April 18, 2024

రేపటి వట వృక్షాలు.

రచన: గిరిజారాణి కలవల

మాదాపూర్ లో అదొక గేటెడ్ కమ్యూనిటీ…రో హౌసెస్.. అన్నీ ఒకేలా తీర్చిదిద్దినట్లుండే ఎనభై డ్యూ ప్లెక్స్ విల్లాలు అవి. అక్కడ నివసించే వారు బాగా ధనవంతులూ.. ఉన్నత స్థాయి కుటుంబాలవారే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులూ, డాక్టర్లు, పెద్ద వ్యాపారస్ధులే.
ఇంకా కొందరి పిల్లలు ఫారిన్ కంట్రీలలో స్ధిరపడిపోతే.. పేరెంట్స్ ఇక్కడ ఇళ్లు కొనుక్కుని ఉంటున్నారు. ఎక్కడక్కడ సెక్యూరిటీ గార్డులు ఉండడంతో సేఫ్టీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉంటున్నారు. ఈ ఇళ్ల లో వారందరూ ఏవైనా ఫంక్షన్ లు చేసుకుందికి, వినాయక చవితి, శ్రీరామనవమి పండగలు, ఉత్సవాలు జరుపుకుందికి ఒక క్లబ్ హొస్.. ఆ పక్కనే పెద్దలకీ, పిల్లలకి వేరువేరుగా స్విమ్మింగ్ పూల్స్ రెండు.. వ్యాయామాలకి జిమ్, పిల్లలకి ఆడుకుందికి అన్ని వసతులతో పెద్ద పార్కు.. గ్రీనరీగా మొక్కలు, పూలచెట్లు, వృక్షాలతో ఆ ప్రాంతం చాలా రమణీయంగా ఉంటుంది.. అక్కడ ఇళ్లు కొనుక్కుందికీ, అద్దె కి ఉండడానికి ఇష్టపడుతూ వుంటారు
సాయంత్రం అయితే చాలు వాకింగ్ ట్రాక్ ల మీద పెద్దలూ, సైకిలింగ్ చేస్తూ, పార్కులలో ఆడుతూ పిల్లలూ, చెట్ల కింద వేసిన బెంచీల మీద కూర్చుని సీనియర్ సిటిజన్ ల పిచ్చాపాటీలతో సందడిగా ఉంటుంది.
అయితే ప్రస్తుతం.. కరోనా ఎఫెక్ట్, లాక్ డౌన్ మూలంగా అందరూ తమతమ ఇళ్ల కే పరిమితమయారు.. స్టే ఎట్ హోమ్ అవడంతో ఎక్కడా కోలాహలం లేదు.
32 వ నెంబర్ ఇంట్లో మూర్తి గారు భార్య శారద ఉంటారు.
కొడుకులు ఇద్దరూ అమెరికా లో స్ధిరపడిపోయారు.. తల్లిదండ్రులని కూడా తమతో ఉండమని అంటూంటారు కానీ… వీళ్ల కి అక్కడ నచ్చలేదు.. ఎప్పుడైనా వెళ్లి ఓ ఆరునెలలు ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, మనవలతో గడిపి వచ్చేస్తూంటారు. ఇంట్లో వంటపనికి, ఇంటిపని కి, తోటపనికి ముగ్గురు పనివాళ్ళని పెట్టుకుని.. కాలం గడిపేస్తూంటారు.
ఉదయం నుంచి ఇంట్లో నే ఉండేసరికి విసుగొచ్చి.. కాసేపు చల్లగాలి పీల్చుకుందామని బయటకి వచ్చారు. శారదని కూడా నాలుగడగులు వేసొద్దాం అని పిలిచారు కానీ… కరోనా మహత్యంతో పనిమనుషులు రాక.. ఆవిడే చేసుకోవలిసి వచ్చేసరికి.. నడుం నొప్పి ఎక్కువగా ఉండడంతో ఆవిడ రాలేనని చెప్పడంతో.. మూర్తి గారు ఒకరే.. ఆ వాకింగ్ ట్రాక్ మీద ఓ పది రౌండ్లు వాకింగ్ పూర్తి చేసి..స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్న బెంచీలో కూలబడ్డారు మూర్తి గారు. ఆ ఈతకొలను నిశ్శబ్దంగా.. చిరు కదలికలు మాత్రమే చేస్తోంది. అదీ కేవలం గాలి మూలానే… ఈ కరోనా ఎఫెక్ట్ కనుక లేకపోతే… ఈపాటికి దాదాపు ముఫై మంది పిల్లమూక మొత్తం ఇక్కడే ఉండేవారు గోలగోలగా ఈతలు కొడుతూ.. ఈ నెల రోజులుగా వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది… పిల్లలు ఎవరింట్లో వారు బందీలైపోయారు అనుకున్నారు మూర్తి గారు.
ఇంతలో… గుబురుగా పెరిగిన చెట్ల వెనక నుంచి ఏవో మాటలు వినపడడంతో… ఏంటా అని ఉత్సుకతతో వినసాగారు. అక్కడ ఉన్నది ఎవరోకాదు… పిల్లలు ఏదో మీటింగ్ పెట్టినట్టున్నారు… అందరూ కూడా మొహానికి మాస్క్ లు పెట్టుకుని, సామాజిక దూరం పాటిస్తూ దూరం దూరంగా కూర్చుని ఉన్నారు.
రోహిత్ లేచి నిలబడి మిగిలిన పిల్లలతో.. ” లాక్ డౌన్ మూలంగా బయట చాలా మందికి అన్నం లేదట. ఇందాక టీవీలో చెపుతోంటే విన్నాను. పాపం పనివారు, ఇల్లు లేకుండా రోడ్డు మీదే ఉండేవారు.. వాళ్ళకి ఫుడ్డు దొరకడం లేదట. బస్సులు, రైళ్లు లేకపోవడంతో.. కూలిపనులు చేసుకునేవాళ్ళు వాళ్ళ ఊరికి నడిచే వెళ్లి పోతున్నారట.. పాపం కాళ్లు నొప్పులు వస్తాయి కూడా.. దారిలో హోటల్స్ లేక ఆకలి వేస్తోందట. మా బాబాయి, మా బామ్మ తో, మా మమ్మీతో పులిహోర, పెరుగన్నం చేయించి తీసుకెళ్లి అందరికి పంచుతున్నాడు. తన ఫ్రెండ్స్ కూడా మజ్జిగ, మంచినీళ్లు, ఇడ్లీలు ఇస్తున్నారట.. అవేం సరిపోవడం లేదట. మనం కూడా సాయం చేద్దామా? నేనైతే.. నా కిడ్డిబేంక్ లో ఉన్న మనీ మా బాబాయికి ఇచ్చి.. వాళ్ళ కి కావలసినవి కొనమన్నాను.. మీరు కూడా ఏదెనా సాయం చేస్తారా? “.. అన్నాడు.
నిముషం కూడా ఆలస్యం లేకుండా అందరూ చేతులు పైకెత్తారు.. నేనిస్తా.. నేనిస్తా.. అంటూ..
అందరిలోకి కాస్త పెద్దది… రాఘవ కూతురు వందన లేచి..
” కిడ్డిబేంక్ లోవే కాదు.. విడిగా మనందరం మన పేరెంట్స్ నీ.. తాతయ్య లని అడిగి మనీ కలెక్ట్ చేద్దాం. అసలు ఓ సారి పిజ్జా తెప్పించుకుంటే మనకి ఐదొందలు అవుతోంది. ఇక నుంచి అలాంటి పిచ్చి తిళ్ళ ఖర్చు లు మానేస్తామని అమ్మానాన్న లకి చెబుదాం. ఆ డబ్బులు అన్నీ కలిస్తే బోలెడు అవుతాయి.. వాటితో కూడా మనం చాలా మంది పూర్ వాళ్ళ కి హెల్ప్ చేయవచ్చు… సరేనా.. ఓకె అయితే చెప్పండి ” అంది.
” ఓకే.. ఓకే అంటూ అందరూ బొటనవేళ్ళు పైకెత్తారు.
సిటీ లో ఓ పెద్ద వ్యాపార వేత్త అయిన ముకుందరావుగారి మనవడు.. విక్కీ… ” మమ్మీ పెట్టే బ్రేక్ ఫాస్ట్ లో రోజూ సగం పారేయడమే అయిపోతోంది.. ఇంత పెట్టొద్దు అన్నా కూడా మమ్మీ బలవంతంగా తిను తిను అని ఎక్కువ పెట్టేస్తుంది.. అమ్మ చూడకుండా ట్రాష్ లో వేసేస్తాను… ఈసారి నుంచీ అలా చేయకుండా అమ్మ కి చెప్పి.. ముందుగానే అదంతా నీట్ గా పేక్ చేసి.. బయట రోడ్డు తుడిచేవారికీ.. కచరా తీసుకెళ్ళే అంకుల్, ఆంటీలకి ఇద్దాము.. పాపం.. ఈ కరోనా టైమ్ లో.. ఇంత డేంజరస్ టైములో కూడా.. ఎక్కడా చెత్త ఉంచకుండా నీట్ గా చేస్తున్నారు.. షాపులన్నీ మూసేసి వుంటాయి కదా.. వాళ్లు ఏదైనా కొనుక్కుందికి ఉండవు.. వాళ్ళకి ఏం కావాలో.. మమ్మీ డాడీలని అడిగి ఇద్దాము. అలాగే పోలీసు అంకుల్స్ కి కూడా.. టీ, టిఫిన్ లు ఇద్దాము… మనందరిళ్ళలోనూ మనకోసమే కాకుండా ఇంకొంచెం ఎక్కువ చేయమని చెపుదాము. పాపం వాళ్లు వాళ్ళ ఫేమిలీ లలని వదిలి మన కోసం బోలెడు హెల్ప్ చేస్తున్నారు కదా.. మనం కొంచమైనా చేద్దాం.. ”
” అక్కా.. నాకూ ఓ ఐడియా వచ్చింది” అంటూ.. అపోలో లో డాక్టర్ గారి కూతురు రిషిక..అనేసరికి అందరూ ఏంటి.. ఏంటి అన్నారు.
” ఎవ్విరీ ఇయర్ మన బర్త్ డే లు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము మనందరం.. ఆ హోటల్లో పార్టీకి ఒన్ లాక్ పైనే అవుతోంది.. ఇంకా మనకి కొత్త మోడల్ డ్రస్సులు.. గిఫ్ట్ లు ఇలా బోలెడు మనీ ఖర్చు పెడుతున్నారు మన పేరెంట్స్.. ఇక నుంచి.. అలా చేసుకోవద్దు మనం.. మన బర్త్ డే కి ఎంత ఖర్చు అవుతుందో ఆ మనీ మొత్తం.. పాపం పేరెంట్స్ లేని ఆర్ఫన్ ఛైల్డ్ కి ఏవైనా కొని పెడదామా? మనకి అమ్మానాన్న లు ఉన్నారు.. ఎప్పుడు ఏదడిగినా కొంటారు.. వాళ్ళ కి ఎవరూ లేరు కదా.. ఎవరు కొంటారు.. అందుకే మనందరం కలిసి ఇలా వాళ్ళ కి డ్రస్సులు, బుక్స్, బొమ్మలు .. మంచి ఫుడ్ ఇద్దాము.. వాళ్లు హేపీ ఫీలవుతారు.. ఏమోనబ్బా.. ఈసారి నేనైతే నా బర్త్ డే కి ఇలాగే చేస్తాను. ” అంది
ఎప్పుడూ తుంటరిపనులు చేసే చింటూగాడు…” ఈ సారి నా బర్త్ డే కి మా డాడీ గేర్ లెస్ సైకిల్ కొంటా అన్నారు… ఈసారి ఆ డబ్బులు పెట్టి.. మన వాచ్ మేన్ వాళ్ళబ్బాయి రాజు పోలియో మూలంగా పాపం నడవలేడు కదా.. తనకి హేండికేప్డ్ వాళ్లు వాడుకునే వెహికిల్ కొనియ్యమని చెపుతాను.. నాకు సైకిల్ అసలు అవసరమే లేదు..” అన్నాడు.
” సరే.. అయితే ఇక నుంచి మనందరం ప్రామిస్ చేసుకుందాం.. ఈ హెల్ప్ లు ఇప్పుడు కరోనా వచ్చిందనే కాదు… రేపు కరోనా తగ్గిపోయాక కూడా మనందరం వేస్ట్ పనులకోసం.. మనీ ఖర్చు చేయకుండా.. ఎవరికి హెల్ప్ అవసరమో చూసి.. పెద్దవాళ్ళ సజెషన్స్ తో ఇలాగే ఏవైనా మంచి పనులు చేద్దాం..” అంటూ చివరగా వందన చేసిన ప్రతిపాదన కి అందరూ తమ తమ చిట్టి చేతులు ముందుకు చాపి.. అలాగే చేస్తాము.. అంటూ ప్రతిఙ్ఙ చేసారు.
” అంతేకాకుండా… ఇప్పుడు ఇంకోటి కూడా చేద్దాం… ఇప్పుడు మన ఎవరిళ్ళకీ సర్వెంట్ మెయిడ్స్ రావడం లేదు కదా.. మన మమ్మీ డాడీలే ఇంటి పనంతా చేసుకుంటున్నారు.. మనం కూడా వారికి హెల్ప్ చేద్దాం.. ఈ హెల్ప్ మనింట్లోనే కాదు… మన కమ్యూనిటీ లో మూర్తి తాతయ్య ఇంట్లో, రాజారావు తాతయ్య ఇంట్లో, దేవకి అమ్మమ్మ ఇంట్లో.. ఇంకా మేజరు తాతయ్య కిషన్ సింగ్ గారు పాపం ఒక్కరే ఉంటారు కదా.. ఆయనకి కూడా మనం సాయం చేద్దాం.. వీళ్ల పిల్లలు అమెరికాలో ఉండిపోయారు.. వీళ్లు పెద్దవారు కదా చేసుకోలేరు.. అందుకే మనం వీళ్ళింట్లో ఏం అవసరమో ఆ పని చేద్దాం.. మాస్కులు వేసుకుని, చేతులు శుభ్రంగా కడుక్కుని.. గిన్నెలు కడిగిపెట్టి, ఇల్లు వాక్యూమ్ చేసి వద్దాం.. రోజుకు మనం ఒకొక్కరం వంతులవారీగా.. ఎవరైతే కుక్ లేకుండా చేసుకోలేక పోతున్నారో.. ఎవరికైతే హెల్త్ బావుండలేదో.. అలాంటి సీనియర్ సిటిజన్ లకి మన ఇళ్ల లో నుండి బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ తీసుకెళ్లి ఇద్దాము.. వాళ్లు మనకి బోలెడు ఫారిన్ చాక్లెట్ లూ.. మన బర్త్ డేలకి మంచి మంచి గిఫ్ట్ లు ఇచ్చారు కూడా.. ఇప్పుడు మన సహాయం వాళ్ళ కి చాలా అవసరం.. సరేనా.. నాతే పాటుగా మీరూ ఈ హెల్ప్ లు చేస్తారా? ” అంది వందన.
ఈ మాటలు వింటున్న మూర్తి గారి మనసు తెలియన ఉద్వేగంతో నిండిపోయింది.. చిన్న పిల్లలకి ఎంత పెద్ద మనసు.. ఆ పసిమనసులలో ఎంతటి ఉన్నతభావాలు..
అల్లరి చేస్తూ.. ఎప్పుడూ ఆటపాటలతోనూ లేకపోతే ఫోన్లు, టాబ్ లు పట్టుకుని వీడియో గేమ్స్ ఆడుకుంటూ.. పిజ్జాలు, బర్గర్ లూ, ఐస్ క్రీమ్ లు అంటూ ఖరీదైన చిరుతిళ్ళు తింటూ.. వేసవి శెలవలలో ఫారిన్ ట్రిప్ లు మాత్రమే తిరుగుతూ.. నోట్లో బంగారం స్పూన్ లతో పుట్టిన ఈ చిన్నారుల నోట.. ఈరోజు ఎంతటి ఉదాత్తమైన ఆలోచనలూ.. ఆశయాలూ.. ఈ మార్పు ఎలా సాధ్యమయింది? ఇంతటి ప్రక్షాళన ఎలా జరిగింది? ఒక ఐడియా జీవితాన్నే మార్చింది అన్నట్లు .. ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఈ కరోనా మహమ్మారి.. పరిసరాలతోపాటుగా.. ఎందరి మనసులని ప్రక్షాళితం చేస్తోంది.. మంచి మనసులుగా ప్రభావితపరుస్తోంది.
ఈ పచ్చని మొక్కల మధ్య.. ఈ చిగురించే పుష్పాలు ఈ పిల్లలు… వీరిలో వెల్లివిరుస్తున్న మానవత్వం..పరిమళించాలి. ఇలాగే పెరిగి పెద్దయి వీరు ఒకొక్కరూ ఒకో వటవృక్షం అయితీరుతారు. ఆ నీడలో ఎంతోమంది ఆర్తులకి, ఆపన్నులకి ఆసరా తప్పకుండా లభిస్తుంది అనే నమ్మకం కలిగింది మూర్తి గారికి. చప్పట్లు కొడుతూ వారి ముందుకు వచ్చి.. అభినందనలు.. శతమానం భవతి అంటూ ఆశీస్సులు అందజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *