March 29, 2024

సౌందర్య భారతం

రచన: మణికుమారి గోవిందరాజుల

“వేదా ఎక్కడికెళ్తున్నావే? పిన్ని వద్దని చెప్పింది కదా? మళ్ళీ అక్కడికేనా?”
“అవునక్కా!”
“పెద్దవాళ్ళు వద్దని చెప్పినప్పుడు వినాలి. వాళ్ళు ఏది చెప్పినా మన మంచికే కదా?”
“అక్కా! నేను చేసేది కూడా మన మంచికే అక్కా! అందరమూ మనకెందుకులే అనుకుంటే ఎలా అక్కా?”
“ఏమోనే! నువు చేస్తున్నది మంచికా చెడుకా అనేది కాదు. కాని వద్దన్నప్పుడు చేయడం ఎందుకు?”
అడుగుతున్న కీర్తనను జాలిగా చూసింది వేద.
“అక్కా నీకొకటి చూపిస్తాను రా…” అని కీర్తనను టీవీ దగ్గరకు తీసుకెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేసి నిర్భయ ఘటన తర్వాత వచ్చిన టీవీ విశ్లేషణలు, అలాగే దిశ తర్వాతి టీవీ షోస్, ఇంకా ఎప్పుడు అటువంటి సంఘటనలు జరిగినా టీవీ వాళ్ళు కాని, రేడియో వాళ్ళు కాని చేసే చర్చాకార్యక్రమాలు చూపించింది. అన్నీ పూర్తయ్యేసరికి ఒక గంట పట్టింది.
“అక్కా! ఇవన్నీ చూసాక నీకేమనిపించింది? ఒక సమస్య వచ్చాక వారందరూ కంఫర్ట్ గా టీవీ స్టుడియోలో కూర్చునో, లేదా తమ ఇంట్లో కూర్చునో ఆ చర్చల్లో పాల్గొంటారు. కాని సమస్య మూలాలు ఎక్కడున్నాయి? పేపర్ల వాళ్ళు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే సమస్య అంతా చిన్న తనంలోనే చెడు సావాసాలకు అలవాటు పడి చదువుకోక అదే జీవితం అనుకుంటూ బాల్యాన్ని పోగొట్టుకోవడమే కాక ఆడపిల్లలు అనుభవించడానికే ఉన్నారు అనుకుంటూ పెరుగుతున్న బాలలు ఎక్కువగా బస్తీల పిల్లల్లోనే అనే కదా?. అప్పుడు నిర్భయ ఘటనను తీసుకున్నా, ఇప్పుడు దిశ సంఘటన తీసుకున్నా ఆ కిరాతకులు లారీ క్లీనర్లు ఇంకా మురికివాడల బాలలే అన్నది అందరికీ తెలిసిన సత్యమే. పాఠశాలల్లో కింది క్లాసులనుండే ఆడవారిని ఎలా చూసుకోవాలి ఎలా గౌరవించాలి?. ఆడవాళ్ళు సమస్య వచ్చినప్పుడు దానిని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి? అనేవి పాఠ్యాంశంగా చెయ్యాలి. అది ఎప్పటికొస్తుందో? కాని అసలు స్కూళ్ళకే వెళ్ళని పిల్లల పరిస్థితి ఏమిటి?
అందుకే ఫేస్బుక్ లో “సౌందర్య భారతం” అని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము. నువ్వసలు ఫేస్బుక్ జోలికే వెళ్ళవాయె. దానిలో మేము చేస్తున్న కార్యకలాపాల వివరాలన్నీ ఉంటాయి. దాని ప్రకారం మేము ఉన్న ప్రాంతాల్లోని ఒక మురికివాడ లేక బస్తీ లేక వాటెవర్ ఆ ప్రాంతంలోని చదువుకోకుండా ఉన్న పిల్లలను ఎంచుకుని వారికి వారాంతం లో వెళ్ళి మాకు తెలిసిన మంచి మాటలు చెప్పి రావడమన్నమాట. ఇప్పటికే మన ఆంధ్రానుండి చాలామంది చేరి వారున్న ప్రాంతాలలో తమ వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు. ఇది పూర్తిగా అఫీషియల్ పని అన్నట్లె. ఇందులో అమ్మ భయపడటానికి కారణమే లేదు.
“అదే కదా పిన్ని భయానికి కారణం? ఆ పిల్లలకు సంస్కారం ఉండదు. కోపమొస్తే ఏమి చేస్తారో తెలియదు. వయసొచ్చిన ఆడపిల్లవి అలా తిరుగుతుంటే పిన్ని భయపడదా?”
“అక్కా! ఆరునెలల ఆడపిల్లనుండి అరవై ఏళ్ళవరకు ఎవరినీ వదలడం లేదు. దానికి వయసుతో సంబంధం లేదు. అలాగే అందరూ చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళు పెరుగుతున్న వాతావరణం వాళ్ళను అలా తయారు చేస్తున్నది. దానికి ఉన్నవాడు లేని వాడు అని లేదు. ఇప్పుడు మొబైల్స్ లో వీడియోలు చూసి చెడిపోతున్నారు అంటున్నారు. కాని ప్రత్యక్షంగా చూసే వాళ్ళ మనఃస్థితి ఎలా ఉంటుంది?”
“అర్థం కాలేదే. . . ప్రత్యక్షంగా చూడడమేమిటి?” అయోమయంగా చూసింది కీర్తన
“చెప్తాను విను. రిక్షా తొక్కేవాళ్ళు,కూలీలు ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా సరే శారీరకంగా కష్టపడేవాడు కొద్దిగా మందుకొట్టగానె స్త్రీ పొందు కోరుకుంటాడు. సాధారణంగా వారివన్నీ ఒంటిగది కాపురాలు. పక్కన పిల్లలు నిద్రపోతున్నారు అన్న భ్రమలోనే వారి కోర్కెలు తీర్చుకుంటారు. చిన్నప్పటినుండి అలా చూస్తూ పెరిగిన పిల్లలకు అందులో ఏదో ఉందనీ దాన్ని తెలుసుకోవాలనీ ఆశపడటం సహజం. అది తప్పు అని చెప్పేవారు వారికి లేరు. తెల్లవారగానే దైనందిన జీవితం లో పడిపోయిన పెద్దవాళ్ళు తామెళ్ళాక తమ పిల్లలు ఏమి చేస్తున్నారు అనే దానిని ఆలోచించరు. ఆడపిల్లలు వయసుకు మించి పరిణతితో ఉంటారు కాబట్టి కొద్దిగా తప్పొప్పులు తెలుస్తాయి. కాని మగపిల్లలు అలా కాదు. అదేదో తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉంటారు. అందుకే ఈ ఘోరాలు. మధ్యతరగతి ఇళ్ళల్లో కూడా వెనక ఒక గదిలోనే కాపురాలు చేసినా చదువు నేర్పిన సంస్కారం వారిని అదుపులో ఉంచుతుంది. ఏడునుండి ఇరవై ఏళ్ళలోపు వయసు ఆడే కాని మగే కాని వారికి చాల విలువైన సమయం. ఆ వయసులోనే ఏది నేర్చుకున్నా కూడా. ఏదైనా సమస్యను దూరం నుండి చూస్తూ అలా ఉండాలి సమస్యకు ఇదీ పరిష్కారం అని చెప్తే చాలదు. టీవీల్లో చర్చలు అలాంటివే. కాని చేయాల్సిందేమిటి? సమస్య మూలాల్లోకి వెళ్ళాలి. సమస్యను తెలుసుకోవాలి. అప్పుడే సరైన పరిష్కారం దొరుకుతుంది. మేము చేస్తున్నది అదే. నువు కూడా రా ఈరోజు నాతో. నీకే అర్థమవుతుంది” చెప్తున్న చెల్లెలు వంక విప్పారిత నయనాలతో చూడసాగింది కీర్తన. తన చెల్లెలేనా? తన వెనకాల తిరుగుతూ అక్కా అదేంటి? ఇదేంటి? అని రకరకాల ప్రశ్నలు వేస్తూ అమాయకంగా తిరిగిన తన చిట్టి చెల్లెలు ఎంత పెద్దదైంది? దాని ముందు తానే చిన్నదైంది కదా అనుకుంది కీర్తన.
కీర్తన వేద సంహిత ఇద్దరూ అక్కచెల్లెళ్ళపిల్లలు. ఇద్దరూ ఒకరొకరే. సెలవులొస్తే చాలు ఎప్పుడూ ఇద్దరూ ఒక చోట ఉండాల్సిందే. . చూసినవారు ఒక తల్లి పిల్లలనే అనుకుంటారు. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్ సందర్భంగా కీర్తన వేదా వాళ్ళింటికి వచ్చింది. . కీర్తనతో తాను చేస్తున్న పనులు ఫోన్ లో చెప్తున్నా ఇంత వివరంగా మాట్లాడుకోలేదు. ఎందుకంటే వేద తల్లి మాలతి చెప్పే మాట ఇంకోరకంగా ఉండడంతో పిన్ని మాటలనే నమ్మింది కీర్తన. కాని ఇప్పుడు వేద చెప్తుంటే తాను కూడా అందులో భాగస్వామిని కావాలన్నంత మంచిగా అనిపిస్తున్నాయి.
“అక్కా! ఈ రోజు నువు కూడా మాతో రా… నీకే అర్థమవుతుంది. నువు చెప్తే ఇక అమ్మ కూడా నా వెంట పడదు”
“మరి ఇప్పుడు నాకు చెప్పినంత వివరంగా పిన్నికెందుకు చెప్పలేదు?”
“అమ్మ కదా! భయం డామినేట్ చేస్తున్నది” నవ్వింది వేద.
“నిజమే కదా అనుకుంది కీర్తన.
తానుకూడా రడీ అయ్యి వేదతో బయలుదేరింది కీర్తన.
“దాంతో పాటు నువ్వూ తయరయ్యావా?” తలకొట్టుకుంటూ వేదతో పాటు వెళ్తున్న కీర్తనను చూసి అడిగింది మాలతి.
“చూసొస్తాను పిన్నీ. తెలుస్తుంది కదా? నువు కూడా రా” పిన్నిని పిలిచింది.
“ఇప్పటికే ఆ గాడిద నిన్ను చెడిపింది. ఇక నేనెందుకు వెళ్ళి రాండి” కోపంగా అన్నది మాలతి. నవ్వుకుంటూ బయటపడ్డారు ఇద్దరూ. స్కూటీ మీద ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు. ఆ పాటికే అక్కడికి ఇంకొంత మంది వచ్చి ఉన్నారు. అందరూ కూడా అటూ ఇటుగా వేద వయసు వాళ్లే. వేద ఫ్రెండ్స్ అందరూ కీర్తనకు తెలుసు. కాని వీళ్ళంతా కొత్తవాళ్ళు. అక్కని అందరికీ పరిచయం చేసింది వేద. రెండు కార్లల్లో బయలు దేరారు అందరు.
“మా అక్కకి కాస్త మనం చేస్తున్నది మీరు కూడా చెప్పండి” కారెక్కాక వాళ్ళతో చెప్పింది వేద.
“ఏమి లేదక్కా! ఈ రోజు ఇక్కడికి దగ్గరలో ఉన్నబస్తీకి వెళ్ళాలి. . . సాధారణంగా ఆడపిల్లల మీద అత్యాచారాలకు పాల్పడే వారు బస్తీలలో జీవిస్తూ తల్లీ తండ్రీ పనికి పోతే చిన్నతనం లోనే డబ్బు సంపాదించడానికి లారీలల్లో క్లీనర్లుగా, హోటల్స్ లో క్లీనర్స్ పని చేసే చిన్నపిల్లలే ఎక్కువ. వేరే వాళ్ళు చేయరు అని కాదు మా ఉద్దేశ్యము. ప్రస్తుతము మా దృష్టి అంతా వీరిమీదే. ఇప్పుడు మేము ప్రతివారం కొంతమందిమి అలాంటి బస్తీలను ఎన్నుకుని అక్కడ పదిహేనేళ్ళ వయసు లోపు పిల్లలను కూడగట్టి చదువు, జీవితపు విలువలు నేర్పాలనేది మా సంస్థ ఆశయం. అది మా యువత బాధ్యత కూడ. ” ఉత్సాహంగా చెప్పింది వేద ఫ్రెండ్ అరుణ.
“ఓకే! బాగుంది కాని మీరే పిల్లలు మీరేమి చెప్పగలరు?చెప్పినా వాళ్ళు వింటారా?” అడిగింది కీర్తన
“తప్పకుండా వింటారక్కా! ఎందుకంటే అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. వాళ్ళకు చెప్పేవాళ్ళు లేక కొంతమంది, అడ్డు చెప్పేవాళ్ళు లేక కొంతమంది చెడ్డవాళ్ళవుతుంటారు. . వాళ్ళకు ఒక చేయూత కావాలి. వాళ్ళు చేసే పనిలో తప్పొప్పులు చెప్పగలిగే వాళ్ళు కావాలి. నీకు నీవె సాటి అన్న ధైర్యాన్ని కలిగించాలి. మీరు కూడా అందమైన భావిభారతానికి మూలస్థంభాలు అన్న ఆలోచన వాళ్ళల్లో వచ్చేల చేయాలి. ఆ చేయుత మేమిస్తున్నాము. మేము చేసే ఈ పని వల్ల ఒక్కరు మంచిగా మారి మంచి జీవితాన్ని పొందినా మా జీవితాలు ధన్యమైనట్లే. అదీ గాక ఇళ్లల్లో పనికెళ్తున్న వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ గా ఉంటామన్నారు. ఈ ఉద్యమం ఇప్పుడే ప్రారంభించాము. తప్పక ఇది సక్సెస్ అవుతుంది. ” ఎంతో ఆత్మ విశ్వాసంతో చెప్తున్న పిల్లలు చాలా నచ్చారు కీర్తనకు.
మాటల్లోనే అందరూ దగ్గర్లోని ఒక బస్తీ చేరుకున్నారు.
అక్కడ అంతా పదిహేనేళ్ల లోపు పిల్లలు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి పదిమంది ఉన్నారు. . బట్టలు చిరుగులతో ఉన్నా నీట్ గా ఉన్నారు. ఒక పద్దతిలో కూర్చుని ఉన్నారు. కార్లు ఆగగానే అందరూ కార్లల్లోనుండి దిగి పిల్లల్ని రమ్మన్నట్లుగా చేయూపారు. . పిల్లలంతా చక్కగా తోసుకోకుండా వచ్చి డిక్కీ ల్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్,కూల్ డ్రింక్స్ ఇంకా ఎప్పుడు సేకరించారో రెండు బట్టల మూటలు అన్నీ తీసి బయట ఒక పద్దతిగా సర్దారు. . పిల్లలు ఆశగా ఆహార పదార్థల వేపు చూసినా క్రమశిక్షణగా ఉన్నారు. లేకిగా ప్రవర్తించలేదు. . ముందుగా డ్రింక్స్ బయటకు తీసి అందరికీ ఇచ్చారు…వేదా అండ్ కో. . . పిల్లలంతా మొహాలు వెలిగిపోతుండగా హాయిగా తాగేసారు.
దూరంగా నిలబడి చూస్తున్న ఆ పిల్లల తల్లులను కూడా పిలిచి డ్రింక్స్ ఇచ్చిన తర్వాత తెచ్చిన చీరలు,ప్యాంట్లు చొక్కాలు ఇచ్చారు…
“పిల్లలూ డ్రింక్స్. తాగాక ఆ గ్లాసులను ఇదిగో మేము తెచ్చిన ఈ డస్ట్ బిన్ లో వెయ్యండి. సరేనా?” చిరునవ్వుతో అందరికీ ప్రేమగా కమాండింగ్ గ చెప్పింది ప్రణవి అన్న అమ్మాయి. పిల్లలంతా డ్రింక్స్ తాగేసి వరుసగా వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసిన డస్ట్ బిన్ లో వేసారు.
“తమ్ముళ్ళూ,చెల్లెళ్ళూ ఒక్కసారి ఇప్పుడు మేమిచ్చాము కదా మా మాట వినాలని అనుకోవడం కాదు. మీకుగా మీరు పరిసరాలను శుభ్రంగా ఉంచడం అలవాటు చేసుకోవాలి. చేసుకుంటారా మరి? ఎక్కడా బైట చెత్త పోయకూడదు. ఒకవేళ ఎవరన్నా వేస్తున్నప్పుడు చూసినా మీరు ధైర్యంగా చెప్పండి అది పద్ధతి కాదని. సరేనా?”
“అలాగే అక్కా!” అందరూ కోరస్ అన్నారు. ”గుడ్ బాయ్స్” మెచ్చుకుంది వేద.
“ భవానీ,మంగా మీరంతా కూడా రోజూ అందరిళ్ళకూ పనికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళు శుభ్రంగా ఉంచడం కాదు మీ ఇల్లు,మీ పరిసరాలు కూడా నీట్ గా ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలో రోజూ చేసే మీకే మాకంటే బాగా తెలుసు. అందుకని మీకు ప్రత్యేకంగా చెప్పే పని లేదు. మీరు మీ పిల్లలకి శుభ్రత నేర్పించండి. పరిసరాలు బాగుంటే మనసు బాగుంటుంది. మనసు బాగుంటే ఆలోచనా,బుద్దీ బాగుంటాయి. ఆలోచనా బుద్దీ బాగుంటే మంచి పెదలుగా పెరుగుతారు. మంచి పెద్దలుగా ఉంటే మన దేశము బాగుంటుంది. ఇంకొక విషయం మీరంతా పన్లల్లోకి వెళ్తే మీ పిల్లలు స్కూలుకి వెళ్ళకుండా చెడు సావాసాలు పట్తే అవకాశం ఉంది. బడికి పంపండి. లేదా వాళ్ళనో కంట కనిపెట్టి ఉండండి. ఒక్కళ్ళు తప్పు చేసినా మీ అందరికీ ఆ పేరు వస్తుంది గుడిశెల్లో వాళ్ళింతే అని. కాని ఎవరికి తెలుసు? భవిష్యత్తులో మీ పిల్లలే దేశాన్ని ఏలే వారు కావచ్చు. తెలివి ఒక్కరి సొత్తు కాదు. మీరు మనసు పెట్టి మీ పిల్లలని పెంచండి”అని చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు.
“తమ్ముళ్ళూ! ఇప్పుడు మీ ఆకలి తీరింది కదా? మూడు వారాల నుండి మనం కలుసుకుంటున్నాము కదా? మేము చెప్తున్నది మీకు అర్థం అవుతున్నదా? అయితే ఏమి చెప్పామో మీకేమి అర్థం అవుతున్నదో చెప్పండి” అడిగింది వేద.
అందరూ తెల్లమొహాలేసారు. “అక్కా మీరొస్తే మాకు తినడానికి రక రకాలుగా ఏవో ఒకటి తెస్తారు. అందుకని మేమొస్తాము. . గుర్తు లేదక్కా!’ ఒక పిల్లాడు లేచి చేతులు కట్టుకుని చెప్పాడు.
“పర్లేదు. ఒక్కళ్ళకి కూడా గుర్తు లేదా?”
“నాకు గుర్తుందక్కా! మేము ఎట్టా ఉండాలో. . . ఎట్టా ఎదగాలో. . ఆడోళ్ళని ఎట్టా సూస్కోవాలో సెప్పావు. మా ఇల్లెట్టా ఉంచుకోవాలో సెప్పావు. మా ఇంటి సుట్టూరా ఎట్టా ఉంచుకోవాలో సెప్పావు. దేశానికి మేము ఏమి సేవ సెయ్యాలో సెప్పావు” పన్నెండేళ్ళ పిల్లాడు ఒకడు లేచి చెప్పాడు. ఆనందంతో ఆడపిల్లలందరూ చప్పట్లు కొట్టారు.
“ఒక్కళ్ళకి గుర్తున్నా చాలు. మల్లేష్ ఇక నువ్వే నీ బ్యాచ్ కి లీడర్ వి. మేము ప్రతి వారం వస్తాము. మీ ఏరియా చూస్తాము. ఎవరు బాగా చేస్తే వాళ్ళకు బహుమతి ఉంటుంది. లీడర్ కి ప్రత్యేక బహుమతి ఉంటుంది. మరి ఎవరు గెల్చుకుంటారొ” అందరికీ ఆశ పెట్టింది కారుణ్య.
“సరే! అక్కా! అట్టాగే సేస్తాము” పిల్లలంతా ముక్తకంఠం తో చెప్పారు.
చూడండి పిల్లలూ… మీ అమ్మా వాళ్ళు పన్లోకి వెళ్తేనే మీకు అన్నం దొరికేది. వాళ్ళు రోజంతా కష్టపడేది మీ కడుపులు నింపటానికే. వాళ్ళు తినీ తినకా మీ పొట్ట నింపడానికి రోజంతా కష్టపడుతున్నారు. మీ ఇళ్ళల్లోని సంగతులు, మీ తండ్రులెట్లా వచ్చేదీ మీకు తెలుసు. అందుకని బాధ్యతగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాయించుకుంటే అప్పుడు బాగా పెద్దాళ్ళయ్యి, ముసలాళ్ళయిన మీ అమ్మోళ్ళని మీరు మంచిగ చూస్కోవచ్చు. ఏమంటారు?”
“అవునక్కా! నేను బాగ చదువుకుంట. మా అమ్మని నాయనని బాగ సూస్కుంట” ఒకళ్ళు లేచి చెప్పంగానే అందరూ లేచి ఉత్సాహంగా వంత పాడారు.
ఆ తర్వాత నిర్భయ ఘటనలో ఆ అమ్మాయి పడిన బాధని హృదయవిదారకంగా వర్ణించారు. అది విని పిల్లలంతా వెక్కి పడ్డారు. అలా చేయడం వల్ల నిందితులు జైల్లో ఇన్నేళ్ళూ ఉండాల్సి వచ్చిందనీ, జీవితాన్నే కోల్పోతున్నారనీ చెప్పేసరికి పిల్లలంతా కొంత భయపడ్డట్లుగా కనపడ్డారు.
చదువు వల్ల ఉపయోగము, ఆడపిల్లల్ని ఎలా చూసుకోవాలి, అన్న విషయం మీద ఒక స్ట్రీట్ ప్లే వేసారు. తాము చెప్పదల్చుకున్న విషయాన్ని మాటల ద్వారా కాక అలా చెప్పడం వల్ల చెప్పదల్చుకున్న సందేశం స్ట్రయిట్ గా వెళ్తుందనిపించింది కీర్తనకు. అందరూ శ్రద్దగా చూసారు. అన్నీ పూర్తయ్యేసరికి లంచ్ టైం అయింది. అప్పుడు తెచ్చిన తిను బండారాలన్నీ అందరికీ పెట్టారు. వాళ్ళు తినే పద్దతి చూసి ఆశ్చర్యపోయింది కీర్తన. అంత నీట్ గా తిన్నారు. ఆ తర్వాత డస్ట్ బిన్ లన్నిటినీ వారి చేతే దగ్గరలోని పబ్లిక్ డస్ట్ బిన్ లల్లో వేయించారు.
. కొద్దిసేపు అలాగే కొన్ని మంచి మాటలు చెప్పి తెచ్చిన బట్టలు అందరికీ ఇచ్చి మళ్లీ వారం వస్తామనీ ఇంకొందరు పిల్లల్ని తీసుకురమ్మని వాళ్ళకు చెప్పి అందరూ టాటా చెప్తుండగా వెనుతిరిగారందరూ.
… తిరిగి మొదటి స్నేహితురాలి ఇంట్లో సమావేశమయ్యారు. వాళ్ళ అమ్మ అందరికీ భోజనం పెట్టింది. “ఈ వయసులో నేను వాళ్ళతో తిరగలేను. అందుకని నా వంతు సాయంగా ఈ పని చేస్తాను” అన్న ఆవిడ ఎంతో నచ్చేసింది కీర్తనకు. అందరి భోజనాలయ్యాక భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యక్రమాలేమిటి అని కొంత సేపు చర్చించుకుని ఎవరిళ్ళకు వాళ్ళు బయలుదేరారు.
“ఎంత మంచి కార్యక్రమం చేస్తున్నారే? ఇప్పుడు నేను కూడా ఫేస్బుక్ లో జాయిన్ అవుతాను. నా వంతు సాయం నేను కూడా చేస్తాను” ఉద్వేగంగా అన్నది కీర్తన.
“అక్కా! ఇది ప్రారంభమే. కాని ఆవకాయ రోజే అన్నప్రాశన లాగా ఈరోజే మేము అన్నీ చెప్పలేము. కాని డెఫినెట్ గా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా మా ప్రయత్నాలు సాగుతాయి. ” కాన్ఫిడెంట్ గా చెప్పింది వేద. ఎదురుగా వచ్చే బండిని తప్పిస్తూ. . .
“ఆల్ ద బెస్ట్ వేదా. పిన్నికి నేను చెప్తాను బెంగ పడొద్దనీ, మీరు చేస్తున్నది ఎంత మంచి పనో అని. తప్పక మీ ప్రయత్నాలు ఫలించి సుందర భారతాన్ని మన హయాం లోనే చూస్తాము”
సాయంత్రం చల్లగాలి వాళ్ళను సుతిమెత్తగా స్పృశించింది ఆశీర్వదిస్తున్నట్లుగా. . .

1 thought on “సౌందర్య భారతం

Leave a Reply to మాలిక పత్రిక మే 2020 సంచికు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *