April 20, 2024

అర్చన కథల పోటి – పథకం

రచన: మన్యం రమేష్ కుమార్

సంగీతం క్లాసు పూర్తయ్యాక బైటికొచ్చి ఆ దారి వెంట నడవసాగారు సుదీప్తి, నీరజ. ఆ సందు చివరికి వెళితే మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడి వరకూ వెళ్లి అక్కడ ఆటో ఎక్కి ఇద్దరూ ఉమెన్స్ హాస్టల్ కి వెళతారు.
“నీ వల్ల సంగీతం నేర్చుకోవాలన్న నా కల కొంతవరకైనా నేరవేర్చుకోగలుగుతున్నానే..” అంది నీరజ.
సుదీప్తి నవ్వి “అది నీ కల మాత్రమే కాదు. నాది కూడా..” అంది.
సుదీప్తి, నీరజ ఇద్దరూ ఓ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరికీ ఇంకా వివాహం కాలేదు. ఒకే ఉమెన్స్ హాస్టల్ లో వుండే వాళ్ళిద్దరికీ ఒక కామన్ ఇంట్రెస్టు వుంది. అదే మ్యూజిక్. ఇద్దరూ సంగీతం గురించీ, పాటల గురించీ గంటల తరబడి మాట్లాడుకునేవారు. ఓ రోజు సుదీప్తి సంగీతం నేర్చుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వెలిబుచ్చడమే కాక అందుకు తగ్గట్టుగా సాయంత్రం సమయంలో సంగీతం నేర్పే ఓ సెంటర్ ను వెతికి పట్టుకుని నీరజకు కూడా చెప్పింది. ఇద్దరూ ఉత్సాహంగా అక్కడ జాయినయ్యారు. తమ ఆఫీస్ అవర్స్ అయ్యాక అక్కడికి వెళ్లి సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు.
అంతా బానే వున్నా ఆ సంగీతం నేర్పే సెంటర్ టౌన్ కి కాస్త దూరంలో వుండటం.. అక్కణ్నుంచి తాముండే వైపు రావడానికి బస్సులు లేకపోవడం లాంటి చిన్న ఇబ్బందులు వున్నాయి. అయితే వాళ్ళిద్దరికీ సంగీతం మీద వుండే ఇష్టం ఆ ఇబ్బందుల్ని అధిగమించేలా చేసింది.
ఆరోజు సుదీప్తి సంగీతం క్లాసు నుంచి హాస్టల్ కు వెళ్ళడానికి ఆటో కోసం చూస్తోంది. ఆఫీస్ లో లేటవడం మూలంగా నీరజ ఆరోజు క్లాసుకు రాలేదు.
శీతాకాలపు సాయంత్రం కావడంతో చలిగాలి తన ప్రతాపం చూపించడం మొదలైంది. ఆటో ఒకటి సుదీప్తి ముందు ఆగింది. లోపలికి చూసింది. డ్రైవర్ ఆ రూట్ లో అప్పుడప్పుడూ వచ్చేవాడే కావడంతో సందేహించకుండా ఎక్కింది. లోపల ఇద్దరు మగవాళ్ళతో పాటు ఇంకొకామె వుంది. ఆమెకు యాబై ఏళ్ళు దాటి వుంటాయి. చేతిలో చిన్న గుడ్డ సంచితో వున్న కేరేజు వుంది. బహుశా భవన నిర్మాణ కూలీ అయ్యుండొచ్చు అనుకుంది సుదీప్తి. ఆమె తర్వాతి స్టాప్ లో దిగాల్సి వున్నట్టుంది. ఆ స్టాప్ రాగానే డ్రైవర్ ఆమెకు గుర్తు చేశాడు. కానీ “ఇక్కడ దిగను బాబూ.. ఈరోజు
మా సెల్లెలింటికి వత్తానని సెప్పాను.. ఆ సంగతి మర్సిపోయాను. అక్కడికెళ్ళాలి. గాంధీ బొమ్మ కాడ దిగుతాను..” అంది. ఆ స్టాప్ లోనే సుదీప్తి కూడా దిగాల్సివుంది. ఆటో అక్కడకు రాగానే ఆడవాళ్ళిద్దరూ దిగిపోయారు.
మర్నాడు నీరజ కూడా సంగీతం క్లాసుకు వచ్చింది. సాయంత్రం క్లాసు పూర్తయ్యాక ఇద్దరూ ఆటో కోసం నిలబడ్డారు. ఆటో వచ్చింది. సుదీప్తి లోపలకు చూసింది. అదే డ్రైవర్..! తరచుగా అదే రూట్లో కనిపించే
ఆ డ్రైవర్ మొహం నీరజ కు కూడా పరిచయమైనదే..! ఇద్దరూ ఎక్కాక ఆటో బైల్దేరింది. ఆటోలో వీళ్ళిద్దరూ కాక మరో ఇద్దరు మగవాళ్ళు వున్నారు. ఒకడు డ్రైవర్ పక్క కూర్చుంటే మరొకడు వెనక సీట్లోనే వున్నాడు.
ఆటో ప్రయాణిస్తుండగా సుదీప్తి సెల్ లో ఏవో మెసేజులు చేస్తూండటం గమనించింది నీరజ.

అప్పటికే చీకటి పడింది. ఆటో వేగంగా వెళ్తోంది. కొంతదూరం వెళ్ళాక కుడివైపుకి తిరిగింది. “ఇదేమిటి..? ఇటు వెళ్తోంది..?” సుదీప్తిని అడిగింది నీరజ.
“ఇటు వెళ్లి ఆయన్ని దింపేసి మళ్ళీ అటుపక్క నుంచి మొయిన్ రోడ్ లోకి వచ్చేద్దాం మేడమ్..” ఆటో నడుపుతున్నవాడు చెప్పాడు.
సుదీప్తి ఏమీ మాట్లాడలేదు. ఆటో వేగంగా ప్రయాణించి కొంత దూరం వెళ్ళాక మళ్ళీ కుడివైపుకి తిరిగింది.
ఆ ఏరియాలో జనావాసాలు లేవు. కొత్తగా లేఅవుట్లు వేస్తున్నారు. ఆటో స్పీడుగా ఇంకా ముందుకు పోతూనే వుంది.
“ఎటు వెళ్తున్నాం మనం..” అయోమయంగా కాస్త ఆందోళనగా అడిగింది నీరజ. ఆటో డ్రైవర్ సమాధానం ఇవ్వలేదు. ఆటో లోపల లైట్ ఏమీ లేకపోవడంతో మసక చీకటి ఆవరించింది.
“మన మీద ఎటాక్ జరగబోతోంది.. నువ్వు ధైర్యంగా వుండు.. ఇది తీసుకో..” ఆమె చెవిలో అతి నెమ్మదిగా గుసగుసలాడి పక్కవాడు గమనించకుండా ఆమె చేతిలో ఏదో వస్తువు పెట్టింది సుదీప్తి.
నీరజకు కొన్ని క్షణాల పాటు ఏమీ అర్థం కాలేదు. భయంతో బిగుసుకు పోయింది. చేతిలో వస్తువు వంక చూసింది. అదేదో స్ప్రే లాగా వుంది. ఆమె బుర్రలో లైటు వెలిగింది. అయినా లోపల భయం మాత్రం విపరీతంగా పెరిగిపోయింది.
సుదీప్తి ఒక్కసారిగా “ఆపండి.. ఎటువెళ్తున్నాం మనం..” అంటూ గట్టిగా అరిచింది. నీరజ కూడా అప్రయత్నంగానే “హెల్ప్.. హెల్ప్..” అంటూ అరవడం మొదలుపెట్టింది. ఆటో ఓ పక్కగా వెళ్లి ఆగింది. వాళ్ళు దిగగానే డ్రైవర్, ముందు సీట్లో వున్నవాడు ఇద్దరూ కలిసి వీళ్ళ మీదకి రాబోయారు. సుదీప్తి వేగంగా రియాక్టయింది.. తన చేతిలో వున్న పెప్పర్ స్ప్రే ని వాళ్ళిద్దరి కళ్ళల్లోకి వెంటవెంటనే స్ప్రే చేసింది. ఈలోపు జరిగింది గమనిస్తున్న నీరజ కూడా తేరుకుని మరోవ్యక్తి కళ్ళలోకి స్ప్రే కొట్టింది. అయితే ఆ చర్య కొద్దిగా ఆలస్యం కావడం వల్ల.. భయంతో ఆమె చెయ్యి వణకడం వల్ల ఆ వ్యక్తి పక్కకు తప్పుకున్నాడు. డ్రైవర్, మరో వ్యక్తి కళ్ళమంటలతో అరుస్తూ వుంటే మూడో వ్యక్తి ఇద్దరు ఆడవాళ్ళ మీద దాడికి దిగాడు. నీరజ ను పక్కకు లాగి సుదీప్తి తను వాడికి ఎదురెళ్ళి అతడి కడుపులో బలంగా కిక్ ఇచ్చింది. ఆమె అలా దాడి చేస్తుందని ఊహించని ఆ మనిషి తూలి వెనక్కి పడ్డాడు. వెంటనే లేచి సుదీప్తిని జుట్టు పట్టుకుని విసురుగా లాగి మొహం మీద గుద్దబోయాడు. సుదీప్తి చాకచక్యంగా తప్పించుకొని అతడిని వెనకనుంచి కాలితో బలంగా తన్నింది. నీరజ జరుగుతున్నదాన్ని జీర్ణించుకోలేనట్టు బిత్తర పోయి చూస్తోంది. ఈలోపు కళ్ళ మంటలతో అయోమయానికి గురైన ఇద్దరూ తేరుకొని నీరజ ను పట్టుకున్నారు. నీరజ భయంతో కొయ్యబారిపోయింది. ఆమెకి ఈరోజుతో ఇంక తమ పని ఆఖరు అన్న భావం వచ్చేసింది. మిగిలిన మనిషి సుదీప్తిని ఒడిసి పట్టుకోవడానికి ముందుకొచ్చాడు.. ఈలోపు నీరజ ను పట్టుకున్న వాళ్ళలో కూడా ఒకడు సుదీప్తి దగ్గరకు వచ్చాడు. ఇద్దరూ కలిసి సుదీప్తిని పట్టుకున్నారు. ఆమె గింజుకుంటూ విడిపించుకోవడానికి ప్రయత్నించసాగింది. నీరజ ఇంక ఆశలు వదిలేసింది. సరిగ్గా అప్పుడు వచ్చింది పోలీస్ జీప్. వెంటనే బిలబిలమంటూ ఐదుగురు పోలీసులు దిగారు. ఎస్సై రివాల్వర్ ఎక్కుపెట్టాడు. మిగిలిన వాళ్ళు దుండగులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే పోలీసులు ఎలా వచ్చారన్నది దుండగులకే కాదు.. నీరజ కు కూడా అర్థం కాలేదు.
* * * * *
పోలీస్ స్టేషన్ లో ఫార్మాలిటీస్ పూర్తయ్యాక సుదీప్తి, నీరజ ఇద్దరూ రూమ్ కి చేరుకున్నారు. నీరజ మనసులో వున్న ఎన్నో అనుమానాలకు సుదీప్తి సమాధానం ఇచ్చింది.. “నిన్న నేను అదే ఆటోలో ప్రయాణం చేశాను.
డ్రైవర్ కాకుండా ఆ మరో ఇద్దరు నిన్న కూడా వున్నారు. నాకు మొదట అనుమానం రాలేదు. కానీ ముందు స్టాప్ లో దిగాల్సిన ఆమె నా స్టాప్ వరకూ వచ్చింది. సరిగ్గా అప్పుడే డ్రైవర్ వాళ్లకి ఏదో సూచన ఇస్తున్నట్టు ‘ఇప్పుడు కాదు..’ అన్నట్టు చూపుడు వేలు ఆడిస్తూ సైగ చెయ్యడం నా కంటబడింది. వెనక వున్నవాడు కూడా డ్రైవర్ వంకే చూస్తూ చిన్నగా తలూపినట్టు అనిపించింది. అప్పుడొచ్చింది అనుమానం..! అంటే బహుశా వాళ్ళేదో ప్లాన్ చేసుకున్నారు. ఎలాగూ ముందు స్టాప్ లో దిగిపోతుంది కదా అని ఆమెను ఎక్కించుకుని వుంటారు. ఆమె నా స్టాప్ వరకూ వస్తుందని వాళ్ళు ఊహించలేదు. దాంతో వాళ్ళ ప్లాన్ మిస్సయ్యింది. నువ్వు నిన్న రాకపోవడం కూడా ఒక కారణం కావచ్చు.. అసలు మనిద్దర్నీ వాళ్ళు టార్గెట్ చేసి వుంటారు. ఇద్దరం రోజూ ఈ టైమ్ వస్తూండడం అనేది వాళ్ళు ఎడ్వాంటేజ్ గా తీసుకున్నారు. ఈ రోడ్లో పెద్ద ట్రాఫిక్ వుండదు.. పైగా దారి మళ్ళించి అటువైపు వెళ్తే ఊరి బైటకు వెళ్ళిపోతాం కాబట్టి కిడ్నాప్ లేదా అత్యాచారం సులువుగా కుదురుతుంది అనుకుని ప్లాన్ చేసి వుంటారు. నేను ఆ విషయాన్ని ఊహించి వూరుకోలేదు.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి మొత్తం వివరించాను.
ఎస్సై గారు నేను చెప్పిందంతా శ్రద్ధగా విన్నారు. వాళ్ళు ఎటాక్ చెయ్యడానికి నిశ్చయించుకున్నారు అనే విషయం నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా..? అని అడిగారు. నిజంగా వాళ్ళు అలా చెయ్యడానికి నిశ్చయించుకున్నారా..? లేదా..? అనేది నేను కూడా నిశ్చయంగా చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ సైగల్ని బట్టి నాకలా అన్పించింది. పైగా వాళ్ళను పట్టుకున్నా ఏ కేస్ మీద వాళ్ళను అరెస్ట్ చెయ్యాలా అన్నది ప్రశ్న. అప్పుడు ఎస్సై గారే ఒక మంచి సూచన చెప్పారు. ‘అదే ఆటో మళ్ళీ మీరు ఎక్కడం జరిగితే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చెయ్యండి. మీ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా మేము మిమ్మల్ని ట్రేస్ చేసి వెంటనే మీ దగ్గరకు వస్తాం. వీలయితే గూగుల్ మేప్స్ లో లొకేషన్ కూడా పోస్ట్ చెయ్యండి. అప్పుడు మీ దగ్గరకు రావడం, మిమ్మల్ని ఫాలో చెయ్యడం మాకు మరింత సులువవుతుంది. మీకు ఎప్పటికప్పుడు మెసేజ్ కూడా ఇస్తాం. ఏమీ జరగక పొతే మా దారిన మేము వెళ్ళిపోతాం. ఎలాంటి అనూహ్యమైన సంఘటన ఎదురైనా మేము వెంటనే వాళ్ళని ఎటాక్ చేసి పట్టుకుంటాం. నిజంగా మీరు ధైర్యం చేస్తే ఇది సాధ్యమౌతుంది.. అయితే మీరు మాకు సమాచారం ఇచ్చినా మేము రావడానికి కనీసం కొన్ని నిముషాల సమయం పడుతుంది. ఈలోపు మీరు ధైర్యంగా వుండడం.. విపత్కర పరిస్థితి ని ఎదుర్కోవడానికి సిద్ధంగా వుండడం.. అవసరం. ఇదంతా మీరు చెయ్యగలమనుకుంటే చెప్పండి.. కొన్ని సూచనలు ఇస్తాను.. లేదా ఎందుకీ రిస్కు అనుకుంటే ఆ ఆటో లేదా ఆ డ్రైవర్ కనిపిస్తే అందులో వెళ్ళకుండా వుండండి.. మీరు చెప్పిన వివరాల ప్రకారం మేము ఆ డ్రైవర్ పట్టుకుని రొటీన్ ఎంక్వయిరీ చెయ్యగలం కానీ అంతకు మించి ఏమీ చెయ్యడానికి వుండదు.. ఎందుకంటే మీ ఊహ నిజమో కాదో మనకు తెలీదు కాబట్టి..!’ అన్నారు. నేను మళ్ళీ అదే ఆటోలో వెళ్తే.. వాళ్ళు నిజంగానే మనల్ని టార్గెట్ చేస్తే రిస్కు తీసుకునైనా సరే వాళ్ళని పట్టిస్తానని చెప్పాను. అప్పుడు పెప్పర్ స్ప్రే గురించీ మరికొన్ని రక్షణ విధానాల గురించీ ఆయన వివరించారు. ఆయన సెల్ నెంబర్ కూడా ఇచ్చారు.

మొత్తానికి నేను ఊహించింది నిజం కావడం.. పోలీసులకు ఇన్ఫార్మ్ చెయ్యడం.. అంతా విజయవంతంగా జరిగింది. కాకపోతే నువ్వు ఆ వ్యక్తి కళ్ళల్లోకి స్ప్రే కొట్టడం లో కొంచెం తేడా రావడం వల్ల మనం కొంచెం రిస్కును ఎదుర్కోవలసి వచ్చింది. నేను హైస్కూల్ టైములో కరాటే నేర్చుకుని వుండడం కూడా పనికొచ్చింది.. మొత్తానికి పోలీసులు వచ్చేలోపు దుండగులను ఏదో రకంగా నిలువరించగలిగాం. పోలీసులకు వాళ్ళని పట్టించగలిగాం.
ఈ ప్లాన్ విషయమంతా ముందే చెప్తే నువ్వు బెదిరిపోతావని చెప్పలేదు.. అంతే.. అదీ జరిగిన కథ..” వివరించింది సుదీప్తి.
నీరజ ఇదంతా విని నిజంగానే ఆశ్చర్యపోయింది. సుదీప్తి ధైర్యానికి ఎంతగానో మెచ్చుకుంది.
రెండు రోజుల తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన పోలీసులు సుదీప్తిని, నీరజను కూడా ఆహ్వానించారు. విలేకర్లకు ఎస్సై గారు విషయం చెబుతూ.. “నేను చెప్పిన పథకానికి ఒప్పుకుని ధైర్యంగా దుండగుల్ని పట్టించిన సుదీప్తి మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఇదంతా నావల్ల కాదు అంటే మేము చెయ్యగలిగింది ఏమీ లేదు. అసలు ఇటువంటి సంఘటన ఎదురైతే స్టేషన్ కు వచ్చి చెప్పి మా దృష్టికి తీసుకువచ్చేవారు చాలా తక్కువ. ఆ రూట్లో రావడం మానేయడమో లేక అలాంటి ఆటోలకు దూరంగా వుండడమో చేస్తారు. కానీ సుదీప్తి ఆ విధంగా చెయ్యకుండా విషయం మాకు చెప్పి మాతో సహకరించి ధైర్యం, సమయస్ఫూర్తి చూపించి వాళ్ళని పట్టించింది. నిజానికి ఆ రూట్లో రోజూ వస్తున్న వీళ్ళని చూసి దుండగులు ఒక పథకం వేసుకున్నారు. కానీ అక్కడ అమలు జరిగింది మాత్రం వాళ్ళ ఎత్తుకు పై ఎత్తుగా మేము వేసిన పథకం..! ఈ విషయంలో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి దుండగుల్ని పట్టించిన సుదీప్తిని అభినందిస్తూ పోలీస్ డిపార్ట్ మెంట్ తరపున మీ అందరి ఎదుట చిరుసత్కారాన్ని అందజేస్తున్నాము..” అంటూ ఆమెకు బొకే అందజేసి ఒక చెక్ ను కవర్లో పెట్టి అందించారు.
తర్వాత సుదీప్తి మాట్లాడింది.. “ముందురోజు వాళ్ళ ప్రవర్తనను బట్టి నేను ఊహించింది నిజమే అయ్యింది. అయితే ఇదంతా ఎస్సై గారికి చెప్పినప్పుడు ఆయన నా మాటల్ని కొట్టిపారేయకుండా మళ్ళీ వాళ్ళు ఎదురైతే ఏం చెయ్యాలో.. వాళ్ళని ఎలా పట్టించవచ్చో ఒక మంచి పథకం చెప్పి వాళ్ళ ఆట కట్టించడానికి నాకు మార్గం చూపించారు. అలాంటప్పుడు నేను భయపడితే వాళ్ళు చట్టం చేతి నుంచి తప్పించుకుంటారు. మాకు కాకపోయినా మరెవరికైనా వాళ్ళనుంచి ప్రమాదం ఎదురుకావచ్చు.. అదే నేను ధైర్యం చేసి వాళ్ళని పట్టిస్తే ప్రమాదకరమైన ఆ దోషుల బారినుంచి మరెవరికీ ఇటువంటి అపాయం జరగకుండా కాపాడినట్టవుతుంది.. అందుకే నేను ఈ పథకానికి ఒప్పుకున్నాను.. ఎస్సై గారు మిగిలిన సిబ్బంది సహకారంతో విజయవంతంగా వాళ్ళని పట్టించాను..” అని చెప్పింది. ఆమె మాట్లాడడం పూర్తి కాగానే అక్కడ ఉన్నవారందరూ చప్పట్లు కొడుతూ తమ అభినందనలను ఆమెకు తెలియజేశారు.
@@@ ———- @@@@@ ———- @@@

4 thoughts on “అర్చన కథల పోటి – పథకం

  1. కరక్టే. అమ్మాయిలందరికీ ఈ awareness అవసరం. బావుంది కధ.

  2. కరక్టే. అమ్మాయిలందరికీ ఈ అవసరం. బావుంది కధ.

Leave a Reply to Gauthami Cancel reply

Your email address will not be published. Required fields are marked *