నాడు. టూ మంత్స్ ముందు ఒక స్టూడెంట్ హాస్టల్ మీద నుండీ పడిపోయి సూసైడ్ చేసుకున్నాడు. పెద్ద గోడవైంది నీకు గుర్తుందికదా అది మాకందరికీ బాధ కలిగించింది. సాకేత్ ను గమనిస్తే కొంచెం డిప్రెషన్ లో వున్నట్టు అనిపిస్తుంది నాకు అందుకే సాకేత్ కు ధైర్యం చెప్పడానికే ఈ వీక్ నీవు మాట్లాడితే బాగుంటుందనిపించింది. వాడు వచ్చాక నేను ఒకసారి లోపలకు వెడతాను. నీవు మాట్లాడు మమ్మీ. ధైర్యం చెప్పు ప్లీజ్ . ” అంటూన్న కౌశిక్ ఎంతో ఎత్తుకు ఎదిగాడని అనిపించింది.

సాకేత్, కౌశిక్ వయసు ఒకటే. అయినా స్నేహితుడి బాగోగులను గమనిస్తున్నాడంటే గర్వంగా అనిపించింది. కౌశిక్ వయసుమించి ఆలోచిస్తాడు.
దూరంగా సాకేత్ రావటం చూసి చెయ్యి ఊపాడు కౌశిక్. సాకేత్ వచ్చాక “ ఎలా వున్నావు సాకేత్ “అడిగింది శ్రీదేవి.
“బాగున్నాను ఆంటీ. అమ్మకి చెన్నై ట్రిప్ వుండట కదా. వార్డెన్ చెప్పారు. ”
“అవును సాకేత్. అందుకే నన్ను నీతో కలవమని చెప్పింది. మీ నాన్నకి వర్క్ఎక్కువ ఉంటుంది కదా” అని చెబుతూంటే
కౌశిక్ “మమ్మీ, నేను అర్జ్రంట్ గా బాత్రూం వెళ్ళాలి. ఇప్పుడే వచ్చేస్తా” అని పరిగెత్తాడు.
“సాకేత్, ఎలా చదువుతున్నావు నాన్నా?”
“బాగానే చదువుతున్నా కానీ ఈ మధ్య నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోతూంది ఆంటీ”
“ఎందుకు?” అంది శ్రీదేవి.
“మీకు తెలుసుగా రీసేంట్ గా ఒక చావు చూసాము. అది డిస్కస్ చేస్తే అమ్మ అది నీకు అనవసరం చదువు కాన్సంట్రేట్ చెయ్యి అంది. అంటే మాకు కన్సర్న్ ఉండకూడదా. ఒక డాక్టర్ గా తను అలా అనవచ్చా. ఆ మాటకొస్తే నాకు ఈ చదువే ఇష్టం లేదు. కంప్యూటర్స్ అన్నా, క్రికెట్ అన్నా ఇష్టం. కంప్యూటర్స్ తో మామూలు డిగ్రీ చదివి నాకిష్టమైన క్రికెట్ ఆడుకోవచ్చు కదా. పేరెంట్స్ ఎందుకు మా ఇష్టాలని అడగకుండా మీ ఇష్టాలని మాపై రుద్దుతారు అని రివోల్ట్ చెయ్యాలని అనిపిస్తుంది. కొంచెం కన్ఫ్యూసింగ్ గా వుంది. ఎక్కువ చదవలేక పోతున్నా. సారీ ఆంటీ నాకెందుకో మీకు చెప్పాలని అనిపించింది. మీరు కూడా కౌశిక్ ని బలవంతం గా చేర్పించారా. ”
సాకేత్ అంత తొందరగా బయట పడతాడని అనుకోలేదు.
“లేదు సాకేత్, కౌశిక్ ఈ కోచింగ్ లో ఇష్టంగా చేరాడు. మెడిసిన్ సులభం కాదని చెప్పినా వినలేదు. అందుకే వాడి ఇష్టమే ఇది. ”
“నేను నా ఇష్టం మమ్మీతో చెప్పే అవకాశమే వుండదు. మమ్మీ, డాడీ ల క్లినిక్ చూసుకోవాలి అందుకైనా డాక్టర్ కావాలి అని ప్రతిసారీ వినిపించడంతో నాకు ఇంట్రెస్ట్ ఇంకా తగ్గిపోతూంది. ”
“నీవు ప్రతిసారీ నాతో కొంచెం సేపు మాట్లాడు సాకేత్” శ్రీదేవి అంటూ వుండగా వచ్చాడు కౌశిక్.
“మమ్మీ ఈ రోజు సాకేత్ బలి అయిపోయ్యాడా ??”అన్నాడు నవ్వుతూ
“లేదు కౌశిక్ నీవు వెళ్ళిపోతే మాట్లాడుతున్నాం . ”
“మీరు కారీ ఆన్. బై కౌశిక్ . ” లేస్తున్న సాకేత్ ని ఆపలేదు ఇద్దరూ.
సాకేత్ ప్లే గ్రౌండ్ వైపు వెళ్ళాడు.
“మమ్మీ నాకెందుకో సాకేత్ చాలా డిప్రెషన్ లో వున్నాడు అనిపిస్తుంది. పోయిన వారం వాళ్ళ అమ్మా, నాన్నా ఇద్దరూ వచ్చి వెళ్ళాక ఎవరితోనూ ఎక్కువ మాట్లాడ్డం లేదు. వాడికి ఇక్కడ చదవటం ఇష్టం లేదేమో అనిపిస్తుంది. మాతో ఎవ్వరితోనూ చెప్పడం లేదు. నీతో ఒకసారి మాట్లాడితే బాగుంటుందని అనిపించింది. ”
“నెక్స్ట్ వీక్ శనివారం నిన్ను బయటకు తీసుకెళ్ళినప్పుడు గిరిజతో చెప్పి సాకేత్ కూడా పర్మిషన్ తీసుకుంటా. తను కూడా మనతో రావచ్చు అప్పుడు నేను ఒకసారి అడుగుతా. ఆదివారం వాళ్ళ అమ్మానాన్నా వచ్చి కలుస్తారు కదా. ” అంది శ్రీదేవి
“అలా చేద్దాం. అసలు వాడు అలా ఎందుకు తయారవుతున్నాడో తెలియాలి. ఇంకా లేట్ అవుతే ఎక్జామ్స్ కోసం కోచింగ్ కొంచెం ఎక్కువ అవుతుంది. ”అని చెప్పాడు .
కౌశిక్ తో మాట్లాడుతున్నా సాకేత్ గురించే ఎక్కువ ఆలోచించింది శ్రీదేవి. తన లోని బాధను పెద్దవాళ్ళు ఎవరితోనైనా చెప్పుకోవాలన్న తపన కనపడింది సాకేత్ లో. లేకపోతే అంత తొందరగా తన ముందు బయటపడేవాడు కాదేమో. సమస్యా, కారణాలు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి ?? శ్రీదేవి ఆలోచనలు కొనసాగాయి ఆ రోజంతా.
గిరిజ కు మూడు రోజులతరువాత ఫోను చేసింది. కాన్ఫరేన్స్ బాగా జరిగిందనీ. సాకేత్ ని కలిసినందుకు థాంక్స్ చెప్పింది.
“గిరిజా ఈ శనివారం కౌశిక్ ని ఔటింగ్ కు పర్మిషన్ అడిగాను. కాస్త చేంజ్ అవసరమని. నీవు వార్డన్ కు ఫోను చేస్తే సాకేత్ ను కూడా తీసుకెడతా. ఆదివారం విజిటింగ్ టైంలో మీరు వెడతారు కదా “అని అడిగింది.
“ఓహ్. వెరీ గుడ్ ఐడియా శ్రీదేవీ తప్పకుండా తీసుకెళ్ళు. ఆదివారం సాయంకాలం మేము వస్తామని వాడికి చెప్పు. సరేనా” అంది గిరిజ.
శనివారం పొద్దున్నే శ్రీదేవి భర్త శ్రీకర్ తో కలిసి కౌశిక్ తోబాటు సాకేత్ ని తీసుకుని దగ్గరలో వున్న రిసార్ట్ కు వెళ్ళారు. ముందుగా బుక్ చేసుకున్నందున అకామిడేషన్ బాగుంది. రక రకాల ఆటలకు ఒక గేం రూమ్ కూడా వుంది. ముందుగా సాకేత్, కౌశిక్, శ్రీకాంత్ స్విమ్మింగ్ కి వెళ్ళారు. ఆపై భోజనం చేసి ఆటల కోసం వెళ్ళాలి అన్న నిర్ణయం జరిగినా సాకేత్ అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు. అది గమనించి శ్రీదేవి
“నేనూ , సాకేత్ కాస్త రెస్ట్ తీసుకుంటాము మీరిద్దరూ గేం రూమ్ కు వెళ్ళండి. ”అంది.
అలా శ్రీకాంత్ కౌశిక్ వెళ్ళిపోయాక రూమ్ లో వున్న టి. వి. పెడుతూ సోఫాలో వెనక్కి వాలింది శ్రీదేవి. సాకేత్ కూడా టి. వి. వైపు చూడసాగాడు. కానీ కాస్త డల్ గా వున్నట్టు గమనించి టి. వి. ఆఫ్ చేస్తూ సాకేత్ తో “సాకేత్ ఎందుకో మూడీ గా వున్నావు. ”అంది
“నాకీమధ్య ఇలాగే మూడ్ ఆఫ్ అవుతూ వుంటుంది ఆంటీ. ఒకసారి చెప్పాను కదా ఈమధ్య మా హాస్టల్ లో ఒకబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు మీకు తెలుసుగా. అప్పటినుండీ నాకూ ఆలోచనలు కొంచెం తేడాగా వున్నాయి. ”
“ఎందుకూ?? నీకేమి ప్రాబ్లం? నిన్ను ఎంతో ఇష్టపడే డాక్టర్లు అయిన తల్లిదండ్రులు. మంచి కోచింగ్ సెంటర్. ”
“నాకు ఈ కోర్స్ ఇష్టమా లేదా అని తెలుసుకోవాలి కదా. మీరు కౌశిక్ ఇష్టప్రకారం ఈ కోచింగ్ కి పంపుతున్నాం’ అన్నారు ఆ రోజు”
“అవును సాకేత్. కౌశిక్ కోరితేనే సైన్సు తీసుకుని కోచింగ్ కోసం ఇక్కడకు రావటం. వాడు డాక్టర్ అవ్వాలని మేము అనుకోలేదు. ”
“కౌశిక్ కు అలా ఎందుకనిపించిందో”
“ఒక సారి తాతగారి అగ్రహార౦కు వెళ్ళాము. ఒక రోజు తాతగారికి ఆయాసం ఎక్కువై 108 వచ్చే లోపు ఆయన ప్రాణం పోయింది. ఇంకా కొన్ని అనారోగ్యం చావులు చూసాడు నీతో చెప్పానుగా. తాతగారి మరణం నుండి చెప్పేవాడు నేను డాక్టర్ చదివి ఈ పల్లెలో క్లినిక్ పెడతా అని . అదీ వాడి ఇంట్రెస్ట్. మేము కూడా చాలా చెప్పాము. అనుకున్నంత ఈజీ కాదని. అయినా పట్టు వదలలేదు”
“కానీ ఆంటీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో అమ్మా,నాన్న ఇద్దరూ డాక్టర్స్ అయితే వాతావరణం వేరు. ఎప్పుడూ ఎమర్జెన్సీలు, ఆపరేషన్లు. నాకు నచ్చదు. అదే మాట అమ్మకూ నాన్నకూ చెప్పాను. అయినా వాళ్ళు చెప్పేది ఒక్కటే. వారి తరువాత ఫామిలీ లో డాక్టర్ గా కంటిన్యూ అవాలని. చిన్నప్పటి నుండి వారి జీవితాన్ని చూసిన నేను ఎప్పుడూ డాక్టర్ అవకూడదని అనుకున్నప్పుడు నన్ను బలవంతంగా ఇలా కోచింగ్ సెంటర్ ఉన్న కాలేజీలో వెయ్యటం నచ్చడం లేదు. ఈ మధ్య ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయని బాగా చదవాలని వారు చెప్పినప్పుడల్లా “నాకు ఇష్టం లేదు” అని గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది ఆంటి. అంతే కాదు. మరీ బలవంతం చేస్తే ఏదైనా చేసుకుని చనిపోవాలని అనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ అందరితో కలిసి ఉందామని కానీ, బాగా చదువుకోవాలని గానీ అనిపించదు. అమ్మతో ఇలా చెప్పే అవకాశం లేదు. ఎప్పుడు విజిట్ చేసినా వారి అభిప్రాయలు వినటమే కానీ నన్ను గురించి వారికి ఆలోచన లేదు.” నిరాశ గా అంటున్న సాకేత్ ను ఆపింది శ్రీ దేవి.
“సాకేత్, ఇప్పుడు పిల్లలు అందరూ తల్లిదండ్రుల మాట వింటారని లేదు. ఏ కోర్స్ అయినా ఖచ్చితంగా మాకు ఇష్టం లేదు అని తెలియచెప్పే కాలం ఇది. నీవు మీ మమ్మీతో ఎందుకు డిస్కస్ చెయ్యవు?? డాక్టర్ అవ్వాలని లేకపోతే నీకు ఇష్టమైన ఫీల్డ్ క్రికెట్ అయితే కొంచెం కెరీర్ కష్టమే. అందులో అందరూ పైకి రాలేరు. ఇక ఇప్పుడు అందరూ మెచ్చే కంప్యూటర్ కోర్స్ ఇష్టమైతే నీవు ఈజీగా చెయ్యచ్చు. మీ అమ్మా నాన్నలా క్లినిక్ డాక్టర్ గా కాకుండా ఓనర్ గా నీవు రన్ చెయ్యచ్చు. వివిధ రకాల స్పెషలిస్ట్ డాక్టర్స్ ను నీ క్లినిక్ లో అప్పాయింట్ చేసుకోవచ్చు. ఇలా ఆలోచి౦చాలి గానీ మాకు ఎలాటి అవకాశం ఇవ్వకుండా నాకు బతకాలని లేదు అని నిర్ణయం చేసుకుంటారా?
సాకేత్ జీవితం జీవించడానికి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, సక్సెస్ వెంట పరిగెత్తడానికి అంతే. ఈసారి మీ పేరెంట్స్ కు నీ ఆలోచనలు చెప్పు. వాళ్ళు తప్పక ఒప్పుకుంటారు. నీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా గిరిజతో మాట్లాడుతాను. చెప్పు”అంటూ సాకేత్ వైపు చూసింది.
“అంత సులభం అంటారా ఆంటీ? “ అన్నాడు సాకేత్
“ఇప్పుడు మీకు కావలసినంత ఫ్రీడం ఇచ్చే కాలం సాకేత్. నిజమే, కొన్నిసార్లు మా కోరికలు మీ ద్వారా తీర్చు కోవాలనే తపన వుంటుంది. మాకు రాని, వీలుకాని ఆలోచనలు ఇప్ప్పటి జెనరేషన్ కి వస్తున్నాయి వాటిని బట్టే పెద్దలూ మారుతున్నారు. ఆలోచిస్తున్నారు. ఓపెన్ గా డిస్కస్ చేసుకోవాలి అంతే. నీవు మాట్లాడాలి. ”అంటూంటే ఆశ్చర్యంగా చూసాడు సాకేత్.
“ఇది నిజం సాకేత్. ఇప్పుడు పిల్లల ఇంట్రెస్ట్ బట్టే పెద్దలు నడుచుకుంటారు. ప్లీజ్ నీవు మీ అమ్మానాన్నలతో చెప్పు ఎంసెట్ లో రాంకు కంటే నీకిష్టమైనదైతే ఇంకా బాగా చెయ్యగలనని. వాళ్ళు తప్పక ఒప్పుకుంటారు. ”
ఇంతలో శ్రీకాంత్, కౌశిక్ వచ్చారు.
“ఏమిటో చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతూందే?” అన్నాడు శ్రీకాంత్.
“ఏమీ లేదండీ, సాకేత్ తనకు ఇష్టమైన ఫీల్డ్ గురించి చెబుతున్నాడు. ”అని నవ్వేసింది.
వెనక్కి వస్తూ వుంటే సాకేత్ విషయం గిరిజతో ఎలా చెబితే బాగుంటుంది అని ఆలోచన చేస్తూ వుంది. డాక్టర్ గా పిల్లల మనస్తత్వాలు తెలిసిన గిరిజ అర్థం చేసుకోగలదు. సాకేత్ ఇష్టానికి ఎదురు చెప్పకపోవచ్చు.
లక్కీగా సాకేత్ నిరాశను కౌశిక్ గమనించడం జరిగింది కాబట్టి ఇలా బయటకు రావటం సాకేత్ తన ఆలోచనలను చెప్పడం జరిగింది. అందరికీ ఇలాటి అవకాశం ఉండక పోవచ్చు.
ప్రతి తల్లితండ్రీ పిల్లలు బాగా పైకి రావాలనే కోరుకుంటారు ఏ కాలంలో నైనా. పిల్లలు ఇష్టాలు తెలుసుకుని ఒక ఆలోచన చేసి, వారి బాధను ఫ్రీగా చెప్పుకోగలిగేలా చేసి పేరెంట్స్ కూడా ఒక పాజిటివ్ ఆలోచన చేస్తే ఎన్నో ఆత్మహత్యలు ఆపబడతాయి.

****

1 thought on “పిల్లల మనసు

  1. వాస్తవికతకు అద్దం పట్టినట్టుగా వుందండీ కథ లక్ష్మీరాఘవగారూ..

Leave a Reply to SUBBALAKSHMI GARIMELLA Cancel reply

Your email address will not be published. Required fields are marked *