February 22, 2024

అర్చన కథల పోటి – నేనూను

రచన: అఫ్పరాజు నాగజ్యోతి


“ షాప్ కి వెళ్ళాలంటే భయమేస్తోంది లతా. రాత్రుళ్ళు నిద్ర కూడా పట్టడంలేదు. తెల్లవారుతోందంటే చాలు గుండెలు దడదడలాడుతున్నాయనుకో! ఏ రోజుకారోజు ‘ ఈవేళే ఆఖరు , రేపటినుండీ ఉద్యోగానికి ఛస్తే వెళ్ళను ‘ అనుకుంటాను. అయితే ఇంటికి చేరుకోగానే వరండాలో మంచంపైన నీరసంగా మూలుగుతున్న అమ్మా, బట్టలచిరుగులని దాచేందుకు విఫలయత్నాలు చేస్తున్న చెల్లెళ్ళూ కనిపిస్తారు. అంతే, అందాకా తీసుకున్న నిర్ణయం కాస్తా వీగిపోతుంది. ఏమిటోనే ఈ జీవితం ! “
ఉష నిర్వేదంగా చెప్పిన మాటలకి పేలవంగా నవ్వింది లత.
“ రోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్లుంది ఉషా! నా ఇక్కట్లు ఎవరికి చెప్పుకోమంటావు ? “
“ అదేంటే ? నాకైతే చదువబ్బలేదు కాబట్టి పదోతరగతి తప్పగానే ఫాన్సీషాపులో సేల్స్గర్ల్గా కుదురుకున్నాను, వచ్చీపోయే కస్టమర్లతో హింసపడుతున్నాను. కానీ నువ్వు నాలా కాదు కదే! చక్కగా డిగ్రీ ఫస్టుక్లాసులో ప్యాసై పెద్దకంపెనీలో ఉద్యోగం చేస్తున్నావు. నీకేం కష్టాలే ? “ ఆశ్చర్యంగా అడిగింది ఉష.
“ పీత కష్టాలు పీతవిలేవే! మా అకౌంట్స్ ఆఫీసరు ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. మేనేజర్కి ఫిర్యాదు చేద్దామంటే, వాడు వీడికంటే నీచుడు. ఏమీ పాలుపోవడంలేదు. ఇంతకాలమూ ఏ ఫైల్ అందిస్తూనో చేతులూ, కాళ్ళు తగిలిస్తూ వెకిలినవ్వులు నవ్వుతుంటే , పోనీలెమ్మని సర్దుకుపోతూ వచ్చాను. కానీ , ఈరోజు వాడు చేసిన పని తలచుకుంటేనే నాఒళ్ళు జలదరిస్తోందే ఉషా …”
భయంతో కళ్ళుమూసుకున్న లతకి వద్దన్నా ఉదయం ఆఫీస్లో జరిగిన సంఘటనే గుర్తొస్తూ ఒంట్లో వొణుకుపుడుతోంది.
***
స్టోర్ రూమ్ లో కూర్చుని కొత్తగా వచ్చిన స్టాక్ ని లెక్కపెడుతూ రిజిస్టరులో ఎంట్రీ చేస్తోంది లత. ఇంతలో హఠాత్తుగా కరెంటు పోయింది. ఆఫీసు క్యాబిన్ లకి కొద్ది దూరంలో ఒక మూలగా వున్న ఆ గదికి ఒక్కకిటికీ కూడా లేకపోవడం వలన కరెంటు పోగానే గదంతా చిమ్మచీకటి అలుముకుంది.
రిజిస్టరుని మూసేసి గోడలని పట్టుకుంటూ మెల్లిగా అడుగులోఅడుగేసుకుంటూ తలుపువేపుకి నడుస్తుండగానే రెండు బలమైనచేతులు లాఘవంగా లత నడుముని చుట్టేసి ఆమెని బలంగా వెనక్కి లాగాయి. భయకంపితురాలైన లత నోరు తెరిచి పెద్దగా కేక పెట్టబోయింది.
ఒక చేత్తో ఆమె నోటిని గట్టిగా అదిమిపట్టుకుని , మరోచేత్తో ఆమె శరీరంలోని ఆణువణువునీ ఆబగా తడముతున్న అతని స్పర్శకి ఆమెకి ఒంటిమీద తేళ్ళూజెర్రులూ ప్రాకుతున్నట్లుగా వుంది. సిగరెట్ కంపు కొడుతున్న అతని మోటుపెదవులు ఆమె మొహానికి అతిదగ్గరగా రావడంతో ఆమెకి వాంతి అయినంత పనైంది. లేని బలం తెచ్చుకుని తీవ్రంగా పెనుగులాడినా అతని ఉడుంపట్టునుండీ ఆమె తప్పించుకోలేకపోయింది. అలాగే ఒడిసిపట్టుకుని నేలకి తనని గట్టిగా అదిమిపెట్టి అతను తనని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుండగా ఒళ్ళంతా నీరసం కమ్మేసినట్లై స్పృహ త్రప్పగా తలప్రక్కకి వాల్చేసింది లత.
***
మొహానికి చల్లగా తగిలిన నీటితుంపరలకి కళ్ళుతెరిచిన లతకి తన మొహంలో మొహం పెట్టి చూస్తున్న ఆయా రంగమ్మ కనిపించింది.
“ లేమ్మా లే , అదురుష్టం బాగుండి అన్నాయం జరక్కముందే నేను రావొడం సానా మంచిదైంది తల్లీ “ అంటూ రంగమ్మ చేతిని సాయం అందించగా గబగబా చీరనీ , చెదిరిపోయిన జుట్టునీ సర్దుకుంటూ పైకి లేచింది లత.
స్టోర్ రూమ్ నుండి నీరసంగా బయటకి వచ్చిన లతని స్టాఫ్ అంతా కూడా గుచ్చిగుచ్చి చూస్తుండడంతో ‘ సారీ , ఉదయంనుండీ ఉపవాసం ఉండడం వల్ల కొద్దిగా కళ్ళు తిరిగినట్టున్నాయి , అంతే ‘ అంటూ వాళ్లకి సంజాయిషీ చెప్పి ఆరోజుకి ఆఫీసుకి సెలవుచీటి ఇచ్చేసి బైటకి నడిచింది లత.
నీరసంగా అడుగులు వేస్తూ గేటు బైటకి అడుగుపెట్టబోతుండగా కుడివేపున వున్న క్యాంటీన్ నుండి పెద్దగా వినొస్తున్న మాటల్లో తన పేరు స్పష్టంగా వినిపించడంతో లత చెవులు నిక్కపొడుచుకున్నాయి.
“డామిట్ , చివరిక్షణంలో ఆ శనిగొట్టుది రాకపోయుంటే ఈరోజు ఆ లతని ఎలాగైనా అనుభవించేసేవాడ్ని. ఈ అవకాశం కోసమే ఎన్నాళ్ళనుండో కాచుకుని కూర్చున్నాను. ఆ ముదనష్టపు రంగమ్మవల్ల చేతిదాకా వచ్చిన మృష్టాన్నం నోటికందకుండా పోయింది. అందినట్టే అంది జారిపోయిందది“
సందేహం లేదు, అది అకౌంట్స్ ఆఫీసరు గొంతే !
వెనక్కి వెళ్లి వాడ్ని చాచి లెంపకాయ కొట్టాలన్నంత ఆవేశం కలిగింది లతలో.
అంతలో ఆ గొంతుకి జతగా మరో గొంతు వినిపించింది.
“నీ పథకం ఫలిస్తే నేనూ దాన్నో పట్టుపడదామనుకున్నా గురూ ! దానికెంత పొగరు కాకుంటే నేను ఎంతో మర్యాదగా మా ఇంటికి ఆహ్వానిస్తే ‘ మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళినప్పుడు నన్నిలా మీరు ఇంటికి పిలవడం మర్యాద కాదు ‘ అంటూ నాకే నీతిబోధలు చేస్తుంది ! దాని అంతు చూడకుండా వదలేది లేదు. నువ్వు రెచ్చిపో బ్రదర్. ఏం జరిగినా నేను చూసుకుంటాను. నీపైన ఫిర్యాదు చేయాలంటే అది రావలసింది నా వద్దకేగా! రానీ , అప్పుడు చెబుతా దానిపని “
మేనేజర్ మాటలు వింటూనే లతకి నవనాడులూ క్రుంగిపోయినట్లయాయి.
ఇద్దరూ తనపై అధికారులే. కంచే చేనుని మేసిన చందాన వాళ్ళిద్దరూ కుమ్మక్కయిపోయాక ఇంక తనని కాపాడేవారెవరు ?
నిస్తేజంగా బైటకి వచ్చి బస్సుస్టాప్ లో నిలబడింది లత.
***
లత చెప్పిందంతా విన్నాక గుండెలమీద చెయ్యి వేసుకుంది ఉష.
“ అమ్మో , దేవుడి దయవల్ల పెద్దప్రమాదం నుండి బైటపడ్డావు లతా ! “ అంది.
“ నిజమే ఉషా , దేవుడే ఆ రంగమ్మ రూపంలో వచ్చి ఈ వేళ నన్ను రక్షించాడు. కానీ అన్నివేళలా అదృష్టం మన పక్షానే ఉండదుగా! దినదినగండంగా ఈ ఆఫీసులో పనిచేయడంకంటే నిప్పులగుండంలో దూకడం నయమనిపిస్తుంది. అలాగని ఈ ఉద్యోగాన్ని కాదని వేరే చోటికి వెళ్తే అక్కడా ఇటువంటి తోడేళ్ళు లేరన్న గ్యారెంటీ ఏమీ లేదు ! పోనీ ఉద్యోగం మానేసి ఇంటిపట్టునే ఉందామంటే మా ఆర్ధికపరిస్థితి అందుకు సహకరించదు. నాన్న జబ్బుపడ్డప్పటినుండీ నా సంపాదనతోనే ఇల్లు నడుస్తోంది. నేనిప్పుడు ఉద్యోగం మానేసానంటే ఇంటిల్లిపాదీ రోడ్డున పడవలసివుంటుంది. “ బాధగా చెప్పింది లత.
అలా మాట్లాడుకుంటూనే మెయిన్ రోడ్డుకి దూరంగా కడుతున్న అపార్ట్మెంట్ల వద్దకి వచ్చారిద్దరూ.
అక్కడేదో పెద్ద గొడవ జరుగుతోంది. జనమంతా గుమిగూడి వున్నారు.
“ పుండాకోర్ , ఇయ్యేల నీ రగతం కళ్ళజూస్తా “ అంటూ వీరావేశంతో నలభైఏళ్ల మగాడ్ని క్రిందపడేసి బూతులు తిడుతూ కాలెత్తి తంతోంది సుమారు ఇరవైమూడు , ఇరవై నాలుగేళ్ల వయసున్న కూలియువతి.
పీకలదాకా త్రాగేసి ఇంటికి వచ్చిన మొగుడు పెళ్ళాన్ని చితకబాదడం సర్వసాధారణం కాబట్టి ఆ దృశ్యాన్ని చూసేందుకు ఎవరూ యిలా గుమిగూడరు. అదే ఒక స్త్రీ ఇలా తెగించి మగాడి జుట్టుపట్టుకుని బజారులోకి ఈడ్చుకొచ్చి తన్నడమన్నది మనసమాజంలో ఎనిమిదోవింత ! అందుకే జనం బారులుతీరి కళ్ళువిప్పార్చుకుని మరీ చూస్తున్నారు.
“ ఏందే ఎంకీ , మరీ ఇడ్డూరం కాకుంటే సరదాకి ఆడేదో కూసింత ఆటపట్టిస్తే అంతలా కొట్టాల్నా ఏంది?”
తన్ని తన్ని ఆయాసపడుతున్న ఎంకితో ఒక యువకుడు అన్నాడు.
“ ఏంది మేస్తిరీ గట్లంటవ్ ? ఈడు ఇట్టాంటి ఎకిలిచాష్టలు నీ సెల్లితోటీ, నీ పెళ్ళాంతోటీ సేస్తే గప్పుడూ గిట్లనే సెబుతవా మల్ల ?“ ఎంకి అడిగినదానికి నీళ్ళు నమిలాడు మేస్త్రీ.
“ ఏండ్ల తరవడి నాను కూలిపన్లనే ఉంటిని గానీ , నీ అసొంటి దాన్ని సూసింది లేదే ఎంకీ ! మరీ సోద్యం కాకుంటే ఇసొంటియన్నీ వొయసులో వున్నప్పుడు మేమంతా పడలేదా ఏందీ? మగోడు కుక్కబుద్ది సూపిస్తే ఆడది గుట్టుగా కప్పెట్టుకోవాల , సద్దుకోవాల. గంతేగానీ ఇట్ట బజార్లపెట్టి అల్లరి సేసుకుంటరా ! “
బుగ్గలు నొక్కుకుంది నడివయసు దాటిన ఒక స్త్రీ.
“ అత్తా, మీ కాలంసంది ఆడోళ్ళంతా గమ్మునుండబట్టే ఈ మొగోళ్ళు ఇట్ట రెచ్చిపోతున్నరు. నువ్వే నాయం చెప్పత్తా. నీకు ఎరకేగా, స్లాబ్ నుంచి కిందడి కాలిరగ్గొట్టుకున్న నా మొగుడు ఆరునెలల సందీ ఇంట్లోనే కుసోబట్టే ! ఇంగ ఇల్లెట్ట గడుస్తదని, సంటిబిడ్డకి రెండుమాసాల వొయసునుండే నేను పనిలోకి రాబట్టిని. బాలింతనని కనికరం లేకపోతేమాయే, నన్నో మడిసిలక్క సూస్తలేడు ఈడు ! సంటిబిడ్డ తల్లినని కూడ సోచాయిస్తలేడు. రెక్కాడితేగానీ డొక్కాడని పేదోళ్ళం మనం. గంతమాత్రాన మనకి మానం మర్యాద ఉండదా అత్తా ? ఈడు ఎట్టాంటి గలీజు పన్లు సేస్తుండో ఎరుకా ! సంటిదానికి పాలిద్దమని సాటుకెళ్తే నాఎనకాలే వొస్తడు, బిడ్డకి పాలిస్తుంటే ఎదురుంగ నిల్సుని ఆబగ సూస్తుంటడు. అయినా ఓర్సుకుంటి ! మొన్నటిసందీ ‘ పాలన్నీ బిడ్డకేనా ఎంకీ ? నాకూ జరింత ఇయ్యరాదటే , ఆకలైతాంది ‘ అంటూ ఎకిలిగ మాట్టాడుడు షురుసేసిండు. దానికీ గమ్మునున్న ! ఈ పొద్దు , బిడ్డని ఒళ్లో ఏసుకుని నేను పాలు పడతావుంటే , ఏకంగ దాన్ని రెక్కపట్టి ప్రక్కకి లాగేసిండు ఎదవ. ఇంగ ఆపైన ఆడేం సెయ్యబోయిండో నా నోటితో నేను సెప్పలేనత్తా “ నోటికి చెంగు అడ్డం పెట్టుకుని భోరుమంది ఎంకి.
అది చూసి అక్కడున్న ఆడవాళ్ళంతా వచ్చి ఎంకిని దగ్గరకి తీసుకుని ఓదార్చారు.
రెండునిముషాలకి ఎంకి తేరుకుంది .
“ సూడండి. ఆళ్ళు ఎట్టాంటి ఎదవపన్లు సేసినా మనం నోరు తెరిసి ఎవ్వరితోటీ సెప్పమన్న దేయిర్నంతోటే రెచ్చిపోతున్నరు. ఇయ్యాల్టి నుండి యా మొగోడైనా మనకాడ ఎదవ్వేసాలేస్తె ఆడ్ని ఊరి నడుమ నిలబెట్టి బట్టలూడదీసి కొట్టి అందరి ముంగట పరువు తీయాల , గప్పుడైనా ఈ మొగోళ్ళకి బుద్దొస్తదేమో మల్ల “
“ అవును, అట్టనే సేయాల “ అంటూ ఆడోళ్ళంతా ఎంకికి మద్దతునిస్తూ తీర్మానం చేసుకున్నారు.
“ ఇంకోపాలి నా జోలికొచ్చినవంటే నేనేంసేస్తనో నాకే తెల్దు. ఖబడ్దార్, చెత్తనాకొడకా “ తర్జని చూపించి వాడ్ని కసిదీరా కాలితో తన్ని అక్కడనుండి కదిలింది ఎంకి.
తుఫాను వెలిసినట్లైంది. చోద్యం చూస్తున్న జనమంతా ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోసాగారు.
లత , ఉషా కూడా ఇళ్ళకి బయల్దేరారు.
‘ మీ టూ ‘ ఉద్యమానికి సజీవరూపంలా నిలుచున్న ఎంకి ఆ స్నేహితురాళ్ళ మనసుల్లో అలజడిని సృష్టించింది. దారంతా ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు.
“ ఉప్పెనలా ప్రపంచాన్ని ముంచేస్తున్న ‘ మీ టూ ‘ గురించి వీసమెత్తంతైనా ఎరగని ఒక కూలియువతి, తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన తోటికూలిని అందరిముందరా ధైర్యంగా నిలబెట్టి ఉతికేసింది. మరి ఇంత చదువు చదువుకున్న నేనెందుకు పిరికిదానిలా ఆఫీసులో ఆ వెధవల ఆగడాలని ఇన్నాళ్ళుగా భరిస్తూ వస్తున్నాను? ఉద్యోగం ముఖ్యమే , కానీ అది ఆత్మాభిమానంకంటే ఎక్కువైతే కాదుగా! పైగా నా మౌనంతో ఈ సమస్య ఎన్నటికీ సమసిపోదు. ఆ దుష్టద్వయం గురించి లోకానికి తెలిసేట్లుగా చేయకపోతే ఈరోజు నేను పడుతున్న ఇబ్బందినీ , మానసికక్షోభనీ నాతర్వాత ఇదే ఆఫీస్లో చేరే ప్రతీ స్త్రీ పడవలసివస్తుంది. వీళ్ళ ఆగడాలకి నాతోనే ఆనకట్ట వేసేయాలి“
ఎంకి ఇచ్చిన స్పూర్తితో మనసులో ధృఢనిశ్చయం చేసుకుంది లత.
ఉష ఆలోచనలూ అదేదిశలో సాగుతున్నాయి.
“ కూలినాలీ చేసుకునే ఎంకికున్నపాటి ధైర్యం నాకు లేకపోయింది. ‘ కస్టమరు దేవుడు. వాళ్ళు ఏమడిగినా నువ్వు నవ్వుతూనే సమాధానం చెప్పాలి ‘ అంటూ నీతులు చెప్పే షాపు ఓనరు ఒకవేపు , ‘మా లేడీస్కి బ్రా లు కావాలి. చూపించండి. నా గర్ల్ ఫ్రెండ్ అచ్చం మీలాగే వుంటుంది , మీ సైజు బ్రా లు చూపించండి ‘ అంటూ సూటిగా నా గుండెలవేపు చేయిపెట్టి చూపిస్తూ నీచంగా మాట్లాడే నికృష్టపు కస్టమర్లు మరోవేపు ! ఈరోజైతే ఒక దరిద్రుడు ఏకంగా ‘ ఒక్కసారి మీరు ఈ బ్రా ని వేసుకుని చూపిస్తారా, షేపు అద్దినట్టుగా వుందో లేదో తెలుస్తుంది ‘ అనేసాడు. మనసు ఉడికిపోతున్నా పైకి ఏమీ అనకుండా మౌనంగా ఉండవలసివచ్చింది. అసలు , అప్పటికప్పుడే వాడ్ని చాచి లెంపకాయ కొట్టుంటే బావుండేది. నిజమే , అలా చేసుంటే ఏం జరిగేది? మహా అయితే ఉద్యోగం పోయేది , అంతేగా. ఇంతోటి ఉద్యోగం మరోటి దొరక్కపోతుందా ! ఛ ఛ , వీళ్ళ ఆగడాలని చాలాకాలంగా ఓపికపట్టాను. అందుకే వాళ్లకి అలుసైపోయానేమో ! ఉద్యోగంకోసం ఆత్మాభిమానాన్ని ఇంక ఎంతమాత్రమూ తాకట్టుపెట్టలేను. ఇకనైనా ఆ వెధవలకి బుద్ధిచెప్పవలసిందే ”
తనలో చైతన్యాన్ని రగిలించిన ఎంకికి మనసులోనే కృతఙ్ఞతలు చెప్పుకుంటూ మెరిసేకళ్ళతో స్నేహితురాలివేపు చూసింది ఉష. అదే సమయంలో ఉష వేపు చూసిన లత కళ్ళు తళుక్కుమన్నాయి. ద్విగుణీకృతమైన ఉత్సాహంతో చేతులు కలిపి “ నేనూను “ అనుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకి కదిలారు స్నేహితురాళ్ళు !!!

5 thoughts on “అర్చన కథల పోటి – నేనూను

  1. పరిగెడుతున్నన్నాళ్ళూ వేటాడే పులులు మీదకొస్తాయి. ఎదురు తిరిగితే కాగితపు పులులౌతాయి.

  2. అద్దంలో నా చుట్టూ వున్నా ప్రపంచాన్ని చూస్తున్నట్లుంది. చాల బాగా మన సోసైటిని ఉన్నదిఉన్నట్టు గా చూపించారు. ఎంతో మంది చదువుకున్న మధ్యతరగతి నోరు మెదపలేని స్త్రీలకు ఎంకి లాంటి వాళ్ళే స్ఫూర్తి అవుతారు. ఇంకా ధైర్యం రానందువల్ల పరిస్థితులు మారలేదు.

  3. మగాడిలో స్త్రీని చిన్న చూపు చూసే గుణం పోనంతవరకూ ఈ సమస్యలిలాగే వుంటాయి. వాడి అల్పత్వమే ఈ దిశా, నిర్భయాలకు దారి తీసింది. బావుంది స్టోరీ.

  4. తలొంచుకుని పడివుండడం సరైనది కాదని బాగా చెప్పారండీ..

  5. ఈ రోజుల్లో ఎదుర్కొంటేనే కానీ కుదరదు..బాగా చెప్పారు జరుగుతున్నా కథ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *