June 25, 2024

అర్చన కథల పోటి – రక్షణ కవచం

రచన: శ్రీ శేషకల్యాణి గుండమరాజు – USA


సాయంత్రంవేళ రైల్వేస్టేషన్ జనంతో కిటకిటలాడుతోంది. రైళ్లు ఎక్కేందుకు వేచి ఉన్న వాళ్ళు కొందరైతే అప్పుడే రైలు దిగి సామాన్లతో స్టేషన్ బయటకు వెళ్లేవారు కొందరు.
ఆ రద్దీలో తన సూట్ కేసు పై కూర్చుని కొంచెం తాపీగా ఆ రోజు వార్తాపత్రిక తిరగేస్తున్నాడు రాఘవ. వార్తాపత్రికలో ప్రస్ఫుటంగా ప్రచురించిన వార్త ఒకటి రాఘవ దృష్టిని ఆకర్షించింది. అది ఒక యువతి కనబరచిన ధైర్యసాహసాలకు సంబంధించినది. ఊరి పొలిమేరల్లో ఎవరో ఆకతాయిలు ఆ యువతిని ఒంటరిని చేసి ఏడిపించబోతూ ఉంటే ఆ యువతి వారందరినీ చిత్తు చేసి పారిపోవడం అక్కడి సీసీ కెమెరాలో చిక్కింది. అయితే ఆ కెమెరా సంఘటనా స్థలానికి చాలా దూరంగా ఉండటంతో ఆ యువతి ఎవరనేది మాత్రం తెలియలేదు. కానీ ఆమె చూపిన తెగువ సంచలన వార్త అయ్యి చిన్నా-పెద్దా ప్రముఖులందరికీ చర్చనీయాంశమయ్యింది.
‘ఎవరో ఈ యువతి!’, అని రాఘవ అనుకుంటూ ఉండగా తను ఎక్కబోయే రైలు బయలుదేరటానికి సిద్ధంగా ఉందని ప్రకటన వినబడింది. వార్తాపత్రిక మడిచి చంకలో పెట్టుకుని, సూట్ కేసు పట్టుకుని, తన బోగినెంబర్ చూసుకుని, రైలు ఎక్కాడు రాఘవ. అప్పటిదాకా రాఘవ ఎన్నో రైలు ప్రయాణాలు చేశాడు కానీ ఆ రోజుది తనకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే తను ఆ మర్నాడు రాష్ట్ర రాజధాని నగరంలో జరగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో తన మొట్టమొదటి ప్రసంగం ఇచ్చేందుకు వెడుతున్నాడు.
రాఘవను ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ గా చూడాలన్నది రాఘవ తల్లి సీతమ్మ కోరిక. రాఘవ ఆ కోరికను కొద్ది నెలల క్రితం తీర్చడమేకాక తను ఎంతగానో కలలుగన్న ఉద్యోగం సంపాదించగలిగాడు. ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులలోనే రాఘవ మంచి పేరు తెచ్చుకున్నాడు. తన పనిని మెచ్చుకుంటూ తన పై అధికారులు తనను స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రసంగించమని ఆహ్వానించారు. రాఘవ ఉండే ప్రాంతం నుండీ రాజధాని నగరం చేరుకోవడానికి విమానం టిక్కెట్లు కూడా పంపుతామన్నారు. సహజంగా ఆడంబరాలంటే గిట్టని రాఘవ సాధారణ ప్రయాణీకుడిలా రైల్లో వస్తానని చెప్పాడు. రాఘవ ప్రయాణం వెనుక ఉన్న కథ ఇది!
రైలు బయలుదేరింది. స్టేషన్ వదిలి ఊరి పొలిమేరల వైపుకు తన వేగాన్ని పెంచుతూ వెడుతోంది రైలు. రైలు చేస్తున్న లయబద్ధమైన చప్పుడును, కిటికీలోంచి తనకు ఆగి ఆగి తగులుతున్న చల్లటి గాలిని మనస్ఫూర్తిగా ఆస్వాదించగలుగుతున్నాడు రాఘవ. అందుక్కారణం అతను జీవితంలో అనుకున్నది సాధించడం కావచ్చు.
‘ఈ ప్రయాణంలో నాకు ఒక మంచి నేస్తం దొరికితే బాగుండు’, అని అనుకుంటూ తన ఎదురు సీట్ వైపు చూశాడు రాఘవ. అక్కడ ఎవరో ముసలవ్వ రైలు కిటికీకి దగ్గరగా కూర్చుని అస్తమిస్తున్న సూర్యుడివైపు చూస్తోంది. చలి వల్లనో ఏమో మందంగా ఉన్న ఒక రగ్గుతో తన ఒంటిని పూర్తిగా కప్పేసుకుని ఉంది. మసకగా ఉన్న వెలుగులో కేవలం ఆ అవ్వ కళ్ళు, గాలికి ఎగురుతున్న ఆమె తెల్లటి ముంగురులు మాత్రమే కనబడుతున్నాయి రాఘవకు.
రైల్లో అందరూ పడుకోవడానికి ఇంకా చాలా సమయం ఉండటంతో, “ఏం అవ్వా! ఎక్కడిదాకా ప్రయాణం?”, అని ఆ అవ్వతో కాలక్షేపానికి మాట కలుపుదామని అడిగాడు రాఘవ. అవ్వ ఏమీ మాట్లాడలేదు.
“ఏ ఊరు వెడుతున్నావవ్వా?”, మళ్ళీ అడిగాడు రాఘవ.
“నేనేఊరెడితే నీకెందుకు బాబూ?”, కాస్త కటువుగా కసిరినట్టు అంది అవ్వ.
“అంత కోపమెందుకులే అవ్వా..! ఊరికే అడిగా. చెప్పాలని లేకపోతే పర్లేదులే”, అన్నాడు రాఘవ.
కొద్దిసేపు గడిచిన తర్వాత అందరూ ఫలహారాలు తినడం మొదలుపెట్టారు. రాఘవ కూడా తన వెంట తెచ్చుకున్న పూరి, కూరతో పాటూ తింటూ, ‘ఆహా! మా అమ్మ చేతి పూరి అద్భుతం!’, అని అనుకుంటూ అవ్వ వంక చూశాడు. అవ్వ ఇంకా రగ్గు కప్పుకుని తన సీట్ లో ఒక మూలకు కూర్చుని కిటికీ బయటకు చూస్తోంది.
“ఏంటవ్వా? నువ్వేమీ తినట్లేదూ? ఇంద. ఈ పూరి తీస్కో. మా అమ్మ చాలా బాగా చేసింది. తిను “, అంటూ రెండు పూరీలు ఇవ్వబోయాడు రాఘవ.
“నాకొద్దు బాబూ”, అంది అవ్వ.
“ఇంట్లో వండినది అవ్వా..! ఆకలితో ఎలా పడుకుంటావ్? తిను”, అన్నాడు రాఘవ.
“నాకొద్దని చెప్పానా?”, మళ్ళీ కసిరింది అవ్వ.
“ప్రతిదానికీ నామీద కోప్పడతావేంటవ్వా? నేను నీ మనవడిలాంటివాడిని”, అన్నాడు రాఘవ బాధగా.
“మీ మగాళ్లను అస్సలు నమ్మకూడదు!”, అంది అవ్వ.
“ఎందుకని?”, అడిగాడు రాఘవ.
“ఆడది కనబడితే చాలు. మీకేదో పుడుతుంది. మీదపడి తినేసేట్టు చూస్తారు.ఛ..ఛ..!”, అంది అవ్వ.
ఆ సమాధానం విని రాఘవ ముందు కొంచెం ఆశ్చర్యపోయి, “అందరు మగవాళ్ళు ఒకేలా ఉండరులే అవ్వా. నేను మంచివాడినే. నీకు ఆకలేస్తోందేమోనని ఇచ్చానంతే!”, అన్నాడు.
రాఘవ మాటల్లో నిజాయితీని గమనించిన అవ్వకు రాఘవ పై జాలి కలిగింది.
“సరేలే నాయనా.. ! ఈ రోజుల్లో ఎవరెలాంటివారో చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఏమీ అనుకోకు”, అంది అవ్వ.
“ఇప్పుడైనా చెప్తావా అవ్వా.. ఏ ఊరు వెడుతున్నావో?”, అడిగాడు రాఘవ.
“రాజధాని నగరం”, చెప్పింది అవ్వ.
“నేనూ అక్కడికే! రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో నేను ప్రసంగం ఇవ్వబోతున్నాను. వీలైతే నువ్వు కూడా రా అవ్వా”, చెప్పాడు రాఘవ.
“స్వాతంత్రం!”, అంటూ నిట్టూర్చింది అవ్వ.
“ఏమైంది అవ్వా? అలా అన్నావ్?”, అడిగాడు రాఘవ.
“నా ఉద్దేశం దేశంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ రావడమే నిజమైన స్వాతంత్రం. అంతవరకూ ఈ వేడుకల కన్నా జరగాల్సిన మార్పు పై దృష్టి సారిస్తే బాగుంటుందేమో”, అంది అవ్వ.
“ఇప్పుడెవరికి స్వేచ్ఛ లేదంటావు అవ్వా?”, అడిగాడు రాఘవ.
“ఆడవారికి! ఆడవారు ఒంటరిగా ఎక్కడికెళ్ళాలన్నా భయపడాల్సిన రోజులొచ్చాయి”, అంది అవ్వ. అవ్వ గొంతులో కొంత కోపం కూడా వినపడింది రాఘవకు.
“అవును నిజమే! ఆ మాటకొస్తే ఈ మధ్య వార్తాపత్రికలలో సమాజంలో జరుగుతున్న అరాచకాలకు సంబంధించిన వార్తలే ఎక్కువగా వస్తున్నాయి”, అన్నాడు రాఘవ.
“ఈ సమస్యకు ఎదో ఒక పరిష్కారం వెతకక తప్పదు”, అంది అవ్వ.
“అవ్వా..! నీ మాటలబట్టి చూస్తే నిన్నెవరో తీవ్రంగా బాధ పెట్టినట్టున్నారే! ఇంతకీ ఆ పరిష్కారం ఏమైవుంటుందీ?”, అడిగాడు రాఘవ.
“నేను ముసలిదాన్నైనా ఒక ఆడదాన్నే కదా బాబూ? అందరు ఆడవాళ్ళలానే నేను కూడా కొందరు నీచులవల్ల బాధపడ్డాను”, అంది అవ్వ.
“అవ్వా.. బాధపడకు. నువ్వు జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఉంటావు. నేను అర్ధంచేసుకోగలను. నీ అనుభవంతో ఈ సమస్యకేదైనా పరిష్కారముందేమో చెప్పు”, అన్నాడు రాఘవ.
“నాయనా! నువ్వు ఈ అరాచకాలను చేసే వారి వయసు గమనించు. వారిలో చాలామంది సుమారుగా నీ వయసున్న యువకులే!” ,అంది అవ్వ.
“అవును. అయితే..?” అన్నాడు రాఘవ.
“యువత చెడిపోవడానికి ముఖ్య కారణం వారిని సరైన మార్గంలో పెట్టే పెద్దవారు లేకపోవడమని నా అభిప్రాయం. డబ్బు కొరత వల్లనో లేక వేరే ఏదో ఒక కారణంతోనో కన్నవారు తమ పిల్లలను పట్టించుకోకపోతే వారు గాలికి పెరిగి చెడు అలవాట్లకు బానిసలయ్యి అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. మద్యపానం వంటి వ్యసనాలవల్ల వారు మంచి చెడు విచక్షణను కోల్పోయి చెయ్యకూడని పనులు చేస్తున్నారు”, అంది అవ్వ.
“మరి ఈ విషయంలో మనము ఏమన్నా చెయ్యగలమంటావా అవ్వా?”, ఆలోచిస్తూ అడిగాడు రాఘవ.
“మనసుంటే ప్రతి సమస్యకీ ఏదో ఒక పరిష్కారం దొరక్కపోదు. జబ్బు నయం కావాలంటే ఆ జబ్బు మూలానికి మందు పడాలి. అలాగే రేపటి యువత బాగుండాలంటే ఇప్పటి పిల్లలకు క్రమశిక్షణ, కట్టుబాట్లు అలవాటు చెయ్యాలి. మన భారతీయ సంస్కృతీసాంప్రదాయాల గొప్పదనం వారికి తెలిసేలా చేసి, వాటి ప్రకారమే వారి ఆహారవ్యవహారాలు ఉండేటట్లు చూసుకోవాలి. చిన్నతనంలోనే వారికి దైవభక్తి, పాపభీతి అలవర్చాలి. మొక్కగా ఉన్నప్పుడే వంచే ప్రయత్నం చెయ్యాలి. వృక్షాన్ని పెకలించడం కష్టం”, అంది అవ్వ.
“నువ్వు నిజం చెప్పావ్ అవ్వా..! కానీ ఈ పరిష్కారం రాత్రికి రాత్రి దొరికేది కాదు. ఒక తరం వేచి ఉండాలి!”, అన్నాడు రాఘవ.
“వేచి చూస్తూ ఉంటే దుర్మార్గం ఇంకా పెరిగిపోతుంది. ఈ సమాజంలో పెడ త్రోవ పడుతున్న వారిని సరిచేసేందుకు నాకు తోచిన పని నేను చెయ్యటానికే రాజధాని నగరానికి వెడుతున్నాను. ప్రతి మతం ఎంతో కొంత మంచిని బోధిస్తూ ఉంటుంది. గమ్యం లేకుండా ఇష్టం వచ్చినట్టు పెరిగే పిల్లలకు ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసి, వారికి మానవతావిలువలను నేర్పి, నియమనిబంధనలతో వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాలనేది నా కోరిక. ధర్మబుద్ధి ఉన్నవాడు ఎన్నటికీ తప్పు చెయ్యలేడు. అందుకు అంతరాత్మ ఖచ్చితంగా అడ్డు పడుతుంది”, అంది అవ్వ.
వయసు ఎక్కువైనా అవ్వ సంకల్పంలోని దృఢత్వం, నమ్మకం ఆమె కంఠంలో సుస్పష్టంగా ధ్వనించాయి. అది విని ఆశ్చర్యపోయాడు రాఘవ. వయసు మీద పడిన అవ్వే ఏదో ఒకటి చెయ్యాలని తాపత్రయ పడుతూ ఉంటే యువరక్తంతో అన్నీ చెయ్యగలిగిన సమర్ధత ఉన్న తను సమాజం కోసం ఏమీ చెయ్యలేనా అని ఆలోచనలో పడ్డాడు రాఘవ.
“మరి అవ్వా! మంచి ఉద్యోగాల్లోనూ, మంచి హోదాలలోనూ పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్నవారిలో కూడా కొందరు చెడ్డ పనులు చేస్తున్నారు కదా? వారి దుశ్చర్యలను ఎలా ఆపగలం?”, అడిగాడు రాఘవ.
“అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకునే వ్యవస్థను ప్రవేశపెట్టి అది సక్రమంగా అమలు అయ్యేటట్టు చూడాలి”, అంది అవ్వ.
“అంటే.. మరణదండన లాంటిదా?”, అడిగాడు రాఘవ.
“ఛ! మరణం ఏ సమస్యకూ పరిష్కారం కాదు. తప్పు చేసినవాడిని మన మధ్యే ఉంచుతూ వాడు ఆ తప్పు ఎందుకు చేశానా అని పశ్చాత్తాప పడేటట్టు చెయ్యాలి. వాడు చేసిన చెడ్డ పనివల్ల అవతలివారికి ఎంత క్షోభ కలిగిందో వాడికి అర్ధమయ్యేలా చెయ్యాలి. పూర్వకాలం చెడ్డ పని చేసిన వారిని ఊరినుండి వేలి వేసేవారు కదా? అలాగే ఇప్పుడు కూడా తప్పు చేసిన వారిని, వారిలో మంచి మార్పు వచ్చే దాకా సమాజం నుండీ దూరంగా ఉంచడం వంటివి చెయ్యాలి. తప్పు చెయ్యాలంటే ప్రతి ఒక్కరూ అందుకు వారు అనుభవించాల్సిన శిక్షలను తలుచుకుని భయపడే పరిస్థితి రావాలి”, అంది అవ్వ.
“అవ్వా.. ! ఏదేమైనా నీ సంకల్పం చాలా గొప్పది. నువ్వన్నట్టు ఈ కాలం పిల్లలకు, యువతకు మన సంస్కృతి ఎంత గొప్పదో తెలిసేలా చెయ్యాలి. అసలు రామాయణం తెలిసిన వారందరికీ ఆడవారి శక్తి ఎంతటిదో తెలిసే ఉంటుంది. రావణాసురుడు గొప్ప శివభక్తుడు. అత్యంత బలవంతుడు. అటువంటి కొన్ని మంచి గుణాలుండి కూడా సీత వంటి మహా పతివ్రతను ఏడిపించడం వల్ల పతనమయ్యాడు. అధర్మము ఏ కాలంలోనైనా నిలవదు. నువ్వు తలపెట్టిన ఈ పనిలో నాకు చేతనైన సహాయం నేను తప్పకుండా చేస్తానవ్వా. నీ ఫోన్ నెంబర్ ఉంటే నాకివ్వు”, అన్నాడు రాఘవ.
“నా సంకల్పాన్ని మెచ్చుకుని ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషం రాఘవా. నాకు ఫోన్ లేదు. నీ నెంబర్ నాకు ఇవ్వు. అవసరపడితే నేనే నిన్ను రమ్మని అడుగుతా”, అంది అవ్వ.
“సరే. నా విజిటింగ్ కార్డు నీ దగ్గర ఉంచు. అవసరమైతే ఫోన్ చెయ్యి. నాకు వీలయినంత త్వరగా నీ దగ్గరుంటా”, అన్నాడు రాఘవ.
“ఇంక పడుకుంటే మంచిది. తెల్లవారకుండానే మనం దిగాల్సిన స్టేషన్ వచ్చేస్తుంది”, అంటూ తను కప్పుకున్న రగ్గులోకి పూర్తిగా దూరిపోయింది అవ్వ.
అవ్వతో జరిగిన సంభాషణను నెమరువేసుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు రాఘవ.
మరుసటి రోజు ‘చాయ్ చాయ్’ అని ఎవరో టీ అమ్ముకునే వాడి అరుపుకు ఉలిక్కిపడి లేచాడు రాఘవ. స్టేషన్ లో రైలు ఆగి ఉంది. అప్పటికే అవ్వతో సహా చాలా మంది రైలు దిగేసారు. గబగబా తన సూట్ కేసు పట్టుకుని రైలు దిగి తనకోసం కేటాయించిన హోటల్ గదికి వెళ్ళాడు రాఘవ.
స్వాతంత్రదినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. తన ప్రసంగంలో అవ్వతో మాట్లాడిన అంశాలను చేర్చి నేటి యువతలో రావలసిన మార్పును సూచిస్తూ, భావితరాలకు నేర్పవలసిన మంచి నడవడికను గురించి ప్రస్తావిస్తూ చివరిగా, “ఆడవారికి సమాజంలో ధైర్యంగా తిరగగలిగే స్వేచ్ఛను కలిగించడం మనందరి కనీసపు బాధ్యత. మనకు జన్మనిచ్చి, మనకు తోబుట్టువులై పుట్టి, నిరంతరం మన శ్రేయస్సును కోరుతూ, మన జీవిత భాగస్వాములై, మన సుఖం కోసం తమ సుఖాన్ని త్యాగం చేసే స్త్రీలను గౌరవించడం మన ధర్మం. మన కర్తవ్యం. మనలో ప్రతిఒక్కరూ వారి రక్షణ బాధ్యతను స్వీకరించాలి. ఆడవారిని ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక కూతురిగా భావించి వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోగలిగితే మన దేశ అభివృద్ధికి అది తోడ్పడుతుంది. ఇక మన చుట్టూ జరిగే మోసాలూ, అరాచకాలూ రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే! ఈ సమాజంలో జరిగే అకృత్యాలను నిర్మూలించడంలో మన వంతు కృషి మనము చేద్దాం. మంచితనాన్ని, మానవత్వాన్నీ పెంచి, దుర్మార్గులు చెడ్డ పని చెయ్యడానికి సిగ్గు పడేలా చేద్దాం. మనవికాని పద్ధతులకు స్వస్తి చెప్పి, మన భారతీయ సంస్కృతిని అనుసరిస్తూ మనకు పెద్దలందించిన సత్సాంప్రదాయాలను కాపాడుకుందాం. సైనికులు ఏ విధంగా అయితే దీక్షాబద్ధులై ఈ దేశమాత కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా అనుక్షణం దేశ ప్రజలందరికీ రక్షణ కల్పిస్తారో అదే విధంగా మనమంతా కలసికట్టుగా పనిచేసి, నేటి పిల్లలు ఎదిగేందుకు అన్ని విధాలా వారికి ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన పరిస్థితులను కల్పించి, ఈ కలికాలపు విపరీతపు ధోరణులు, ఆలోచనలు, అనైతిక పోకడలు వారిని ప్రభావితం చెయ్యకుండా వారికి మనము అనుక్షణం రక్షణకవచంగా నిలిచి, భావితరాలవారికి శాంతిభద్రతలున్న నవ సమాజాన్ని అందిద్దాం!”, అన్నాడు రాఘవ.
ప్రసంగం ముగిసిన వెంటనే ఆ ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. ఆ ప్రసంగం అన్ని ప్రసార సాధనాల ద్వారా జనమందరికీ చేరడంతో తన పై అధికారులతో సహా అందరూ రాఘవను ఎంతో మెచ్చుకున్నారు. సీతమ్మ రాఘవకు ఫోన్లో తన సంతోషాన్ని పంచుకుని ఆశీర్వాదాలు తెలిపింది. హోటల్ రూంకి చేరుకున్న రాఘవ సోఫాలో కూర్చుని సేద తీరుతూ ఉండగా తన ఫోన్ మోగింది. ఏదో కొత్త నెంబర్ లా ఉందే అని అనుకుంటూ ఫోన్ ఎత్తాడు రాఘవ.
“రాఘవా.. ! నేను అవ్వను. నీ ప్రసంగం విన్నాను చాలా అద్భుతంగా చెప్పావు. నిన్ను కలవాలనుకుంటున్నాను”, అంది అవ్వ.
“అవ్వా! నీ గురించే ఆలోచిస్తున్నా. నువ్వెక్కడుంటావో చెప్పు. అరగంటలో బయలుదేరి నీ దగ్గరుంటా”, అన్నాడు రాఘవ.
“నేనుండేది సద్గుణ అనే స్వచ్చంద సంస్థలో. ఈ పేరు ఊరందరికీ సుపరిచయమే. ఇక్కడికి తేలిగ్గా చేరుకోవచ్చు” ,అని అడ్రస్ ఇచ్చింది అవ్వ.
“అవ్వా..ఇంతకీ నీ పేరేంటీ? నువ్వు నాకెదురుగా ఉన్నా నేను నిన్ను గుర్తుపట్టలేను. ఎందుకంటే నాకు నిన్న రాత్రి రైల్లో ఉన్న చీకట్లో నీ కళ్ళు, జుట్టు తప్ప ఇంకేమీ కనబడలేదు”, అన్నాడు రాఘవ.
“నా పేరు ధరణిజ”, అని ఫోన్ పెట్టేసింది అవ్వ.
అవ్వది ఈ కాలం పేరులా ఉందే అని అనుకుంటూ సద్గుణకు బయలుదేరాడు రాఘవ.
సద్గుణ ప్రాంగణం చాలా పెద్దది. అందులో నాలుగైదు భవంతులు ఉన్నాయి. ఒకటి బడి, ఇంకొకటి గుడి, మరొకటి వసతి గృహం. ఇక చివరిది కార్యాలయం అని గ్రహించాడు రాఘవ.
ఆ కార్యాలయంలోకి ప్రవేశించగానే అక్కడ ఒక మహిళ పలకరించి, “మీరు ధరణిజ మేడం కోసం వచ్చారా? రండి. ఇక్కడ కూర్చోండి. మేడం ఇప్పుడే వస్తారు”, అంటూ ఒక గదిలో ఉన్న కుర్చీలో కూర్చోమని చెప్పింది. అక్కడున్న అలమరాల నిండా పిల్లల మనస్తత్వం గురించి ఏవేవో పుస్తకాలు ఉన్నాయి. అక్కడి బల్ల పైన ‘డా|| ధరణిజ, పి.హెచ్.డి. ‘ అన్న పేరు రాసి ఉన్న బోర్డు కనపడింది రాఘవకు.
‘అరె! అవ్వ ఇంత విద్యావంతురాలన్నమాట. అందుకే అవ్వ మాటలు, సంకల్పం అంత గొప్పగా ఉన్నాయి’, అని అనుకున్నాడు రాఘవ.
అంతలో, “రాఘవా! ఎలా ఉన్నావ్?”, అని అవ్వ గొంతు వినపడింది.
“బాగున్నానవ్వా”, అంటూ తలెత్తి చూసిన రాఘవకు అక్కడ ఒక అందమైన యువతి కనబడింది.
“నేనే అవ్వను రాఘవా!”, అంది ఆ యువతి. అవాక్కయ్యాడు రాఘవ!
“మరి నిన్న రైల్లో ఎందుకలా?”, కాస్త అయోమయంగా అడిగాడు రాఘవ.
“ఏం చేయమంటావు రాఘవా..! పాపిష్టి ఆలోచనలు ఉన్న మగవాళ్ల బారి నుండీ నన్ను నేను కాపాడుకోవటానికి అలా చేశా”, అంది ధరణిజ.
“అర్ధంచేసుకోగలను”, అన్నాడు రాఘవ.
“నువ్వు మొదటినుంచీ నన్ను సరైన రీతిలో అర్ధం చేసుకుంటున్నావనే నేను తలపెట్టిన కార్యంలో నీ వంతు సహాయం చేస్తావని రమ్మన్నా”, అంది ధరణిజ.
“ఏం చెయ్యాలో చెప్పు.. సారి.. చెప్పండి”, అన్నాడు రాఘవ.
“ఏకవచనం ఉపయోగించులే..! ఏమీ అనుకోను. ఇక నేను తలపెట్టిన కార్యం గురించి చెబుతాను విను. ఈ రాజధాని మహానగరం. ఇక్కడ పూటకు గతిలేని వాళ్ళు చాలా ఎక్కువ. అటువంటివాళ్ళు, తమ పిల్లలను పోషించే స్థోమత, సామర్ధ్యం లేక వారిని రోడ్లపై వదిలేస్తున్నారు. మా కార్యకర్తలు అటువంటి పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు చెప్పి ఇక్కడకు పట్టుకొస్తారు. మేము ఆ పిల్లలను మా దగ్గరే ఉంచుకుని వారికి విద్యాబుద్ధులు, మంచి అలవాట్లు నేర్పుతున్నాము. నువ్వు చదువుకున్న వాడివి, తెలివైన వాడివి. నీకు తెలిసినది అప్పుడప్పుడూ ఇక్కడకు వచ్చి మా పిల్లలతో పంచుకుంటావేమోనని అనుకుంటున్నా”, అంది ధరణిజ.
“మీరు చేస్తున్నది చాలా మంచి పని. ఇటువంటి మహత్కార్యంలో నేను తప్పకుండా పాలుపంచుకుంటా”, అన్నాడు రాఘవ.
“వెరీ గుడ్! ఈ శుభ సందర్భంలో మంచి కాఫీ తాగుదాం!”, అంటూ అక్కడున్న ఫ్లాస్క్ లోని వేడి కాఫీని రెండు కప్పుల్లో పోసింది ధరణిజ. అంతలో ఆ గదిలోని గోడ పైన ధరణిజ పేరుతో ఉన్న కరాటే సర్టిఫికెట్ కనపడింది రాఘవకు.
“నీకు కరాటే కూడా వచ్చా?”, అడిగాడు రాఘవ.
“వచ్చు. నాకు బ్లాక్ బెల్ట్ ఉంది. మరి దుర్మార్గులను ఒంటరిగా ఎదిరించాలంటే ఆత్మరక్షణకు ఇలాంటి విద్యలు తెలిసుండాలి కదా!”, అంది ధరణిజ.
“అయితే… ఆ రోజు ధైర్యసాహసాలు కనబరచి సంచలనం సృష్టించిన ఆ యువతీ…”, అని ఆగాడు రాఘవ.
“నేనే!”, అని ముసి ముసి నవ్వులు నవ్వింది ధరణిజ. ఆశ్చర్యపోయాడు రాఘవ.
“మరి నువ్వన్న ఆ ‘రక్షణ కవచం’ తయారు చెయ్యడానికి సన్నాహాలు చేద్దామా?”, అడిగింది ధరణిజ.
“ఓ! తప్పకుండా!! మీవంటి వారితో కలిసి పని చెయ్యడం నా అదృష్టంగా భావిస్తాను!”, అని అన్నాడు రాఘవ ఉత్సాహంగా.

*****

8 thoughts on “అర్చన కథల పోటి – రక్షణ కవచం

  1. మనిషి ఆలోచన వాడు పెరిగిన వాతావరణం మీదే ఆధారపడుతున్నది. ఇది స్త్రీకి కూడా వర్తిస్తుంది. మంచి కధ. పాత్రల ద్వారా మంచి విషయాలు చెప్పించారు.

  2. నిజమే, మనిషి ఆలోచన వాడు పెరిగిన వాతావరణం మీదే ఆధారపడుతున్నది. ఇది స్త్రీకి కూడా వర్తిస్తుంది. మంచి కధ. పాత్రల ద్వారా మంచి విషయాలు చెప్పించారు.

    1. నా కథను చదివి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు లక్ష్మిగారూ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *