April 16, 2024

కంభంపాటి కథలు – పెద్దమ్మాయిగారి కథ

రచన: కంభంపాటి రవీంద్ర

‘మధ్యాన్నం బోయనానికి ఇంటికొచ్చెయ్యి .. నిన్ననే దవిలేశ్వరం నుంచి పులసలు తెప్పించి పులుసు కాయించేను .. పైగా మా ఆవిడ ఇయ్యాల ఉదయం పెరుగావడలు చేసింది.. నిన్న ఎండబెట్టిన ఉసిరికాయ వడియాలు ఎండేయంట .. అవి కూడా టేస్టు చూద్దూగాని .. మళ్ళీ మీ హైద్రాబాదు వెళ్ళేవంటే ఇవన్నీ దొరకవు ‘ అంటూ ఉదయాన్నే లోవరాజు ఫోను
‘ఇవన్నీ ఏమో గానీ .. హైదరాబాద్ వెళ్ళేనంటే నీ కధలు మట్టుకు దొరకవు ‘ అన్నాను
‘నీ తెలివి తెల్లారినట్టే ఉంది .. కధలైతే ఫోన్లోనైనా చెప్పుకోవచ్చు .. వంటలు ఫోన్లో తినగలవేంటీ ?.. తొరగా ఇంటికొచ్చెయ్యి ‘ అంటూ ఫోనెట్టేసేడు
ఆ రోజు మధ్యాన్నం వాళ్ళింట్లో భోంచేస్తూ అడిగేను .. ఈ ఉసిరి వొడియాలేంటీ .. ఎప్పుడూ తిన్లేదు ?’
లోవరాజు వాళ్ళావిడ చెప్పింది .. ‘మా పుట్టింటాళ్ళుండే కైకవోలు లో ఉంటారు .. పెద్దమ్మాయి గారని .. ఆవిడ నేర్పించేరు ‘
‘ఈడికి ఆవిడ స్టోరీ చెప్పు.. భలేగా ఉంటాది ‘ అన్నాడు లోవరాజు, చేపల పులుసేసుకుంటా .
‘ఆవిడి స్టోరీ చెప్పాలంటే .. అనన్య మిశ్రా గురించి చెప్పాలి ‘ అంది
‘అనన్యా మిశ్రా నా? ఇదేదో హిందీ పేరు లాగుందే ?’ అన్నాను
‘అవును. హిందీ అమ్మాయే . వాళ్ళాయన ఓఎన్జీసీ లో ఆఫీసరు .. పెళ్లి చేసుకున్నాక .. ఏదైనా అచ్చమైన పల్లెటూరి వాతావరణం లో ఉండాలని సరదా అట అతనికి .. అందుకే .. కాకినాడకి దూరంగా నుండే మా ఊళ్ళో పెద్దమ్మాయి గారి మేడలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు ‘ ఆసక్తిగా వింటున్నాను
పేరుకి పెద్ద మేడ గానీ .. ఆ ఇంటి మొత్తానికీ ఆ పెద్దమ్మాయిగారొక్కరే ఉండేవారు . పిల్లలు కొందరు అమెరికా లోనూ .. ఇంకొందరు ఆస్ట్రేలియాలోనూ సెటిలైపోయేరండి .. ఆళ్ళెప్పుడూ వచ్చేవాళ్ళు కాదు .. ఆళ్ళు ఇక్కడికి రాని కాడికి నేను మటుకు అక్కడికెందుకూ వెళ్లడం అని ఆవిడ ఆ ఊరు దాటి కదల్లేదు . పన్నెండు గదుల మేడలో ఓ రెండు గదుల వాటా మట్టుకు నెయ్యమ్ముకునే ఓ పేద బ్రేమ్మలాయనకి అద్దికిచ్చి, మిగతా ఇల్లు ఆవిడే ఉంచుకుంది
ఆ ఇంట్లోకి అద్దెకి దిగేరు కొత్తగా పెళ్ళైన ఓఎన్జీసీ ఆఫీసరు గౌరవ్ కుమారు, అతని భార్య అనన్యా మిశ్రా.
మొగుడి సరదా కాదనలేక ఆ అమ్మాయి ఒప్పుకుంది గానీ .. అసలా పల్లెటూళ్ళో ఉండడం ఆ పిల్లకి ఏమాత్రమూ ఇష్టం లేదు . ఎవ్వడూ హిందీ మాట్లాడడు, హిందీ వాళ్ళ తిండి దొరకదు .. అప్పటికీ ఎప్పుడైనా వీలైనప్పుడు వాళ్ళాయన కాకినాడ తీసుకెళ్లి హోటళ్లలో తినిపించినా, ఎప్పుడెప్పుడు ఈ ఊరినుంచి పారిపోదామా అన్నట్టు ఉండేది .
ఇలాంటి పరిస్థితుల్లో ఆ గౌరవ్ కుమారుకి ఏదో కేంపు వెళ్లాల్సిన పని పడింది . భార్యని తనతో తీసుకెళ్లలేని పరిస్థితి .. ఏమైనా అవసరమైతే సాయం చేసిపెట్టమని పెద్దమ్మాయి గారికి చెప్పి వెళ్ళేడు .
ఆ రోజు సాయంత్రం, అనన్య వాళ్ళ ఇంటి తలుపు తట్టిన పెద్దమ్మాయి గారు ‘నాలాగా నువ్వూ ఒక్కదానివే ఉన్నావు కదా .. అందికే ఈ పూట మనిద్దరికీ కలిపి వంట చేసేసేను, అని అరిటాకు తో మూటబెట్టున్న ఓ కంచం ఆ పిల్లకి ఇచ్చి వెళ్ళిపోయేరు . ఆవిడ చెప్పిన ఒక్కమాట కూడా అర్ధం కాకపోయినా, తినడానికి ఏదో తెచ్చేరని మటుకు అర్ధమైంది ఆ పిల్లకి !
ఈ సౌతు వాళ్ళ ఫుడ్డు మనమేం తింటాం అని ఆ కంచాన్ని అలాగే పక్కనెట్టిన ఆ పిల్ల రెండు చపాతీలు చేసుకుని, పెరుగులో నంచుకుని తినేసింది . ఆ తర్వాత .. గిన్నెలు కడుక్కుంటూ, ఈవిడిచ్చిన కంచాన్ని కూడా కడిగేసి ఇచ్చేస్తే ఓ పనైపోతాదని, ఆ అరిటాకు తీసేసరికి .. బాగా కాల్చిన ఇంత పెద్ద మినపరొట్టి, ఓ చిన్న ఆవకాయ ముక్క, ఇంకో పక్క ఓ చిన్న గిన్నెలో తేనె పానకం కనిపించేయి . వాటి వాసనకే ఆకలి పుట్టేసిందా పిల్లకి .
చిన్నగా రుచి చూద్దామని మొదలెట్టి, రెండు నిమిషాల్లో కంచం మొత్తం ఖాళీ చేసేసింది . గబగబ కంచాన్ని కడిగేసి, తీసుకుని పెద్దమ్మాయి గారి ఇంటికి వెళ్లి, థాంక్సు చెప్పి .. ఇంత రుచిగా ఉంది.. దీని పేరేమిటీ ? అని హిందీలో అడుగుతూ .. ఈవిడకి అర్ధం కావడానికి ఏవో సైగలు చేస్తూంటే, ‘మినపరొట్టి, తేనె పానకం ‘ అని చెప్పి..
‘అప్పట్లో నేను ఓల్డు బియ్యే తో పాటు హిందీ విశారద పరీక్షలు కూడా పాసయ్యేను ‘ అని ఈవిడ అనేసరికి, తెగ సంతోషపడిపోయిన ఆ అనన్య ‘హమ్మయ్య .. నాకు హిందీలో మాట్లాడుకోడానికో తోడు దొరికింది’ అని సంబరపడితే, ‘భలేదానివే .. ఏదో ఈ ఒక్కసారికీ మాట్లాడేను కానీ .. మా ప్రాంతానికి వచ్చి, నువ్వు మా భాష నేర్చుకోకపోతే ఎలా ?..అప్పుడప్పుడు నీ సౌలభ్యం కోసం మేము నీతో హిందీ మాట్లాడొచ్చు .. నువ్వు మా భాష నేర్చుకోడానికి ప్రయత్నిస్తేనే! ..బీ ఏ రోమన్ ఇన్ రోమ్ అని చదువుకునే ఉంటావు కదా ‘ అందా పెద్దమ్మాయి గారు నవ్వుతూ, సరేనని ఒప్పుకుందా అనన్య .
ఇంక మర్నాటి నుంచి ప్రతిరోజూ పెద్దమ్మాయి గారి దగ్గిరే కూచుని .. పప్పుచారు దగ్గిర్నుంచి అరటిపువ్వు పెసరపప్పు కూర దాకా అన్నీ నేర్చేసుకుందా పిల్ల .
నెల రోజుల క్యాంపు తర్వాత వచ్చిన గౌరవ్ కుమారు కి భలే ఆశ్చర్యంగా అనిపించింది .. వచ్చీ రాని తెలుగు మాటాడేస్తూ, అద్భుతంగా తెలుగు వంటలని వండేస్తున్న అనన్య ని చూసి!
ఆ తర్వాతేడాది ఎండా కాలం వచ్చేసరికి, పెద్దమ్మాయి గారి దగ్గరే కూచుని మామిడల్లం బద్దల నుంచి ఆవకాయ,మెంతికాయ, మాగాయ, పెసరావకాయ లాంటి రకరకాల పచ్చళ్ళు పెట్టడం నేర్చేసుకుని, లక్నో లో వాళ్ళ పుట్టింటాళ్ళ ఇంటికి కూడా ప్యాక్ చేసి మరీ పంపించిందా అనన్య .
అనన్య పెద్దమ్మాయి గారితో ఎంతలా కలిసిపోయిందంటే .. తెలీనోళ్లు ఎవరైనా చూసేరంటే .. ఆ ఇద్దరూ తల్లీ కూతుళ్ళనేసుకుంటారు .. అంతలా కలిసిపోయేరు !
‘ఊళ్ళో జనాలు . నా వంటలన్నీ అచ్ఛం మీరు చేసినట్టే ఉంటాయంటున్నారండీ. కానీ .. మీ వంట గొప్పదనమే వేరనుకోండి ..ఇన్నేసి వంటలు నేర్పించిన మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్ధం కావడం లేదండి ‘ అని తూగో జిల్లా యాసలో మాట్లాడుతున్న ఆ అనన్య ని చూసి .. ‘లేదమ్మా .. నాకు గత ఏడాదిన్నరగా నీ రూపంలో భలే తోడునిచ్చేడమ్మా ఆ దేవుడు .. ఆ అదృష్టం నాది .. నేనే నీ కడుపున పుట్టి నీ రుణం తీర్చుకుంటాను ‘ అని చెప్పిన ఆ పెద్దమ్మాయి గారు రెండేళ్ల తర్వాత కాలం చేసేరు ‘ అంది లోవరాజు భార్య
‘బావుంది కథ .. ‘ అన్నాను
‘కథలెప్పుడూ అయిపోవండి .. ఏదో రూపంలో నడుస్తూంటాయి ‘ అందావిడ
‘ఈ కథ ఇంకా నడుస్తూందా ?..అదెలాగా ?’ అని నేనడిగితే, ‘ఆ గౌరవ కుమారుకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయినా .. ప్రతి ఏడాదీ .. మా కైకేవోలు అనన్య తోనూ, తన కూతురుతోనూ వచ్చి .. పెద్దమ్మాయి గారి తద్దినం దగ్గిరుండి పెట్టిస్తాడు .. పెద్దమ్మాయి గారికి ఇష్టమైన రకాలతో ఆ రోజు బ్రేమ్మలకి వంటంతా ఆ అనన్యే చేస్తుంది’ అంటూ ముగించింది !

8 thoughts on “కంభంపాటి కథలు – పెద్దమ్మాయిగారి కథ

  1. ఇప్పటికే ఇలాంటి ఫ్యామిలీలు ఎక్కువ అయ్యిపోయాయండీ…………
    మన తరం ఎలా ఉంటుందో…..

  2. చాలా బాగుంది..కథనం అద్భుతంగా ఉంది..చిన్న పాయింట్ తో మీరు చెప్పిన విధానం బాగుంది..

  3. నోటికి రుచిగా, ,మెదడుకు మేతగా ,మనసుకు హాయిగా ఉంది కధ

Leave a Reply to Raghu Cancel reply

Your email address will not be published. Required fields are marked *