May 19, 2024

అర్చన కథల పోటి – దీర్ఘ సుమంగళీ భవ!

రచన: ఎస్. జి. జిజ్ఞాస

“వాడికి కోర్టులో శిక్ష పడకుండా తప్పించుకున్నాడనుకో…. ఏంచేస్తావు నాన్నా?”
ఈ ప్రశ్నే రఘురాంను ఎంతో ఉద్వేగానికి గురిచేస్తోంది. కూతురు రాసిన ఉత్తరంలోని ఆ వాక్యాన్ని చదివిన ప్రతిసారీ మనసులో మెదిలే విపరీత ఆలోచనను తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. ఈ మూడేళ్ళలో ఎన్ని వందల సార్లు చదివాడో ఆ ఉత్తరాన్ని….పరుపు కింద పెట్టుకున్న ఆ ఉత్తరాన్ని రాత్రి పడుకునేటప్పుడు తడిమి చూసుకోవడం అలవాటైంది.
“ఎందుకండీ! ఆ ఉత్తరాన్ని రోజూ చూస్తూజరిగినదంతా గుర్తుతెచ్చుకొని పదే పదే కుమిలిపోతుంటారు. మనం ఏ జన్మలో చేసుకున్న పాపమో….మనకు ఆ పాప పుట్టలేదనుకుందాము….” అంటూ భార్య సురేఖ సముదాయించడం కూడా పరిపాటైంది.
నిజమే! భార్య అన్నట్లుగాచదివినప్పుడల్లాబాధతో రాలిన కన్నీటి బిందువులతో చెదరి చారికలు కట్టిన ఆ ఉత్తరం….అయినా అక్షరాలన్నీ అతని కళ్ళముందు కూర్చిపెట్టినట్లు స్పష్టమే…. ప్రతి వాక్యం కంఠోపాయమే…..
“నన్ను క్షమించు నాన్నా! మిమ్ములందరినీ వదలి వెళుతున్నాను. జీవితంలో ఓడిపోయాను నాన్నా! నాకు బ్రతకాలనే ఉంది. మీ అందరితో కలిసి సంతోషంగా ఉండాలనే ఉంది. కానీ…. బహుశా దేవుడు నాకా అవకాశం ఇవ్వాలనుకోలేదేమో!
నాన్నా! మీలాంటి వాళ్ళు నాకు పేరెంట్స్ గా దొరకడం నా అదృష్టం. ఎంత ఎక్కువుగా ప్రేమించారని నన్ను. చిన్నప్పటినుండి ఏ తప్పూ చేయకుండా చదువులో ఫస్ట్ ఉండేదాన్ని కదా నాన్నా! మీ అమ్మాయి వైష్ణవి చాలా మంచిది… బాగా చదువుతుంది… అని అందరూ పొగడుతుంటే నీ ముఖంలోని పట్టరాని ఆనందాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బై పోయేదాన్ని. ‘నా కూతురు’ అని మీరు గర్వంగా చెబుతుంటే ముసిముసి నవ్వులు నవ్వేదాన్ని. ‘అబ్బో! మీకొక్కరికే ఉంది ముద్దుల కూతురు’ అని అమ్మ అన్నప్పుడు కొంచెం కోపం వచ్చేది. అమ్మ అలా అన్నప్పటికీ బయటకు వ్యక్తంకాని ఆ తల్లి మనస్సులోని ఆనందాన్ని కనిపెట్టేశానులే. ఎల్కేజీ నుండి ఇంజినీరింగ్ వరకు మంచి మార్కులు తెచ్చుకొని మీ పేరు నిలబెట్టాను నాన్నా!
కానీ నాన్నా! పెళ్ళి అనే పరీక్షలో ఫెయిల్ అయ్యాను. అబద్దాలు, మాయ మాటలు చెప్పి పెళ్ళికి ఒప్పించారు. నేను వాణ్ణి పెళ్ళి చేసుకోవడం వలననే మీరు ఎన్నో బాధలు పడ్డారు. నా వల్లనే మీ పరువు, మర్యాద దెబ్బతినింది. మీరెన్నో అవమానాలకు గురయ్యారు. అయినా మీరు నన్ను ఒక్క మాటకూడ అనకపోవడం మీ సంస్కారం నాన్నా! మా అత్తింటి వాళ్ళు కించపరుస్తూ ఎన్ని మాటలన్నా కేవలం నాకోసం భరించావు. వాళ్ళు మానవ రూపంలోనున్న రాక్షసులు. పెళ్ళయిన ఒక్క సంవత్సరంలోనే నరకాన్ని చూపించారు. డబ్బుకోసం ఎంతటి నీచానికైనా దిగజారుతారు. వాడు సుమంత్ భర్త కాదు. కౄర మృగం. వాడు నా మెడలో కట్టింది మంగళసూత్రం కాదు… మృత్యుపాశం. ఎంత విచక్షణా రహితంగా గొడ్డును బాదినట్లు కొట్టాడని. బయటకు కనిపించని గాయలెన్నో…మీకు తెలిస్తే బాధపడతారని చెప్పలేదు. నాలో నేను ఏడ్చి ఏడ్చి, కుమిలి కుమిలి చచ్చి సగమయ్యాను. నేను ఇంకా బ్రతికి ఉంటే డబ్బుకోసం నన్ను, నిన్ను వేధిస్తూనే ఉంటారు. వాణ్ని వదిలేసినా వేధింపులకు అంతం ఉండదు. ఒంటరిగా నిలబడలేని స్త్రీ భయం నన్నుకుడా వెంటాడుతోంది. అందుకే వీటికి ముగింపు పలకడానికి ఇప్పుడు పూర్తిగా చచ్చి పోతున్నాను. నేను చచ్చిపోతున్నానని అనడంకంటే వారు నన్ను చంపేశారని చెప్పడం నిజం.
నీకు గుర్తుండేఉంటుంది నాన్నా! ఆ రోజు పెళ్ళిలో వచ్చిన వారంతా నన్ను ‘ ధీర్ఘ సుమంగళీ భవ!’ అంటూ అశ్వీరదిస్తూ అక్షింతలు వేశారు. వారి మాట నిజమైంది. నేను కలకాలం సమాజనికి సుమంగళిగానే మిగిలిపోతాను. ఎంత అదృష్టం నాది. నా అదృష్టాన్ని చూసి ఈ లోకం సంతోషిస్తుందోమో… ఏం లోకం నాన్న ఇది…! ఏమై పోయాయి నాన్నా! వేదమంత్రాలు, ఏడడుగులు… అగ్నిసాక్షి, అరుంధతి నక్షత్రాలు…. కానీ లోకానికి తెలియని ఒక రహస్యముంది. నేను ఈ ఉత్తరం రాయడానికి ముందు వాడు నా మెడకు కట్టిన ఆ మంగళ సూత్రాన్ని తెంచి పారేశాను. శుభమో, అశుభమో తెలియదు నాన్నా! అయినా నాన్నా! ఆ దుర్మార్గులను మాత్రం ఊరికే వదలిపెట్టరాదు. ఈ సూసైడ్ నోటే నా మరణ వాంగ్మూలం. అన్ని ఆధారాలు పోలీసులకివ్వండి. వాడికి కఠిన శిక్ష పడాలి. అదే నా చివరి కోరిక. మరో అమ్మాయికి ఇలా జరుగరాదు. సెలవ్! నాన్నా! మరో జన్మ ఉంటే మీకే కూతురుగా పుట్టాలని ఉంది. కానీ ఇలాంటి నికృష్ట సమాజంలో కాదులే. చివరగా నాకొక అనుమానం నాన్నా!. వాడు శిక్ష పడకుండా తప్పించుకుంటే?……”
నాలుగు పేజీల సుధీర్ఘ ఉత్తరంలోనిఈ ప్రశ్న దగ్గరికి వచ్చేటప్పటికి మరి చదవకుండా ఆగిపోతాడు రఘురాం. వారం కిందట కోర్టులో ఫైనల్ హియరింగ్ ముగిసింది. కూతురు అనుమానమే నిజమై ఎల్లుండి వచ్చే తీర్పులో శిక్ష పడకపోతే….నేనే వాణ్ణి…..నో! అలాంటి పరిస్థితి రాకూడదని దేవుణ్ణి వేడుకుంటాను. వాడికి తప్పక కఠిన శిక్ష పడుతుంది….అయినా మనసులో ఎదోమూల ఒక అనుమానం..
దీన్ని తీర్చుకోవడానికి రెండు రోజులక్రితం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కలిసినప్పుడు ఇదే సందేహాన్ని వెలిబుచ్చాడు.
“సార్! ఈ మధ్య పేపర్లలో జడ్జీలగురించి ఏమేమో వస్తోంది. బెంచిలేవో మారుస్తారట…నిజమేనా! వారుకూడా….”
దానికి ఆయన చిరునవ్వు నవ్వి
“బెంచీలూ, కుర్చీలూ అంటూ అలాంటి అనుమానాలేమీ పెట్టుకోమాకయ్యా! అయినా అందరూ అలానే ఎందుకుంటారయ్యా?
“ఏమో సార్! పోలీసులు తిమ్మిని బమ్మిని చేయడం చూశాను. జడ్జీలు కూడా…ఆయనెవరో ఢిల్లీలో పెద్ద లాయరట….సుప్రీంకోర్టు జడ్జీల నిజాయితీని కోర్టు హాల్లోనే ప్రశ్నించాడట. పేపర్లో వచ్చింది”
“అవును, నేనుకూడా చదివానయ్యా! అలా ఉండకూడదనేకదా! మిగతా జడ్జీలు బయటకువచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా మాట్లాడింది.”
“ ఏదో తెలియక అడిగాను… మీరేమీ అనుకోకండి”
“భలే వాడివయ్యా! మీ అనుమానాలను నివృత్తి చేయడం మా వృత్తి. నీవు నిశ్చింతగా వెళ్ళు. సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి. ధర్మం, న్యాయం మనవైపుంది.”
ప్రాసిక్యూటర్ ఇలా భరోసా ఇచ్చినప్పటికీ రఘురాం సందేహం తీరలేదు. ఎందుకంటే పూణేలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న కూతురు అక్కడే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నప్పుడు అక్కడి పోలీసులు కేసును బయటకు రాకుండా చూశారు. ఇక్కడి పోలీసులు కేసును మాఫీ చేయడానికి ప్రయత్నించారు. అప్పుడుగానీ నారీ చేతన సంఘం నాయకులు వచ్చి కేసును బయటకులాగి ప్రపంచానికి చెప్పకపోయి ఉంటే తనొక్కడే ఏం చేయగలిగి ఉండేవాడు! వారిచ్చిన ధైర్యం అతనిలో కొత్త శక్తిని నింపింది. కూతురి చివరి కోరికను నెరవేర్చాలనే దృఢనిశ్చయానికి పురికొల్పింది. కాలేజీ అమ్మాయిలందరూ బయటకువచ్చి ‘వైష్ణవికి న్యాయం చేయాలి’ అని దిక్కులు పిక్కటిల్లేలా గొంతెత్తి అరిచారు. వారి గొంతుకలతో తను, తన భార్య సురేఖ శృతి కలిపారు. దాంతో పత్రికలు వైష్ణవి సూసైడ్ నొత్ ను హెడ్ లైన్స్ లో వేశారు. చివరకు పోలీసులు కేసు ఫైల్ చేసి, కోర్టులో విచారణ నడపక తప్పలేదు. మూడేళ్ళ కోర్టు పోరాటం ఇప్పుడొక కొలిక్కొచింది. నిందితులకు శిక్షపడే సమయం వచ్చింది.
“ఇప్పుడు మరోలా జరిగితే…” అనే ఆలోచననే అతడు జీర్ణించుకోలేక పోతున్నాడు.
“నారీ చేతన మేడమ్ నే అడుగుదాం! ఆమె అన్నీ వివరంగా చెబుతుంది. జరగరాంది జరిగినప్పుడు ఏం చెయ్యాలోకూడా తెలుస్తుంది. బహుశా అంత్యక్రియలు జరిగిన రెండవ రోజు.ఆమె ఇల్లు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆ విషాద వాతావరణంలో ఎవ్వరూ ఆమెను సరిగా పలకరించలేదు. అయినప్పటికీ ఆమే చొరవ తీసుకొని ఓదార్చింది. మాటల మధ్యలో ఎన్నో మంచి విషయాలు చెప్పింది. కాసేపు బాధను మరపింపజేసి భావాలపై చర్చింది. వేదనకు ఉపశమనమిచ్చి వాదనలో పాల్గొనేటట్లు చేసింది. శోకంతో నిశ్శబ్దంగా ఉన్న ఇంటిలో నిశ్చయాన్ని నింపింది. అవన్నీ ఇప్పటికీ అతనికి బాగా జ్ఞాపకమే…. ఆమె మాట్లాడే ప్రతి మాట తల్లిదండ్రులకు కనువిప్పు కలిగిస్తుంది. లోకంపట్ల కొత్త జ్ఞానోదయం కలిగిస్తుంది. కూతురు ఉత్తరం ఎంతగా కలచివేస్తుందో అంతగా ఆమె పలుకులు ప్రభావితం చేస్తాయి…హల్లో తన కెదురుగానున్న సోఫాలో కూర్చొని ఆమె చేసిన సంభాషణ ఇప్పటికీ అతని మనస్సులో తాజాగా మెదులుతూనే ఉంటుంది….
******
“రఘురాం గారు! తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డలకు అడిగినవన్నీ ఇస్తారు, బాగా చదువు చెప్పిస్తారు. డబ్బూ, నగలు వగైరా అన్నీపెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు. అయితే పరిస్థితులను ఎదుర్కొని బ్రతకగలిగే ధైర్యాన్ని మాత్రం కలిగించలేకపోతున్నారు…అందుకే ఇలాంటి విషాదాలు” అంటూ సూటిగా మాట్లాడుతూ గంభీరమైన చర్చను లేవనెత్తింది.
ఆమెతో వాదించడానికి మనస్సు సిద్దంగా లేకపోయినప్పటికీ మౌనంగా ఉండడం సంస్కారం కాదని
“అంతకంటే మేము చేయగలిగేది ఏముంటుందమ్మా? చదివించి ఒక అయ్య చేతుల్లో పెట్టడం వరకు మాత్రమే కదా కన్నవారి బాధ్యత” అని మాత్రమే అతను బదులు పలికాడు.
“ఇలా ఆలోచించడమే చాలా తప్పు. వివాహమే స్త్రీలకు అంతిమమని భావించడమే మీరు చేస్తున్న తప్పిదం” అంటూ ఆమె తిరిగి ప్రతి వాదన చేసింది.
“ఆదేకదమ్మా! మన భారతీయ ధర్మం….అంతకుమించి స్త్రీ జాతికి ఇంకేముంటుందో నాకు తెలియడం లేదు” అంటున్నప్పుడు అతని గొంతు జీరబోయి విషాద స్వరం వినిపించింది.
“ఆ ధర్మం పేరుమీదనే ఇన్నాళ్ళు ఆత్మ వంచన చేసుకుంటూ వస్తున్నాము. పరస్పర ప్రేమ, గౌరవం, నమ్మకం పునాదులుగా వివాహబంధం వికసించాలి. అయితే డబ్బు, సంపదలకై వేధించే స్వార్థం, కౄరత్వం పెంపొందింది. అందుకే సంసారాలు నరకప్రాయమవుతున్నాయి. భర్త దుర్మార్గుడని తెలిసి తెలిసి తిరిగి ఆ నరకంలోకే అమ్మాయిలను నెడుతున్నారు. భర్త లేకుండా స్త్రీ బ్రతకలేదా ఏం….చెప్పండి ” కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించింది.
ఒక అపరిచిత వ్యక్తి అందులోనూ ఒక భారతీయ మహిళ అలా ఆడగడం అతనికి అనుభవంలోలేనిది. ఈ ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలో రఘురాంకు తోచలేదు. అయినా తనకు తెలిసిన మేరకు ఏదో చెప్పాలనిపించి
“అవును, సాధ్యమే! అయితే కట్టుకున్నోన్ని వదిలేసిన ఆడది అని లోకం ఆడిపోసుకుంటుంది” అని ఒకింత నిరసనగా పలికి తలెత్తి అమెవైపు చూశాడు. ఆమె ముఖంలో అంతకుమునుపులేని మరో రూపం కనిపించింది. కళ్ళనుండి తీక్షణంగా చూపులు వెలువడుతున్నట్లనిపించింది.
“ఏ లోకమండీ! భర్త పెట్టిన చిత్రహింసలు భరించలేని మీ అమ్మాయికి మీరు చెప్పే లోకం ఏదారి చూపింది? అక్కడే చావమని చెప్పకనే చెప్పలేదా! పురుషుడు లేకుండా స్త్రీకి ఉనికే లేదు అంటూ తరతరాలుగా నూరిపోస్తున్న ఈ తప్పుడు ధర్మమే స్త్రీలను అశక్తులుగా చేస్తోంది. అందుకే నాగోడు వినే నాథుడేలేడని మీ కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణానికి కారణమైన దోషులను శిక్షించడానికి ఈ లోకం మీకు అండగా నిలిచిందా! లేదే! అలాంటి లోకం గురించి మీరు చెబుతున్నారు. లోక భయమే మనుష్యుల నీతి, నియమాలను నిర్దేశిస్తుందా చెప్పండి!”
తనకంటే ఆమె వయస్సులో, అనుభవంలో చిన్నది కావున ఆవేశంతో మాట్లాడుతోందని అతడు భావించి
“ఎందుకమ్మా! లోకం మీద అలా అభాండాలు వేస్తావు….లోకంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకోమని చెబుతారా! మా అమ్మాయి అలా చేస్తుందని ముందుగా తెలిసివుంటే ఇలా జరగనిచ్చే వాళ్లం కాదు”
“సారీ! మీరు లోకం అని అనేసరికి ఉద్వేగాన్ని అపుకోలేక పోయాను. మీ అమ్మాయికూడా సూసైడ్ నోట్ లో ఈ లోకం గురించే రాసింది. తమదాకా రానంతవరకు ఈ లోకం ఎలా తయారైందో చాలమందికి తెలియక పోవచ్చు” అని పలికి తిరిగి కంఠ స్వరాన్ని మార్చి
“నేను మాట్లాడుతున్నది మీ ఒక్క అమ్మాయి గురించి మాత్రమే కాదు….బాధలు, అవమానాలు భరించలేక ఆత్మహత్యే పరిష్కారమనే పరిస్థితులు మన సమాజంలో ఉన్నప్పుడు మీ అమ్మాయి మాత్రం భిన్నంగా ఎలా ఆలోచిస్తుంది చెప్పండి?”
“అవునమ్మా! నీవు చెప్పేది నిజమే! కానీ మనమొక్కరమే పరిస్థితులను మార్చలేముగా”
“పరిస్థితులను మార్చడానికి ముందు మన ఆలోచనా తీరును మార్చుకోవాలి. స్త్రీకి జీవితంలో వివాహం ముఖ్యమే. దాన్ని నేను కాదనను. అయితే అదే వారి జీవితానికి పరమావధి అనే భావాన్నిమాత్రం అంగీకరించరాదు. సమాజం ఈ తప్పుడు భావంనుండి బయటకు రావాలనేదే మా కోరిక. స్త్రీలు నిస్సహాయులుగా కాక మనోధైర్యంతో నిర్భయులుగా నిలబడే వ్యక్తులుగా తయారు కావాలనేదే మా ఆకాంక్ష. అప్పుడే మీ అమ్మాయేకాదు, ఏ అమ్మాయైనా పరిస్థితులకు తలవంచకుండా ఎదిరించి నిలుస్తుంది” అని పలికి కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆ తరువాత ఆమె చివరగా చెప్పిన మాటలు రఘురాం ను కదిలించి వేశాయి.
“వైష్ణవి మాకేమీ బంధువుకాదు, ఆమెతో పరిచయమే లేదు….మేము ఆమెను చూడలేదు, కలవలేదు….అయినా రక్త సంబంధాల, కుటుంబ బాంధవ్యాల సరిహద్దులను దాటిన సంబంధం మాది…. నిస్సహాయతనే స్త్రీల బలహీనతే మరొక మా చెల్లిని బలి తీసుకుందని మా ఆవేదన. ఇకెంతమంది సమిధలవుతారో….” అని అంటున్నప్పుడు ఆమె కళ్ళనుండి కన్నీళ్ళు జలజలారాలి పడ్డాయి. కన్నబిడ్డను కోల్పోయిన మా కడుపు కోతను ఎంతోమంది బంధుమిత్రులు పంచుకుని ఓదార్చారు. కానీ మా వేదనను ఆమె పంచుకున్న తీరు మాత్రం విభిన్నం. అప్పటినుండి ఆమె చెప్పే విషయాలపై గురి కుదిరింది. కోర్టు వ్యవహారాల గురించి కూడా తెలుసుకోవడానికి ఆమె వద్దకు రేపే వెళ్ళాలని మనసును దిటవు చేసుకొని కూతురు ఉత్తరాన్ని పరుపుకింద పెట్టి ఏవేవో ఆలోచనలు ముసురుకుంటున్నానిద్ర పోవడానికి ప్రయత్నించాడు. పరుపుమీద పక్కకు తిరిగి చూస్తే…..ఈ కాలపు మాయామర్మం తెలియని సురేఖ మాత్రం అప్పటికే నిద్రలోకి జారుకొని ఉంది.
******
జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించే రోజు వచ్చింది. ఉదయాన్నే రఘురాం అక్కడికి చేరుకున్నాడు. కోర్టు ఆవరణమంతా చాలా సందడిగా ఉంది. సంచలనం సృష్టించిన కేసు కావడంతో మీడియా అంతా రకరకాల లోగోల గొట్టాలతో మోహరించి ఉంది. ముద్దాయిలకు రాజకీయ పలుకుబడి ఉండడంతో కోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలుసుకోవాలని జనరల్ పబ్లిక్ లో కూడా ఎంతో ఆసక్తి కనిపించింది. అతను కోర్టు హాల్ లో జడ్జీకి ఎదురుగా దాదాపు నలభై అడుగుల దూరంలో కొంచెం ఎత్తులోనున్నపబ్లిక్ గ్యాలరీలోని కుర్చీలలో వచ్చి కూర్చున్నాడు. అప్పటికే ఆ గ్యాలరీ నిండిపోయి ఉంది. కొద్దిమంది నిల్చోని ఉన్నారు. కాసేపటి తరువాత నారీ చేతన మేడమ్ వస్తే తనకు ఎడమవైపు కొంచెం దూరంలో ఎవరో లేచి నిలబడి ఆమెకు సీటిచ్చారు. ఆమె నన్ను చూసి విష్ చేసింది. ఆ విష్ లో ధైర్యంగా ఉండమనే సందేశం కనిపించింది. సరిగ్గా 11 గంటలకు కోర్టులోని బిళ్ళ బంట్రోత్తు “కోర్టువారు వేంచేయుచున్నారు…ఆర్డర్.. ఆర్డర్…” అంటూ మూడుసార్లు గట్టిగా అరిచాడు. దాంతో కోర్టు హాలంతా పూర్తి నిశ్శబ్దం నెలకొంది. సెషన్స్ జడ్జి వచ్చి ఆసనంపై కూర్చున్నాడు. ఆయన కాసేపు హాలంతా పరికించి చూసి తనవెంట తెచ్చుకున్న బ్రీఫ్ కేస్ తెరచి పేపర్లు బయటకు తీశాడు. తీర్పులోని చివరి రెండు పేరాలు మాత్రమే ప్రకటిస్తున్నట్లు చెప్పి ఇంగ్లీషులో మూడు నిమిషాలపాటు చదివి లేచి లోపలికి వెళ్ళి పోయాడు. దాని సారాంశం రఘురాంకి ఇలా అర్థమైంది:
“అన్ని సాక్ష్యాధారాలను బాగా పరిశీలించి మొదటి ముద్దాయి సుమంత్ కు ఐ‌పీసీ సెక్షన్స్ 304-బి, 306 ప్రకారం జీవిత కఠిన కారాగార శిక్ష, మిగతా ముద్దాయిలకు 10 సంవత్సరాల సాధారణ కారాగారవాసం విధించబడింది. తీర్పును పై కోర్టులో పునర్ విచారించడానికి అనుమతి మంజూరైంది”
మూడు సంవత్సరాల కోర్టు పోరాటం మూడు నిమిషాల్లో తేలిపోయింది. ఈ తీర్పుకు రఘురాం చాలా సంతోషించాడు. కానీ పై కోర్టులో అప్పీలు అనే సరికి తిరిగి అదే సందేహం పుట్టుకొచ్చింది. డబ్బు, రాజకీయం ఉపయోగించి చట్టానికి దొరక్కుండా తప్పించుకుంటారేమో…అయినా వెనకడుగు వేయరాదని నిర్ణయించుకున్నాడు.ఏదిఏమైనా మరో న్యాయ పోరాటానికి సిద్దంగా ఉండాలని మనస్సులో గట్టిగా తీర్మానించుకున్నాడు. కోర్టు హాలునుండి వెలుపలికి వచ్చాడు. తీర్పు గురించిన వార్తను వెంటనే భార్యకు చెప్పాలని సెల్ ఫోన్ లో ప్రయత్నించాడు. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దాంతో త్వరగా ఇంటికి వెళ్ళడానికి బయటకు వస్తేమీడియా చుట్టుముట్టింది. ముప్పుతిప్పలుపడి వాళ్ళను తప్పించుకొని ఇంటికి చేరుకున్నాడు. భార్యకూడా భర్త సంతోషంలో పాలుపంచుకుంటూ
“ ఏవండీ! మీరు కోర్టుకు వెళ్ళిన తరువాత బాపనయ్య వచ్చి వెళ్ళాడు. కోర్టు తీర్పు తరువాత మన పాప అస్థికలను గోదావరిలో కలుపుతానని మీరు ఆయనతో అన్నారట. వాటిని ఇన్నాళ్ళు ఉంచుకోవడం శాస్త్రం కాదట” అని చెప్పింది.
“అవును చెప్పాను… అయితే ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నాను. నా కూతురు మరణానికి కారణమైన వాడికి శిక్ష ఖరారయ్యేదాక ఆ అస్థికలు నదిలో కలవవు. అంతవరకు ఏ శాస్త్రాలు నాకు పట్టవు” అంటూ ఇంటి హల్లో గోడకు వేలాడుతున్ననిలువెత్తు కూతురు ఫోటోవైపు చూశాడు. పట్టు వస్త్రాలతో, పసుపు కుంకుమలతో, నవ్వు నిండిన ముఖంతో వెలిగిపోతున్న ఆ ఫోటోను తదేకంగా చూస్తున్న రఘురాంకు తన కన్నకూతురు ఒక్కతే కాదు….అమానుష అన్యాయాలకు బలవుతున్న ఆడకూతుళ్ళు ఎంతోమంది కనిపించారు.
****************

7 thoughts on “అర్చన కథల పోటి – దీర్ఘ సుమంగళీ భవ!

  1. Huh… సమాజం, పరువూ, పెద్దరికం… మట్టి మసానం కాదు. ఒక్క మగ పిల్లల్ని అని ఏమి లాభం. వీళ్ళకి కిర్రెక్కించే అక్కలు, చెల్లెళ్ళు. వీళ్ళని, మా అబ్బాయి బంగారం అనే మూర్ఖులు. ఈ అబ్బాయిలు పడేసే పడి, పరకకి కక్కుర్తి పడి ఆడపిల్ల గొంతు నొక్కడాన్ని మద్దతు ఇచ్చే చుట్టాలు, పక్కాలు. వీళ్ళని ఏమి అనాలి.ఇదొక విష వలయం. అమ్మాయిలు డబ్బు సంపాదించి పోస్తే, పిల్లల్ని కని దత్తత కి ఇస్తే మంచిది. లేదంటే చెడ్డది. ఇలాంటి లోకానికి, ఇలాంటి మనుషులకి భయపడి చస్తే మన జన్మ కి మనం విలువ ఇవ్వనట్టే. ఎంతో మంది ఇద్దరు ఆడపిల్లలని కన్న నేరానికి అత్తారింట్లో ఆరళ్ళు పడటం. ఉద్యోగం వదిలేస్తే అత్తారింటి సాధింపులకు తట్టుకోలేను అని పిల్లల్ని ఆయా మీద వదిలి ఉద్యోగానికి వెళ్ళడం. నిజంగా చెప్పాలి అంటే రోజు రోజు కి ఆడవాళ్ళకి కష్టాలు పెరుగుతున్నాయి. మొగుడు చితక తన్నినా, నోరు మూసుకొని ఇంట్లో కుక్కల పడి ఉండటం మన పుణ్యవతుల అలవాటు. నువ్వు కాకపోతే ఇంకోడు అనుకుంటూ మొగుడిని మార్చేసే కల్చర్ ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అవుతోంది. అయితే పడి వుండటం. లేదంటే మొగుడిని మార్చడం రెండు తప్పు. సమస్య నీ ఎదుర్కొని, పరిష్కరించుకోవాలి.

  2. అమ్మాయిలకు మొగుడొచ్చెస్తే లైఫ్ సెటిల్ అయినట్టే అనే భావన అమ్మాయిలకు, వాళ్ళ కన్న వాళ్ళకు కూడా ఈ రోజుల్లో పనికి రాదు. తమకన్నా ఏమాత్రం అధికంగా కనబడినా తమ పెద్దరికం పోయిందనుకునే మూర్ఖులు చాలామంది ఉన్నారు. అబ్బాయొక్కడు బాగా కనబడితే సరిపోదు, గంగిరెద్దును అందంగా అలంకరించి పదిమందినీ అలరించడానికి ఆటా పాటా నేర్పి వీధిలో తిప్పుతున్నట్లే వాళ్ళ కొడుకులకు కూడా లేని మెరుగులు దిద్ది బయటకు వదులుతారు. ఆడపిల్లలూ తస్మాత్ జాగ్రత్త!
    .
    సూపర్ స్టోరీ.

  3. నిజమే ఆడపిల్లలకు ఇంకా ఏమి నేర్పించాలో చెప్పారు. ఈ పాయింట్ మిస్ అవుతాము. .మంచి కథకు బహుమతి అభినందనలు

  4. ప్రథమ బహుమతికి అర్హమైన కథ. చాలా బాగుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *