April 17, 2024

నన్నెచోడుడు – “జానుతెలుగు”

రచన: సంధ్య యెల్లాప్రగడ

జాను తెలుగు అంటే అందమైన, స్వచ్ఛమైన తెలుగు అని నిఘంటువు అర్థము. ఆ మాటను 12 వ శతాబ్దాపు కవి నన్నెచోడుడు మొదటిసారి వాడాడు.
శివాచార తత్పరుడై, జంగమ భక్తుడిగా, విలక్షణ శైలిలో రచనలు చేశాడు నన్నెచోడుడు. నన్నెచోడుడు గురించి, ఆయన రాసిన అపూర్వ గంథ్రం ‘కుమారసంభవము’ గురించి చాలా శతాబ్ధాలు తెలియదు తెలుగువారికి. 1909 లో శ్రీ మానపల్లి రామకృష్ణ కవి ప్రపంచానికి ఈ ‘కుమారసంభవ’మన్న అత్యద్భుత తెలుగు ప్రబంధము పరిచయము చేశారు.
ఆ ప్రబంధము రచించిన నన్నెచోడుడి కాలము గురించి పండిత వర్గములో వాదోపవాదముల తరువాత, ఆయన నన్నయ్య, తిక్కన నడిమి కాలపువాడని, క్రీ.శ. 1125 నాటి వాడని తీర్మానించారు.
ఆయన తల్లి శ్రీసతి యని, తండ్రి చోడబల్లి యని, తాను 21 వేయి గ్రామాల అధిపతి అయిన ‘టెంకణాదిత్యుడ’ని చెప్పుకున్నాడు తన ప్రబంధంలో వీరశైవుడయిన కవిరాజు నన్నెచోడుడు.
“కుమారసంభవ”మనే కావ్యమును ప్రబంధముగా, తెలుగులో రాసిన మొదటి కవి ఆయన. అందుకే ఆయనని ఆదికవి అనటములో తప్పులేదని అంటూ ఆరుద్ర గారు “సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర”లో నన్నెచోడుడుని ఇలా అభివర్ణించారు. “ఆదికవి అన్న బిరుదు లేకపోతే పోయింది కానీ నన్నెచోడుడు నిజంగా చాలా విషయాలలో ఆద్యుడు. ప్రతీ ప్రబంధంలోనూ మనం మొట్టమొదట చదివే ఇష్టదేవతా ప్రార్ధన , పూర్వకవి స్తుతి, కుకవి నింద, గ్రంధ కర్త స్వీయ వంశ వర్ణన , కృతిపతి వర్ణన, షష్ట్యంతాలు మొదలైనవి నన్నెచోడుడే మొదలుపెట్టాడు. అది తరువాతి కవులకు ఒరవడి అయింది”.
శైవ కవులలో శిఖరప్రాయులై విమర్శకులచే గుర్తింపబడిన వారిలో నన్నెచోడుడు ప్రథముడు. ఆయన దేశికవితా ప్రవక్త. తెలుగులో మార్గదేశీ పదములను కలిత్వపరముగా మొదట వాడిన వాడు నన్నెచోడుడు.
“మును మార్గకవితా లోకం
బున వెలయగ దేశికవిత బుట్టించి తెనుం
గున నిలిపి రంధ్ర విషయం
బున జనచాళుక్య రాజు మొదలుగ బలువుర్‌”।
మార్గ కవిత్వమంటే సంస్కృత మని, దేశీ కవిత్వమంటే తెలుగు కవిత్వమని ఆయన భావించాడు.
వర్ణనా ప్రధానమైన వస్తు కవిత అతని ధ్యేయము. వస్తువులో, అలంకృతిలో , భావంలో, భాషలో దేశీయత ఉట్టిపడాలని ఆయన ఆశయం.
కావ్యవస్తు ద్రవ్యాలన్నీ దేశీయమై వుండాలి. కవితాభివ్యక్తి కళాసుందరముగా ఉండాలని అభిలాషించాడు.
నన్నెచోడుని కుమార సంభవమందు 12 ఆశ్వాసాలున్న ప్రౌడ ప్రబంధం.
“సతిజన్మంబున్‌, గణాదీశ్వర జననము, దక్షక్రతు ధ్వంసముం, బా/
ర్వతి జన్మంబున్, భావోగ్రవ్రత చరితము, దేవద్విషత్‌ క్షోభమున్,శ్రీ /
సుత సంహారమ్ము, భూభృత్సుత తపము నమాసుందరోద్వాహమున్, ద/
ద్రతి భోగంబుం గుమారోదయము నత డనిం దారకుంబోర ఁగెల్వున్‌” (1-68)
అవి 1. సతీదేవి జననము, గణాధిప జననము 2. దక్షాధ్వర ధ్వంసము. 3. పార్వతీ జననము, శివుని తపస్సు. 4. తారాకాసురుడు దేవతలకు కలిగించిన బాధ, మన్మథుడీశ్వరునిపైకి వెడలుట. 5. మన్మథ సంహారము, పార్వతీ విరహము 6. పార్వతీ తపస్సు 7. ఈశ్వర వటు రూపధారణము, పార్వతీ తపస్సు ఫలితము. 8. ఓషధీప్రస్థపురవర్ణనము, పార్వతీపరమేశ్వరులని వాహనమునకు అంకురార్పణ 9. పార్వతీ పరమేశ్వరుల వివాహము, వారి శృంగారలీలలు. 10. కుమారస్వామి జననము. 11. తారకాసుర, కుమార రాయబారములు, యుద్ధ ప్రారంభము. 12. తారక వధ, కుమారస్వామి విజయము.
నన్నెచోడుని కావ్యతత్త్వ వివేచనలో ప్రసిద్ధమైనది వస్తుకవిత. ‘వస్తు’ అనే పదానకి అలంకారికులు ‘కథ’ అనే అర్థంచెబుతారు.
అంటే“కథాకవిత, కథా కావ్యం” అని భావించవచ్చు. వస్తుమయంగా, కావ్యంగా, అలంకారయుక్తంగా రచించాడని చెప్పుకున్నాడు.
“సరళముగాగభావములు జాను తెనుంగువ నింపుపెంపుతో /
బిరిగొన వర్ణనల్ ఫణితి పేర్కొన వర్థము లొత్త గిల్ల బం/
ధురముగఁ బ్రాణముల్ మధు మృదుత్వ రసంబున గందలింప న/
క్షరములు సూక్తులార్యులకుఁ గర్ణరసాయనలీలఁ గ్రాలగాన్” (1-35)
తాత్పర్యము: భావములు సరళతతోనూ, స్పష్ఠమై అందరికీ తెలిసిన జాను తెలుగు పదాలతో నిండి ఉండాలి.
మరి వర్ణనలు వాక్కు ప్రసిద్ధములుగా ఉండాలి అంటే అవి యెప్పటికీ నోటికి గుర్తుండి పోయే విధంగా ఉండాలి. అర్థములు పొడి పొడిగా కాక ఒత్తుకొనిపొయి సాంద్రతరంగా ఉండాలి. కావ్య జీవములు ఒప్పుగా మృదు మధురంగా అంకురించాలి. అక్షరములు మరియు సూక్తులు పండితులకు వీనుల విందుగా ఉండి మెప్పించగలగాలి. కావ్య రచనను అలా చేయాలి అని ఈ పద్య తాత్పర్యం.
ఇక్కడ కవి “జాను తెనుగు” అనే కొత్త పదాన్ని వాడాడు. అంటే సంస్కృత పద భూయిష్టమైన ‘మార్గ ‘ కవిత్వం కంటే సందర్భానికి తగినట్లు ఉండే తేట తెలుగు మిశ్రమమైన ‘దేశీ’ కవిత్వాన్ని వాడమన్నాడు. జాను అను పదము కన్నడ భాష నుండి వచ్చి చేరినదిగా కనపడుతుంది. “జాణ్ణుడి“ అనగా అందమైన నుడికారము కల భాష అని అర్థం. జానుతెనుగంటే అచ్చతెనుగు, ప్రసన్న, సరసమైన భాష అని చెప్పకనే చెప్పాడు.
‘మార్గ కవిత’ అనగా క్లిష్టమైన ఛందో స్వరూపంలో రాసిన పద్యాలు, ఉదాహరణకు చంపకమాల ఉత్పలమాలలలో అల్లిన పద్యాలు.
దేశీ కవిత్వము సరళ చందస్సుతో కూడుకొని పాడుకోవడానికి కూడా సులభంగా అనుకూలించేదిగా ఉంటుంది
ఉదాహరణకు ‘ఆటవెలది, తేటగీతి మరియు సీసం’ లాంటివి.
నన్నెచోడుడి కవిత్వములో అందమైన తెలుగుతో పాటు మరో అందమైన లక్షణము ఎత్తుగడ.

”పవడంపులత మీద ప్రాలేయ పటలంబు
బర్వెనా మెయినిండ భస్మమలది
లాలితంబగు కల్పలత పల్లవించెనా
గమనీయ ధాతువస్త్రములు గట్టి
మాధవీలత కళిమాలికల్ ముసరెనా
రమణ రుద్రాక్షహారములు వెట్టి
వర హేమలతికపై బురినెమ్మి యూగెనా
సన్నుతమగు నెఱిజడలు బూని”
సీసములో వున్న వర్ణన, తపస్సు చేస్తున్న పార్వతీదేవి గురించి.
ప్రాలేయము అంటే మంచు. మంచు బిందువులతో మెరిసే పగడపుతీగవలె ఉన్నదామె. ఎందుకు? ఆమె మేను సహజమైన కెంపుదనంతో పగడపుతీగలా ఉంది. దానిమీద తెల్లని బూడిద పూసుకుంది. అందుకు. అలాగే లలితమైన కల్పలత (పారిజాతపు తీగ) చిగురించినట్లుగా ఉంది, ఆమె అందమైన కాషాయి వస్త్రాలను కట్టుకొంటే. మాధవీలత చుట్టూ నల్లని తేనెటీగలు మూగినట్లుగా ఉన్నాయామె ఒంటిపై చుట్టుకున్న రుద్రాక్షహారాలు. జడలుగట్టిన ఆమె నెఱికుఱులను చూస్తే అందమైన బంగారు సంపెంగ తీగపై, విప్పారిన నెమలి పురి ఊగుతున్నట్లుంది. మామూలుగా అయితే జడ నల్లని కాంతులతో నిగనిగలాడుతూ ఉంటుంది. కాని తపోదీక్షలో, సంరక్షణ లేక ఆమె కురులు బిరుసెక్కి ఎఱ్ఱెఱ్ఱని రంగులోకి మారాయి. అందుకూ నెమలి పురితో పోలిక.
ఇవన్నీ చాలా అందమైన పోలికలు. అన్నీ ప్రకృతినుంచి తీసుకున్నవే. పార్వతి ప్రకృతి స్వరూపమే కదా మరి! పైగా నాలుగు పోలికలలోనూ మనకి కనిపించేది తీగే. ఆమె శరీరం తపస్సుకి ఎంతగా కృశించిపోయిందో, అయినా తన సహజ సౌందర్యంతో ఎలా శోభిస్తోందో, ఈ పోలిక వల్ల చాలా చక్కగా ధ్వనిస్తోంది.
ఇంతటితో ఆగిపోతే ఇదేమంత పెద్ద గోప్ప వర్ణన అని చెప్పలేం.
ఎత్తుగీతితో యీ వర్ణన స్థాయిని ఎంతో ఎత్తుకి తీసుకువెళ్ళాడు నన్నెచోడుడు.
“హరుడు మాహేశ్వరీ రూపమైన చెలువ
మభినయించెనొ యని మును లర్థి జూడ
గురుతపశ్శక్తి మూర్తి సేకొనిన కరణి
దగిలి యుమ తపోవేషంబు దాల్చి పొల్చె!” (6-82)
అని తేటగీతిలో వర్ణించాడు.
యీ ఎత్తుగీతి చదివేదాకా పార్వతి తపోవేషం సరిగ్గా శివుని రూపాన్ని పోలినదన్న స్ఫురణ మనకు కలగదు. అలా కలగకుండా చాలా జాగ్రత్తగా పద్యాన్ని చెక్కాడు కవి. ప్రతి పాదంలోనూ పార్వతీదేవి వేషధారణ చెప్పడానికి ముందు, దాని గురించిన రమణీయమైన పోలిక చూపించి, మనసుని కట్టిపడేసాడు అసలు వేషమ్మీదకి దృష్టి మళ్ళకుండా. ఇది కవి దృష్టి. ఎత్తుగీతి మొదటి పాదంలో హఠాత్తుగా శివుని రూపాన్ని మన కళ్ళముందు సాక్షాత్కరింప జేసాడు.
అది మునుల చూపు! ఇది గొప్ప పద్యశిల్పం.
ఈ శిల్పం ద్వారా కవి మామూలు మనుషుల చూపుకీ, మునుల చూపుకీ ఉన్న అంతరాన్ని అద్భుతంగా ఆవిష్కరించడం. మనము ప్రకృతి రమణీయకతకి పరవశులమైపోతాం. కానీ మహర్షులు అసలు స్వరూపాన్ని దర్శించగలుగుతారు. ప్రకృతిలో పరమాత్మను దర్శిస్తారు. పార్వతీ పరమేశ్వరులు, ప్రకృతీపురుషులు ఒకటే అన్న జ్ఞానాన్ని పొందుతారు. ఇంత గొప్ప తత్త్వాన్ని అందమైన వర్ణనల మాటున, సీసపద్య శిల్పం ద్వారా చక్కగా ధ్వనింప జేసాడు నన్నెచోడుడు.
ఈ వర్ణనలో మరొక చిన్న విశేషం కూడా దాగి ఉంది!
శివదీక్ష చేపట్టే వారు ఆ శివునిలా రుద్రాక్షలు ధరించి, బూడిదపూసుకొని అతని రూపాన్ని అనుసరించడం ఒక పద్ధతి. నన్నెచోడుడు కుమార సంభవమందు కథా సంవిధానమును సమగ్రపరచి, వస్వైక్యమును సాధించి వర్ణనాత్మక రచనారీతికి ఆద్యుడైనాడు. ఈ కవిరాజ శిఖామణి రచనా చమత్కారము బహుధా ప్రశంసనీయము. ఈయన ప్రతిభాతిశయం కుమార సంభవము నందు అడుగడుగునా దర్శనమిస్తుంది.
మత్తేభాల విక్రీడితాన్ని మత్తేభ విక్రీడితంలోనే చెప్పడం, అలాగే ముద్రాలంకార రచనా పద్ధతికి కూడా ఆద్యుడు నన్నెచోడుడే. పద్యానికి తాను వాడిన ఛందస్సు పేరు ఆ పద్యంలోనే వచ్చేటట్టు రాయడం ముద్రాలంకారం. స్వాగత వృత్త పద్యం రాస్తే అందులో స్వాగతమనే పదం వాడతాడు. క్రౌంచపదం వృత్తంరాస్తే ఆ పేరు ఉండేలా జాగ్రత్త పడతాడు. దానికి ఆద్యుడు నన్నెచోడుడు.
ప్రబంధాల్లో అష్టాదశ వర్ణనలుండాలని నియమం. నన్నెచోడుడు తన కావ్యంలో పద్దెనిమిది వర్ణనలని సంపూర్ణంగా అమలుపరచాడు. చక్కటి తెలుగు నుడికారాలతో ప్రబంధాని పరిపుష్ఠి చేశాడు నన్నెచోడుడు.
తేగీ. “ఎలుక మీదికోపమున ఇల్లేర్చునట్లు
దక్షుపై నల్గి జగమెల్ల నీక్షణంబ
సంహరింపంగ దలచుట సన్నె, వాని
బట్టి తెచ్చెద వడినన్ను బనుపు దేవ.”
ఈ పద్యంలో మొదటి పాదం తెలుగు నుడికారపు సొంపుకు గొప్ప నిదర్శనం.
ఇటువంటి ఎన్నో అచ్చతెలుగు సామెతలనూ తన రచనలో విరివిగా ఉపయోగించాడు.

నన్నెచోడుడు కంద పద్యాలను ఎక్కువగా రచించడమేకాదు, వాటిలో చిత్రమైన ప్రయోగాలెన్నో చేశాడు.
ఈ సర్వలఘు కందం చూడండి..
“తగుదగదని మనమున మును/
వగవగనొడబడగవగవ వగవగ బడయున్/
దగుదగదనివగవనివగ/
వగవగబనీగలదేతనకువగమతిజగతిన్।।”
ఏదైనా పని చేసేముందు అది మంచిదా చెడ్డదా అని ఆలోచించాలి. అలాంటి యోచన చేయకుండా పనికి ఉపక్రమిస్తే అది చేసేవాళ్లకే కాదు లోకానికి కీడు చేస్తుందని ఈ పద్యభావం.
ఇలాంటి సర్వలఘు కందమొకటి మనము పోతన భాగవతంలో చూస్తాము.
నన్నెచోడునిది శాంతిపూర్వక శైవమని కుమారసంభవం నిరూపిస్తుంది. ఆనాడు వాడుకలో ఉన్న కవుల మార్గాన్ని వదిలి దేశీపదాలు, జాను తెలుగును, సంప్రదాయాలు, నానుళ్లకు కావ్య గౌరవం కల్పించి, ప్రబంధ రచనకు మార్గదర్శిగా నిలిచాడీ ‘కవిరాజ శిఖామణి’.

Ref : పద్య కవితా పరిచయం – బేతవోలు రామబ్రహ్మం
సార్వస్వత వ్యాసాలు – నన్నెచోడుడు – దివాకర్ల

1 thought on “నన్నెచోడుడు – “జానుతెలుగు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *