February 22, 2024

అర్చన కథల పోటి – మార్పు

రచన: డా. జె. శ్రీసత్య గౌతమి

సావిత్రీ, రాజారావులు కూతురు అంజలిని కలవడాని కి వైజాగ్ ప్రయాణమవుతున్నారు.”ఇంకా ఎంతసేపు సావిత్రీ? లేటు చేస్తే ట్రాఫిక్ లో ఇరుక్కుంటాం. బస్సు మిస్సవుతాం…” హడావిడి పడుతున్నారు రాజారావు.
“ఇదిగో … అయిపోయింది. అన్నీ వెతుక్కొని ఒక దగ్గర పెట్టుకొనేసరికే టైము గడిచి పోతోంది” సావిత్రి సర్దుబాటు తన ఆలశ్యానికి.
“సావిత్రీ, ఉండాల్సినవన్నీ ఒక చోట వుంటే కావాల్సినప్పుడు ఇంత శ్రమ వుండదు”.
“మరేం… సంవత్సరానికి ఎన్నిసార్లు బయటికి ట్రిప్పులు వెళతామో కదా.. మరి అందుబాటులో ఉండదూ ???”
“ఈ వెటకారానికి తక్కువ లేదు. అవసరానికి ఇలా ఎప్పుడయినా బయల్దేరుదామంటేనే నీకు చేత కాదు. మళ్ళీ ట్రిప్పులు కూడానూ.. నీతో కలిసి!” … రాజారావు గారి చురక.
సావిత్రమ్మ ముఖం వాడిపోయింది. “మీకు మమ్మల్ని బయటకు తీసుకు వెళ్ళుంటే, నాకూ అంజలికి కూడా అలవాటుండేది. ఎప్పుడూ ఇంట్లోనే, చుట్టాలందరూ ఇక్కడే ముసరడం… మరో లోకమే తెలియకుండా పోయింది”.
“సర్లే సర్లే… నీ గోల ఎప్పుడూ వుండేదే. ఏం అంజలికేం … హాయిగా బంధువుల చేతుల్లో బంతిపువ్వులా పెరిగింది. నీ ఏడుపుగొట్టుతనం దానికంటించకా … అయినా నీ వాళ్ళు మాత్రం వచ్చి పోయేవారు కాదా??”
“ఎవరు వచ్చిపోతున్నారని కాదండీ” … అని చెప్పబోతూ ఆగి, “అయినా ఇదంతా అప్రస్తుతం. కాస్త ఖాళీ దొరికితే చాలు నాతో లంఘించుకుంటారు. అందుకే నా బిజీలో నేనుండాలి!” అని వడి వడిగా అక్కడినుండి వెళ్ళిపోయింది.
రాజారావు ఉస్సూరుమన్నారు. “ఛీ.. మూడ్ కాస్త పాడు చేస్తుంది” అని విసుక్కుంటూ మళ్ళీ పెద్ద గావుకేక పెట్టారు. “ఏమయ్యిందీ, బయల్దేరేదేమన్నావుందా? అమ్మాయి మన గురించి వెయిట్ చేస్తూంటుంది. ఆ అబ్బాయిని కూడా వెయిట్ చేయిస్తావేమో” అని ఉత్తరం వైపుకు తిరిగి సావిత్రి గది ముందు దండకం చదువుతున్నారు.
సావిత్రమ్మ ప్రక్క ద్వారం నుండి బయటికి వచ్చేసి, చెప్పులేసుకొని చేతిలో బ్యాగ్ కూడా పట్టుకొని, వాకిట్లో నిలబడి రాజారావు వ్యవహారం చూస్తూ మాట్లాడకుండా వింటుంది.
సావిత్రమ్మ చేతిలో బ్యాగ్ చూసి, ఎక్కడికో బయలుదేరుతుండవచ్చు అని, నేరేడు చెట్టు నీడలో సేదదీర్చుకుంటున్న ఆటో మల్లేశు ఏకంగా ఆటో స్టార్ట్ చేసుకొని సావిత్రమ్మ దగ్గిర నిలబెట్టాడు.
అప్పుడు వెనక్కి తిరిగి చూసారు రాజారావు. చూసేసరికి తానింకా షూ కూడా వేసుకోకుండా ఇంటి లోపలే తను, ఆల్రెడీ ఆటో ఎక్కేసి కూర్చొని సావిత్రమ్మ!
“షూ వేసుకొని బయలుదేరండి. టైం అవుతోంది. అవతల ట్రాఫిక్ కూడా ఎక్కువ” అని తిరిగి ఫన్ చేస్తూ సావిత్రమ్మ నవ్వుతున్నారు.
రాజారావు హతాశుడయ్యి, వెంటనే ఆదరా బాదరాగా షూ వేసుకొని, తలుపుకు తాళాలేసొచ్చి తానూ ఆటో ఎక్కారు.
“నీకున్న పాపులారిటీ ముందు నేనెంత” అంటూ “ఏం మల్లేశూ.. అమ్మగారు ఇలా కాలు బయట పెట్టగానే రధం రెడీ చేసావు. ఎప్పుడయినా నన్ను అడిగావురా?”
“హ హ హ… అదేంటి సారూ, అమ్మగారి చేతిలో బ్యాగ్ వుందంటే మీరిద్దరూ ఎక్కడికో వెళ్తున్నారనేగా, అందుకే వచ్చేసాను” అన్నాడు మల్లేశు. ఇలా ఏదోక మాట, దానికి మళ్ళీ మడత పేచీ. ఇలా మడత పేచీలతో బస్సెక్కి వైజాగ్ పోయి అంజలి రమ్మన్న రెస్టారెంట్ కి చేరుకున్నారు.
ఒక టేబుల్ దగ్గిర్నుండి “హాయ్ మమ్మీ… హాయ్ డాడీ …” అని చలాకీగా పలకరించింది నవ్వుతూ అంజలి.
కూతురు అందంగా, హుందాగా తయారయ్యింది. తమ రాకకోసం ఎంతో ఉత్సాహం తో ఎదురుచూస్తున్నట్లున్నది. ఈ మార్పు కన్న వాళ్ళిద్దరికీ ఆశ్చర్యంతో పాటు ఆనందాన్నిచ్చింది.
అంజలి వైజాగ్ లో బి. టెక్. చేస్తోంది. అంతకు మునుపు చదువంతా నర్సీపట్నం లో కానిచ్చింది. బి. టెక్. కంప్యూటర్స్ చేయడానికి మొదటిసారిగా ఇల్లు వదిలి బయటికెళ్ళింది. ఇంకా మూడవ సంవత్సరం చదువుతోంది. మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి అంజలికి. ఆ మాటే చెవిన వేశారు రాజారావు, సావిత్రమ్మ ఫోన్ లో మూడు వారాల క్రితం. అప్పుడే అంజలి తన నిర్ణయాన్ని తెలిపింది.
“అమ్మా…నాన్నా, నేను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాను”.
“ఎవరమ్మా అతను? ఎప్పుడు పరిచయం? ఎక్కడ పరిచయం? నీ క్లాసు వాడా? మన కులమేనా? ఏ వూరు అతనిదీ? … ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు రాజారావు, సావిత్రమ్మ.
“వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తే బాగుంటుందో వారు చెప్తేనే బెటర్. మనమంతా కలిసి కూర్చొని ఒక నిర్ణయానికొస్తే పెళ్ళి ఏర్పాట్లు చేసుకొవడానికి అవకాశం దొరుకుతుంది. తననొచ్చి మీరు కలిసేంత వరకూ …నన్నే ప్రశ్నలు అడగవద్దు. శనివారం సాయంత్రం ఆరింటికల్లా హోటల్ హయాత్ కి వచ్చేసేయండి” అంది అంజలి.
“హోటల్ హయాతా?” అని సావిత్రమ్మ ఏదో అనబోతుండగా అంజలి “అవునమ్మా. తానొక బిజీ డాక్టర్. అస్సలు టైం వుండదు వూర్లు తిరగడానికి. అందుకే ఏమనకోకుండా ఇక్కడికి మీరే రండి” అని అనునయంగా అడిగింది.
“సరే” అన్నారు. అవతల అంజలి ఫోన్ పెట్టేసింది.
రాజారావు, సావిత్రమ్మ ఆశ్చర్య చకితులయ్యారు. “తమ అంజలియే… ఇంత పెద్దదయ్యిందా? రెండేళ్ళ క్రితం మౌనమే తన భాష అన్నట్లుండేది. అయినా కాలం! కాలమే తీర్చి దిద్దుతుంది అందరికీ..” అని అంజలి పరిచయం చేస్తానన్న కుర్రాడి ఆలోచన్లలోకి మారారు. “ఎప్పుడెప్పుడు శనివారమొస్తుందా …” అని ఎదురు చూసి, ఇదిగో … ఇప్పుడిలా వచ్చారు.
అంజలిని చూసి రాజారావు, సావిత్రమ్మ చెయ్యి వూపుతూ టేబుల్ దగ్గిరకొచ్చారు, కూర్చున్నారు.
“చాలా బాగుందమ్మా హోటల్”… అన్నారు సావిత్రమ్మ.
“అవునమ్మా… ఇది 5 స్టార్ హోటల్, నీకయితే అన్నీ విచిత్రమైన వంటలనిపిస్తాయి”.
“అంటే ఉడకబెట్టి ప్లేట్ నిండా నింపి ఇస్తారు, నువ్వేది ఆర్డర్ చేసినా…” అని సావిత్రిని చూసి నవ్వారు రాజారావు.
“అంత ఎగతాళి చెయ్యక్కర్లేదు మీరిద్దరూ. 5 స్టార్ అంటే నాకూ తెలుసు. సూప్స్ బాగుంటాయి, ప్లేట్ లో ఒక ఫిష్ దాని ప్రక్కన ఏ మొక్కో, పండో పెట్టి తినమంటారు..” అని నవ్వేసారు సావిత్రమ్మ.
అలా అందరూ కలసి నవ్వులమయం. ఈలోపు బేరర్ వచ్చాడు ఆర్డర్ తీసుకోవడానికి. అంజలి మళ్ళీ రమ్మని చెప్పి పంపేసింది. తనక్కాబోయే వాడికోసం వెయిటింగు, అమ్మానాన్న వచ్చేసినా … అని సావిత్రి మనసులోనే కాస్త కినుక పడింది.
“భోంచెయ్యడానికి కూడా వెయిటింగే… ఏవిటో ఈ సిటీ లైఫ్, వేళకింత తినరో ఏమో … అని అనుకుంటే ఎలా సావిత్రీ?” అని రాజారావు సావిత్రికేసి చూసారు. సావిత్రి ఉలిక్కిపడి మనసులో … “సర్లే, తానడగాల్సినవన్నీ నా మీద పెట్టి అడుగుతారు” అని వూరుకుంది. అంజలి ఫోన్ చేస్తోంది. “అబ్బాయికి ఫోన్ చేస్తోంది గావోసు”… సావిత్రి రాజారావు చెవిలో అన్నది. అట్నుండి ఏమి సమాధానమో గానీ, అంజలి ముఖం కాస్త జేవురించింది.
“ఏమ్మా … ఏమయింది?”
“అబ్బే ఏం లేదు నాన్నా … తనకు ఇంకా కాస్త లేటవుతుందిట, ట్రాఫిక్ జామయిందిట.
“అయ్యో… దానికేముందమ్మా, బయటెక్కడా నిలబడలేదుకదా? హాయిగా లోపలే వున్నాము కదా, ఫర్వాలేదు”.
కొద్ది నిముషాలు పోయాక … రాజారావు మళ్ళీ మొదలెట్టారు.
“ఈ కాలంలో కులమేమిటే పిచ్చిదానా? అయినా ప్రేమకు కులముంటుందా? కులం చూసుకొని ప్రేమ పుడుతుందా? కాకపోతే ఆ పుట్టేదేదో మన కులం వాడయితే అన్ని విధాలుగా బాగానే వుంటుంది. అయినా దేవుడు నీ మొరాలకించొద్దూ? అంతకన్నా ముందు నీ కూతురు… అయినా నీ కూతురికి తెలీదుటే … నీకేం కావాలో? నాకయితే నా కూతురు కళ్ళల్లో ఎప్పుడూ సంతోషాన్ని నిలపగలిగే వ్యక్తి తన జీవితంలోకి రావాలి అని కోరుకుంటాను”
“ఏంటి నాన్నా?” అంజలి ఆర్తిగా అడిగింది.
“ఏం లేదు తల్లీ … అవన్నీ ఆయన నిన్నడగాలనుకుంటున్నవి నా మీద పెట్టి అడుగుతున్నారు. నేనయితే అబ్బాయిని ముందు చూడాలి. ఆపై అతనే చెప్తాడుగా వివరాలు… తినబోతూ రుచెందుకో?” సావిత్రమ్మ కుండ బద్దలుకొట్టారు.
ఇంతలోఅంజలి ఫోన్ మ్రోగింది. ఫోన్ వింటూనే అంజలి మొహం చందమామలా వెలిగింది. “అబ్బాయి వచ్చేసినట్లున్నాడు” రాజారావ్ అన్నారు.
“అవును నాన్నా” … అని అంజలి సర్దుకొని కూర్చుంది. తల్లిదండ్రులు కూడా ద్వారం వేపే చూస్తున్నారు.
ఈలోపు సూట్ వేసుకొని అలేఖ్య లోపలికి అడుగు పెట్టి, అంజలి ప్రక్కన కూర్చుంది.
కన్నవాళ్ళు ద్వారం వైపు నుండి చూపు మరల్చి, “ఎవరీ అమ్మాయి, నీ క్లాస్ మేటా?” అని అడిగారు.
అలేఖ్య చలాకీగా, దర్జాగా అడుగులు వేసుకుంటూ ఎడమ చేతితో కళ్ళకున్న రేబాన్ గ్లాస్ ని స్టైల్ గా తీసి టేబుల్ మీద పెట్టి, అంజలి ప్రక్కన కూర్చుంటూ అంజలిని దగ్గిరగా తీసుకొని, ఆమె నుదుటి మీద ముద్దు పెట్టింది. రాజారావు, సావిత్రి కళ్ళప్పగించి చూస్తున్నారు. రాజారావు గొంతు పెగల్చుకొని, “ఈ పాపెవరు? ఫ్రెండా?” అని అడిగారు. అప్పుడు అలేఖ్య నమస్కారం చేస్తూ … “నమస్కారం అంకుల్, నమస్కారం ఆంటీ” అంటూ తన కుడి చేతిని అంజలి భుజం చుట్టూ వేసి “నేను అంజలి ఫియాన్సీ ని” అని చెప్పింది.
రాజారావు గొంతు పెగల్లేదు. సావిత్రమ్మ ఆ… అని నోరు వెళ్ళబెట్టింది.
*******X**********X***********
“మీరు విన్నది కరక్టే ఆంటీ, అంకుల్. మేము పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం. మేమిద్దరం సంతోషంగా వుంటామనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరు మమ్మల్ని అర్ధం చేసుకోవాలి” పాయింటుకొచ్చేసింది అలేఖ్య.
“ఏంటమ్మా ఇదంతా? ఏం మాట్లాడుతుందామ్మాయి? పెళ్ళి ప్రస్తావన తీసుకొస్తే, ఇద్దరినీ రమ్మన్నావు. రాకుంటే నీ మనసు బాధపడుతుందీ, ఒక్కగానొక్క గారాల బిడ్డవు, నీ యిష్ఠానికే తలవంచి వస్తే … ఇలా ఒక అమ్మాయిని చూపించి పెళ్ళంటావేంటి? జీవితం అంటే ఆటగా వుందా?” నాన్న కోప్పడ్డారు అంజలి మీద.
అంజలి “అమ్మా … నాన్నా… కాస్త సావధాన పడండి ముందు. మాక్కావలస్నదేమిటో మీరు అర్ధం చేసుకోండి ” అన్నది.
“అర్ధం లేని మాటలు మీరిద్దరూ మాట్లాడుతున్నారు. అమ్మాయిని అమ్మాయి పెళ్ళాడడమేమిటి? స్వలింగ సంపర్కమా? చూడు అలేఖ్యా … ఇవన్నీ మేము తట్టుకోలేము. మా పిల్లకు అమెరికా సంబంధాలు వస్తున్నాయి. నువ్వు ఎవరో ఏవిటో … మా పిల్లను బుట్టలో వేసుకున్నావు. అంజలికి లోకం తెలియదు. చిన్న పిల్ల. చూస్తే ఆమెకన్నా నువ్వు పెద్దదానిలా ఉన్నావు. ఇలా చెయ్యడం నీకు తప్పనిపించడం లేదూ? అయినా ఇటువంటి ఆలోచనలు నీకెలా వస్తున్నాయమ్మా? అమ్మానాన్న ఎక్కడుంటారు?” రాజారావు ఆవేశంగా మాట్లాడేస్తున్నారు.
వాళ్ళ మాటలకు ఏ మాత్రం అంతరాయం కలిగించకుండా పూర్తిగా విని అలేఖ్య… “నేను అంజలిని బుట్టలో వేసుకున్నానంటున్నారు, హు.. అసలు మీ అమ్మాయి ఏ పరిస్థితిలో నా హాస్పిటల్ కి వచ్చిందో తెలుసా? అంజలి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. చావు బ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడుతుంటే ఆమె స్నేహితులు హాస్పిటల్ కి తీసుకొచ్చారు. అతి ప్రయాస మీద ఆమెను కాపాడగలిగాం. చాలా ఎక్కువ మోతాదు లో స్లీపింగ్ పిల్ల్స్ తీసుకుంది” అని ఆగింది.
రాజారావు, సావిత్రులు బెంబేలు పడిపోయి కళ్ళల్లో నీళ్ళతో … ఏవిటీ ..ఏం మాట్లాడుతున్నావ్? ఎప్పుడు? ఎందుకు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
అప్పుడు అంజలి, తల్లి చేతిని తన చేతిలోకి తీసుకొని ” సారీ అమ్మా… ఇంకెప్పుడూ అలా చెయ్యను” అంది తానూ కళ్ళనీళ్ళ పర్యంతమవుతూ.
అప్పుడు అలేఖ్య కల్పించుకొని “అవును ఆంటీ…దీనంతటికీ కారణం తనకు చిన్ననాటి నుండీ జరిగిన చేదు అనుభవాలే. ఆమెను ప్రాణాపాయ స్ఠితినుండి బయట పడేసి, తన మానసిక ఆందోళనలనలన్నిటినీ దూరం చేసి, ఇదిగో ఇలా మామూలు మనిషిని చేసాను” అంటూ అంజలికేసి ప్రేమగా చేస్తూ ఆమె నుదుటి మీద ముంగురులు సరి దిద్దుతుంది అలేఖ్య.
“అసలేం జరిగింది?” రాజారావు ఫ్రస్ట్రేషను.
“అంజలికి ఎంతో ప్రేమ కావాలి, తనని గౌరవించే ప్రేమ కావాలి”
“ఏం మాట్లాడుతున్నావ్? మాకామె గారాల పట్టి. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాం” అన్నారు రాజారావు, సావిత్రి.
“మనిషి యొక్క వ్యక్తిత్వం కేవలం తల్లిదండ్రుల ప్రేమా, పోషణ మీద మాత్రమే ఆధారపడి వుండదు. రక్షణ కూడా ఇవ్వాలి. ఆమె వ్యక్తిత్వాన్ని కూడా రక్షించుకోవాలి. తనను కించ పరిచే అనుభవాలు కలిగినప్పుడు, ఆడపిల్ల చిన్నబుచ్చుకొని మానసికాందోళనలకు గురవుతుంది. మానసిక వికాసాన్ని కోల్పోతుంది. ఆ స్టేజ్లో వున్న మనిషికి ఏ చిన్న వ్యతిరేకత ఎదురయినా అది తట్టుకోలేక సమన్వయాన్ని కోల్పోతుంది. ఇదేదో ఒక రోజు, రెండు రోజుల్లో వచ్చిన మార్పు కాదు అంజలిది. తన పదేళ్ళ వయసునుండీ తాను పడుతున్న క్షోభ. ఇంటికొచ్చిన ప్రతి గాడిద చుట్టం, ఇరుగిల్లు పొరుగిల్లు గాడిదలు ఆమె పై చెయ్యి వేసి, అప్పుడే వికసిస్తున్న ఆమె అంగాలపై దాడి చేస్తూ … మీ అమ్మానాన్నకు చెప్పావంటే, నువ్వు మంచి పిల్లవు కావని చెప్తాం, నిన్ను ఇంట్లోంచి తగిలేస్తారు అని బెదిరిస్తుంటే … పాపం పిచ్చిపిల్ల .. తెలిసీ తెలియని వయసులో అది నిజమనుకొని మానసిక ఆందోళనలకు గురవుతూ వచ్చింది” అలేఖ్య చెప్పసాగింది.
“ఎప్పుడూ తల్లి ఇంట్లోనే వుంటుంది. ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కడా?” అని సావిత్రికేసి చూసాడు రాజారావు.
మళ్ళీ అలేఖ్య “ఇది దురదృష్ఠం. అంజలి తన మనోభావాలను మీకు చెప్పలేకపోవడం, జరిగిన సంఘటనలను సంక్షోభం చెందుతూ మగ వెధవల బెదిరింపులకు భయపడుతూ వారి నుండి పారిపోతూ తనకు తానే దూరమయిపోయింది. అందరి మధ్యావున్నా ఒంటరితనంతో మగ్గి పోయింది. తాను పుట్టింది కేవలం భాషలేని ఆవేదన గురించే పుట్టినట్లుగా భావించుకొంది. సాటి విద్యార్ఢితో మట్లాడాలంటే తనలో ఒక భయం. ఆ భయాన్ని పోగొడుతూ స్నేహంతో గౌరవించే స్నేహితుడే ఆమె జీవితంలో కరువయ్యాడు. సాటి విద్యార్ధునులు కూడా ఆమె సమస్యను అర్ధం చేసుకోలేక పోయారు” చెప్పసాగింది.
“అవునమ్మా… చిన్ననాటినుండి జరిగిన చేదు అనుభవాల వల్ల ఈ ప్రపంచం యొక్క స్పీడును అందుకోలేకపోయాను. పై చదువులకు వెళ్ళాక మరింత ఒంటరితనాన్ని ఫీల్ అయ్యాను. అందరూ చేసే ఎంజాయ్మెంట్లు నేను చేయలేక పోయాను. స్నేహితులు దూరమయ్యారు, చదువు మీద ధ్యాస పోయింది. తక్కువ మార్కులు వస్తున్నాయి. వీటన్నిటినీ ఎలా అధిగమించాలో తెలియక పిచ్చిదాన్నయ్యాను. ఆత్మహత్యా ప్రయత్నం చేసాను. తప్పే. నాది నిజంగా తప్పే. అలేఖ్య పరిచయంతో నేను మళ్ళీ మామూలు మనిషిని కాగలిగాను. నేను తనతోనే జీవిస్తానమ్మా. నీ ప్రేమలో వున్న చల్లదనం అలేఖ్య ప్రేమలో కూడా ఉందమ్మా. నాకు మగవారితో పెళ్ళొద్దమ్మా …” అంటూ అంజలి ఏడ్చింది.
“ఎవరమ్మా నిన్నీ స్థితికి తెచ్చింది?” అంటూ సావిత్రి అడిగారు గద్గద స్వరంతో. అంజలి ఒక విరాగి నవ్వు నవ్వుతూ “అందులో నీ తమ్ముడు కూడా ఉన్నాడమ్మా” అంది.
మళ్ళీ అలేఖ్య అందుకొని, “అమెరికా సంబంధాలు వస్తున్నాయన్నారు కదా అంకుల్, నేను కూడా అమెరికా పౌరురాలినే. నేను అక్కడే పుట్టాను. సైక్రియాట్రిస్టుని. అమెరికాలో ఎందరికో మానసిక వైద్యం అందించాను, ఇప్పుడు ఇండియాలో కూడా అందిస్తున్నాను. పదండి మిమ్మల్ని ఒక దగ్గిరకి తీసుకెళ్తాను” అని లేచింది. అందరూ అలేఖ్య బెంజికారులో కూర్చున్నారు. పది నిముషాల్లో కారు ఒక కనస్ట్రక్షన్ ముందు ఆగింది. “అంజలీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్” …పైన కమాన్ పై అందమైన అక్షరాలు. అలేఖ్య ఒక పెద్ద రిసార్ట్ ని కొని, దాన్ని హాస్పిటల్స్ గా మారుస్తోంది, మానసిక వైద్యశాల దగిరనుండి రిహాబిలిటేషన్ సెంటర్ వరకూ ఎన్నో సదుపాయాలతో ఎన్నో రకాల వైద్యరీతులను ప్రజలకు అందించాలని కోరుకుంటోంది. “అంకుల్ … ఈ హాస్పిటల్స్ అన్నిటికీ మన అంజలే ఎం.డి.” అని అంటోంది అలేఖ్య.

“అలేఖ్యా.. మా అమ్మాయికి పునర్జన్మనిచ్చావ్. దానికి చేతులెత్తి నమస్కరిస్తాను. ఒక మగవాడు స్త్రీకి సాంఘికంగా ఏమివ్వగలడో అవన్నీ మా అమ్మాయికి ఇస్తున్నావు. ధనిక ప్రపంచాన్ని చూపించావ్, వ్యాపార వేత్తను చేస్తున్నావ్, అయినా నువ్వొక అమ్మాయివి. మరి సంతానమెలా? నలుగురూ ఏమనుకుంటారు? మీ ఇద్దరి యొక్క రిలేషన్ ని అంగీకరించలేకపోతున్నాను. అన్నీవున్న నువ్వు అంజలితో ఎందుకు బ్రతకాలంకుంటున్నావు?”
“అంకుల్… మీ అమ్మాయిది మానసిక పరమైన సమస్య. నాది జెనిటిక్. ఇక పిల్లలు. ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులు లేక ఒంటరి వాళ్ళవుతున్నారు. వాళ్ళకి మేము తల్లిదండ్రులమవుతాము.
“మా పాత తరం ఆలోచనలు దీనికి అంగీకరించలేవు అలేఖ్య…” అని ఖచ్చితంగా చెప్పేసారు రాజారావు.
అంజలీ, అలేఖ్యలు సావిత్రమ్మ గారి వైపు చూసారు. తానేమీ మాట్లాడలేదు. కొద్ది సమయం ఎదురుచూసి అంజలీ, అలేఖ్యలు భారంగా కదిలి కారు వైపు నడిచారు. నిశ్శబ్దంగా వారిద్దరి వెనుక సావిత్రి కూడా అడుగు ముందుకేసారు.
“సావిత్రీ”… రాజారావు గారి పిలుపు.
సావిత్రి తన హృదయలోతుల్లోంచి … “నవమాసాలు మోసానండి. కోల్పోలేను”.
“అందరి దగ్గిరా ఎలా తలెత్తుకుంటావ్ సావిత్రీ?” రాజారావు గారి గొంతులో వణుకు.
“మార్పు చిన్న అడుగుతోనే మొదలవుతుంది. మనిషి ఆలోచన, ప్రవర్తన భౌతిక కారణాలపై ఆధారపడివుంటుంది. ఇది అర్ధమయితే వ్యవస్థకూడా మారుతుందండి. వ్యవస్థ ఈ మార్పుకు సిద్ధపడినప్పుడు మార్పు తప్పక సంభవిస్తుందండి” అంది సావిత్రమ్మ గంభీరంగా. రాజారావు గారు ఆలోచనలో పడ్డారు.

(సమాప్తం)

23 thoughts on “అర్చన కథల పోటి – మార్పు

 1. మానవ మేధస్సు లో పుట్టిన ప్రతి ఆలోచనను ఆచరణలో పెట్టితే సమాజం అరాచకమేకదా !! స్వార్థ పూరిత సుఖాల పరంపరలో పురోగతిని సభ్య తను మరిస్తే అధోగతేకదా!!?.ఆరోగ్య కరమైన సమాజాన్ని మార్చే ప్రయత్నం కాదా. ఏదిఏమైనా మీ కథనం బాగుంది ముగింపు మాత్రం వాక్తూ……..క్షమాపణ లతో
  మీ
  అభిమానిని
  లాల్ కోట విజయ కుమార్

 2. చాలా బాగుంది గౌతమి గారూ, ఏ మార్పు అయినా చిన్నగానే మొదలవుతుంది. అందరి తల్లితండ్రులు తమ పిల్లల సౌఖ్యమే కోరుకుంటారు. ఇలాంటి పరిస్ధితులలో కూడా వారి ఆనందానికి ఆధారంగా నిలవడం పిల్లలను మరింత దగ్గర చేస్తుంది.

  1. Super. Thats what I want to convey too. Parents వాళ్ళను విపరీత విమర్శలకు గురి చేస్తే వారు Pseudo అభ్యుదయం అనే wrong track లోకి వెళ్ళి parents కి, Society కి పనికి రాకుండా పోయే అవకాశం వుంది. అప్పుడు. వారు జనజీవన స్రవంతిలో కలవకుండా మరో ప్రపంచంలోకి అడుగుపెడితే, society కి కూడా ప్రమాదం. ఏ పిల్లలకయినా ఇంట్లోవారి ఆదరణ, సపోర్టు చివరిదాకా వుండాలి.

   Thank you Venkat garu.

 3. Who ever commented here, none of you watched Telugu movie “Awe”? The same story line of one of the thread in the movie!! Same location, same content!! How maalika group accepted this and selected for publishing!! Very surprised and disappointed!

  1. Did not see the movie. This is a real story between two girls happened in Hyderabad. Infact real లో అయితే తల్లిదండ్రులు నెత్తీనోరు బాదుకుంటున్నారు వాళ్ళ బాధ్యతలేని టింగరి సమాధానాలకు. నేనింకా చాలా అందంగా రాసాను.

 4. కథ చాలా బాగుంది
  ఏ మార్పు అయిన ఒక్క అడుగుతో మొదలవుతుంది అనే ముక్తాయింపు సూపర్

  1. ధన్యవాదాలు డా. భానూరి గారు. మరిన్ని మంచి కధలు విత్ పంచులు తీసుకురావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను.

 5. Very well written on a taboo topic. I can dare say a new star had arrived to the Telugu literature.

 6. చుట్టూ ఉండే సామాజిక పరిస్థితులు చిన్న వయసులో – పిల్లల మనసును ఏ విధంగా ప్రభావితం చేస్తాయో మీ కథలో చక్కగా తెలియజేశారండీ.

  1. థాంక్యూ కళ్యాణిగారు …నా రచనను అభినందించినందుకు.

 7. మార్పు- బాగుంది. భవిష్యత్ లో ఈ బంధాలే బలపడతాయేమో !?!

  1. !?!——– I liked this. Hahaha. It is possible if the things do not set right.

   Thank you C.V.S. Rao గారూ, కధ చదివినందుకూ, అభినందించినందుకు.

 8. This story “Maarpu” started everything as a natural and normal family prayanam. The twist came when the parents went to meet Alekhya. The flow of the story is very nice with unexpected twist and show of affection to partner.
  Statistics also show that most of the abuses are caused by known persons like relatives. The “Maarpu” in the story will become a new norm in society. However, the real change is to oppose the abuse, stand strong and get the absurd punished. I agree that parents should support children instead of being critical. Nice story Gauthami. Congratulations.

  1. Thank you so much for your nice review Prasadgaru! These are some of my observations in society together a story.

   More importantly, their relation was shown much respectable than that between a man and a woman with an abused relation, Woman is like a beautiful plant which can grow with love and respect.

   I have started this story writing in 2017 but written the ending in 2020. Loved to see how nicely received the applause by you all.

 9. మార్పు చాలా బాగుంది గౌతమీ. accept చేయడం కష్టమైనా ఆలోచింపజేసే అంశాలున్నాయి కధలో. వెరసి నైస్

  1. మగవాడు ఇప్పుడయినా మారకపోతే ఇటువంటి మార్పుకు వాడు పునాదెయ్యక తప్పదు. థాంక్యూ ఎన్నెల గారూ, కధ చదివి అభిప్రాయం తెలిపినందుకు, అభినందించినందుకు.

 10. The story is nice and contemporary. It’s difficult to digest to the people of old school.

  1. ప్రస్తుత సామాజిక పరిస్థుతులను బట్టీ భవిష్యత్తు ఇలా మారి పోతోంది. మగవాళ్ళ అంచనాలకు స్వార్ధాలకు తూగలేకో, వాళ్ళ దౌష్ఠాలు సహించలేకో ఎంతోమంది ఆడవారు వంటరిగా మిగిలిపోతున్నారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే అమ్మాయిలు అబ్బాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేస్తారు.

   పెళ్ళి పేరుతో అమ్మాయిని వంచిస్తే ఆవిడ ఆత్మహత్యతో ఆవిడ ప్రస్తావన పూర్తిగా పోతుంది, అప్పుడు మగవాడు క్లీన్ చిట్ తో మళ్ళీ పెళ్ళికి రెడీ అయిపోతున్నాడు. ఇటువంటి సమాజాన్ని ప్రోత్సహించిన people of old school రేపు రాబోయే ఈ మార్పును అర్ధం చేసుకోవడానికి సమయం పడుతుంది.

   థాంక్యూ శ్రీనివాస్ గారూ, కధ మెచ్చుకున్నందుకు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *