April 19, 2024

చంద్రోదయం – 3

రచన: మన్నెం శారద

సారధి చుట్టూ చూసేడు.
ఎదురుగా పది అడుగుల దూరంలొ బైక్‌కి జేరబడి.. ఓ యువకుడు అతన్నే పరీక్షగా చూస్తున్నాడు. అతను.. అతను నాల్గురోజుల క్రితం తనకి హోటల్లో బిల్లు పే చేసిన యువకుడు.
సారధి సిగ్గుతో లేచి నిలబడ్డాడు. అతను దగ్గరగా వస్తున్నాడు.
అనుకోని విధంగా అతను సారధి భుజాలమీద చేతులుంచి ఆప్యాయంగా నొక్కాడు.
“ఐ కెన్ అండర్‌స్టాండ్ యువర్ ప్రాబ్లం. కాని చావు దానికి పరిష్కారం కాదు” అన్నాడతను.
సారధి మాట్లాడలేదు.
“పద” అతను చనువుగా సారధి చేయి పుచ్చుకొని బైక్ దగ్గరకి తీసికెళ్ళేడు.
సారధి మాట్లాడకుండా వెనుక కూర్చున్నాడు.
బైక్ వాల్తేరు అప్‌లాండ్ లో ఈ అందమైన బంగళా ముందు ఆగింది. సారధిని రమ్మని సైగ చేసి మేడ మీదకి దారి తీసేడు.
సారధి అనుసరించేడు.
అతను రూం తాళం తీస్తుంటే సారధి అప్రయత్నంగా అక్కడున్న నేమ్ ప్లేట్ చదివేడు.
శేఖర్ బి.ఇ. (సివిల్)
శేఖర్ సారధిని లోపలికి ఆహ్వానించాడు.
లోపల రెండు గదులున్నాయి. గదుల్లో సామాను ఖరీదుగానే వుంది. అటాచ్‌డ్ బాత్రూం చూపించి “స్నానం చెయ్యండి” అన్నాడు శేఖర్.
“వద్దండి నేను వెళ్ళిపోతాను” బెరుకుగా అన్నాడు సారధి.
“మిస్టర్. మీ పేరు తెలియదు. నాకు చెప్పినట్లు వినకపోతే చాలా కోపం వస్తుంది. ముందు వెళ్లి తల మీద స్నానం చెయ్యండి. మీతో నేను చాలా మాట్లాడాలి” శేఖర్ సీరియస్‌గా అన్నాడు.
సారధి మారు మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళేడూ. షవర్ బాత్ చేస్తుంటే సారధి వంట్లోని నరాలన్నీ చల్లబడుతున్నట్లనిపించసాగింది. స్నానం వద్దన్న అతను వళ్లు మరిచి అదే పనిగా స్నానం చేస్తూనే వున్నాడు.
బాత్రూం తలుపు టకటక లాడింది.
సారధి తలుపు తీసేడు.
“మిస్టర్! టాంకులో నీళ్లయిపోతే ఇల్లుగలవాళ్లు వూరుకోరు. ఇక చాలించి బయటకు రండి” అతను తలుపు సందులోంచి లుంగీ అందించేడు.
సారధి లుంగీ అందుకుని కట్టుకుని బయటికి వచ్చేడు. వచ్చేటప్పటికే శేఖర్ డైనింగ్ టేబుల్ మీద క్యారియర్ విప్పి భోజనం వడ్డించేడు.
శేఖర్ భోజనాల దగర ఏం మాట్లాడలేదు. సారధిని క్రీగంట గమనిస్తూనే తింటున్నాడు. సారధి భోజనం అయిందనిపించేడు. ఈ “శేఖర్” అనే వ్యక్తి తనని అడ్డుకోకపోతే తనెపాటికి తునాతునకలయి ధూళిలో కలిసిపోయి వుండేవాడు.
గుర్తుతెలియని తన శవం కన్నీళ్లకు కూడా నోచుకోకుండా నక్కల పాలయ్యేది. ఇంటి దగ్గర తన రాక కోసం తన వాళ్లు ఎదురు చూసి చూసి ఏడ్చేవాళ్ళు.
వాళ్లకి ఏడుపు క్రొత్త కాదు.
కొందరు కేవలం ఏడవటానికే పుడతారు. పుట్టు దరిద్రంలో పుట్టినవాళ్లకి కేవలం పొట్ట ఎలా పోసుకోవాలన్న బాధ తప్ప మరోటి ఆలోచించేందుకు కుదరదు.
ఇంటికి పెద్దవాడుగా పుట్టటం, ఆపైన తండ్రి చనిపోవటం, తన వెనుక పుట్టినవాళ్ళు అందరూ ఆడపిల్లలు కావటం , తమకంటూ ఓ చిన్న పెంకుటిల్లు తప్ప మరొకటి లేకపోవటం, ఇవన్నీ తను పుడుతూనే మోసుకొచ్చిన శాపాలు.
ఉన్నదంతా ఊడ్చి తనకు డిగ్రీ చెప్పించి, మిగతా వాళ్లకి ఒంటినిండా గుడ్డ, కడుపునిండా తిండి యివ్వలేకపోయినా, తనకి ఫీజులు కట్టి తనకో ఉద్యోగం వస్తే గంజయినా త్రాగొచ్చని వాళ్లు ఎదురు చూడటం, వాళ్ళు చేసుకొన్న పాపాలు.
వాళ్ల ఆశలు తీర్చాలని తను అయిదేళ్లనుంచీ ప్రయత్నం చేస్తూనే వున్నాడు. ఎన్నో ఇంటర్వ్యూలకి తిరిగేడు.
కేవల అప్లికేషన్ ఫారాలకే అప్పు చేసి ఎంతో తగలబెట్టాడు. ఇంటి పరిస్థితులు తల్లక్రిందులయ్యేయి.
తన అసమర్ధత చూసి తల్లి మంచం పట్టింది.
ఇటు చదువు, అటు డబ్బు లేని స్థితిలో చెల్లెళ్ళు కొరగాకుండా పడి వున్నారు. ఏనాడొ పూర్వీకులిచ్చిన యిల్లు, ఏనాడూ రిపేరుకు నోచుకోకపోయినా ఇన్నాళ్లూ తమని కాపడుతూ గట్టిగానే ఉండేది. కాని అది కూడా మార్వాడీ అప్పుతో మరింక నిలవలేనట్లు క్రుంగిపోయింది. బీటలు వారిన గోడలు, వంగిపోయిన వాసాలు తనని హేళన చేస్తుంటే యింక ఆ యింటికి ఏ ముఖం పెట్టుకుని వెళ్లగలడు.
ఈసారి తనకు ఉద్యోగం రాలేదని ఎలా చెప్పుకోగలడు. ఆ క్షణంలో తన ప్రాణాన్ని కాపాడినందుకు శేఖర్ని అభినందించాలా/ దుయ్యబట్టాలా?
సారధి మానసిక స్థితి అయోమయంగా వుంది
*****
దూరంగా వెన్నెలలో సముద్రం పాలవిరుగుడులా వుంది. చలిగాలికి ముడుచుకొన్నట్లు కూర్చున్నాడు సారధి. సారధి కథ విన్న శేఖర్ మౌనంగా వుండిపోయేడు. శేఖర్ డబ్బులో పుట్టేడు. డబ్బులో పెరిగేడు. తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కొడుకుగా అపురూపంగా పెరిగేడు. డబ్బుని ఏయే రూపాల్లో ఎక్కడెక్కడ ఎలా మరోకంటికి తెలియకుండా దాచాలో తెలియక తికమకపడే తండ్రి కష్టాలే తనకు తెలుసు. కానీ, యిలా తిండికి కూడా అష్టకష్టాలు పడే బ్రతుకులుంటాయని, అందుకోసం అత్యంత ప్రీతిపాత్రమైన ప్రాణాలు కూడా తీసుకునే అభాగ్యజీవులుంటారని అతనికి తెలియనే తెలియదు.
కేవలం అతను సరదాగా చదివేడు. సరదాగానే ఉద్యోగం చేస్తున్నాడు. నిజానికి అతని జీతం అతనికి ఒక్కరోజు ఖర్చుకి కూడా రాదు. వారానికొకసారి ఇంటికి ఫోన్ చేసి వేలువేలు తెప్పించుకుంటాడు. పర్స్‌లో వేయి రూపాయలకి ఒక్క పైసా తగ్గినా డబ్బులేనట్లు, బ్రతకలేనట్లు విలవిలలాడిపోతాడు. అలాగని అతనికి దురలవాట్లు లేవు. సినిమాలు, సిగరెట్లు, స్నేహితులు మాత్రమే అతని వ్యసనాలు. డబ్బుని మంచినీళ్లకన్నా తేలిగ్గా అతని చుట్టూ స్నేహితులు చేరటం పెద్ద వింతేం కాదు.
డబ్బుని దుబారా చేస్తున్నాడని యింటికి వెళ్ళినప్పుడల్లా అతని తండ్రి గంగాధరంగారు కోప్పడుతూనే వుంటారు. కాని ఆ మందలింపులో కోపంకన్నా ఆప్యాయతే ఎక్కువ.
డబ్బుని దుబారా చేస్తున్నాడని యింటికి వెళ్లినప్పుడల్లా అతని తండ్రి గంగాధరంగారు కోప్పడుతూనె వుంటారు. కాని ఆ మందలింపులో కోపంకన్నా ఆప్యాయతే ఎక్కువ.
ఆ మాటలు విన్నప్పుడు అతని తల్లి శాంతమ్మగారు తెగ బాధపడిపోతుంది. భర్తమీద విరుచుకుపడుతుంది.
“మన సంపాదన వాడిగ్గాక ఎవరికి? మనం పట్టుకుపోతామా? ఈసారి వాడొచ్చినప్పుడు డబ్బు ప్రసక్తి ఎత్తితే మంచిది కాదు.”
ఆవిడ మాటలకి గంగాధరంగారు నవ్వుకొంటారు. ఒకరికి తెలియకుండా మరొకరు వేలకు వేలు కొడుకు జేబులో కుక్కి పంపుతుంటారు.
శేఖర్ సారధి పరిస్థితులకి విస్తుపోతున్నాడు. తన స్నేహితులలో కూడా ఇంతలా డబ్బు కోసం అవస్థలు పడుతున్నవారు వున్నట్టు లేరు.
కష్టమంటే తెలియకుండా సున్నితంగా పెరిగిన అతని హృదయం ద్రవించి ప్రవహించసాగింది.
సారధి పైకి లేచాడు.
“మీరు నా ప్రాణాల్ని రక్షించేరు. అందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకోలేను. ఎందుకంటే నెను కష్టాలతో విసిగి నాలాంటివాడు దేశానికి దండగని, నా చావువల్ల మరొకరికి తిండిగింజలు మిగులుతాయని పరోక్షంగా, నేనిలా నా దేశంలో ఒకరికి మేలు చేసినవాడినవుతానని అనుకున్నాను. మీరు నా ఆశ తీరకుండా చేసేరు. ఇప్పుడయినా నేను తిరిగి మళ్ళీ చావొచ్చు కానీ, ఆ తెగింపు, ఆ మొండితనం ప్రతిక్షణం రావు కదా. ఇంతకూ నేను దురదృష్టవంతుణ్ణి. మీరు నాకు రెండుసార్లు తిండిపెట్టి ఆదరించేరు. అందుకు మాత్రం నా కృతజ్ఞతలు.
శేఖర్ ఆందోళనగా చూసేడు.
“ఎక్కడికి వెళతారు?”
సారధి నిర్లిప్తంగా నవ్వేడు. “ఇంటికి”
“రేపు వెళ్దురుగాని. ఈ రోజుకి ఇక్కడే వుండండి”
“వద్దండి. నాలాంటి దురదృష్టవంతుడు యిక్కడ వుంటే మీకు కూడా అనుకోని కష్టాలు ముంచుకు రావొచ్చు. నన్ను వెళ్లనివ్వండి”
“అబ్బా! మీకు అంత నిరాశ పనికి రాదు. రేపు మాట్లాడుకుందాం. ఈ రాత్రికి మాత్రం మిమ్మల్ని వదలను. ఒక ప్రాణాన్ని కాపాడింది, తిరిగి అంత తేలిగ్గా పోనివ్వడానికి కాదు”
“నేనింక చావను లెండీ”సారధి నీరసంగా నవ్వేడు
“ప్లీజ్!” శేఖర్ అర్ధింపుకి సారధి మెత్తబడిపోయేడు.
శేఖర్ మొట్టమొదటిసారిగా సారధిలాంటి అభాగ్యజీవుల గురించి ఆలోచించటం మొదలుపెట్టేడు.
ఇన్నాళ్లూ తను కేవలం విలాసాల కోసం, సరదాల కోసం డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేసేడేగానీ, దానికోసం తిండిలేక అలమటించే అదృష్టహీనుల కష్టాల గురించి ఆలోచించలేదు. వారి కోసం ఓ పైసా ఖర్చు పెట్టలేదు. అసలా ఆలోచన ఎన్నడూ తనకి రాలేదు. ఈరోజు అనుకోకుండా సారధి తారసపడి తనకి కనువిప్పు కల్గించేడు. తనలాంటి వాళ్లకోసం ఆలోచించమన్నాడు. తన మూలంగా శిథిలమై కూలిపోబోతున్న ఒక యిల్లు నిలబడినా అది నిజంగా తనకి ఎంత గొప్పవరం.
అయితే తనేం చెయ్యాలి?
శేఖర్ అర్ధరాత్రివరకూ ఆలోచనలతో కొట్టుకున్నాడు. అవును. తను సారధి జీవితానికి సార్ధకత చూపించాలి. అతన్ని ఆర్ధిక దురవస్థలనుంచి శాశ్వతంగా తప్పించాలి. ఈరోజు తన రెండువేలిచ్చి అతన్ని ఆదుకోవచ్చు. కాని అవి వాళ్ల బాధల్ని ఎంతకాలం దూరంగా వుంచగలవు? ఎన్నాళ్ళు వాళ్ల కుటుంబాన్ని నిలబెట్టగలవు?
అందుకే తన పలుకుబడిని, అవసరమైతే డబ్బుని ఉపయోగించి సారధిని మనిషిని చేయాలి. అతను సంఘంలో సగౌరవంగా బ్రతకగల ఏర్పాటు చూడాలి. ఇది తనకు చాలెంజ్.

ఇంకా ఉంది..

1 thought on “చంద్రోదయం – 3

Leave a Reply to Nalini Erra Cancel reply

Your email address will not be published. Required fields are marked *