April 16, 2024

అమ్మ కడుపు చల్లగా

రచన: తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం

పిట్స్ బర్గ్ లో విమానం దిగి బయటకు రాగానే వాళ్ళు ఎక్కవలసిన రైలు రావడంతో హడావిడిగా ఎక్కేసారు మంగమ్మగారు మంగపతి గారు. నిముషంలో కంపార్ట్ మెంట్ తలుపు యాంత్రికంగా మూసుకోవడం , రైలు వేగంగా ముందుకు దూసుకు పోవడం జరిగింది. కళ్ళు మూసి తెరిచేంతలో వాళ్ళు దిగవలసిన చోటు వచ్చేసింది. హాండ్ లగేజిగా తెచ్చుకున్న చిన్న సూట్కేసులు లాక్కుంటూ కరౌసిల్ దగ్గరకు వచ్చారు ఆ దంపతులు.
వాళ్ళను చూసి గబ గబనడుస్తూ వచ్చాడు అల్లుడు . పక్కనే తండ్రి కంటే పొడుగ్గా , పెద్ద కళ్ళు, సూది ముక్కు, ఒత్తైన జుత్తుతో అమ్మాయిల కలల రాకుమారుడిలా వున్న మనవడిని చూసిన ఆనందంతో మంగమ్మగారి కళ్ళు చెమరించాయి . ఆసలు కంటే వడ్డి ముద్దు అని ఎందుకు అంటారో మనవళ్ళు , మనవరాళ్ళు పుట్టాక అర్థమయ్యింది ఆమెకు. ఎయిర్ పోర్ట్ అని సంకోచించకుండా వంగి అత్తగారికి, మామగారికి పాద నమస్కారం చేసాడు అల్లుడు. అమ్మమ్మ తాతలకు తనూ వంగి దండం పెట్టాడు మనవడు. ఇద్దరి తల నిమిరి అశీర్వదించి , మనవడిని దగ్గరకు తీసుకున్నారు మంగమ్మగారు.
పుత్ర గాత్ర పరిష్వంగ సుఖం అని కవులు వర్ణించే దాన్ని తను అనుభవించలేక పోయినా పౌత్ర గాత్ర పరిష్వంగ సుఖం పొందిన సంతోషంతో ఆమె గుండె నిండిపోయింది. ‘అయ్యో అందరూ ఆడ పిల్లలేనా ?’ ఆన్న వాళ్ళంతా అసూయ పడేటట్టు అమ్మ నాన్నలను ఆదుకుంటున్నారు తన కూతుళ్ళు.
*****
గ్రీన్ ట్రీ రోడ్ మీద వచ్చి కుడివైపుకు తిరిగి వాళ్ళు వుండే రెండు అంతస్థుల ఇంటి ముందు కారు ఆగింది.
అప్పటికే పదేళ్ళ రెండో కొడుకుని వెంట తీసుకుని క్రిందికి దిగి వచ్చి ఇంటి ముందు వున్న పూల చెట్ల దగ్గర నిలబడి వుంది మంగమ్మగారి మూడో కూతురు. అందరూ ఎయిర్ పోర్ట్ కు వస్తే సామానుకు వాళ్ళ బి ఎం డబ్ల్యు లో చోటు సరిపోదని చిన్ని, రెండోకొడుకు ఇంట్లో వుండిపోయారు. వాళ్ళను చూడగానే ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేసివచ్చిన అలసట తీరిపోయినట్టు అనిపించింది ఆ దంపతులకు .
భోజనాల బల్ల మీద బాత్ టబ్ పెట్టి అందులో పడుకోబెట్టి చిన్నవాడికి నీళ్ళు పోసి మెత్తని తువాలులో చుట్టిన అనుభూతి ఇంకా మరువనే లేదు . అప్పుడే పదేళ్ళ వాడు అయ్యాడా అనుకుంటూ వాడిని దగ్గరకు తీసుకున్నారు మంగమ్మగారు .
మరు నాడు శనివారం సెలవు రోజు కావడాన అమ్మా, నాన్నల ఇష్టదైవం వేంకటేశ్వర స్వామి గుడికి తీసుకు వెళ్ళింది చిన్ని.
కర్నూలులో వున్నప్పుడు దగ్గరే వున్న అంగడిలో ఏదైన కొనుక్కు రమ్మంటే తల అడ్డంగా తిప్పే భయస్తురాలైన చిన్ని ఇరవై మైళ్ళ దూరంలో వున్న గుడికి తానే కారు డ్రైవ్ చేస్తూ తీసుకు వెడుతుంటే మంగమ్మ గారి మనసు గర్వంతో పొంగిపోయింది.
పెన్ హిల్స్ లో వున్న ఆ గుడి అమెరికాలో పేరుపొందినది . స్క్విరల్ టనెల్, పిట్స్ టనెల్ దాటి కొండమీద వున్నట్టు ఎత్తులో వున్న గుడికి చేరగానే ఆమెకు తిరుపతి కొండ మీదకి వచ్చినంత ఆనందం కలిగింది. చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంతమైన ఆవరణ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి
తిరుమల లోని పూజారుల లాగానే ఇక్కడి అర్చకులు శిఖ ముడి, చెవులకు కమ్మలు, నడుముకు బిగించిన అంగ వస్త్రంతో వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం పూజ చేస్తుంటే ఎక్కడో పరాయి దేశంలో వున్నామని అనిపించలేదు మంగమ్మ గారికి . ప్రసాదం తిని, ఇంటికి చేరేసరికి రాత్రి పదిగంటలు దాటింది.
*****
అలవాటైన ప్రదేశమే గనుక మరునాడు ఆదివారం సాయంత్రం ఒంటరిగానే ఇంటికి దగ్గరే వున్న
పార్క్ వైపు నడవ సాగిందామె.
అంతకు ముందు పరిచయం అయిన చిన్ని స్నేహితురాలు ఆరతి అనే అమ్మాయి “ ఎప్పుడు వచ్చారు ఆంటీ ? పది రోజుల్లో మా అమ్మా, నాన్న కూడా వస్తున్నారు. రోజూ ఇక్కడ కలుసుకుని కబుర్లు చెప్పుకోవచ్చు “అంది చనువుగా పలుకరించి .
ఆరతితో కూడా నడుస్తున్న మరో ఇద్దరిని చిరునవ్వుతో పలుకరించి “ పూర్ణిమ కనబడలేదే ? అన్నది ఆమె.
“ వాళ్ళ నాన్నగారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారట ఆంటీ. ఆందుకని ఇండియాకు హడావిడిగా వెళ్ళింది. అన్నది ఆరతి పక్కన ఉన్న ఊర్మిళ.
“ అలాగా పాపం పోయినసారి వచ్చినప్పుడు బాగానే వున్నారు ఆయన. ” సానుభూతిగా అని ముందుకు నడిచింది ఆమె.
మంగమ్మగారు పార్కులో కనబడిన పరిచయస్తులతో కాసేపు కబుర్లు చెప్పి వెనక్కి వస్తుంటే వాళ్ళ ఇంటి దగ్గరలో వుండే నీలవేణి , వాళ్ళ మామగారిని వీల్ చైర్ లో కూర్చోబెట్టి తోసుకుంటూ ఇంటివైపు రావడం కనబడింది.
ఎప్పుడొచ్చారు ఆంటీ? అని పలుకరించింది నీలవేణి .
“ మొన్ననే. అని “ ఏమయింది మామయ్యగారికి? “ అయనకు నమస్కరించి నీలవేణిని అడిగిందామె.
“ పక్షవాతం అండి. వున్నది ఒక్కడే కొడుకు. ఆందుకని ధైర్యం చేసి తీసుకు వచ్చేసాము. ” ఆంది నీలవేణి.
“ డాలర్ల సంపాదన కోసం దేశాలు దాటి వచ్చినా అమ్మానాన్నలను అనాధలుగా వదిలేయడం లేదు మన పిల్లలు. “ అనుకుంటూ నిట్టూర్చి ఇంటి దారి పట్టారు మంగమ్మగారు.
దారిలో వున్న సీనియర్ సిటిజెన్స్ హోం ముందు ఆంబులెన్స్ ఆగి వుండడం చూసి “అయ్యో” అనుకుంటూ అలా నిలబడి పోయిందామె.
పై అంతస్థు లో వుంటున్న ఎనభై ఏళ్ళ ముసలామెను స్త్రెచర్ మీద తీసుకు వచ్చి ఆంబులెన్స్ ఎక్కించారు. మంగమ్మగారు అటు వెళ్ళేటప్పుడు కనబడితే నవ్వుతూ చేయి వూపేది ఆ అమెరికన్ ఆవిడ.
“ఆమె ఒంటరిగా. ఉంటుంది అన్నావు కదా ఇప్పుడు ఎవరు పిల్చుకువెళ్ళారు హాస్పిటల్ కి “ అని ఇంటికి వచ్చాక చిన్నిని అడిగిందావిడ.
“మెయింటెనెన్స్ వాళ్ళు ఫోన్ చేసి ఆంబులెన్స్ పిలిపించారట. ఆవిడ సోషల్ సెక్యూరిటి డబ్బుతో బతుకుతోంది. ఇద్దరు కూతుళ్ళు , ఇద్దరు కొడుకులు వున్నారు. ఆందరూ చెరో రాష్త్రంలో వున్నారు. ఎవ్వరూ ఎప్పుడు వచ్చినట్టు కనబడదు. మదర్స్ డే కి పువ్వులు, చాకలెట్లు పంపిస్తారుట. ” అంది చిన్ని.
“అందరూ వుండి ఎవరూ లేనట్టు ఒంటరిగా బ్రతకడం ఎంత దౌర్భాగ్యం. మనదేశంలో కూడా ఈ మధ్యన పెద్దవాళ్ళ బ్రతుకు ఇలాగే వుంటోంది . “ అని నిట్టుర్చారు మంగమ్మగారు.
వారం గడిచింది. మళ్ళీ ఆదివారం వచ్చింది. ఆ రోజు ఉదయం లేవగానే “హాపీ మదర్స్ డే అమ్మా ” అంటూ అమ్మను కౌగలించుకుంది చిన్ని. గులాబీ పూల గుత్తితో బాటు ఒక కవర్ అమ్మ చేతిలో పెట్టింది.
“ఇక్కడివాళ్ళ అలవాటు నీకూ వచ్చిందా? థాంక్యూ “అంటూ కవర్లో డాలరు నోట్లు వుండడం చూసి “నాకెందుకే ఈ డబ్బు? నాకేమి కావాలన్నా నువ్వే కొంటావు కదా? అని వెనక్కి ఇవ్వబోయింది ఆమె.
“అలా కాదులే అమ్మా, చెక్ ఇస్తే ఇక్కడ మార్చుకో లేవు. డబ్బు దగ్గర వుంటే మాల్ కు వెళ్ళినప్పుడు ఏదన్నా నచ్చితే నువ్వు స్వతంత్రంగా కొనుక్కోవచ్చు. నేను సంపాదిస్తున్నాను కదా అందులో ఒక అయిదు వందలు వాడుకునే హక్కు నీకు లేదా? అంది చిన్ని.
“సరే. నీ ఇష్టం. అవునూ ఆ సీనియర్ సిటిజెన్ హోం ఆమె హాస్పిటల్ నుండి ఇంకా తిరిగి వచ్చినట్టులేదే “. అని అడిగారు మంగమ్మగారు.
“ఆవిడ కాన్సర్ పేషెంట్ అంట అమ్మా. ఇంక మందులు నయం చేసే పరిస్థితి కాదు. మనం ఇండియన్ స్టోర్ కి వెళ్ళే దారిలో చర్చ్ వుందా? దాని వెనక వున్న హాస్పిస్ లో చేర్పించారట. టెర్మినల్లీ ఇల్ అయి , ఇక వైద్యం లేదు అంటే అక్కడ పెడతారు. నర్సులు, సహాయకులు వుంటారు. కొంతమంది వాలంటరీ సర్విస్ కూడ చేస్తారు అక్కడ. ” చెప్పింది చిన్ని.
“అయ్యో పాపం” అని నిట్టూర్చింది ఆమె.
భోజనాలు అయ్యాక కూతురు, అల్లుడు, పిల్లలు మేడ ఎక్కాక , ” నేను నాలుగు అడుగులు నడిచి వస్తాను” అని భర్తకు చెప్పి బయట పడ్డారు మంగమ్మగారు. “సరే” అని నిద్రలోకి జారుకున్నారు మంగపతిగారు.
ఇంచుమించు రెండు గంటల తరువాత ఆవిడ తిరిగి వచ్చేసరికి అందరూ ఆమె కోసం ఎదురు చూస్తున్నారు.
” ఎక్కడికి వెళ్ళావమ్మా? ఇవాళ మదర్స్ డే అని మీ అల్లుడు మిమ్మల్ని బయటకు తీసుకు వెళ్ళాలని అనుకున్నారు. తొందరగా తయారవ్వు. ” అంటూ హడావిడి పెట్టింది చిన్ని.
అరగంట ప్రయాణం చేసి క్రూస్ ట్రిప్ కొసం నది దగ్గరికి చేరారు.
పిట్స్ బర్గ్ లో మొనాంగల్, అలీఘనీ అనే రెండు నదులు ఓహియో నదితో కలుస్తాయి. నది పొడవునా దీపతోరణాలతో ఆర్చ్ ఆకారంలో వున్న బ్రిడ్జ్ లు కనువిందు చేస్తాయి. ఆ వూరికి పెట్టిన వడ్డాణంలా వుంటుంది దూరం నుండి చూస్తే.
టికెట్స్ కొనుక్కుని పడవ ఎక్కి , డెక్ మీద వున్న కుర్చీలలో కూర్చున్నారు అందరూ. పడవ బ్రిడ్జీల క్రింద నుండి కదులుతుంటే అనుకోకండానే తలలు వంచుతున్నారు కొందరు. ఇంతలో మూజిక్ బాండ్ వాళ్ళు వచ్చి గిటార్. మొదలైన వాయిద్యాలు వాయిస్తూ అందుకు అనుగుణంగా నాట్యం చేస్తూ అలరించారు.
చిన్ని భర్త ” పదండి. కింద రెస్టారెంట్ వుంది. ఏవన్నా తిని, కాఫీ తాగుదాము అనగానే అందరూ మెట్లు దిగారు.
అక్కడ కూర్చుని ఫ్రెంచ్ ఫ్రైస్ నములుతూ, కాఫీ తాగుతూ కిటికీలో నుండి బయటకు చూస్తే దీపాల వెలుగులో మెరిసిపోతున్న పిట్స్ బర్గ్ పట్టణం కనుల విందుగా కనబడుతోంది. విద్యుత్ దీప కాంతులు నీటిలో ప్రతిఫలిస్తుంటే ఆకాశంలోని నక్షత్రాలు కిందకి దిగి నీటిలో జలకాలాడుతున్నాయా అనిపిస్తోంది.
“ నిన్న మనం కొండ మీద వున్న డ్యుకెన్ ఇంక్లెయిన్ అనె చోటు నుండి ట్రాంలో ఏటవాలుగ కిందికి దిగుతూ, ఈ పడవలు, బ్రిడ్జ్ లు చూసాము కదా. తిరుమల నుండి రాత్రి వేళ బస్ లో కిందికి వస్తుంటే దేదీప్యమానంగా వెలిగిపొతూ కనబడే తిరుపతిని చూసి స్వర్గం కిందికి వచ్చిందా అనుకునేవాళ్ళం. ఇక్కడ నదిలో, వెలుగుతున్న హంసలలా తిరిగే పడవలూ, నీటిలో ప్రతిఫలించే దీపతోరణాలు చూస్తే అసలు స్వర్గం ఇక్కడ వుందా అనిపిస్తుంది అన్నావు కదా! అందుకే ఇవాళ మీ అల్లుడు మీ కోసం ఇచ్చిన స్పెషల్ ట్రీట్ ఇది. అంది చిన్ని అమ్మతో.
ప్రేమగా కూతురి తల నిమిరిన మంగమ్మగారి కళ్ళు తడిగా మెరిసాయి.
“అమెరికాలో మదర్ ఇన్ లా మీద చాలా జోక్స్ వున్నాయిట కదా? మాన్స్టర్ ఇన్ లా అనీ, గాడ్ కెనాట్ బి ఎవ్విరి వేర్ సో హి క్రియేటెడ్ మదర్స్ అండ్ సేటన్ కెనాట్ బి ఎవ్విరి వేర్ సో హి క్రియేటెడ్ మదర్స్ ఇన్ లా అనీ” సరదాగా అల్లుడిని అడిగారు మంగపతిగారు.
“అవన్నీ ఇండియన్ అల్లుళ్ళకి కాదు లెండి “అన్నాడు చిన్ని భర్త.
“ఇండియా లో అల్లుడిని దశమ గ్రహం అంటారు” కొంటెగా నవ్వి అంది చిన్ని.
” మా అల్లుళ్ళు మాత్రం ఆణిముత్యాలు” గర్వంగా అన్నారు మంగమ్మగారు.
ఇంటికి వచ్చే ముందు మహరాజ రెస్టారెంట్ లో ఫలహారం ముగించి రాత్రి పదింటికి ఇల్లు చేరారు.
“అవునమ్మా, ఇంతకీ మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళావు? నువ్వు వెళ్ళి చాలాసేపు అయ్యిందని నాన్న చెప్తే కంగారుపడ్డాను. ” మరునాడు తల్లిని అడిగింది చిన్ని.
” ఆ చర్చ్ వెనకాల హాస్పీస్ వుందని అన్నావు కదా. అక్కడికి వెళ్ళి ఆ సీనియర్ సిటిజెన్ హోంలో వుండిన అమెరికన్ ఆమెను చూసి వద్దామని వెళ్ళాను. అక్కడ ఎంతమంది రోగగ్రస్థులైన ముసలి వాళ్ళు ఆఖరి క్షణం కోసం ఎదురు చూస్తున్నారో. నా గుండె తరుక్కుపోయిందే. చిన్నీ. నువ్విచ్చిన అయిదు వందలు అక్కడ విరాళంగా ఇచ్చి, నాకు చేతనైనట్టు నాలుగు మంచి మాటలు మాట్లాడి వచ్చాను. ”
“ఇండియాలో కూడా ఈ మధ్యన ఇదే పరిస్థితి కనబడుతోంది అంటున్నారు. విదేశాలకు వలస పోయిన పిల్లల తలిదండ్రులే కాదు, అక్కడే వున్న బిడ్డలు కూడా అమ్మానాన్నలను పట్టించుకోవడం లేదు. ఏ రోజు ఎలా వుంటుందో, దేవుడే దిక్కు ” అని దీర్ఘంగా నిట్టూర్చి కళ్ళు మూసుకుంది ఆవిడ.
చిన్ని కాసేపు మౌనంగా వుండి ” మీరు భయపడే పని లేదమ్మా . ముగ్గురం వున్నాము. మీ చేయి వదలం. మేమైనా అక్కడికి వచ్చేస్తాము. లేదా మీరే ఇక్కడ మా దగ్గర వుంటారు. ” అంది.
“ నిజమే ఇక్కడికి వచ్చేసి , తమను చేయి పట్టి నడక నేర్పిన అమ్మానాన్నలను అందరు నిర్లక్ష్యం చేయరులే. ఇంత మంచి సంపాదన, పిల్లలకు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన విద్యాలయాలలో చదువులు, ఈ సౌకర్యాలు వదిలేసి మా కోసం మీరు వెనక్కి రావాలనుకోవడం మా స్వార్థమే అవుతుంది. అక్కడ కాలిఫొర్నియాలో మీ అక్క దగ్గర వున్నప్పుడు చూసాను కదా. మనవాళ్ళు చాలా మంది ముసలి తలితండ్రులను ఇక్కడికి పిలిపించుకుంటున్నారు. సరే. చూద్దాం. నందో రాజా భవిష్యతి కదా. ” అన్నారు మంగమ్మగారు.
ఇంకో వారం గడిచింది. ఆ శనివారం ఉదయం కూతురు అల్లుడు మేడ దిగి రాగానే , ” చిన్నీ తిధి ప్రకారం ఇవాళ మీ పెళ్ళి రోజు. ఇలా వచ్చి కూర్చోండి . తలకు నూనె పెడతాను. తలంటుకుని , మేము తెచ్చిన కొత్త బట్టలు కట్టుకుని దేవుడికి దండం పెట్టుకోండి” అంటూ హడావిడి పెట్టారు మంగమ్మగారు.
ఆవిడ చాదస్తానికి నవ్వుకుంటూవచ్చి ఆమె కార్పెట్ మీద పరచిన కంఫర్టర్ మీద కూర్చున్నారు చిన్ని, ఆమె భర్త.
ఇద్దరి ముఖాన కుంకుమ పెట్టి, వుంగరం నూనె గిన్నెలో ముంచి తీసి వాళ్ళ తలమీద మూడుసార్లు నూనె తాకించి , “అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, పిల్ల పాపలతో సుఖంగా వుండండి” అని దీవించి, , పళ్ళెంలో కలిపి పెట్టుకున్న పారాణితో ద్రిష్టి తీసింది ఆవిడ.
” పెరిగి పెద్దవాళ్ళు అయినా , పిల్లల కోసమే అమ్మానాన్నల మనసు పరితపిస్తుంది. వాళ్ళు సుఖంగా, సంతోషంగా వుండడమే అమ్మా నాన్నలకు కావాలి. అందుకే అమ్మ కడుపు చల్లగా నువ్వు, మీ అత్త కడుపు చల్లగా మీ ఆయన వుండాలని దీవెనలు. అందులో కూడా మా స్వార్థం వుంది. మీరూ రేపు మీ పిల్లల గురించి ఇలాగే ఆలోచిస్తారు. ” నవ్వుతూ అని పారాణి పళ్ళెంలోని అక్షింతలు వాళ్ళ ఇద్దరి తలల మీద వేసింది ఆమె.
—————.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *