April 22, 2024

సరుడు

రచన: పద్మజ కుందుర్తి

నానబెట్టి వడేసిన నూకల్ని రొట్లో వేసి అదరాబదరా దంచుతున్న కాసెమ్మని గోడమిదుగా చూసి,” ఏందొదినో! మంచి వుసిమీద వుండావూ ….ఏంది కత? ఈరోజు మాయన్నకు పలారం వొండి పెడతన్నవే ….ఏంది సంగతీ …” కుశాలగా అడిగింది, పక్కింటి లచ్చిమి.

“పెద్ద పలారమేం గాదులే ..కూసింత పాలతాలికలు జేద్దామనప్పా! శానాదినాలాయె పాలతాలికలు జేసి, మీయన్న పొద్దస్తమానుం అడుగుతా నా పెయ్య దీస్తుంటే …ఇప్పటికి కుదిరింది మరి.” సమాధానం జెప్పింది కాసెమ్మ.

“సర్లే తూర్పు పొలం లో ఈ రోజు కలుపుతీత…ఆడలేకపోతె పన్లుగావు నాకు, పోయొస్త వొదినో …నాక్కూడా కూంతె బెట్టు మరి” నవ్వుతా సెలవు తీసుకుంది లచ్చిమి.”దీని దూం దగల ..దీని కళ్ళనే బడితిమి ద్యావుడా ….దీనికియ్యకుంటే సేసింది తిన్నా అరిగేది ల్యా …..” అనుకుంటా, రోట్లో పిండి తీసి జల్లెడ పట్టింది కాసెమ్మ.

గ్యాసుపొయ్యి ఏడిజాల్దు, కట్టెల పొయ్యిమీదొండితేనే పాల్తాలికలకు మాదొడ్డ రుసి ….అనుకుంటా కొస్టంలో కిబొయ్యి నాలుగు కట్టెపుల్లలు ఇరిసి కట్టగట్టుకుని దొడ్లో పొయ్యికాడ పడేసి, ఇటికెలు సరిజేసి పొయ్యిరాజేసింది.పోతిత్తడి గిన్నెలో చిక్కని గవిడిగేదెపాలు పోసి పొయ్యికెక్కించి,గుండ్రాయి తుడిచి బెల్లం చితక్కొట్టి పక్కన బెట్టుకుంది.

“ఓర్నీ! యాలుక్కాయలు మర్సి పోయానే ….” అనుకుంటా పొయ్యిలో రెండు పుల్లలు యెనక్కితీసి మంట తగ్గించి, వీధివాకిట్లో ఎవురన్నా పిలకాయలు కనబడతరేమో …. అని నిలబడి సూస్తాఉంటే, కటారోళ్ళ పిలగాడు కనిపించాడు.” ఒరే సిన్నా !ఒకైదురూపాయిల యాలక్కాయిలు బిర్నీ పట్రాఫో ….లగెత్తు ” అని వాణ్ణి పంపించింది. వాడొచ్చేలోగా పొయ్యిమీద పాలుచూసి, ఒక బెల్లమ్ముక్క సేతబట్టుకుని వీధిలోకి పోయి వాడు రాంగనే పొట్లం దీసుకుని, బెల్లమ్ముక్క నవ్వుతా వాడికిచ్చింది “తినుకుంటా ఇంటికిబో ” అనుకుంటా ఇంట్లోకొచ్చింది.

కాసెమ్మ ఇంత కుశాలుగా ఉండటానికి కారణం. ఇయ్యాల మొగుడు బాంకీలో కుదువపెట్టిన తన ‘సరుడు’ ఇడిపించి తీసుకొస్తానని పట్నం పోవటమే. ఇయ్యాళా ..రేపా ?పదేళ్ళనాడు సేయించిన సరుడు.! పెళ్ళయిన పదేళ్ళకు మొగుణ్ణి అడిగీ, అడిగీ బతిమాలీ బామాలీ సేయించుకున్న సరుడు! సేయించుకున్నాక ఆర్నెల్లుకూడా మెళ్ళో యేసుకోలా. ఎప్పుడూ ఎదోవొక కర్సు ..ఇడిపించిన ముచ్చట తీరకుండనే మళ్ళీ నాటు కూలీ కనో, కలుపు కూలీకనో, కళ్ళాల కూలీకనో అది బాంకిలోనే పడుండేది.

పెళ్ళికి ముందునించీ ఆ సరుడు అంటే ఎంతో మోజు పెంచుకుంది తను. పెళ్ళికుదిరింది అనగానే నానమ్మ ” ఏం సంబంధం తెచ్చినావురా కొడుకా! ఒట్టి అతకలమారి సంబంధం! మెళ్ళోకి సరుడైనా చేపించలేని వాళ్ళు, పిలగానికి మాత్రం ఐదెకరాల భాగం పంచుతారంట! అసలది నిజవో కాదో తేల్చుకోండి ముందు.సరుడు కూడా లేకుండా పసుపుతాడేసుకుని తిరగాల్నేవో పిల్ల …మీ తాతా ఇంతేనే తల్లీ ..కనీసం సరుడుకూడా సేపిచ్చకుండా రోజులు ఎలమార్చుకోని పొయ్యాడు. అందుకే నా కోడలికి కర్సులో కర్సు అని పెళ్ళిలోనే సరుడు చేపిచ్చా” అంటూ చెప్పింది.

అప్పటిదాకా సరుడంటే, పెద్దగా పట్టిచ్చుకోకపోయినా మనసులో ఏదో మూల సరుడు చేయించుకోవాలన్న కోరిక పెరిగిపోయింది తనకు.”ఐదెకరాల ఆసామీ …దేవుడు దయజూత్తే, రెండేళ్ళ పంటసాలు సరుడెంతసేపు చెయిత్తాడ్లే అమ్మా!” అని నాన్న పెళ్ళిలో దాటేశాడు. ఆతరువాత ఆ మాటే మర్చిపోయాడు కట్టుకున్న పెనిమిటి.

పెళ్ళయినాక,అత్తా మామా ,మరుదులూ, వాళ్ళ పెళ్ళిళ్ళూ, తనకు పుట్టిన ఇద్దరాడపిల్లలూ, కాస్తో కూస్తో వాళ్ళ చదువులూ, కర్సుల మీన కర్సులు తోసుకొస్తున్నా, అంతో ఇంతో కస్టపడి కూడబెట్టి మొగుణ్ణి బతిమాలి చేయిచ్చుకుంది ఆసరుడు. అది మొదలు ఇంట్లో ప్రతి పెద్దఖర్చుకూ అదే ఆసరా అయింది తమ కుటుంబానికి. ఇన్నాళ్ళకి, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి, అత్తామామా కాలం జేసి కొద్ది ఊపిరి పీల్చుకునే రోజులొచ్చినయ్.

ఇప్పటికైనా సరుడు మెళ్ళో ఏసుకోవాలనే కోరిక పెచ్చుమీరతావుంది కాశెమ్మకి. ఆడపిలకాయిలిద్దరికీ పెళ్ళిమాటల్లోనే పట్టుబట్టి సరుడు చేపించింది. ఆళ్ళ పెళ్ళిళ్ళకి గూడా కరుసులు సాలక మళ్ళా బాంకీకే పోయింది సరుడు. ఇప్పటికైనా అప్పిసం మెళ్ళో ఏసుకోవాలని తెగ ఇదైపోతొంది కాశెమ్మ మనసు.

పొదుపు గ్రూపుల్లో దాచిన పాతికవేలు మొగుడిచేతిలో పెట్టి, ఇంకాస్త సర్దుబాటుచేసి సరుడు ఇంటికితెమ్మని చెవినిల్లుకట్టుకొని ఒకటే పోరతాంది. పెద్దపిల్లగూడా మొన్నే ఫోనుచేసి “అమ్మ సరుడు తే నాయినా! ఎప్పుడూ బాంకీకి అప్పచెప్పేదేనా. అమ్మకు కూడా కాస్త సరుడు మోజు తీరనీ …..మా యత్తకూడా ఎప్పుడూ పసుపు తాడేసుకుని తిరుగుద్ది మీయమ్మకు సరుడుకూడాలేదా? అంటుంటే నాకూ సిన్నతనం గా ఉండాది.” అని వత్తాసు పలికింది.

సిన్నదేమో నాయినబిడ్డ!”ఏందిమా..ఎప్పుడూ సరుడో……. అంటా నాయిన ఉసురుతీత్తావు.ఎంత కస్టింజేత్తున్నాడు మా నాయినా! కాసించ చెయ్యి వెసులుబాటు కానీ, నీసరుడేమన్నా అమ్ముకు తిన్నడా? బద్రంగా బాంకీలోనే గదా దాసిపెట్టిండేటిదీ ……తెత్తాడులే …వూకే నసపెట్టమాకమా!” అని గసురుద్ది. కంసాలి షాపులో పదిరకాలు సూసి, బంతిపూల గొలుసైతే దొడ్డగా, మెరుపుగా ఉంటాదని ఆ రకమే సేయిచ్చుకుంది.

బతకని బిడ్డ బారెడనీ, ఎప్పుడూ బాంకుల్లోనే పడుండి కూసింత కూడా మెరుపు తగ్గలా!ఎప్పుడన్నా మొళ్ళో ఉన్న నాల్రోజులూ, ఏమాట కామాటే ….నెత్తిమీద తురాయి పెట్టుకున్న దొరసానిలాగుండేది మనసు. కోరుకున్న ఒక్కకోరికా మనుసుతీరకుండానే, పత్తికి తెగులొచ్చిందనో, పుగాకుకి పచ్చతెగులొచ్చిందనో, సరుడుకి కాళ్ళొచ్చి బాంకీ బాట పట్టేది. నూటికి పది వడ్డీలు కట్టలేక, పెళ్ళాం తిట్లన్నీ భరించి, మెదలకుండా సరుడు పొట్లాకట్టుకుని, జేబులో ఏసుకుపొయ్యేవాడు పెనిమిటి.

పాలూ, బెల్లం పొంగి తెర్లు రాంగనే, పిండి గిద్దల్లో పెట్టి తాలికలు పాలల్లోకి నొక్కింది. అడుగంటకుండా నెమ్మదిగా గంటెతో కలబెడతా….పొడికొట్టిన యాలకులు పోసి ఉడికినాక మసిగుడ్డతో దించింది. దేవుడిగూడు కాడ పెట్టి దణ్ణం పెడుతుండగానే వాకిట్లో మరిది కేక “వొదినమ్మా!” అంటా వినపడింది.

“రాయ్యా! ఏంది వోకిట్లోనే నిలబడుకున్నావూ! లోనకిరా”అంటా మరిదిని పిల్చి కుర్చీ జరిపింది,కూచోమన్నట్లుగా. “ఏందొదినమ్మో! ఇల్లుమొత్తం గుమగుమలాడతాంది! మాయన్నకోసం పాలతాలికగానీ సేసినావా?” వొదినసేతి పాలాలతాలికల రుచితెలిసిన మరిది వెంటనే గుర్తుపట్టాడు. “అవునబ్బాయా! అయ్యే వొండినా ఇప్పుడే! కాసినితిందూగాని కూసో! మంచినీళ్ళేమన్నా గావాల్నా?”అని ముసిముసిగా నవ్వుకుంటా ఇంట్లోకి బొయ్యి, చిన్న గాజుకప్పులో పాలతాలికలూ, రెండోసేత్తో మంచినీళ్ళ గ్లాసూ పట్టుకొచ్చింది కాశెమ్మ.

జేబులోంచి గులాబీరంగు కాయితం పొట్లం తీసి, వొదినచేతిలో పెడుతూ “అన్నాయి ఇదినీకిమ్మని నా చేతికిచ్చి పొలం పోయాడొదినా,ఓగంటలో వొస్తాడంట”అని చెప్పి చెంచాతో పాలతాలికల రుచిని ఆస్వాదిస్తూ,”ఏవైనా పాలతాలికలంటే నువ్వేజేయాల వొదినమ్మా!అబ్బో రుసి ఎంత బాగుండాయో.అందుకే మా అన్న ఇంకెవరు పెట్టినా తినడు. నువ్వు జేత్తే ఆ రుసే అలాదు.”
అనుకుంటా అస్తారుబతంగా తిని, అన్నొచ్చాక మళ్ళొస్తాలే”అంటా వీధిలోకి పొయ్యాడు.

మరిదిని వీధిలోకి పోనిస్తూనే చేతిలోని పొట్లాన్ని అపురూపంగా విప్పింది కాశెమ్మ. పొట్లం లో మెరిసిపోతా ముచ్చటగా, వొద్దిగ్గా చుట్టగా చుట్టున్న సరుడుని ఆప్యాయంగా చేత్తో తడుముకుంది. తెల్లని పొట్లాల దారం గూళ్ళలో వెతుక్కుని దొడ్డిగడపలో గట్టుమీద కూర్చుని దారం తొడమీద మెలేసి సూత్రపు తాడు పేనుకుంది.

ఇంతలో గోడమీదుగా లచ్చిమి “వొదినా మాన్నింకా ఇంటికి రాలేదా ఏంది? బో తీరిగ్గా కుసున్నావ్” అంటా పలకరించింది. కాశెమ్మ నవ్వుకుంటా…”అట్టా తిరిగి వీది వాకిల్న రా!”అంటా ఇంట్లోకి పోయి,కాలెండరు చూస్తా… ఇయ్యాళ మంగళోరం గదా! మెళ్ళో రేపు ఏసుకుందాం లే సరుడు అనుకుంటా, ఇంట్లోకొచ్చిన లచ్చిమి ని “రావొదినాని పిల్చి, చిన్న గాజు కప్పులో పాలతాలికలు పెట్టింది.

“వూరకే సర్దాకన్న వొదినా! అన్నీ మాకే బెడతన్నవ్ మా యన్నకుంచావా అసలూ …”అంటా తాలికలు తింటా “నీ సేతిలోనే ఉన్నదొదినా రుసి” అని తెగమెచ్చుకుంది. “ఇదిగో వొదినా ఇయ్యాలే తెచ్చాడు మీయన్న, బాంకినుంచి నా సరుడు.” అని కులుకుతా, పొట్లం లోని సరుడు చూబిస్తున్న కాశెమ్మని ఎక్కెసెక్కెలాడతా…. “అదీసంగతి! మావొదిన ముకం పొద్దుటినుంచీ సీమ సవురు పోసిన దీపమల్లే ఎలగతాంది, ఏందబ్బా అనుకుణ్ణే …..ఇదా సంగతీ,మాయన్నకి ఇందుకేనా పాలతాలికల పలారంపెట్టేది ఇయ్యాలా….అని కాశెమ్మని బుగ్గమీద పొడిసింది.

“సాల్లే సరసాలు! మీయన్న దీన్ని నామెళ్ళో ఎన్నాళ్ళుంచుతాడ్లే! కోతకూలీ లనో,పచ్చాకు కూలీయనో సల్లంగ దీస్కపోయి యా బాంకీలోనో కుదువబెట్టడా ఏందీ? అన్నది కాశెమ్మ. “వొదినో మాయన్న మంచోడు. పొలం అమ్మకుండా , నీ సరుడు అమ్మకుండా, గుట్టుగా ఎగసాయం జేసి తమ్ముళ్ళూ, సెల్లెళ్ళూ రాకపోకలు జూసుకుంటా ఇద్దరాడపిల్లల్ని సదివిచ్చుకోని పెళ్ళీపేరంటాలు జేసుళ్ళా…అప్పోసొప్పో జేసాడుగానీ అయినకాడికి పొలమమ్మలా! మాయన్న అసుమంటోడు దొరికేది నీయదృష్టమనుకో …”తేల్చి చెప్పింది లచ్చిమి.

మురిపెంగా మూతి మూడొంకర్లు తిప్పి, “అబ్బో! బో జెప్పిందమ్మా బాశాలీ ……నేను మాత్రం ఇంట్లో అడుగుపెట్టింది మొదలూ రాణీవోసం జేసినానా? గొడ్డుగోదా మేపుకోనీ, గెనాలమీద గడ్డికోసీ,కాయకష్టిం జేసుళ్ళా? మొన్నటిదాకా ముసిలోళ్ళని కాసుకోలా?నీ యన్న ఎనకాల చేలో నాట్లకీ కోతలకీ, పొగాకు దిబ్బల్లో నారు పీకేదానికీ పోలా? కష్టిం సుకం పంచుకుంటేనేగా సంసారం ఈడకొచ్చిందీ!…అంతామీయన్నగొప్పేనా యేందీ?”అని యాస్టపడింది.

ఇద్దరూ ఆరకంగా ముచ్చట్లాడుకొంటుంటే ….మరిది వీదివాకిలి తీసుకొని అదరాబదరా వొచ్చేడు.ఆయాసపడతా నిలబడుకోనున్న మరిదిని చూచి, “ఏందబ్బాయా!ఎసపోతన్నావ్ ఏమైంది” అనుకుంటా లేచింది కాసెమ్మ. “పొలంనుంచి తిరిగొస్తా రాజిరెడ్డి ట్రాక్టర్ ఎక్కినాడంట అన్నాయి! గనిమె జారి ట్రాక్టర్ తిరగబడినాదంట! అన్న కిందకుపడి, ట్రాక్టర్ మీదపడినాదంట వొదినమ్మా!”గసపెడతా చెప్పాడు మరిది.

“వామ్మో! ఏమైందిరయ్యో నా పెనిమిటికీ ….” శోకాలకు లేచింది కాశెమ్మ. “నూటెనిమిదికి ఫోన్ జేశారంట, నేనిప్పుడే పొలం కాడికి పోతన్నా. ఆసుపత్రికి పొయ్యేదానికి సర్దుకోనుండు అంటా పరిగెత్తాడు మరిది. కుప్పకూలిన కాసెమ్మని లచ్చిమి “ఏంకాదులే వొదినా అన్నకి” అని ధైర్యం చెబుతుండగానే ఇరుగూ పొరుగూ అందరూ గుమి గూడారు. “అయ్యో! ఏమైందీ అంటా విచారణ మొదలుపెట్టారు.

ఇంతలో వాకిట్లోకి వచ్చిన నూటెనిమిది అంబులెన్స్ లో మొగుణ్ణి తీసుకొచ్చారు. నిలువెల్లా రక్తం తో తడిసున్నాయి తెల్లని లాల్చీ పంచే రెండూ. మోగుణ్ణి అలాచూస్తూనే కుప్పకూలి పోయింది కాసెమ్మ.ప్రాణానికి వొచ్చిన ఇబ్బందేమీ లేదనీ, ఎముకలూ అవీ ఎక్కడెక్కడ విరిగాయో పెద్దాసుపత్రి కి తీసుకుపోతేగానీ తెలీదనీ చెప్పారు అందులో సిబ్బంది.

ప్రాణాపాయం లేదని చెప్పాక, కొద్దిగా తేరుకున్న కాసెమ్మ ఇంట్లోకి పరుగెత్తి చీరా, దుప్పటీ సంచీలో కుక్కోని, బైటికొస్తుంటే గుర్తొచ్చింది! “ఇంట్లో వెయ్యి రూపాయిలు కూడా లేవు. ఆసుపత్రికి పొయ్యాక ఎట్లా? ఎంతకరుసవుద్దో ఏమో? భగవంతుడా” అని గుమ్మం పట్టుకు నిలబడ్డ కాసెమ్మకి, చటుక్కున గుర్తొచ్చింది పట్టెలోని సరుడు!
“అబ్బాయా!” అంటా మరిదిని కేకేసింది. “సేతిలో డబ్బుల్లేవు ఎలాగా” అంటావుంటే “నాకాడ పదేలున్నై వొదినా అయ్యే తెత్తన్నా” అన్నాడు. “అయ్యి సాలవుగాయ్యా! ఈ సరుడు కోమటి కిట్టయ్య కాడ కుదువబెట్టి, ఇచ్చిన కాడికి డబ్బులుతే….” అని నిట్టూర్చి ఇంటికి తాళం పెడుతుంటే లచ్చిమి అదరాబదరా వొచ్చి రెండేలు గుప్పిట్లో పెట్టి “కరుసులకు గావాలిగా వొదినా ఉంచు అన్నొచ్చి నీ చెయ్యి వెలుసుబాటు అయినాక ఇద్దువులే” అని గుప్పిట మూసింది.

కళ్ళనీళ్ళు తిరుగుతుండగా లచ్చిమి వైపు కృతజ్ఞతగా చూసి గోడమీది వెంకన్న పటానికి దణ్ణం పెట్టి, పసుపు తాడుకి కట్టున్న మంగళసూత్రాలని కళ్ళకద్దుకోని నూటెనిమిది బండెక్కింది కాసెమ్మ.

12 thoughts on “సరుడు

 1. Chaalaa baagundi….intha baagaa raasaaru …patrikallo mee peru eppudu choodaledu….vichaarakaram….
  maandalikam chaalaa baagundi….
  Excellent…keep writing madam…

  1. చాలా బావుంది సబ్జక్టు ముఖ్యంగా లాంగ్వేజ్…

  2. థాంక్యూ సో మచ్ అండీ. మనండలికం లో రాయాలని నేను చేసిన ప్రయత్నానికి మీ అభినందనలు లభించినందుకు సంతోషం. ధన్యవాదాలు

  3. ధన్య వాదాలు సర్ నా ప్రయత్నం మీకు నచ్చినందుకు థాంక్యూ

 2. చాలా బాగా రాసారు పద్మజా! మాండలీకంలో భావం ఎక్కడా చెదరకుండా… పల్లెజీవనంలో, రైతుకుటుంబంలో బంగారం ఏదో అవసరానికి ఎలా తిరుగుతూంటూనో చాలా వివరాలతో చెప్పారు. పాలతాలికలంత మధురంగా ఉంది.

  1. థాంక్యూ సో మచ్ శశికళగారూ. మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది

 3. బంగారం వొంటి మీదకన్నా తాకట్టులో ఉండడమే ఎక్కువైన సంసారాల కథ కళ్ళకు కట్టినట్లు చెప్పారు .మాండలిక పదాలు భలే వాడతారు ,అస్తారుబతంగా ,బాశాలి ,వాడుతూంటేనే కదా పదాలు జీవంతంగా ఉంటాయి .

  1. అవునండీ. మాండలికం లోని పదాలు చాలావరకూ కనుమరుగు అవుతున్నాయి. వాటిని మళ్ళీ వాడుక లోకి తెచ్చే ప్రయత్నం చెయ్యాలి. వివిధ మాండలికాలూ అందులోని పద ప్రయోగాలూ గమనిస్తే ఎంత బాగుంటాయో. ధన్యవాదాలు మీకు నచ్చినందుకు ఆనందంగాఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *