March 28, 2024

అర్చన కథల పోటి – వాళ్ళూ మనుషులే

రచన: జి.యస్.లక్ష్మి

సాయంత్రం అయిదుగంటలయింది. ఆఫీసులోని తన సీట్లోంచి లేచి, పక్కనున్న షోల్డర్ బేగ్ అందుకుంటున్న వేణు “డాడీస్ పెట్…స్వీటీ ఈజ్ ద బెస్ట్” అంటూ తన యెనిమిదేళ్ళ కూతురు స్వీటీ పాడినపాట తో పెట్టుకున్న రింగ్ టోన్ తో మొబైల్ మోగడంతో దాన్ని తీసేడు. వెంటనే భార్య వనజ గొంతు “మన స్వీటీ స్కూల్లో లేదుటండీ. స్కూల్ నించి ఫోన్ వచ్చింది.” అంటూ ఆదుర్దాగా వినిపించింది.
ఒక్కసారి అతని బుర్ర పనిచెయ్యడం మానేసింది. కాస్త తేరుకుని, “లేకపోవడం యేంటీ! పొద్దున్నే మనవే కదా ఆటో యెక్కించేం..” అన్నాడు.
“ఔనండీ. రోజంతా స్కూల్లోనే వుందిట. సాయంత్రం స్కూల్ వదిలేక ఆటో ఎక్కడానికొచ్చి, స్కూల్ బేగ్ ఆటోలో పెట్టి అతన్ని కాసేపు ఆగమని స్కూల్ పక్కనున్న షాప్ లో మేప్ కొనుక్కుందుకు వెళ్ళిందిట. ఎంతకీ రాకపోయేటప్పటికి ఆటో అతను షాప్ కి వెడితే అక్కడ లేదుట. షాపతన్నిఅడిగితే అతనేమీ చెప్పలేకపోయేడుట. ఆటో అబ్బాయి స్కూల్ లోపలికి వెళ్ళి ఎదురుకుండా కనపడిన టీచర్ తో ఈ విషయం చెపితే ఆవిడ ప్రిన్సిపల్ కి చెప్పిందిట. అన్ని రూమ్ లూ, గ్రౌండూ అంతా వెతికి, స్వీటీ కనపడకపోతే ఆ ప్రిన్సిపల్ ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పింది. నేను ఇప్పుడు స్కూల్ కే వెడుతున్నాను. మీరూ అటే వచ్చెయ్యండి..” ఒకవైపు దుఃఖాన్ని ఆపుకుంటూ సంగతి వేణూకి చెప్పేసేక ఒక్కసారిగా గొల్లుమని యేడ్చేసింది వనజ ఫోన్ లోనే.
వేణూ ఖంగారుపడిపోయేడు. “వనూ, వనూ.. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్.. నువ్వలా వచ్చెయ్యి. నేనిలా వస్తాను. ఏమీకాదు.. అక్కడే ఎక్కడో వుంటుంది. ఖంగారుపడకు..” అంటూ బైటకొచ్చి, కారుని స్వీటీ స్కూల్ వైపు పరుగెత్తించేడు.
అసలే ఆఫీసులు, స్కూళ్ళూ, కాలేజీలూ వదిలేవేళ. హైదరాబాదు మహానగరంలో యే సిగ్నల్ దగ్గర చూసినా వాహనాల వరసలే. వేణూకి మనసు మనసులో లేదు. స్వీటీ స్కూల్లో లేకపోవడమేంటి! మేప్ కొనుక్కుందుకు స్కూల్ పక్కనున్న షాప్ కి వెళ్ళిందిట. ఆటో అతనికి చెప్పే వెళ్ళిందిట. స్వీటీ కది అలవాటే. ఇంటిదగ్గర చేసుకురమ్మని స్కూల్లో రోజూ యేదో ప్రాజెక్ట్ యిస్తూనే వుంటారు. దానికి కావల్సిన డ్రాయింగ్ షీట్సు, మేప్ లూ లాంటివి మళ్ళీ ఇంటికొచ్చేక కొనుక్కుందుకు పనికట్టుకుని వెళ్ళాలని తనూ, వనజా యేకంగా స్కూల్ పక్కనున్న షాప్ లో కొనుక్కుని, ఆటోలో యింటికొచ్చెయ్యమని చెప్పేరు. అసలా షాప్ కూడా స్కూల్లో పిల్లలకోసమే పెట్టేరు. వాళ్లక్కావల్సినవే వుంటాయందులో. మరక్కడ లేకుండా యెక్కడికి వెళ్ళినట్టూ..
దాదాపు అరగంట దాటాక స్వీటీ స్కూల్ కి దగ్గర్లో వున్న జంక్షన్ దగ్గరికి వచ్చేడతను.
సిగ్నల్ యెప్పుడొస్తుందా అని చూస్తూ స్వీటి గురించి పరిపరివిధాల ఆలోచిస్తున్న వేణూ ఎయిర్ కండిషన్డ్ కార్లో అద్దాలన్నీ బిగించేసున్న కారు అద్దాలమీద ‘టక్ టక్..’ అంటూ చప్పుడయింది. ఒక్కసారి ఈ లోకంలో కొచ్చి అటువైపు చూసేడు. బిచ్చగాడొకడు తన చేతిలోని అల్యూమినియం బొచ్చెతో వేణూ కారు అద్దాలమీద కొడుతున్నాడు. చిర్రెత్తుకొచ్చింది వేణూకి. “ఛీ.. అసలు వీళ్ళందర్నీ లైన్ గా పెట్టి షూట్ చేసెయ్యాలి..” అనుకుంటూ అద్దం దించి కోపంగా వాడివైపు చూసేడు వేణు. ఆ బిచ్చగాడు వేణూ చూపుల్ని పట్టించుకోకుండా వనజ కూర్చునే పక్కసీటువైపు చూసేడు. కోపం తారస్థాయికి చేరుకుంది వేణూకి. వెధవ..వెధవాని. వనజ యిచ్చే పేకట్లకోసం చూస్తున్నాడు. తేరగా తిండి దొరుకుతోంది వనజ వల్ల.. మరి చూడకేం చేస్తాడూ! అయినా ఈ వనజ కూడా ఇంతే.. ఈ వెధవల్ని పట్టించుకోవద్దని ఎంత చెప్పినా వినదు. అదేదో అప్పున్నట్టు ప్రతివారం వీళ్ళకోసం ప్రత్యేకంగా వండించి మరీ వీళ్లకి తినడానికి పేకట్లు అందిస్తుంది. ఎన్నిసార్లో చెప్పేడు వేణూ వనజకి, అంతగా కావాలంటే పదో పరకో డబ్బులు పడెయ్యి వాళ్లకి, అంతేకానీ ఇలా ఏదో పెళ్ళివారికి పెట్టినట్టు వండించి, పేకట్లందివ్వడం యేంటని.. అబ్బే.. వనజ వాదన వనజదే. అలా డబ్బులివ్వడం మంచిది కాదంటుంది. అడుక్కునేవాళ్లకి డబ్బులివ్వడం మంచిదికాదనీ, వాళ్లలో చాలామందికి బాంకుల్లో లక్షలున్నాయనీ, అందుకని నిజంగా ఆకలిగొన్నవారి ఆకలి తీర్చాలన్న ఉద్దేశ్యం వున్నవాళ్ళు వాళ్ల బొచ్చెల్లో డబ్బులు కాకుండా బ్రెడ్ కానీ, బిస్కట్ పేకెట్ కానీ ఇవ్వండని ఎవరో వాట్సప్ లో మెసేజ్ పెట్టేరుట.
అది చదివినప్పట్నించీ వనజ బిచ్చగాళ్లకి డబ్బులివ్వడం మానేసింది. వారానికోరోజు శనివారం ఇద్దరి ఆఫీసులకీ శెలవురోజు కనక ఆ రోజు స్వీటీని ఇద్దరూ కలిసి కారులో స్కూల్ కి తీసికెళ్ళి తీసుకొస్తారు. అలా శనివారం రోజు వనజ ఇంట్లో పొంగల్ కానీ, పులిహార కానీ ఏదోకటి వండించి, పేకెట్లు కట్టించి దార్లో చెయిచాపిన బిచ్చగాళ్లకి యివ్వడం మొదలెట్టింది. తల్లిని చూసి స్వీటీ కూడా ఉత్సాహంగా “అమ్మా, నేనూ యిస్తాను…నేనూ యిస్తాను.. .” అంటూ కొంతమందికి తను యిచ్చేది. ఇదంతా చాలా చిరాగ్గా వుండేది వేణూకి. ఆ అలగా జనాన్ని స్వీటీ ఎక్కడ తాకుతుందోనని వేణూకి టెన్షన్. ఇదంతా గిర్రున రీలులా కళ్ళముందు తిరిగేసరికి ఒక్కసారి స్వీటీ యేమయిందో నన్న గాభరా మళ్ళీ మొదలైంది వేణూలో. తనలో ఆవేశాన్ని తగ్గించుకుందుకు కారు దిగి వాడిని నాలుగు దెబ్బలేద్దామనుకున్న వేణూ సిగ్నల్ పడడంతో కారును స్కూల్ వైపు పరిగెత్తించేడు.
అక్కణ్ణించి స్కూల్ కి వెళ్ళేదాకా వేణూకి స్వీటీ యేమయిందోనన్న ఆలోచనలే. స్కూల్ గేట్ దగ్గరే నిలబడుంది వనజ. ఆమె పక్కన ప్రిన్సిపల్, ఇద్దరు ముగ్గురు టీచర్లూ, ఆటో అబ్బాయీ వున్నారు. స్వీటీతోపాటు ఆటోలో తీసికెళ్ళే మిగతా పిల్లల్ని ఆ ఆటోఅబ్బాయే తెలిసున్న వేరే ఆటోలో పంపించి, అతను స్కూల్ దగ్గరే వుండిపోయేడు. వేణుని చూడగానే వనజ దుఃఖం ఆపుకోలేకపోయింది.
అప్పటిదాకా చెప్పిందే మళ్ళీ అందరూ చెప్పేరు వేణూకి. పోలీస్ కి కూడా రిపోర్ట్ చేసామనీ, కాసేపట్లో వస్తారనీ చెప్పేరు. వేణూ కయితే అసలు బుర్ర ఆలోచించడం మానేసింది.
“అన్ని రూములూ చూసేరా!, బాత్ రూములూ, గ్రౌండూ అంతా వెతికేరా! యే ఫ్రెండింటికయినా వెళ్ళిందేమో కనుక్కున్నారా!” అన్నీ జరిగాయని తెలిసినా ఇంకా యేదో ఆశ వేణూచేత అడిగించింది.
“షాప్ వాడిక్కూడా యేమీ తెలీదా!” మళ్ళీ అడిగేడు.
“అందరు పిల్లలూ యూనిఫామ్ లో ఒక్కలాగే వుంటారు. స్కూల్ వదలగానే ఒక్కసారి బోల్డుమంది పిల్లలు వాడి షాప్ మీద పడిపోతారు. మొహాలు చూసే టైమెక్కడుంటుంది.. వాళ్లడిగింది చెవుల్తో విని యివ్వడం, వాళ్ల చేతుల్లో డబ్బులు తీసుకోవడం…అంతే అతను చేసేది.“ టీచర్ వివరించింది.
“ఆ షాప్ యెటుంది.” అంటూ ఆటో అబ్బాయితో కలిసి అటు వెడుతుంటే వెనకాల వనజ కూడా వెళ్ళింది. స్కూల్ వదిలి చాలా సేపవడంతో అక్కడంతా ప్రశాంతంగా వుంది. షాపువాడు వీళ్ళని చూసి బైటకి వచ్చేడు. వేణూ మొబైల్ లో వున్న స్వీటీ ఫొటో చూపించగానే “ఇందాక ఆ అమ్మ కూడా చూపించేరండీ. కానీ ఈ పాప వచ్చినట్టు నాకు గుర్తు రావటంలేదండీ..” అన్నాడు షాపతను.
ఇంతలో పోలీస్ వచ్చారు. వాళ్ల పధ్ధతిలో వాళ్ళు ఎంక్వయరీలు మొదలెట్టారు. వనజని అక్కడున్నవాళ్ళెవరూ పట్టుకోలేకపోతున్నారు. “స్వీటీ అండీ..ఏ బండి కింద పడిందో…” బెంబేలెత్తిపోయింది.
“ఖంగారు పడకండమ్మా.. ఇక్కడ యే యాక్సిడెంటూ జరగలేదు.”
పోలీసన్న మాటలు విని “అయితే యే దొంగవెధవలు ఎత్తుకుపోయేరో..” అంటూనే గొల్లుమంది. అసలే మతిపోయినట్టున్న వేణూకి వనజ మాట వినగానే గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. మొదలు నరికిన చెట్టులా కూలబడిపోయేడు. తన చిట్టితల్లిని యే వెధవలు యెత్తుకుపోయేరో.. వాళ్ళు తన బంగారాన్ని కుంటిదాన్నో గుడ్డిదాన్నో చేసేస్తారేమో.. ఇలాంటివన్నీ తను వింటూనే వున్నాడు. బిచ్చగాళ్ళులా రోడ్లమీద తిరుగుతూ ఇలా పిల్లల్ని యెత్తుకుపోయి అమ్మెయ్యడమో, లేకపోతే కుంటివాళ్లనో గుడ్డివాళ్లనో చేసి అడుక్కోడానికి పంపించడమో చేస్తారని తెలిసిన వేణూ గుండెలు అవిసిపోయేయి. వనజని పట్టుకోడం అక్కడెవరివల్లా అసలు కావటంలేదు.
ఇంతలో అక్కడే వున్న వేణూ కారు అద్దాలమీద ‘టక్…టక్..’ అంటూ చప్పుడు వినిపించేసరికి అందరి దృష్టీ అటు మళ్ళింది. వేణూ కారు కిటికీ అద్దాలమీద చప్పుడు చేస్తూ, ఇందాక వేణూకి చిరాకు తెప్పించిన బిచ్చగాడు ఆ అద్దాల్లోంచి కారులోపలికి తొంగి చూస్తున్నాడు. వేణూ యింక కోపం ఆపుకోలేకపోయేడు.
“రాస్కెల్.. ఏం చేసేవురా నా కూతుర్నీ…” అంటూ వేళ్ళాడిపోతున్న వాడి చొక్కా పట్టుకుని ఒక్క గుంజు గుంజేడు. పోలీసులు వేణూ వెనకాలే గబగబా వెళ్ళి వాణ్ణి పెడరెక్కలు విరిచి పట్టుకుని నిలబడ్డారు. అక్కడున్న అందరూ పరిగెడుతున్నట్టే కారు దగ్గరికి వచ్చేసేరు. వాళ్లలో వనజని చూడగానే ఆ బిచ్చగాడు “అమ్మా… అమ్మా… పాప ..పాప..” అంటూ ఒకవైపునించి దెబ్బలు తప్పించుకుంటూ అరుస్తున్నాడు.
“అవును.. పాప..పాప.. నీకు కనపడిందా!.. నువ్వు చూసేవా!” ఒక్క ఉదుటన అతని ముందుకెళ్ళి అడిగింది వనజ ఆత్రంగా..
“పాపని…పాపని ఆళ్ళు తీసికెళ్ళేరమ్మా.. అది చెపుదామనే ఇందాక ఈ కారు గురుతు పెట్టుకుని ఒచ్చేను..”
“వాళ్లంటే ఎవరు..!” ఇనస్పెక్టర్ ముందుకొచ్చేడు.
“గంగులుగాడి గాంగయ్యా.. ఆళ్ళు పిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మేస్తుంటారు. ఈ పాప, ఆ అమ్మ మాకు కడుపు కింత పెడుతుంటారయ్యా.. అందుకే పాపని ఆళ్ల దగ్గర చూడగానే ఒదిలెయ్యమని ఎంత సెప్పినా ఇనలేదయ్యా.. ఆ మాట ఈ అమ్మకి సెబుదామంటే ఆళెక్కడుంటారో తెల్దు గదయ్యా.. అందుకే అక్కడే ఆ కారుకోసం చూస్తూ కూసున్నానయ్యా.. బాబుగోరు నా మాట ఇనిపించుకోలేదు. ఆరెనకాల పరిగెడుతూ ఈడ కొచ్చేనయ్యా..”
“ఎక్కడుంటాడా గంగులు!” ఒక్కసారి ఆ బిచ్చగాడి చేతులు పట్టుకుని వూపేస్తూ అడిగేడు వేణూ ఆత్రంగా.
“మునిసిపల్ పార్క్ పక్కన పెద్దబిల్డింగయ్యా..”
“పద.. చూపించు..”
పోలీసులు జీపులో, వనజ వేణూ కార్లో బిచ్చగాణ్ణి ఎక్కించుకుని బయల్దేరేరు. సరిగ్గా వీళ్ళు వెళ్ళేసరికి గంగులు గాంగంతా అక్కడే వుండి, రెడ్ హాండెడ్ గా పట్టుబడ్డారు. స్వీటీని చూడగానే వనజ, వేణూల గుండెల్లో భారమంతా దిగిపోయింది. పరిగెత్తుకొచ్చి అమ్మానాన్నల్ని పట్టేసుకున్న స్వీటీని చూసి ఆ బిచ్చగాడు కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకున్నాడు. పాపని ఎత్తుకుని వేణూ, వనజా ఆ బిచ్చగాడి ముందు నిలబడ్దారు. అతనికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో వాళ్లకే అర్ధంకావటంలేదు.
ఎంతో పెద్ద ప్రమాదం నుంచి స్వీటీని రక్షించిన అతనికి యేమిచ్చినా తక్కువే అనిపించింది వాళ్లకి. వేణూ స్వీటీని వనజకి అందించి, “నీ ఋణం ఎన్ని జన్మలైనా తీర్చుకోలేం. చెప్పు, నీకేం కావాలి.. ఏదడిగినా యిస్తాను..” అన్నాడు గొంతు పూడుకుపోతుంటే..
“అయ్యా, అవన్నీ నాకు తెలీవయ్యా. నా కడుపాకలి చూసి ఆ అమ్మ ఇంత బువ్వెట్టింది. ఒకొక్కసారైతే ఆ అమ్మ పెట్టిన బువ్వ వల్లే నా పాణం కూడా నిలబడేది. అసుమంటి అమ్మకి అన్నేయం జరుగుతుంటే సూస్తా ఉండలేకపోయేనయ్యా.. అంతే నేను సేసింది. ఆ అమ్మ సేసినదానికన్నా ఇదేమంత ఎక్కువకాదు బాబూ..” అంటూ వేణూకీ, వనజకీ దణ్ణం పెడుతూ ఆ బిచ్చగాడు నెమ్మదిగా అక్కణ్ణించి వెళ్ళిపోయేడు.

19 thoughts on “అర్చన కథల పోటి – వాళ్ళూ మనుషులే

  1. చాల మంచి థీం తో వ్రాశారండి.
    మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు… ఒక్కసారి గొల్లుమంది, లాంటి మాటలు ఇంకా వాడుతూండటాం ఆశ్చర్యంగా ఉంది. వాడకూడదని కాదు..

  2. లక్ష్మి గారు, కధ చాలా బాగుంది. పెట్టిన చేతిని, ఆ మనిషిని మరచిపోయే కృతఘ్నులు చాలా తక్కువమంది ఉంటారు. పాప సురక్షం గా దొరకడం హాయినిచ్చింది. అభినందనలు

  3. Please accept my congratulations Mrs Lakshmi Garu This story is heart touching one My eyes are filled with water , while I am reading this story. I think, ur pen is filled with hellarios and heart touching ink We expect more and more from ur pen

  4. నిరు’పేద’లలో ఉండే గుణ’సంపన్నులకు’ మీ కథలోని బిచ్చగాడు ఒక చక్కటి ఉదాహరణ. కథ చాలా బాగుందండీ!

  5. కధ చాలా చాలా బాగుంది అక్కా… బిచ్చగాళ్ళని ఈసడించుకునే వారికి కళ్ళు తెరిపించే కధ. పట్టెడు మెతుకులు పెట్టిన పుణ్యం తిరిగి స్వీటీని వాళ్ళకు దక్కేలా చేసింది. ‘దైవం మానుష రూపేణా’ అని అంటారు కదా!

    1. అవును కదా గిరిజా.. కథ నచ్చినందుకు ధన్యవాదాలు..

  6. ఏంటి మేడం, ఇలా ఏడిపించేసారు నన్ను?
    సూపర్. బావుంది.

  7. సరదాగా హాస్యంగా ఉండే జి.ఎస్. లక్ష్మి గారి కథల్లా కాకుండా బిన్నంగా ఉత్ఖంఠభరితంగా రాసిన కథ ఇది. డబ్బులివ్వకూడదనేది కూడా కరెక్ట్ కాదు. మహా ఇస్తే పదిమందిలో ఒకరిస్తారు అదిగూడా అయిదో పదో కి మించి ఎవరూ వేయరు. దానమివ్వాల్సిన చోట ఎలా ఇవ్వాలో అలానే ఇవ్వాలి. అసలు మానవీయత స్వతహాగా ఉండాలి.

  8. కధ బాగుంది. మనం చేసిన మేలు ఎప్పుడూ మనకి మంచే చేస్తుంది

  9. సుబ్బలక్ష్మి గారూ , ఉత్కంటతో చదివించారు. స్వీటీ కి ఏమైందో నని గాబరా అయ్యేంత గా కాఖరాల వెంట పరుగులు తీశాయ్ నాకళ్ళు. ! అమ్మ సుఖాంతం చేసి రక్షించారు. ఇప్పుడు జరుగుతున్న కథ. జీవితం లో ఎవరు ఎప్పుడు, ఎలా ఉపయోగపదతారో తెలీదు. అభినందనలు బహుమతి కి అర్హమైన కథను అందించినందుకు

Leave a Reply to పి.యస్.యమ్. లక్ష్మి Cancel reply

Your email address will not be published. Required fields are marked *