February 23, 2024

చంద్రోదయం – 4

రచన: మన్నెం శారద

 

అలా నిర్ణయం తీసుకున్న మరుక్షణం శేఖర్‌కి గాఢనిద్ర పట్టేసింది.

“ఈ వెయ్యి రూపాయిలు ముందు యింటికి పంపించండి..” శేఖర్ అందిస్తోన్న డబ్బు వేపు విప్ఫారిత నేత్రాలతో చూశాడు సారధి.

“వద్దండి. తీసుకోవటం తేలిక. తిరిగి తీర్చలేని దురదృష్టవంతుణ్ణి. మీ మంచితనాన్ని దుర్వినియోగపరచలేను” అన్నాడు సారధి సిగ్గుగా.

సారధి మాటలకి శేఖర్ నవ్వేడు.

“నేను మిమ్మల్ని ఇన్సల్టు చేయటానికి.. బరువులో దించటానికి మాత్రం యివ్వటం లేదు. ఈ డబ్బు మీరు తీసుకోనంత మాత్రాన నా దగ్గర శాశ్వతంగా నిలబడిపోదు. మరో క్షణంలో ఎందుకూ పనికిరాని విలాసాలకి తగలబడిపోతుంది. కాని  అదే డబ్బు… ఎన్నో ప్రాణాల్ని నిలబెట్టి, తిండి పెట్టడానికి ఉపయోగపడంలో ఎంత ఆనందం వుందో నేనిప్పుడే అర్ధం చేసుకోగల్గాను. ఈ రోజు నుండి నేను పనికిమాలిన పిచ్చిపిచ్చి ఖర్చులు మానేయాలని నిర్ణయించుకున్నాను. మీరీ డబ్బు తీసుకుని యింటికి పంపించండి. నేను ధర్మం చేస్తున్నానని అనుకోవద్దు. ఉద్యోగం రాగానే తెర్చటానికి ప్రయత్నించండి” అన్నాడు.

సారధి నిరాశగా నవ్వేడు. “ఉద్యోగమా? నాకా? నాకు జీవితమ్మీద ఆశలు కల్పిస్తున్నారా?”

శేఖర్ రెట్టిస్తున్నట్లన్నాడు..”ఏం మీకు అర్హత లేదా.. మీరంతా పనికిమాలినవాళ్లా?”

“అనే అనేకసార్లు నిరూపించబడింది”

“మీ అర్హతేమిటో మీకు వారం రోజుల్లో తెలియబరుస్తాను. అంతవరకూ ఓపికపట్టి నా మాట వినండి” శేఖర్ బలవంతంగా నోట్ల కట్టని సారధి చేతిలో పెట్టేడు.

శేఖర్ పట్టుదలవల్ల అయితేనేమి, అతనికున్న డబ్బు, పలుకుబడి వల్లనయితేనేం, సారధికి ఒక బేంకులో వారం తిరక్కుండానే ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగానికి కట్టవలసిన సెక్యూరిటీ డిపాజిట్టు కూడా శేఖరే కట్టేడు.

సారధిని వెంటబెట్టుకెళ్ళి అర్జంటుగా బట్టలు కూడా కుట్టించేడు  శేఖర్.

నిజానికి సారధికన్నా సారధికి ఉద్యోగం రావటం శేఖర్‌కి ఎక్కువ ఆనందంగా ఉంది. అతను దరిదాపు స్నేహాలని, విలాసాల్ని, సరదాల్ని వదులుకొని సారధి పర్యవేక్షణలో పడ్డాడు.

శేఖర్ స్నేహితులకి ఇది చాలా ఈర్ష్యనీ, బాధనీ కల్గించింది.

“ఈ దరిద్రాన్ని తెచ్చిపెట్టుకున్నాడేం ఖర్మ!”అనుకున్నారు.

శేఖర్‌కి  యివేం పట్టలేదు. సారధి జీవితాన్ని తీర్చిదిద్దటమే అతనికి జీవితాశయమైంది.

సారధికి యిది నమ్మశక్యంగా లేదు. తనేమిటి,, తన పరిస్థితులేమిటి? ఇతనెవరు. తనపట్ల ఎందుకింత శ్రద్ధ. డబ్బున్నవాళ్లకు కళ్లుమూసుకుకుపోయి వుంటాయని, గర్వానికి ప్రతీకలని, దరిద్రాన్ని వాళ్ల దగ్గరకు రానివ్వరని అతని నమ్మకం.

కాని యితడు ఎంత విచిత్రమైన మనిషి. యిన్నాళ్లకు, యిన్నేళ్ళకు దేవుడు తనకు మొదటిసారిగా ప్రసాదించిన వరం యితని స్నేహం, ఆదరణ, ఆత్మీయత.

సారధి ఆలోచనతో తబ్బిబ్బవుతున్నాడు.

“పదండి. టైమవుతోంది. మిమ్మల్ని బ్యాంక్ దగ్గర వదిలేస్తాను. మొదటిసారి కదా…!” శేఖర్ భుజమ్మీద చేయి వేసి ఆప్యాయంగా నొక్కేడు సారధిని.

సారధి అకస్మాత్తుగా అనుకోని విధంగా శేఖర్ పాదాలకు నమస్కరించేడు.

ఆ ఆకస్మిక చర్యకు శేఖర్ నిరుత్తరుడయి చూసేడు. “ఏమిటిది? ఏం చేస్తున్నారు?” శేఖర్ పాదాల్ని ఎడంగా లాక్కున్నాడు. సారధి కళ్ళు తుడుచుకున్నాడు. “నా కృతజ్ఞత మరోలా తెలియజేసుకునే అవకాశం లేక” అన్నాడు.

“మన మధ్య కృతజ్ఞతలెందుకు? ఈ రోజునుండి నువ్వెవరో తెలుసా? నా ఆత్మీయుడివి. నేను నీకోసం ఎందుకు కష్టపడుతున్నానో తెలుసా? రేపెప్పుడయినా నాకు కూడా యిలాంటి కష్టం వస్తే నువ్వు నన్ను కంటికి రెప్పలా ఆదుకుంటావని. చూసేవా నేనెంత స్వార్ధపరుణ్ణో?” అన్నాడు శేఖర్ చమత్కారంగా నవ్వుతూ.

“మీకు కష్టమా? నేను ఆదుకోవటమా? జోక్ చేస్తున్నారా సార్!” సారధి ఆశ్చర్యంగా అడిగేడు.

“కష్టాలు నాకు రాకూదదని రూలేమన్నా వుందా? అదంతా ఇప్పుడెందుకు గాని, ఈ రోజునుంచి మన మధ్య మన్ననలకు గుడ్‌బై. సార్, గీర్ అని పిలిస్తే నేను ఒప్పుకోను. నా పేరు శేఖర్. డూ యూ నో?” శేఖర్ గమ్మత్తుగా కళ్లెగరేసి అంటుంటే సారధి నవ్వకుండా వుండలేకపోయాడు.

*****

చాలా తక్కువ కాలంలోనె వారిద్దరూ గాఢస్నేహితులయిపోయేరు.

సారధి శేఖర్ ప్రోద్బలంతో నైట్ కాలేజీలో జాయినయి ఎం.కాం. చేస్తున్నాడు. బాంక్ పరీక్షలకి ప్రిపేరవుతున్నాడు.

అకస్మాత్తుగా చేతినిండా డబ్బు పడేసరికి విలాసాలకి మరగకుండా సాధ్యమైనంత ఎక్కువగా డబ్బు యింటికి పంపిస్తున్నాడు.

ఇంటిమీద తన చదువుకోసం చేసిన అప్పు చాలావరకు తీర్చేసేడు. ఇక చెల్లెళ్ళకి పెళ్ళి చేయాలి. అందుకుగాను డబ్బు కొంత బాంక్‌లో దాస్తున్నాడు.

సారధికి ఇంటికి వెళ్ళినప్పుడు చెల్లెళ్ల ముఖాలలో కాంతి చూసి ఆశ్చర్యం వేస్తుంది.

ఎండి, వాడి, పాత గుడ్డలు కట్టుకున్న వాళ్లు యిదివరకెంత అందవిహీనంగా కనిపించేవారు.

ఇప్పుడో…

చక్కటి తిండి, అందమైన బట్టలమధ్య అందగత్తెల్లా మెరిసిపోతున్నారు.

డబ్బుకెంత బలముంది?

డబ్బు వుంటేనే మనిషి బతుక్కి ఓ విలువ.

అందుకే కాబోలు లక్ష్మీకళ అన్నారు.

కొడుక్కి వుద్యోగం రాగానే  సారధి తల్లి సావిత్రమ్మ కూడా మంచం దిగి తిరుగుతోంది.

సారధి చెల్లెళ్లకి పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయి. ఒకప్పుడు వద్దు పొమ్మన్నవాళ్లే కబుర్లు చేస్తున్నారు. అంతా డబ్బు మహిమ! అనుకొన్నాడు సారధి.

ఈ మధ్య కాలంలో సారధి శేఖర్ అలవాట్లని, పద్దతుల్ని, అతని స్తితిగతుల్ని కూడా గ్రహించగలిగేడు.

అపురూపాన పెరగటం వలన శేఖర్‌కి కాస్త బద్ధకం పాలు హెచ్చనే చెప్పాలి. ప్రొద్దుట తొమ్మిదిగంటలకి గానీ అతను నిద్ర లేవడు. బెడ్ కాఫీ అంటే అతనికి ప్రాణం. ఆ తర్వాత మంచం మీదే పేపర్ చూసి, ఆఫీసు టైం అవుతుందనగా హడావిడిగా బాత్రూంలోకి పరిగెత్తి ఓ చేత్తో పళ్ళు తోమి, మరో చేత్తో వళ్ళు తోమి, స్నానం అయిందనిపించి, అతడి తువ్వాలు, లుంగీ మంచం మీదే విసిరికొట్టి, డ్రెస్ చేసుకుని బైక్ మీద హోటల్ పరిగెత్తి భోజనం అయిందనిపించి ఆఫీసుకు పరిగెత్తుతాడు.

గదినిండా సిగరెట్ యాష్. చిందరవందరగా పేపర్లూ, అడ్డదిడ్డంగా బట్టలూ, సారధికి ఏవగింపుగా వుండేది.

కాని శేఖర్‌కి చెప్పగల  స్థితి కాదు అతనిది.

అందుకే ఓపిగ్గా అన్నీ సర్దేవాడు.

శేఖర్ యిదంతా గమనించేవాడు కాదు. అతని ధోరణి అతనిదే. సారధి వల్ల అతనికి కాస్త యిబ్బందులు వచ్చిపడ్డాయి.

అతను బేడ్ కాఫీ తీసుకొని ఏడుగంటలకల్లా నిద్రలేపుతాడు. ఇలా కొంపలంటుకున్నట్లు లేవటం శేఖర్‌కి సుతరామూ యిష్టం లేదు. అయితే సారధి యిదేం పట్టించుకునేవాడు కాదు.

ఆదివారం ఓపిగ్గా వంట చేసి పెట్టేవాడు. హోటల్ భోజనానికి విసుగెత్తిన శేఖర్, సారధి వంట  మెచ్చుకుని తృప్తిగా తినేవాడు. తనకు ఎంతో  మేలు చేస్తున్న స్నేహితునికి ఆ మాత్రం మెప్పించగల్గినందుకు సారధికి మహదానందంగా వుండేది.

శేఖర్‌కి సారధి ఓర్పు చూసి ఆశ్చర్యం వేసేది.

ఓ పక్క ఉద్యోగం చేస్తూ చదువుకుంటూ, యింటిని జాగ్రత్తగా తీర్చిదిద్దే అతని నేర్పు, చాలా గొప్పగా కన్పించేది.

“లేమి మనిషికెన్ని జాగ్రత్తలు నేర్పుతుందో” అనుకునేవాడు. అదివరకెలా గడిచిందోగాని, యిప్పుడు సారధి లేకపోతే తనేం చేయలేడు అన్పిస్తుంది శేఖర్‌కి.

సారధిలో అదివరకు గూడుకట్టూకున్న నిరాశ, నిస్పృహ, రెక్కలు విప్పి కన్పించనంత దూరం పారిపోయేయి..

 

ఇంకా వుంది..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *