April 25, 2024

ప్రకృతి మాత పాఠం

రచన: విజయ భార్గవి

ఎక్కడో దూర దేశాలలో పుట్టింది…
ఆకారంలో అణువంత, వినాశనంలో విశ్వమంత
వ్యాపించింది వివిధ దేశాలకు, మ్రోగించింది మరణ మృదంగాలని!

అన్నింట్లోనూ అధికున్నీ, నాకేది సాటి అని విర్ర వీగుతున్న మానవుణ్ణి,
ఒక్క క్షణంలో చేసింది అధముణ్ణి, అసమర్ధుణ్ణి !

జబ్బలు చరుచుకుంటున్న విజ్ఞానం కానీ,
అబ్బురపరుస్తున్న నూత్న వైద్య చికిత్సా విధానం కానీ,
తలలు వంచాయి దాని ముందు..నివారణ, నియంత్రణకు దిక్కు తోచక !

అనాది నుండి మానవుడు ఏంతో
మహోన్నతంగా నిర్మించుకున్న ఛాందస భావ కోటలు,
దాని ముందు మట్టి పిడతలే !

మృత్యువుకు లేదు కుల, మత, వర్గ, జాతి భేదo
ధనికుడు, పేదవాడు అని వర్గాలు దానికనవసరం..
నీవు ఎవరైనా, ఎక్కడ ఉన్నా సమయం వచ్చినపుడు
తీసుకుపోతుంది తనతో, ఈ మహమ్మారి రూపంలో..

మృత్యువు రక్కసి కోరలు చాచి కరాళ నృత్యం చేస్తుంది,
విలయ తాండవం సాగిస్తుంది!

మహోన్నతమైన మానవ నాగరికతకు పెను సవాలుగా మారింది,
అనంతమైన అభివృద్ధిని అంధకారంలోకి తోస్తుంది !

అగ్ర రాజ్యాలు, చిన్న దేశాలు అన్నీ సమానమైపోయాయి నేడు…
ఓ మహోన్నతమైన మనిషీ తెలుసుకున్నావా నిజం,
నేడు ప్రకృతి నేర్పుతున్న పాఠం..
ఇది మృత్యు తాండవం కాదు, కరాళ నృత్యం కాదు
గతి తప్పిన, మితి మీరిన, విశృంఖలమైన
నవ నాగరికతకు మనం చెల్లించుకుంటున్న మూల్యం !
ఇదే ప్రకృతి నేర్పుతున్న పాఠం !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *