June 19, 2024

అర్చన కథల పోటి – సెలెబ్రిటి

రచన: పోలాప్రగడ జనార్ధనరావు

” ‘సెలెబ్రిటి’ అంటే ఎవరు నాన్నా?”
నాని అడిగిన ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలా అని ఆలోచనలో పడ్డా.
“నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. నీకు తెలుసున్నదంతా చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చెయ్యకు నాన్నా”
నీరసంగా, నిస్సత్తువుగా, మంచం మీద పడుకున్న నా ఒక్కగానొక్క కొడుకు ‘నాని’ని చూసేసరికి, నాలో ఏదో ఆందోళన. అది కప్పిపుచ్చుకునేందుకు మొహం మీద నవ్వు మాస్క్ పులుముకొని “సెలెబ్రిటీ అంటే… సెలెబ్రిటీ అంటే… గొప్పవాళ్ళు” అన్నా.
“అంటే గొప్పవాళ్ళందరూ సెలెబ్రిటీలే నన్నమాట. ఇలా నా దగ్గరగా వంగు నాన్నా!” అంటూ నా మెడ చుట్టూ చేతులేసి ఆప్యాయంగా కౌగిలించుకుని, ముద్దుపెట్టుకుని “మా నాన్నే నా సెలెబ్రిటీ” అన్నాడు నాని. వాడి మాటలకి నాకు కన్నీళ్లొచ్చాయి. అవి అణచుకుని “నేను ‘సెలెబ్రిటీ’ని కాదు కన్నా! ఏదో ఒక రంగంలో నిష్ణాతులైన వాళ్ళు ప్రజలందరూ జేజేలు పలికినవారు అభిమానులకి ఉత్సాహం. ఉప్పెనలా తెప్పించే వాళ్ళే ‘సెలెబ్రిటీ’ ”
“నిన్ను చూస్తే, నీతో మాట్లాడితే నాకు చాలా ఉత్సాహం వస్తుంది నాన్నా! నిన్నే కాదు, అమ్మ ఫొటో చూసి మందులు వేసుకున్నా, నా జబ్బు హుష్కాకి అంటూ ఎగిరిపోతుంది అంటూ నీరసంగా వాడన్న మాటలకి, నాకు కాస్త ఆశొచ్చినా, వాడి అనారోగ్య తీవ్రత గుర్తొచ్చి, ఆందోళన ప్రారంభమవుతుంది. పది నెలల క్రితం, పట్టుమని పదేళ్ళు నిండని, పసికందుకి, ‘కేన్సర్ ముదిరింది. ఇంక ఎన్నో రోజులు బతకడు…’ అన్న డాక్టర్ల మాటలు పూర్తి అవకుండానే నా గుండాగిపోయింది, మెదడు మొద్దుబారిపోయింది. నిద్దరపట్టదు. ఆకలేయదు.
నా భార్య ‘మైథిలి’ నానిని కనడానికి నానా యాతనలు పడి, వాడ్ని నా చేతుల్లో పెట్టి కన్నుమూసింది. అప్పడ్నుంచి నానీకి నేనే అమ్మను.
నానికి ఏం తెలియక పోయినా, అది తెలుసుకునే వరకు ఓ పట్టాన వదలడు. అంతా వాళ్ళ అమ్మ పోలికే.
వాడి ఆలోచనలో కాస్త మార్పు రావడానికి, “నానీ! నీకు క్రికెట్లో బౌలింగ్ ఇష్టమా? బ్యాటింగ్ ఇష్టమా?” అని అడిగా.
“బ్యాటూ, బాలూ లేకుండా ఆటని ఒక్క వేలుతో డిసైడ్ చేసే ఎంపైర్ అంటే ఇష్టం నాన్నా” అంటూ తన చూపుడు వేలు పైకి చూపెట్టి “అవుట్… అవుట్” అని నన్ను ఆట పట్టించాడు.
‘అవుట్’ అన్న మాట వాడి నోటవింటే ఏదో తెలియని ఆందోళన, అలజడి, నాలో మొదలయ్యాయి. ‘మన ఆటను నిర్దేశించి, ఎంపైరింగ్ చేసేవాడు భగవంతుడు. రూల్సు ప్రకారం ‘ఆడ్డమే మన బాధ్యత’ అని ఆ పసివాడికి చెప్పలేకపోయా.
నాని నిద్దరపోయాక, వాడి బుక్ షల్ప్ వెతికా. ఓ ఆల్బమ్ కనపడింది. అందులో ప్రఖ్యాత క్రికెట్ ఎంపైర్లు, డిక్కీబర్డ్, ఇల్లంగ్వర్త, వెంకటరాఘవన్, వి.కె.రామస్వామి, శ్రీనాథ్ ఫొటోలు, న్యూస్ పేపర్ల కటింగులు కనబడ్డాయి. అందులో ముఖ్యంగా ‘శ్రీనాథ్’ అనే భారతీయ ఎంపైర్ ఫొటోలు చాలా వున్నాయి.
వాడికి ఇష్టమైన ‘సెలెబ్రిటీ’ ఎవరో తెల్సింది. ఆయన్ని నానికి చూపించాలని నిర్ణయించుకున్నా.
మానని జబ్బులతో మానసికంగా కృంగిపోయి, తీవ్రంగా రోగగ్రస్థులయిన వారికి, వారి అభిమానుల్ని కలిసేలా చేసే ‘మీట్మి’ సంస్థ ఆఫీసుకెళ్ళా. ఆ సెక్రటరీకి నా విజిటింగ్ కార్డ్ ఇచ్చి, దుఃఖం దిగమింగుకొని నాని గురించి వివరాలు చెప్పి అప్లికేషన్ ఫిలప్చేసి, డొనేషన్ ఇచ్చా. త్వరలో ఎపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాం అన్నారు.
ఆ తర్వాత ‘మిట్మీ’ సంస్థ చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరిగా. ఫలితం శూన్యం. ఓ రోజు బాధతో గట్టిగా అడిగా. “యింకా ఎన్నాళ్ళు. అవతల మా వాడి జీవితం…” అంటూ ఏడ్చా.
“మీరన్న సెలెబ్రిటీని సంప్రదిస్తూ వున్నాం. ఆయన ఇప్పుడిప్పుడే హైదరాబాద్ రావటం కష్టమట. చాలా టైయిట్ షెడ్యూలట” అన్నాడు ఆ సెక్రటరీ.
రెండు రోజుల తర్వాత గవర్నర్ భార్య చేస్తున్న ఓ కార్యక్రమానికి ఆ సెలెబ్రిటీ గెస్ట్గా హైదరాబాద్ వచ్చాడని పేపర్లో చదివి షాక్ అయ్యా. నాకు చాలా చికాకు అసహ్యం వేసింది. ఇన్ని అబద్ధాలా? సెలెబ్రిటీ పదానికి వీళ్ళు అర్హులా? వీళ్ళకి ఆ హోదా కల్పించిన అభిమానులు ఎంత పిచ్చోళ్లో, అమాయకులో అనిపించింది.
స్పెషలిస్ట్ల చేత ట్రీట్మెంటు చేయిస్తున్నా, నాని ఆరోగ్యం క్షీణించింది. నాని కోరిక నేను తీర్చకుండానే వాడు నాకు దూరమై పోయాడు. కేన్సర్ మహమ్మారితో పోరాడి, పోరాడి, ఇంక ఓపిక లేక ఓడిపోయాడు.
ఆ సంఘటనతో నేను పిచ్చివాడ్ని అయిపోయా. ఏకాకి నయ్యా నాలో నేను కుమిలిపోతూంటే, రోజూ మైథిలి, నానీ, నా కలలో కనబడుతూ, నాకు ధైర్యం చెబుతున్నారు. నన్ను కృంగిపోవద్దని, మానవ జన్మ చాలా గొప్పదని, నలుగురికి సాయపడే పని చేయమని ప్రోత్సహిస్తున్నారు.
నాకు నేను సర్దిచెప్పుకుని కొత్త జీవితం ప్రారంభించాలనుకుని, మృత్యువుతో పోరాడుతున్న రోగుల ఆఖరి కోరిక తీర్చాలని దృఢంగా నిర్ణయించుకున్నా.
మైథిలి, నాని, జ్ఞాపకార్థం ‘ఆత్మీయ’ అనే సేవా సంస్థని నా డబ్బుతో స్థాపించా. అన్నీ నేనే అయి ‘సింగిల్మేన్ ఆర్మీలా’ కార్యక్రమాలు రూపుదిద్దా.
హాస్పిటల్స్కి వెళ్ళి మృత్యువుతో యుద్ధం చేస్తున్న రోగుల సమాచారం సేకరించి, వాళ్ళ ఆఖరికోరికలు తెలుసుకుని, వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో, కొంతమంది రోగుల కోర్కెలు తీర్చా.
అప్పుడే నాకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. సెలెబ్రిటీలను కలుసుకునేందుకు ‘వైతరిణీ’ నది దాటినంత అవస్థలు పడ్డా.
కొందరి సెలెబ్రిటీలకు కొత్త అల్లుడి మర్యాదలు చెయ్యవలసి వచ్చింది. దానికి తోడు, ఎంతోమంది రాజకీయ నాయకులు, సూడో సెలెబ్రిటీల భార్యలు, పేరుకోసం, పబ్లిసిటీకోసం, మా ‘ఆత్మీయ’ సంస్థలో జేరి, నన్ను పక్కకునెట్టి, వాళ్ళ ప్రాపకం పెంచుకోవాలని రాజకీయాలు మొదలుపెట్టారు.
ఆ ఒత్తిళ్ళకి విసిగి, వేసారి, సహనం చచ్చి, సంస్థను మూసేద్దామనుకుంటూంటే, నా జీవితం రింగురోడ్డులా మలుపు తిరిగింది.
‘ఆత్మీయ’ సంస్థని మూసేసి ఏం చెయ్యాలని ఆలోచిస్తూ కారులో హైటెక్ సిటీకి వెడుతున్నా. ట్రాఫిక్ జామ్ అయినట్టుంది. ఎక్కడ కార్లు అక్కడే ఆగిపోయాయి. యాక్సిడెంటేమోనని నేనూ కారాపి, ఏం జరిగిందో తెలుసుకుందుకు, కుతూహలం కొద్దీ నడిచి ముందుకెళ్ళా.
ముసలావిడ ఓ కారును రాయిపెట్టి కొట్టిందట. కారు అద్దం బద్దలయిందట. ఆ కారు డ్రయివర్ ఆమెతో గొడవ పడుతున్నాడు. కారణం తెలుసుకుని, గొడవ లేకుండా చేద్దామని “ఎందుకు రాయుచ్చుకుని కొట్టావమ్మా?” అని అడిగా.
“బిడ్డా! రోడ్రు పక్క ముసలాడు కళ్ళు తిరిగి పడిపోయిండు. ఆడ్ని దవాఖానకు తోలుకెళ్ళాలని, రోడ్రుమీనకచ్చి కార్లు ఆపుతుంటే, పెతిగాడిదా కారద్దంలోంచి సూడ్డం, పోవడం- గదే పడుసుపిల్ల రోడ్రు మీన నుంసుంటేసాలు అడగకపోయిన, అడ్డమైన యదవలు కారాపి ఏం కావాలని అడుగుతారు. నేను ముసలిముండను. నన్ను సూసి ఒక్క బద్మాష్గాడు కారాపటంలే. ముసలోడి పానం పోయేలోపు ఏదో సెయ్యాలి. కంగారులో కారుని రాయుచ్చుకు కొట్టి ఆపిన. తప్పా బడ్డా? అంటూ ఆయాస పడుతూ చెంగుతో చమట తుడుచుకుంటూ, తనతో దెబ్బలాడుతున్న కారు డ్రయివర్ సీటు కిందున్న వాటర్ బాటిల్ చటుక్కుని లాగి అవ్వ ముసలాడి దగ్గరకి ఆయాసడుతూ పరిగెత్తింది.
నేను ఆమె వెనకాలే వెళ్ళి “ఊరు బయటకు ఎండలో ముసలాడ్ని నడిపించి తీసుకొచ్చావా? ఏ ఆటోలోనో, బస్సులోనో రావాల్సింది అవ్వా” అన్నా.
“బిడ్డా! ఈ ముసలాడెవరో నాకు తెల్వదు. నా రోగానికి సెట్టు మందుకోసం ఈ దారిని పోతాంటే, రోడ్రు పక్కన నడుస్తూ ముసలాడు, నా కళ్ళముంగటే కళ్ళు తిరిగి పడిపోయిండు” అంటూ నాతో మాట్లాడుతూనే, కొంగు తడిపి ముసలాడి మొహం తుడిచి, నీళ్ళు తాగించాకే తను తాగింది.
ఇప్పుడు అవాక్కవడం నా వంతైంది. ఆలస్యం చెయ్యకుండా వాళ్ళని నా కారులో ఎక్కించుకున్నా. దారిలో నా గురించి, మా ‘ఆత్మీయ’ సంస్థ వివరాలు చెప్పి, అవ్వ గురించి తెలుసుకున్నా. ముసలాడ్ని హాస్పటల్లో చేర్చి, అవ్వను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టా.
నా స్వచ్ఛంద సంస్థని మూసేయాలన్న ఆలోచన, అవ్వ ప్రవర్తనతో అంతమైంది.
“జర చాయి తాగిపో బిడ్డా!” అంది అవ్వ. “తరుచు వస్తూ వుంటా అవ్వా” అని మందులు కొనుక్కుందుకు, ఆమె వద్దన్నా వినకుండా, డబ్బులు ఆమె చేతిలో పెట్టా.. “ఏ కష్టమొచ్చినా నాకు ఫోను చెయ్యమ్మా” అని నా విజిటింగ్ కార్డు యిచ్చా. ఆమె మానవత్వానికి ఖరీదు కట్టే షరాబెవ్వడు?
నేను చేస్తున్న పనుల్లో అసహనం, ఆవేదన వచ్చినప్పుడల్లా, అవ్వ ఇంటి చుట్టుపక్కలున్న వాళ్ళకి చేసే సేవ గుర్తుకొచ్చి, నాలో నూతన ఉత్సాహం వస్తోంది.
అవ్వకి నా అన్నవాళ్ళెవరూ లేరు నేను తప్ప.
ఇన్నేళ్ళు తన రెక్కల కష్టంతోనే బతికిందట. అప్పుడప్పుడు అవ్వను కలిసి నాకు చేతనైన సాయం చేస్తున్నా. ట్రీట్మెంట్ చేయిస్తున్నా. పాపం అవ్వ ఆరోగ్యం రోజు రోజుకి దిగజారిపోతోంది.
నాతో ఏదో చెప్పాలనుకుంటుంది. నేను ఇబ్బంది పడతానేమోనని చెప్పదు. అవ్వకి ఆఖరి రోజుల్లో మనశ్శాంతి కలిగించే పని చెయ్యాలని నా మనసు తహతహలాడుతోంది. కానీ, అవ్వ కోరిక ఏమిటో తెలియదు.
ఓరోజు అవ్వని ఆమె గుడిశ బయట నుంచి ఎంత పిలిచినా పలకలేదు. కంగారుగా, మొదటిసారి గుడిశలోకి వెళ్ళా.
పెచ్చులూడిన మట్టి గోడలకి దేవుళ్ళ పాత సినిమా పోస్టర్లు అతికించి వున్నాయి. వాటి పక్కనే కృష్ణుడి వేషంలో ప్రముఖ సినీ హిరో. చవకబారు ఫ్రేమ్ కట్టిన ఫొటో. దానిని గుచ్చిన అగరత్తుల పొగతో ఆ దేవుడు పొగచూరిపోయాడు. ఎప్పుడో ఆరిపోయిన ఆ అగరత్తులు, బక్కచిక్కిన అవ్వచేతి వేళ్ళల్లా వున్నాయి. గోడకానించిన కిరసనాయిలు డబ్బామీద చిరిగిన తువ్వాలు. దానిమీద విరిగిన మురళితో మాసిన తెల్లటి కృష్ణని మట్టి విగ్రహం. ఆయన పాదాలు తాకి తరించిన వాడిన పువ్వులు.
అది అవ్వ గుడిశెలా లేదు. శిథిలమైన గుడిలా వుంది.
అవ్వ కుక్కి నులకమంచంలో గర్భస్థ శిశువులా ముడుచుకుని పడుకుంది. చలితో ఒణికిపోతుంది. దుప్పటి కప్పా. మందగించిన ఆమె చూపుకి కన్నీళ్ళు అడ్డొస్తున్నా ఫొటోలో కృష్ణుడి వేషంలో వున్న సెలెబ్రిటీకి చేతులు వణుకుతూంటే దండం పెడుతూ చెంపలేసుకుంటోంది.
మెడ తిప్పలేక, కృష్ణుడి విగ్రహంకేసి చూస్తూ, కన్నీళ్ళతో స్వామి కాళ్ళు కడుగుతోంది.
నాకు అవ్వ మనోభావాలు అర్థమవుతున్నాయి.
‘నీ మనసులో కోరిక చెప్పు అవ్వా’ అని తరచి తరచి అడిగా.
మాట తడబడుతూ తన మనసులో మాట చెప్పలేక… చెప్పలేక.. అస్పష్టంగా గొణిగింది. ఆమె కోరిక విని షాకయ్యా… అవ్వ నా చెయ్యి పట్టుకుని “ఊ” అనే వరకు వదలటం లేదు.
నా కొడుకు ఆఖరి కోరిక తీర్చలేని నిస్సహాయుడ్ని. అవ్వకి కూడా అదే జరిగితే? ఆ భావనే భరించలేకపోయా. మరి అవ్వ కోర్కె తీర్చడం ఎలా? ఎలా? అది నా వల్ల అవుతుందా? ‘ఆత్మీయ’ సంస్థ నన్ను అసమర్దుడని వెక్కిరిస్తున్నట్టు అనిపించింది. ఆ ఆలోచనే తట్టుకోలేకపోయా.
“ఆ దేవుడ్ని నాకు చూపించవా బిడ్డా?” అంటూ గోడకేసి చూపిస్తూ, ఏదేదో ముద్దముద్దగా మాట్లాడుతూ ఏడుస్తోంది.
భక్తుడికి భగవంతుడి ధ్యాస
జాలరికి చేపల ఆశ.
రోగులు ఆఖరికోరిక తీర్చడమే నా శ్వాస.
నా ఆలోచనల్లా దేవుడి దగ్గరికి వెళ్ళిన ఆ ‘సెలెబ్రిటీ’ని అవ్వకి చూపించడం ఎలా అని?
పాపం! అవ్వకి ఆ విషయం తెలియక అడుగుతోందా? అసలు విషయం తెలిస్తే ఆ షాక్కి తట్టుకోగలదా? ఇందులో ఏదైనా ఆధ్యాత్మిక భావం అంతర్లీనంగా వుందా? అది నాకు అర్థం కావటం లేదా?
యిలా నాలో నేను తర్కించుకునే సమయం లేదని అవ్వ శ్వాస ఎగిరెగిరి పడుతోంది.
“నీ కోరిక తప్పక తీరుస్తానని” అవ్వ తృప్తికోసం మాటిచ్చి, ఆలోచిస్తూ, ఇంటికొచ్చా.
నా ఆధ్యాత్మిక అజ్ఞానం నన్ను అపహాస్యం చేస్తోంది.
నా ‘అసహనం’ వేడి వేడి నిట్టూర్పులు విడుస్తోంది.
నిద్దర పట్టడం లేదు. అవ్వ వేలెత్తి గోడకేసి చూపిస్తున్న దృశ్యం. నా గుండెకు గుచ్చుకుంటోంది. అంతా మానసిక కల్లోలం. కన్నీళ్ళ కెరటాల కునికిపాట్లు. కలత నిద్దరలో కల. కలలో నాని బాలకృష్ణని వేషంలో నవ్వుతూ గర్భగుడిలోకి దారి చూపిస్తూ మాయమయ్యాడు. వేణుగానం వినబడుతోంది. గుడిగంటలు మోగుతున్నాయి. ఉలిక్కిపడి లేచా. కర్తవ్యం బోధపడింది.
అనంతకోటి జీవరాసికి ‘సెలెబ్రిటీ’ ఎవరో తెలిసింది.
నా అజ్ఞానం పటాపంచలయింది. నాలో ఏదో వెలుగు, మరేదో మెరుపు… వెంటనే అవ్వని తీసుకుని ఆ అసలు సిసలైన ‘సెలెబ్రిటీ’ దర్శనార్థం ‘ద్వారక’కి బయలుదేరా.
అంతర్యామి ఆశీర్వాదంతో నా అసహనం ఆవిరయ్యింది.

4 thoughts on “అర్చన కథల పోటి – సెలెబ్రిటి

  1. మంచి పని చేసారు.
    సెలబ్రిటీల్లోనే దేవుడ్ని చూసుకొని బ్రతికేసే జనానికి మంచి ముగింపు. బావుంది కధ జనార్ధనరావు గారు.

  2. మీ కథ చాలా బాగుంది, నేటి సమాజంలో మృగ్యమయిన మానవతావిలువలు తట్టి లేపినట్లుంది. అభినందనలు

  3. నిజమైన సెలిబ్రిటీని చూపించారు. అభినందనలండీ..

  4. మనసు కదిలించారు. అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *