May 25, 2024

తల్లిని మించి ఎవరు?

రచన: శింగరాజు శ్రీనివాసరావు

మానస మనసు మనసులో లేదు. పదే పదే మధు మాటలే చెవిలో మారుమోగుతున్నాయి.
“మానసా నా మాట విను. ఎంతకాలమిలా ఒంటరిగా జీవితాన్ని గడుపుతావు. నీకంటూ ఒక తోడు కావాలి. భగవంతుడు వేసిన శిక్ష అనుకునో, నా బ్రతుకింతే అనుకునో కష్టాన్ని అనుభవించే రోజులు పోయాయి. నీ ప్రతి బాధ్యతను నా బాధ్యతగా తీసుకుంటాను. నిన్ను నా భార్యగా జీవితమంతా నా గుండెల్లో దాచుకుంటాను.”
అతని మాటల్లో నిజాయితి వుంది. కాని అది ఎంతకాలం నిలుస్తుంది. ఎన్నో ఘటనలు విన్నవి, చూసినవి కాదనే చెబుతున్నాయి. కాని కాలం మారింది మనుషులు మారారు పాత ఆలోచనలు మాని కొత్తగా ఆలోచించి అడుగు వేయమని అందరూ చెబుతున్నారు. కానీ ఏదో భయం తనని వదలట్లేదు. ఆలోచనలలో మునిగివున్ప మానస ‘అమ్మా’ అన్న పిలుపుతో లోకంలోకి వచ్చింది.
“రా నాన్నా అంటూ” అప్పుడే వచ్చిన కొడుకు మహీధర్ ను దగ్గరకు తీసుకుంది.
“అమ్మా నాకు చక్రాలు పెట్టవా” అని తల్లి బుగ్గ మీద ముద్దు పెడుతూ అడిగాడు.
“సరే. కాళ్ళు కడుక్కొని రా” అంటూ లేచింది మానస.
******
వయసుకు మించిన భారాన్ని ఒడిలో వేసుకుని పుట్టిందేమో అనిపిస్తుంది మానస జీవితం. తండ్రిది తక్కువ జీతగాడై చిన్న ఊరిలో వుండడం వలన కాలేజి చదువంతా మేనమామ గారింట్లో జరిగిపోయింది. కాలేజిలో ఉన్నప్పుడే తన మంచితనం, ఓర్పుకు మెచ్చి కోరి మరీ పెళ్ళి చేసుకున్నాడు ఇంగ్లీషు లెక్చరర్ మల్లిక్. అందరూ తన అదృష్టానికి మురిసిపోయారు. ఇప్పటిదాకా పడిన కష్టానికి దయతలచి భగవంతుడే తనకీ భాగ్యాన్ని ప్రసాదించాడన్నారు.
తాను కూడ మురిసిపోయింది. మనసారా ప్రేమించే భర్త, ఏ బాధ్యతా లేని జీవితం తనకు దక్కినందుకు ఎంతో ఆనందించింది మానస. ఏడాది తిరగకుండానే మహీధర్ కు జన్మనిచ్చింది. వాడు అచ్చం మల్లిక్ లాగానే వుండడం ఆమెకు మరీ సంతోషాన్నిచ్చింది.
సజావుగా సాగిపోతున్న సంసారాన్ని చూసి భరించలేకపోయిన ఆ భగవంతుడు భరించలేని విషాదాన్ని ఆమె బ్రతుకులో వేస్తూ కారు ప్రమాదంలో మల్లిక్ ను తీసుకుపోయాడు. మహీధర్ వయసు అప్పటికి మూడు సంవత్సరాలు. అనుకోని ఆ సంఘటన ఆమెకు అశనిపాతమే అయింది. తట్టుకుని మరలా మామూలు మనిషి కావడానికి సంవత్సరం పట్టింది. అంతంత మాత్రమైన తండ్రి సంపాదన ఆమెను మోయలేదని తెలుసుకున్న మేనమామ కాలేజి వాళ్ళతో మాట్లాడి అక్కడే ఆఫీసులో గుమాస్తాగా చేర్పించాడు మానసను.
అప్పటినుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వయసులో వున్న ఆడపిల్ల కావడం భర్త లేకపోవడం వల్ల చాలామంది కన్ను ఆమె మీద పడింది. అందరూ ఆమెను ఏదో ఆశించి ప్రేమ నటించారు గాని ఒక్క తెలుగు లెక్చరర్ మాధవరావు మాత్రం ఆమెను మనసారా ఇష్టపడ్డాడు. గత రెండు సంవత్సరాలుగా ఆమె సమ్మతి కోసం ఎదురుచూస్తున్నాడు.
******

“మానస గారు చాలా బిజీగా ఉన్నట్లున్నారు” అంటూ ఆఫీసు రూమ్ లోకి ప్రవేశించాడు మాధవరావు.
“లేదండీ. అడ్మిషన్లు మొన్ననే కదా ముగిశాయి. వాటి తాలూకు పని మిగిలివుంటే చేస్తున్నాము. అంతే” అంటు కూర్చోండి అని సీటు చూపించింది.
“మరి మిగిలిన ఇద్దరూ ఎక్కడికి వెళ్ళారు”
” గోపాలం గారు బ్యాంకుకు వెళ్ళారు. సీతగారు సెలవు. ఏదైనా పనుండి వచ్చారా”
“అబ్బే లేదండి. ఉదయం నుంచి మీరు కనిపించలేదు. వచ్చారా లేదా చూసిపోదామని వచ్చాను”
“థాంక్సండీ. మా నాన్న గారికి వయసు పైబడుతోంది కదా. ఉద్యోగం కూడా కష్టంగా చేస్తున్నారు. నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను. అందుకని నాన్న వాళ్ళను ఇక్కడికే వచ్చేయమన్నాను. రేపు గానీ, ఎల్లుండిగానీ రావచ్చు. వస్తే ఇక ఇక్కడే వుండిపోతారు” విషయం వివరించింది మానస.
ఒక్కసారి ఖంగుతిన్నాడు ఆమె మాటలకి. కాని తమాయించుకుని అడిగాడు. ఈ మధ్య కాలంలో తనతో ప్రతి విషయాన్ని చెప్పే తను ఇప్పటి వరకు తనతో ఈ విషయం చూచాయగా కూడ చర్చించలేదు.
“మానస గారు మరల మరల అడగడం నాకు సిగ్గుగా అనిపిస్తుంది. అయినా అడుగుతున్నాను ఎందుకంటే సమయం ఇంకా మించిపోతే మనం చేసే పనికి అర్థం వుండదు. ఇంతకూ ఏమి నిర్ణయించుకున్నారు” సూటిగానే అడిగాడు మాధవ్
“ఇక్కడ చర్చించ వలసిన విషయం కాదది మాధవరావు గారు. తరువాత ఎక్కడైనా కలసి మాట్లాడుకుందాం” టాపిక్ దాటెయ్యాలని చూసింది మానస.
“లేదు మానస గారు ఇది ఎంత తొందరగా తేలితే అంత మంచిది. లేకుంటే మహీధర్ మనసులో వ్యతిరేక ముద్ర పడవచ్చు. సాయంత్రం కాలేజీ అయిపోగానే అలా క్యాంటిన్ కెళ్ళి మాట్లాడుకుందాం. కాదనకండి”
బ్రతిమలాడుతూనే ఆర్డర్ వేశాడు మాధవ్
మానస ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడం వాళ్ళు ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. రేపు వాళ్ళు వచ్చేది కూడా అందుకేనని మానసకు తెలుసు. అందుకే తను కూడా నిర్ణయాన్ని త్వరగా చెప్పెయ్యాలనుకుంటోంది.
” సరే సర్” అని తన అంగీకారాన్ని తెలిపింది
“థాంక్యూ” అని చెప్పి వెళ్ళిపోయాడు మాధవ్
మానస పనిచేస్తున్నదేగాని మనసంతా సాయంత్రం ఎలా తన నిర్ణయం చెప్పాలా అని ఆలోచిస్తున్నది.

*****

మానస వచ్చేసరికే మల్లిక్ ఆమెకోసం ఎదురుచూస్తున్నాడు.
“రండి మానస గారు” అంటూ ఆహ్వనించి పార్కులో బెంచి మీద కూర్చున్నాడు.
ఇద్దరి మధ్య మౌనం కొద్ది నిముషాలు.
“మీరొక నిర్ణయానికొచ్చారనుకుంటాను” మౌనాన్ని ఛేదిస్తూ అడిగాడు.
అతని కళ్ళల్లోకి చూసింది మానస.
“ఇలా తొందరపెడుతున్నందుకు క్షమించండి. వేరే ఉద్దేశ్యం ఏమీలేదు. మహీధర్ కు వయసు పెరిగితే మన బంధం మీద అతనికి అసహనం ఏర్పడవచ్చు. తండ్రిగా నన్ను అంగీకరించకపోవచ్చు అంతదూరం ఎందుకని” తలవంచుకున్నాడు మాధవ్
“ఆ పరిస్థితి ఇప్పుడే వస్తుందేమోనని నా అనుమానం మాధవరావుగారు. మీరు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినపుడు అందరిలాగే మీరూ అనుకున్నాను. కాని క్రమంగా తెలిసింది మీ ప్రేమలో ఉన్న నిజాయితీ. చాలా ఆనందమేసింది. వెంటనే భయం కూడ వేసింది. దానికి కారణం నన్ను వెన్నంటి వున్న బాధ్యతలు. అమ్మ, నాన్న, మహీధర్. ఈ విషయం మీతో చెప్పినపుడు ఆ బాధ్యతలన్నీ మీవిగా స్వీకరిస్తానన్నారు. మీ మంచి మనసుకు పులకించిపోయాను. కాని మిమ్మల్ని ప్రేమ పేరుతో ఇలా బంధించడం భావ్యమా అనిపించింది. ఇది ఒకటి రెండు రోజులతో ముగిసిపోయేది కాదు. జీవితాంతం భరించాలి. మొదట మొదట ప్రేమ మైకంలో భరించినా రాను రాను భరించలేనిదై మీ అసహనానికి దారితీయవచ్చు. మన మధ్య కలతలకు కారణం కావచ్చు. మహీధర్ మనసు గాయపడవచ్చు. అది నేను సహించలేను. అలా జరగదని మీరనవచ్చు. మనం మనుషులం. రేపు మనకు పిల్లలు పుట్టినా, లేక వద్దనుకున్నా వాడి పనులు మీకు నచ్చనపుడు విసుగుపుట్టవచ్చు. మీలో ఎంత మంచితనమున్నా మీరు వాడి తండ్రి కాదని తెలిసినపుడు మీమీద వాడికి చులకనభావం ఏర్పడవచ్చు. అది నా మనసుకు బాధ కలిగిస్తుంది. ఇప్పటికే వాడికి తనకు తండ్రిలేడన్న విషయం తెలిసిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని తండ్రిగా పరిచయం చేసినా ఆ పసిమనసు అంగీకరించవచ్చు, అంగీకరించకపోనూ వచ్చు. అదీగాక ఇంతవరకూ స్వచ్ఛంగా వున్న మిమ్మల్ని ఈ రొంపిలోకి దించి మీ జీవితాన్ని నాశనం చేయలేను. అన్నిటికంటే ముఖ్యంగా తల్లిగా నా బాధ్యత నిర్వహించాలి. వాడిని నేలమీదకు తెచ్చినందుకు వాడిని ప్రయోజకుడిని చేయాలి. అంతకు మించి నాకు ఏది ముఖ్యంకాదు” ఒక్క క్షణం ఆగింది మానస.
“చాలా దూరం ఆలోచించారు మానస గారు. కానీ నా మనసునే మీరు సరిగా అర్థంచేసుకోలేదు. ఇకనుంచి మహీధర్ మీ బిడ్డ కాదు మన బిడ్డ. తన బాధ్యత మనం కలసి మోద్దాము. నాకు పిల్లలు అక్కరలేదు. నాకు మీరు కావాలి మీ ప్రేమ కావాలి మీరు నవ్వుతూ వుండాలి. నన్ను అర్థం చేసుకోండి” మనసులో మాట చెప్పాడు మాధవరావు.
“మాధవరావు గారు ఆదర్శం వేరు జీవితం వేరు. ఆవేశంలో మనం తీసుకునే నిర్ణయం మన భవిష్యత్తులో మనం పొరపాటు చేశామనే భావన రాకూడదు. రాదని మీరనవచ్చు, కానీ ఇప్పటి వరకు జరిగిన ఇలాటి వివాహాలలో అర్థాలకంటే అపార్థాలే ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అందుకే నేను సాహసం చేయలేకపోతున్నాను. ఒక ఆడదానిగా మగవాడి తోడు కోరుకుంటున్న మనసు ఒకవైపు, తల్లిగా బిడ్డ భవిష్యత్ గురించిన ఆలోచన మరొకవైపు నన్ను సందిగ్ధంలో పడవేశాయి. చివరకు తల్లి ప్రేమ ముందు అన్ని కోరికలు చిన్నవనిపించాయి. అందుకే మీరిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నాను. నన్ను క్షమించండి” మానస కళ్ళు వర్షిస్తున్నాయి.
ఏం మాట్లాడాలో కొద్దిసేపు అర్థం కాలేదు మాధవరావుకు. ఇద్దరి మధ్య మౌనం తాండవించింది.
“ఇక వస్తానండి. మిమ్మల్ని నిరాశపరచి వుంటే నన్ను మన్నించండి. నా మాటలలోని వాస్తవికతను గుర్తించండి. కలసివచ్చిన అదృష్టాన్ని కాలితో తన్ని వెళ్ళిపోతున్నానని మీరనుకోవచ్చు. కానీ ఒక బిడ్డకు తల్లయిన ఆడదానికి ఏ సంతోషమైనా ఆ బిడ్డ సంతోషం తరువాతే” అంటూ బయలదేరడానికి లేచింది మానస.
“మానస గారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా గర్వంగా వుంది. తల్లి అంటే దేవత అని అందరూ అంటుంటే అది కవుల కల్పనని, అంత త్యాగం ఎవరూ చేయరని విన్నాను. కానీ అది నిజమని తల్లిని మించిన వారు ఎవరూ లేరని నిరూపించారు. బిడ్డకోసం ఇంత త్యాగం చేస్తున్న మీలాంటి తల్లికి కొడుకుగా పుట్టడం మహీధర్ అదృష్టం. మీ ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నాను. ఒక్కమాట మీకు ఏ కష్టమొచ్చినా మీకు తోడుగా ఈ స్నేహితున్నాడని మరచిపోకండి. కనీసం అందుకైనా అంగీకరించండి” అంటూ మానస చేయిపట్టుకున్నాడు మాధవరావు.
“మాధవరావు గారు నా నిర్ణయం తప్పో, ఒప్పో తెలియదు. కాని తల్లిగా అది నా బాధ్యత. మీరు మరొకరిని వివాహం చేసుకుని హాయిగా వుండండి. మీరెప్పటికీ నా స్నేహితులే.” మనస్పూర్తిగా చెప్పింది మానస.
“అవన్నీ తరువాత. మీరు నడుస్తున్న దారిలో ఏ ముళ్ళు గుచ్చుకోకుండా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ జన్మకు ఇది చాలు. ” అంటూ వెనుకకు తిరిగాడు.
లీలగా అతని కళ్ళలో నీటిపొర కదలాడింది. ప్రేమ హృదయాన్ని గెలిచిన తల్లి హృదయం తలవంచుకుని ఇంటివైపుకు దారితీసింది.

***********

2 thoughts on “తల్లిని మించి ఎవరు?

  1. నా కథను ప్రచురించినందుకు సంపాదక వర్గానికి ధన్యవాదములు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *