April 24, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 48

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

అన్నమయ్య ఈ సంస్కృత కీర్తనలో మహావిష్ణువును కీర్తిస్తున్నాడు. కృష్ణావతారంలో చేసిన కృత్యాలను వివరిస్తూ బహుధా ఉల్లేఖిస్తూ… ఆ పరమాత్మను శరణువేడుకుంటున్నాడు.

కీర్తన:
పల్లవి: జడమతిరహం కర్మజంతురేకోఽహం
జడధినిలయాయ నమో సారసాక్షాయ ॥పల్లవి॥
చ.1. పరమపురుషాయ నిజభక్తిజననసులభాయ
దురితదూరాయ సింధరహితాయ
నరకాంతకాయ శ్రీనారాయణాయ తే
మురహరాయ నమో నమో నమో ॥జడ॥
చ.2. నగసముద్ధరణాయ నందగోపసుతాయ
జగదంతిరాత్మాయ సగుణాయ
మృగనరాంగాయ నిర్మితభవాండాయ ప-
న్నగరాజశయనాయ నమో నమో ॥జడ॥
చ.3. దేవదేవేశాయ దివ్యచరితాయ బహు-
భావనాతీతాయ పరమాయ
శ్రీవేంకటేశాయ జితదైత్యనికరాయ
భూవల్లభాయ నమో పూర్ణకామాయ ॥జడ॥
(రాగం శ్రీరాగం; సం.1 సంకీ.481 – రాగిరేకు – 96-5)

విశ్లేషణ:
పల్లవి: జడమతిరహం కర్మజంతురేకోఽహం
జడధినిలయాయ నమో సారసాక్షాయ

ఓ! పరంధామా! నేను మందబుద్ధిగలవాడిని. నేనొక కర్మఫలంవల్ల మానవుడినైనా పశు జీవనం సాగిస్తున్నాను. ఓ దేవా! పాల సముద్రంలో నివసించే పరమాత్మా! దేవతలకు సకలచరాచరాలకు ఆనందం కలిగించే పద్మాలవంటి నేత్రములు కలవాడా! నీకు నా నమస్సులు అంటున్నాడు అన్నమయ్య.

చ.1. పరమపురుషాయ నిజభక్తి జననసులభాయ
దురితదూరాయ సింధరహితాయ
నరకాంతకాయ శ్రీనారాయణాయ తే
మురహరాయ నమో నమో నమో
పురుషోత్తముడైన ఓ శ్రీహరీ! నిజమైన భక్తులకు నీవు సులభంగా కైవల్యాన్ని ప్రాసాదించే పావనుడవు. మా పాపములను పోగొట్టి సముద్ధరించే దేవాతిదేవుడవు. నరకాసురుని అంతం చేసినవాడవు. మురయనే రాక్షసుడిని అంతమొందించినవాడా! నీకు అనేక నమస్కారములు తెలియజేస్తున్నాను.

చ.2. నగసముద్ధరణాయ నందగోపసుతాయ
జగదంతిరాత్మాయ సగుణాయ
మృగనరాంగాయ నిర్మితభవాండాయ ప-
న్నగరాజశయనాయ నమో నమో
ఈ సకలజగత్తుకు ఆత్మవై నిలిచి శ్రీకృష్ణావతారంలో నందగోపునికి కుమారుడవై. గోవర్ధనగిరినెత్తి మానవులను కాపాడినవాడవు. సకల గుణ సంపన్నుడవై, నృసింహరూపం ధరించినవాడవు. మానవులకు సంసార సృష్టిని కలిగించినవాడవు. శేషశయనుడైన ఓ పరమాత్మా నీకు నా నమోవాకములు.

చ.3. దేవదేవేశాయ దివ్యచరితాయ బహు-
భావనాతీతాయ పరమాయ
శ్రీవేంకటేశాయ జితదైత్యనికరాయ
భూవల్లభాయ నమో పూర్ణకామాయ
దేవతలకు సర్వేశ్వరుడైన వాడవై, ఘన చరిత్రము కలిగి, గొప్ప జ్ఞాన సిద్ధిని సాధించిన పరమాత్మా! అనేక రాక్షసులను సమ్హరించి మునులను కాపాడి, భూదేవికి పతివై, కోరికలకు అతీతమైనవాడైనటువంటి శ్రీవేంకటేశ్వరునకు మనస్సుతో నమోవాకములు అర్పిస్తున్నాను.

ముఖ్యమైన అర్ధాలు: జడమతి = మందమతి; కర్మజంతు: = కర్మలవలన జంతురూపం ధరించినవాడను; సారసాక్షాయ = సంతోషము కలిగించే కన్నులుగలవాడా!; దురిత దూరాయ = పాపములను నసింపజేసేవాడా!; జగదంతరాత్మాయ = ఈ జగత్తునే ఆత్మాగా కలవాడా! (జగదంతరాత్మనే నమ:) మృగనరాంగాయ = నృసిమ్హ రూపుడవు; భవాండాయ = ఈ సంసారమనే వ్యవస్థనేర్పాటు చేసినవాడా!; బహుభావనాతీతాయ = గొప్ప ధ్యానంవలన సకల చరాచరములను అధీనము చేసుకున్నవాడా!; జితదైత్య నికరాయ = రాక్షస సమూహమును జయించినవాడా!; భూవల్లభాయ = భూదేవికి పతైనవాడా!; పూర్ణకామాయ = కోరికలకు అతీతమైనవాడా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *